సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్త అనుభవమాలిక 4వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  • బాబా కృపతో నా ఆరోగ్య సమస్య తీరింది. 
  • సాయి నా జీవితంలోకి వచ్చిన తీరు

బాబా కృపతో నా ఆరోగ్య సమస్య తీరింది. 

సాయిభక్తుడు తిరుపతిరావు రాజన్ తన అనుభవాన్ని పంచుకుంటున్నారు.
నేను చిన్ననాటినుండి బాబా భక్తుడిని. నా రోజు బాబా నామంతో మొదలయి, వెబ్ సైట్ లో భక్తుల అనుభవాలు చదవడంతో ముగుస్తుంది. ఒకసారి నా చేతులకి అలర్జీ వస్తే, నేను చాలా మందులు వాడాను. అయితే అది తగ్గడానికి బదులు రోజురోజుకీ పెరగసాగింది. దాంతో నేను ఒక స్కిన్ స్పెషలిస్టుని సంప్రదించాను. అతను, పెద్ద సమస్యలేమీ లేవు అని చెప్పి కొన్ని టాబ్లెట్లు, ఒక ఆయింట్మెంట్, ఒక సబ్బు వ్రాసి ఇచ్చారు. ఆయింట్మెంట్ వ్రాయడం వలన అలర్జీ రోజురోజుకీ తగ్గింది గాని, టాబ్లెట్స్ వేసుకుంటే శరీర ఉష్ణోగ్రత, గుండె వేగం పెరిగి నిద్రపట్టేదికాదు. ఇలా రెండురాత్రులు నిద్ర లేకపోవడంతో ఆ ప్రభావం నా ఉద్యోగ విధుల మీద పడింది. మూడోరోజు కూడా అలాగే జరిగేసరికి నేను ఆ బాధ తట్టుకోలేక, "బాబా! దయచేసి ఈ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయేలా అనుగ్రహించండి. మీ దయవలన నేను హాయిగా నిద్రపోగలిగితే నా అనుభవాన్ని సైట్ ద్వారా సాయిబంధువులతో పంచుకుంటాను" అని ప్రార్థించాను. బాబా నా ప్రార్థన విన్నారు. కొద్దిసేపట్లో నిద్రలోకి జారుకుని రాత్రంతా ప్రశాంతంగా నిద్రపోయాను. బాబాకి కృతజ్ఞతలు చెప్పుకుని ఆరోజు నుండి టాబ్లెట్స్ వేసుకోవడం మానేసాను. బాబా కృపతో కేవలం ఆయింట్మెంట్ వలన అలర్జీ పూర్తిగా తగ్గిపోయింది. రోజురోజుకీ బాబా యందు నా విశ్వాసం పెరుగుతూ ఉంది. నేను పూర్తిగా సాయి దివ్యపాదాలకు శరణాగతి చెందాను. ప్రతి గురువారం బాబా మందిరానికి వెళ్తూ ఉంటాను. అక్కడికి వెళ్లిన ప్రతిసారీ మనస్సుకు ఎంతో శాంతిగా ఉంటుంది. "బాబా! మీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి".


సాయి నా జీవితంలోకి వచ్చిన తీరు

ఒక అజ్ఞాత సాయిభక్తుడు తన అనుభవాన్ని పంచుకుంటున్నారు.
నాకు 29 సంవత్సరాలు. రెండేళ్ల క్రితం నేను చెన్నైలో ఒక బ్యాంకు ఉద్యోగంలో చేరాను. అక్కడ నేను ఒక అమ్మాయిని చూస్తూనే తను నాకు, మా కుటుంబానికి చక్కగా సూటవుతుందనిపించింది. నేను తనతో నా గురించి, నా కుటుంబం గురించి, నాకు వస్తున్న శాలరీ గురించి అన్నీ ఉన్నది ఉన్నట్లుగా చెప్పాను. నేను కావాలనుకుంటే తనని ఒప్పించడానికి అబద్ధం చెప్పవచ్చు. కానీ ఏ కారణం చేత కూడా ఒక అమ్మాయిని మోసం చేయడం నాకిష్టంలేదు. తను కాస్త పేద కుటుంబానికి చెందిన అమ్మాయి. మాది ఉన్నత తరగతి కుటుంబం. ఈ విషయమే నేను మా అమ్మగారితో చెప్తే తను కూడా ఒప్పుకున్నారు. మా కుటుంబం ఎప్పుడూ డబ్బుల విషయాన్ని సీరియస్గా తీసుకోదు. కొన్నాళ్ల పరిచయం తర్వాత మాటల్లో క్యాస్ట్ విషయం బయటకు వచ్చింది. అది నా ప్రేమకు ముగింపు అవుతుందని నేను అనుకోలేదు. క్యాస్ట్ విషయం తెలిసాక తను, "ఎట్టి పరిస్థితుల్లో నా తల్లిదండ్రులు వేరే క్యాస్ట్ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోరు" అని చెప్పి, కమ్యూనికేషన్ పరంగా నేను తనని కాంటాక్ట్ కాకుండా అన్నివిధాలా నన్ను బ్లాక్ చేసింది. తనతో మాట్లాడక ఎనిమిది నెలలు గడిచినప్పటికీ ప్రేమ చేసిన గాయం మానిపోలేదు. తను కూడా నన్ను ఇష్టపడిందని నాకు బలంగా తెలుసు.

ఇదిలా ఉండగా 3 నెలల క్రితం హఠాత్తుగా ఆఫీసులో నా సీటు తన సీటుకు కాస్త దగ్గరగా మార్చారు. నేను కూర్చున్న ఆ చోట ఒక చిన్న సాయిబాబా ఫోటో ఉంది. ఆ ఫోటో నా జీవితాన్ని మార్చేసింది. మెల్లగా ఆయన గురించి చదవడం, ఆయన బోధనలను తెలుసుకోవడం, ఆయనను ప్రార్థించడం మొదలైంది. దాంతో ఏదో తెలియని ఆనందం, ప్రశాంతత చేకూరాయి. ఆ ఆనందం అన్ని ఆనందాలకు అతీతమైనది. ఈమధ్యే నేను ప్రేమించిన అమ్మాయి కూడా సాయిభక్తురాలని తెలిసింది. నేను చాలాసార్లు తనతో మాట్లాడడానికి ప్రయత్నించాను కానీ, తను కాల్ కట్ చేసేది. నన్ను చూసేటప్పుడు మాత్రం తను ప్రేమగానే చూసేది. తన మనసులో ఏముందో నాకు అర్థమయ్యేది కాదు. కానీ అంతా బాబాకు విడిచిపెట్టాను. ఆయనే మా ఇద్దర్నీ కలిపారు. ఇప్పుడు ఆయన ఏది నాకు మంచిదో అదే చేస్తారని అనుకుంటున్నాను.

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo