సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి భక్తుల అనుభావమాలిక - 2


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

ఈరోజు భాగంలో అనుభవాలు:
  • బాబా కృపతో నా ప్రాజెక్ట్ వర్క్ విజయవంతమైంది.
  • 'నా భక్తులను రక్షిస్తాను'


బాబా కృపతో ప్రాజెక్ట్ వర్క్ విజయవంతమైంది.
హైదరాబాదునుండి సాయిబంధువు అర్చనగారు ఇటీవల జరిగిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

ఓం సాయిరామ్! బాబా నాకు మూడు నెలల ప్రాజెక్టులో పనిచేసే అవకాశాన్ని ఇవ్వడం, ఆ సమయంలో బాబా ఇచ్చిన నిదర్శనాలను ఇదివరకు మూడు నెలల క్రిందట దిగువ బ్రాకెట్లలో ఇవ్వబడిన లీల ద్వారా మీతో పంచుకున్నాను. కావలిసిన వారు క్రింది బ్లూ లెటర్స్ పై టచ్ చేసి ఆ అనుభవాన్ని చదవవచ్చు.

బాబా దయతో ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు విజయవంతంగా పూర్తయింది. అది విజయవంతమైతే బ్లాగు ద్వారా మీతో పంచుకుంటానని బాబాని ప్రార్థించాను. ఆ అనుభవాన్నే నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

ప్రాజెక్ట్ డిప్లొయిమెంట్ (ప్రాజెక్టుకి మేము వ్రాసిన కోడ్ సరిగా పనిచేస్తుందో లేదో ముందుగా పరీక్షించి, చివరిగా దాన్ని ఒరిజినల్ ప్రాజెక్టులోకి ప్రవేశపెట్టడాన్ని డిప్లొయిమెంట్ అంటారు.) 2019, ఫిబ్రవరి 28న ఉందనగా నేను ఫిబ్రవరి 21న మా నాన్నగారి ఆరోగ్యం కోసం సచ్చరిత్ర పారాయణ మొదలుపెట్టాను. నేను చేసిన ప్రాజెక్ట్ కోడ్ ని వేరే వేరే చోట్ల టెస్ట్ చేశాను. డిప్లొయిమెంట్ కి ముందు స్టేజ్ ఎన్విరాన్మెంట్ లో కూడా టెస్ట్ చేయాలి. కానీ అక్కడ ఆ టెస్ట్ చేయడానికి యూజర్ ఐడి లేకపోవడంతో నాకు అనుమతి లేదు. అనుమతి అడిగినా, ఇస్తామంటూ ఇచ్చేవాళ్ళు కాదు. ఇంతలో అనుకోకుండా నా ప్రాజెక్ట్ డిప్లొయిమెంట్ ఫిబ్రవరి 27కి మారింది. బహుశా బాబా సంకల్పమేమో! ఆరోజే నేను పారాయణ ముగించిన రోజు. ముందురోజు రాత్రి కూడా క్లయింట్ ని టెస్ట్ చేయడానికి అనుమతి అడిగాను. ముందు ఇస్తామని, మళ్ళీ మేమే చేసుకుంటామన్నారు. ఇక నేను అన్నిచోట్లా వర్క్ అయింది, ఇప్పుడు ఈ ప్లేస్లో కూడా వర్క్ అవుతుందిలే అని ఊరుకున్నాను. రాత్రి క్లయింట్తో మాట్లాడి పడుకునేసరికి 12 గంటలు దాటింది. దానికి తోడు ఉదయాన్నే 4 గంటలకి మెలకువ వచ్చేసింది. ఉదయం పారాయణ ముగించి బాబాకి స్వీట్స్ పెట్టి ఆఫీసుకి వెళ్లాను. ఇదివరకు నాకిలాంటి సందర్భాల్లో చాలా ఆందోళన ఉండేది కానీ, ఆరోజు చాలా ప్రశాంతంగా అనిపించింది. మా మేనేజర్, "అన్నిచోట్లా టెస్ట్ చేసారు కదా" అని అడిగితే, నేను, 'చేసాన'ని చెప్పాను. సరేనని ఇక డిప్లొయిమెంట్ మొదలుపెడితే ఇష్యూస్ మొదలయ్యాయి. సాధారణంగా ప్రొడక్షన్లో సమస్యలు వచ్చాయంటే నేను టెస్ట్ చేయకుండా వదిలేసిన స్టేజ్ ఎన్విరాన్మెంట్లో కూడా సమస్యలు వచ్చి వర్క్ అవదు. కానీ నేను అది చేయకుండా చేసానని చెప్పాను. అందువలన ఇక పెద్ద సమస్య నాకు ఎదురుకాబోతుందని నాకు టెన్షన్గా అనిపించింది. టెస్ట్ చేయకుండానే అబద్ధం చెప్పానని నాకు చెడ్డ పేరు వస్తుంది, ఇన్నాళ్ళు పడ్డ శ్రమ వృధా అయిపోతుందని భయపడ్డాను. ఇలా భయపడుతున్నప్పటికీ నేను చేసిన కోడ్ వల్ల వచ్చిన ప్రాబ్లం కాదని కూడా నాకు తెలుసు. వెంటనే, "బాబా! ఏ సమస్య కాకుండా కాపాడండి" అని ప్రార్థించాను. ఇంతలో నాతోపాటు వర్క్ చేస్తున్న అతను వేరే వాళ్ళకి మెయిల్స్ పెట్టి ఆ సమస్యలు సరిచేయించారు. దానితో క్షణాల్లో డిప్లొయిమెంట్ విజయవంతమైంది. మరికొద్దిసేపట్లో ప్రొడక్షన్లో ఉన్న వేరే అతను టెస్ట్ చేసి, 'వర్క్ అవుతోంది' అని నిర్ధారించాడు. ఇక నా ఆనందానికి అవధులు లేవు. ఆ సమయంలో నేను ఎంతో టెన్షన్ పడ్డాను కానీ, బాబా దయవల్ల అంతా సుఖాంతమైంది.

'నా భక్తులను రక్షిస్తాను'
ఓం సాయిరాం! సాయిభక్తులందరికీ నా నమస్కారం. నా పేరు శిరీష, నేను రాజమండ్రి నివాసిని. ముందుగా ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారందరికీ నా ధన్యవాదాలు. నా జీవితంలో బాబా ప్రసాదించిన అపూర్వ అనుభవాలను సాయిబంధువులతో పంచుకోవాలనుకుంటున్నాను.

మావారి ఉద్యోగరీత్యా బదిలీల వలన ప్రస్తుతం గుంటూరులో ఉంటున్నాము. 2017  సంవత్సరంలో మా అమ్మగారి ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ని సంప్రదించాము. డాక్టర్ వివిధ పరీక్షలు, బయాప్సీ చేసి అమ్మకు 'గర్భాశయ క్యాన్సర్' అని చెప్పారు. అది విని మేమంతా హతాశులమయ్యాము. ఏం చేయాలో తోచని పరిస్థితి. తరువాత మేమంతా అమ్మకు చెన్నైలో ట్రీట్మెంట్ చేయిద్దామని నిర్ణయించుకున్నాము. చెన్నై వెళ్ళే ముందు మా బావ బాబా దగ్గరకు వెళ్లి, "బాబా! ఆమెని కాపాడండి" అని ప్రార్థించి, రెండు రూపాయలు దక్షిణ వేసి వచ్చిన తరువాత మేము చెన్నై బయలుదేరాము. బాబా తన భక్తుల వెంటే ఉండి కాపాడుతారనే మాట అక్షరసత్యం. మేము చెన్నై ట్రైన్ ఎక్కగానే బాబా విగ్రహం చేతిలో పట్టుకుని ఉన్న ఒక సాధువు కనిపించారు. అలా చూడగానే, బాబా మాతోనే ఉన్నారు ఇక భయంలేదు అనుకున్నాను. చెన్నై చేరుకున్నాక నిజంగా మేము ఊహించని విధంగా డాక్టర్లు మా అమ్మకి అన్ని పరీక్షలు చేసి, "ఇది క్యాన్సర్ కాదు, ఆపరేషన్ చేస్తే సరిపోతుంది" అని చెప్పారు. ఇక మా ఆనందానికి అవధుల్లేవు. ట్రైనులో బాబా దర్శనంతోనే "అమ్మకు ఏమీకాదు, ఆ బాబానే అన్నీ చూసుకుంటారు" అనుకున్నాను. నేను అనుకున్నట్లుగానే బాబా అమ్మను కాపాడి, "నా భక్తులను రక్షిస్తాను" అనే మాట నిరూపించి చూపారు. మరొక అనుభవంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.

జై సాయిరామ్!

No comments:

Post a Comment

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo