సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్త అనుభవమాలిక 5వ భాగం....


కఠిన సమయంలో ప్రతిక్షణం అండగా నిలిచారు బాబా

సాయిబంధువు సాయిసిరి తన అనుభవాన్ని పంచుకుంటున్నారు. 

2019, ఫిబ్రవరి 21న హఠాత్తుగా మా బాబుకి బాగా జ్వరం రావడంతో హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాం. డాక్టరు పరీక్షించి కొన్ని మందులు వ్రాసిచ్చారు. ఆ మందులు వాడుతున్న తరువాత కూడా రాత్రి ఒంటిగంటకి బాగా జ్వరం రావడంతో, వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాము. తెల్లవారుఝామున 3 గంటల వరకు పర్యవేక్షణలో ఉంచి, మందులు మార్చి ఇంటికి పంపారు. మరునాడు కూడా జ్వరం వస్తూపోతూనే ఉంది. ఆరోజు మా బాబు స్కూలులో డాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అక్కడికి తీసుకుని వెళ్తే కాస్త హుషారవుతాడని మా మామగారు వాడిని స్కూలుకి తీసుకుని వెళ్తానని పట్టుపడితే, ఇక చేసేదిలేక వాడిని స్కూలుకి తీసుకుని వెళ్ళాం. అక్కడ వాడికి బాగా వాంతులయ్యాయి. తరువాత నేను ఎదురుగావున్న నాగసాయి సుబ్రహ్మణ్యేశ్వర మందిరానికి తీసుకుని వెళ్ళాను. బాబా మందిరంలో ఉండే పూజారి బయటకు వచ్చి, "ఈ స్థితిలో బాబునెందుకు తీసుకొచ్చావ్? వెంటనే వాడిని హాస్పిటల్ కి తీసుకొనిపో" అని గట్టిగా అరిచారు. కనీసం బాబా దర్శనం కూడా చేసుకోనివ్వలేదు. మాములుగా ఆ పూజారి ఎప్పుడూ నాతో చాలా సౌమ్యంగా మాట్లాడతారు. కానీ ఆరోజు అలా మాట్లాడేసరికి నాకు బాధగా అనిపించింది. బాబునింక నేరుగా హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాము. వెళ్తున్నప్పుడు వాడు తన చేయి నొప్పి పెడుతుందని బాగా ఏడ్చాడు. డాక్టర్లు అన్ని పరీక్షలు చేసి, "బ్లడ్ లో ఇన్ఫెక్షన్ ఉంది, నిమోనియా కూడా" అని చెప్పి 5 రోజులు హాస్పిటల్ లో ఉండాలని చెప్పి, బాబుని అడ్మిట్ చేసుకున్నారు. నేను చాలా భయపడుతూ ఉండగా వాట్సాప్ గ్రూపులో, "నేను నీతోనే ఉన్నాను" అని బాబా సందేశమిచ్చారు. అప్పుడు ఆలోచిస్తే బాబానే పూజారి ద్వారా మమ్మల్ని సరైన సమయానికి హాస్పిటల్ కి చేర్పించారనిపించింది. 5 రోజులు తరువాత డాక్టరు, "ఇంకేం ప్రాబ్లం లేదు. కొన్ని మందులిస్తాను, వాడండ"ని చెప్పారు. అయితే ఇంటికి వచ్చాక కూడా జ్వరం వచ్చింది. దాంతో మళ్ళీ డాక్టరు వద్దకు తీసుకుని వెళ్ళగా, "ఇన్ఫెక్షన్ తగ్గింది కానీ, నిమోనియా అలానే ఉంది. బహుశా మళ్ళీ అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. కానీ ఇప్పటికే బాబుకిచ్చిన ఇంజెక్షన్స్ వలన వాడి చేయి బాగా వాపు ఉంది. కాబట్టి మార్చి 4 వ తేదీ వరకు చూద్దామ"ని చెప్పి, యాంటీబయాటిక్స్ ఇచ్చారు. కొత్త మందులు వాడుతున్నా కూడా ప్రతి 8 గంటలకి ఒకసారి జ్వరం వస్తూనే ఉండేది. ఆరోజు రాత్రి కూడా జ్వరం రావడంతో నేను, "బాబా! ఏమిటింకా నా బాబుకి తగ్గట్లేదు? వాడికి తగ్గిపోతుందని ఏదో ఒక రూపంలో నాకు సంకేతమివ్వండి. లేకపోతే వాడి జ్వరం నాకివ్వండి" అని బాగా ఏడ్చి నిద్రపోయాను. మరునాటి ఉదయం మా అమ్మ 'సద్గురులీల' మ్యాగజైన్ వచ్చిందని నా చేతికిచ్చింది. నిజానికి నేనెవరికీ ఆ పత్రిక కోసం డబ్బులు కట్టలేదు, నా అడ్రసు కూడా ఇవ్వలేదు. ఇప్పటికీ అదెలా వచ్చిందో అర్థం కాలేదు. నేను, "వాడికి నయమైపోతుందని ఏదో ఒక రూపంలో హామీ ఇవ్వమ"ని బాబాని అడిగినందుకు బాబా అలా అనుగ్రహించారు.

తరువాత నేను మా ఇంటికి దగ్గరలో ఉన్న 'సాయిపథా'నికి రాత్రి 8 గంటల సమయంలో యాదృచ్ఛికంగా వెళ్ళాను. ఆ సమయంలో అక్కడ ఆరతి ఉంటుందని నాకు తెలియదు. నేను లోపలకి అడుగుపెట్టేసరికి "సాయి రహం నజర్ కరనా" ఆరతి పాట వస్తుంది. ఆ పాట ద్వారా నా బాబు విషయంలో బాబా అభయం ఇస్తునట్టుగా నాకనిపించి కాస్త ధైర్యం చేకూరింది. నేనలా ప్రతిరోజూ సాయిపథానికి వెళ్తూ అక్కడనుండి ఊదీ తెచ్చుకుని ఒక చిన్న డబ్బాలో పోస్తుండేదాన్ని. అలా చేస్తుండగా ఒకరోజు ఊదీ టేబులుపైన పడిపోయింది. ఒక్కక్షణం బాధగా అనిపించినా, క్రిందపడిన ఊదీనంతా తీసి మా బాబు శరీరమంతా పూసేసాను. ఆరోజు నుండి బాబుకి జ్వరం రాలేదు. మళ్ళీ చెకప్ కోసం వెళ్లాల్సిన శివరాత్రినాడు కూడా ఊదీ క్రిందపడిపోయింది. అప్పుడు కూడా బాబు శరీరమంతా ఆ ఊదీ రాసి సాయంత్రం హాస్పిటల్ కి బాబుని తీసుకుని వెళ్ళాను. డాక్టరు పరీక్షలు చేసి, "బాబుకి అంతా తగ్గిపోయింది. రిపోర్ట్స్ అన్నీ నార్మల్ గా ఉన్నాయి" అని చెప్పారు. నేను ఆనందంతో మనసారా, "చాలా చాలా ధన్యవాదాలు బాబా" అని చెప్పుకున్నాను. ఆరోజు ఊదీ క్రిందపడకుండా ఉంటే, నాకు బాబు శరీరానికి ఊదీ రాయాలనే ఆలోచనే వచ్చేది కాదు. బాబాయే ఊదీ క్రిందపడిపోయేలా చేసి, వాడి శరీరానికి రాసేలా ప్రేరణ ఇచ్చారు. "బాబా! నిజంగా ఆ కఠిన సమయంలో మీరే నాకు ప్రతిక్షణం అండగా నిలిచారు. మీ వల్లే నేను ధైర్యంగా ఉండగలిగాను. మీరు ఎప్పటికీ నాకు ఇలాగే తోడుగా ఉండండి".

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo