సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1784వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా లేకపోతే ఏదీ సాధ్యం కాదు
2. సాయి అనుగ్రహం

బాబా లేకపోతే ఏదీ సాధ్యం కాదు


సాయిబంధువులకు నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, స్నేహితులు అన్ని బాబానే. మా చెల్లి వివాహానికి ముహూర్తం నిర్ణయించుకున్నాక మా నాన్నకు దాదాపు 15 లక్షల రూపాయలు కావాల్సి వచ్చింది. చిట్టీ డబ్బులు వస్తాయని చూస్తే, అవి సమయానికి చేతికి అందలేదు. అవతల మగపెళ్లివాళ్ళకి ముందుగా అనుకున్న సమయానికల్లా 12 లక్షలు అందజేయాల్సి ఉంది. నేను నా అలవాటు ప్రకారం ఎప్పటికప్పుడు బాబాతో అన్ని విషయాలు చెప్తూ, "ఎలాగైనా సమయానికి డబ్బు అందేలా చూడమ"ని వేడుకుంటూ ఉండేదాన్ని. కానీ ఎవరు ఇస్తారని ఒక చిన్న భయం కూడా ఉండేది. అయితే బాబా దయవల్ల మా నాన్న దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకున్న ఒక అతను కొంత మొత్తాన్ని, మా మరిది మరికొంత మొత్తాన్ని, మిగతా డబ్బులు మా నాన్నకి తెలిసిన ఒక అంకుల్ ఇవ్వడంతో అనుకున్న సమయానికి మగపెళ్ళివారికి డబ్బు ఇవ్వగలిగాము. ఇకపోతే చిన్నచిన్న మొత్తాల్లో డబ్బు నాన్న సర్దుబాటు చేసుకోవడంతో పాటు కిరాణా షాపువాళ్లకి, టెంట్ వాళ్లకి, వంటవాళ్లకి కాస్త సమయం తీసుకుని ఇస్తానని మాట్లాడుకోవడం వల్ల ఏ సమస్య లేకుండా అంతా సవ్యంగా జరిగింది.


నేను మా అమ్మానాన్నలకు పెద్ద కూతుర్ని. నా చెల్లెళ్ళ పెళ్లి అప్పుడు పెళ్లి బొట్టు పెట్టడం, మంగళహారతి ఇవ్వడం వంటివి నేనే చేస్తాను. కానీ ఈ చెల్లి పెళ్లి సమయానికి నా నెలసరి సమయమైంది. టాబ్లెట్లు వేసుకుందామంటే పది వరకు వేసుకోవాలి. అన్ని వేసుకుంటే తర్వాత కడుపునొప్పి వస్తుందని భయం. అందువల్ల రోజూ బాబాని ఈ సమస్య నుండి తప్పించండి అని వేడుకుంటూ ఉండేదాన్ని. విచిత్రంగా అంతకుముందు ఎన్నడూ జరగని విధంగా ఆరు రోజుల ముందే నెలసరి వచ్చేయడంతో పెళ్లిలో సంతోషంగా పాల్గొన్నాను. ఇది కేవలం బాబా వల్లనే సాధ్యమైంది.


2023, సెప్టెంబర్ నెల చివరి వారంలో మేము తిరుమలలో అంగప్రదక్షిణకు టికెట్లు బుక్ చేసుకొని ట్రైన్ టికెట్లు కూడా తీసుకున్నాం. అది మాలో ఎవరికీ నెలసరి సమయం కాదు. కానీ మా చిన్నమ్మాయికి రావాల్సిన సమయానికి నెలసరి రాలేదు. తిరుమల వెళ్ళే సమయం దగ్గర పడుతున్న కూడా తనకి నెలసరి రాలేదు. అందుచేత నెలసరి రాకుండా టాబ్లెట్లు వేసుకోమంటే తను, "నేను రావడం మానేస్తాను గాని, టాబ్లెట్లు వేసుకోన"ని చెప్పింది. పోనీ, ప్రయాణాన్ని రద్దు చేసుకుందామంటే, మళ్ళీ ఎప్పుడు వెళ్తామో తెలియదు. అందువల్ల బాబాపై భారమేసి ధైర్యంగా వెళ్లాలని బయలుదేరాం. నాకు, మావారికి అంగప్రదక్షిణ టికెట్లు ఉన్నాయిగాని పిల్లలకి లేవు. అందువల్ల మెట్ల మార్గంలో టికెట్లు ఇస్తారని శ్రీవారి మెట్ల మార్గం గుండా తిరుమల కొండెక్కేందుకు బయలుదేరాం. మధ్య దారిలో గతంలో చిరుతపులి ఒక పాపను చంపేయడం గుర్తుకు వచ్చి చాలా భయమేసింది. అప్పుడు బాబా ఉన్నాక ఏదీ మనల్ని ఏమీ చేయలేదని అనుకొని ధైర్యంగా ముందుకు సాగాము. కొండపై పైకి వెళ్ళాక అందరం ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకున్నాము. గతంలో అంగప్రదక్షిణకి వెళ్లిన మా చెల్లి, మరిది ప్రదక్షిణ పూర్తిగా చేయలేక మధ్యలోనే లేచిపోయారు. అందువల్ల మా వాళ్ళందరూ మమ్మల్ని అంగప్రదక్షిణకు వెళ్లోద్దని చెప్పారు. నేను వాళ్లతో బాబా ఉండగా నాకేమీ కాదని చెప్పాను. బాబా దయవల్ల మాకు ఏ మాత్రం కష్టం అనిపించలేదు. ఇంకా ఇంటికి వచ్చిన వారం రోజులకి మా చిన్న అమ్మాయికి నెలసరి వచ్చింది. బాబా లేకపోతే ఏదీ సాధ్యమయ్యేది కాదు. 


మా చెల్లి పెళ్ళికి నెల ముందు నా కింద పళ్ళు రెండు పీకించి కొత్తవి పెట్టించాల్సిన అవసరం ఏర్పడింది. నాకేమో ఇంజక్షన్ అంటే భయం. అందువల్ల చాలా టెన్షన్ పడి బాబాతో ఎన్నోసార్లు, "నొప్పి లేకుండా చూడమ"ని వేడుకున్నాను. చివరికి ఒకరోజు నేను, మా అమ్మాయి హాస్పిటల్‌కి వెళదామని బయలుదేరాము. అప్పుడు ఒక ఆటో వెనక బాబా అభయహస్తంతో దర్శనమిచ్చారు. దాంతో బాబా తోడుగా వస్తున్నారని నాకు ధైర్యం వచ్చింది. బాబా దయవల్ల డాక్టరు ఏ నొప్పి లేకుండా చికిత్స చేసారు. ఇంతలా ఎంతో సహాయం చేస్తున్న నా తండ్రి సంవత్సరాల తరబడి మానసికంగా నలిగిపోతున్న ఒక క్లిష్టమైన సమస్య నుండి బయటపడేస్తే మరోసారి అందరితో ఆయన అనుగ్రహం పంచుకుంటాను. "ధన్యవాదాలు బాబా. ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోవాలి తండ్రీ".


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!


సాయి అనుగ్రహం


సాయినాథుని పాదారవిందములకు ఆనంతకోటి ప్రణామాలు. తోటి సాయి బిడ్డలందరికీ నమస్కారాలు. నా పేరు సీత. చాలా ఏళ్లగా మా కుటుంబంలోని అందరం సాయి భక్తులం.  సాయినాథుని అనుగ్రహంతో మా అమ్మాయి పెళ్లి జరిగింది. కానీ తనకి పిసిఓఎస్  సమస్య ఉండడం వల్ల సంతానం విషయంలో ఏమైనా ఇబ్బంది అవుతుందేమోనని నేను భయపడ్డాను. అందువల్ల, "సాయినాథా! మీ అనుగ్రహంతో అమ్మాయికి సంతానం కలిగితే మీ అనుగ్రహం గురించి బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాన"ని సాయికి మొక్కుకున్నాను. అద్భుతం! సంవత్సరం లోపల మాకు మనవరాలు పుట్టింది. సాయినాథుని కృపను వర్ణించటానికి నాకు మాటలు చాలటం లేదు. "ధన్యవాదాలు బాబా. ప్రస్తుతం మేము మా అబ్బాయి ఆర్థిక, మానసిక, సంసారిక సమస్యలతో చాలా బాధపడుతున్నాము. తట్టుకునే శక్తిని మీరు ఇస్తున్నప్పటికీ సమస్యలు సానుకూలంగా పరిష్కారమై మేము ప్రశాంతంగా ఉండేటట్టు చూడు తండ్రీ. మీ అనుగ్రహం తోటి భక్తులతో తప్పకుండా పంచుకుంటాను".


సాయిభక్తుల అనుభవమాలిక 1783వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా రక్షణ
2. సాయిమహారాజుని వేడుకోగానే చేకూరిన స్వస్థత

బాబా రక్షణ


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!

సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై!!!!


నా పేరు ధనలక్ష్మి. నాకు బాబా చాలా అనుభవాలు ప్రసాదించారు. అందులో ఒకటి మీతో పంచుకుంటున్నాను. 2001లో మొదటిసారి బాబా, గురువుగారు(ఫోటో రూపంలో) మా ఇంటికి వచ్చారు. ఆ సమయంలో నేను ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాను. బాబా, గురువుగారి రాకతో కొంచెం కొంచెంగా బాధలు తగ్గుతూ వచ్చాయి. కానీ ఆ విషయాన్ని నేను మొదట్లో గుర్తించలేకపోయాను. తర్వాత కొన్ని సంఘటనల ద్వారా నన్ను, నా కుటుంబాన్ని కాపాడుతుంది బాబా, గురువుగారు అని నా అనుభవంలోకి వచ్చింది. అలా ఉండగా 2004లో గురుపౌర్ణమికి మేము మొదటిసారి శిరిడీ వెళ్ళాము. ఎన్నో సమస్యలుతో కృంగిపోతున్న నాకు బాబాని, గురువుగారిని చూడటంతోనే తెలియకుండానే నా కళ్ళ నుండి నీళ్ళు కారిపోయాయి. ఏదో తెలియని అనుభూతి కలిగింది. వారిరువురూ నాకు అండగా ఉన్నారనే ధైర్యం వచ్చింది. నాటినుండి నేటివరకు బాబా, గురువుగారు నన్ను, నా కుటుంబాన్ని చాలా బాగా చూసుకుంటున్నారు. మా జీవితాలలో చాలా మార్పు వచ్చింది.


2005, జూన్ 11న మర్నాడు అరుణాచలంలో గురువుగారి దర్శనాలున్నాయని మాకు తెలిసి అప్పటికప్పుడు అరుణాచలం వెళ్లాలని అనుకున్నాము. నేను, మా పిల్లలు, మా అమ్మానాన్న, అక్క, వాళ్ళ పిల్లలిద్దరు మధ్యాహ్నం బయలుదేరి రిజర్వేషన్ టికెట్లు లేకపోయినా ఒంగోలులో రాత్రి 7.30కి ఉన్న శబరీ ఎక్సప్రెస్ ఎక్కుదామని బయలుదేరాము. ముందుగా ఒంగోలులో మా బంధువులు ఉంటే వాళ్ల ఇంటికి వెళ్ళాము. వాళ్ళు, "ఎక్కడికి వెళ్తున్నారు?" అని అడిగితే, 'అరుణాచలం' అని చెప్పాము. వాళ్ళు, "మీలో ఒక్కరికీ రిజర్వేషన్ లేదు. ఎలా వెళ్తారు? ఆ ట్రైన్ బాగా రద్దీగా ఉంటుంది" అని అన్నారు. మాకు ఏమి అర్దంకాక ఇప్పుడేమి చేయాలని అనుకుంటుంటే మా బంధువులు, "మా ఇంట్లో టీసీ ఒకరు అద్దెకు ఉన్నారు. అతనిని కనుక్కుంటాను" అని ఆ టీసీతో మాట్లాడారు. అతను మా నాన్నని స్టేషన్‌కి తీసుకెళ్ళి 4 స్లీపర్ టికెట్లు ఇప్పించి, "ఎవరైనా అడిగితే, మా బంధువులని చెప్పండి" అని అన్నారు. తర్వాత మేమందరం స్టేషనుకి వెళ్ళాము. అక్కడ మేము 3వ నంబర్ ప్లాట్ఫారంకి వెళ్లాల్సి ఉండగా ఓవర్ బ్రిడ్జి ఎక్కి దిగలేమని పిల్లలు, లగేజీ అన్నీ తీసుకుని ట్రైన్స్ ఏవీ రాని సమయంలో అవతల ప్లాట్ఫారంకి వెళ్లాలని అనుకున్నాము. అయితే 2 నంబర్ ప్లాట్ఫారం మీద తిరుపతి వెళ్ళే ట్రైన్ ఆగి ఉంది. ఆ ట్రైన్ ఉదయం 5 దాకా అక్కడే ఉంటుందన్నారు. అందువల్ల చేసేదేమీలేక ఆ ట్రైన్ ఎక్కి అవతలి ప్లాట్ఫారం మీదకి వెళ్ళడానికి అందరం సిద్ధమయ్యాము. ముందుగా మా అమ్మ కిందకి దిగి రెండో నెంబర్ ప్లాట్ఫారం మీద ఉన్న ట్రైన్ ఎక్కి అవతలి ప్లాట్ఫారం మీదకి వెళ్ళింది. నాన్న నా దగ్గర ఉన్న బ్యాగులు అందుకొని అవతలకి చేర్చారు. తర్వాత పిల్లల్ని అందిస్తూ ఉంటే ఎవరో ఒక అతను వచ్చి, "నాకు ఇవ్వు" అంటూ మా పాపని అందుకొని నాన్నకి ఇచ్చారు. తర్వాత అతను మా బాబుని అందుకుంటూ ఉంటే, బాబు చేయి జారవిడుచుకొని 10 అడుగుల ఎత్తులో నుండి కింద ఉన్న కంకరరాళ్ళపై పడిపోయాడు. అప్పుడు బాబుకి 3 సంవత్సరాలు. మరుసటిరోజు 4 వస్తుంది. వాడిని గురువుగారి దగ్గరకి తీసుకెళ్లాలని వెళ్తుంటే ఆ ప్రమాదం జరిగింది. బాబు కింద పడుతూనే పెద్దగా ఏడ్చాడు. మా నాన్నకి, మాకు చాలా భయమేసింది. ఏమైందో, ఏమోనని కంగారుగా బాబుని ఎత్తుకొని షర్ట్ విప్పి చూస్తే ఏమీ కాలేదు. బాబుని, "సాయీ! ఏమైనా దెబ్బ తగిలిందా?" అని అంటే, "'ఏమీ లేదు" అని అన్నాడు. నాడు కొలిమిలో పడ్డ బిడ్డను బాబా ఎలా కాపాడారో సచ్చరిత్రలో చదువుకుంటున్నాము. అలా నేడు కళ్ళముందు నా బిడ్డను కాపాడారు. అది తలుచుకుంటే ఈరోజుకి బాబా నా బిడ్డకి మరో జన్మనిచ్చారనిపిస్తుంది. అంత అద్భుతంగా మా కుటుంబాన్ని కాపాడుతున్నారు బాబా. అంతా బాబా, గురువుగారి అనుగ్రహం. వారి చల్లని చూపు మాకు రక్ష. వారులేనిదే మేము లేమని ప్రతిక్షణం వారి పాదాల దగ్గర ఉండే అదృష్టం ఇవ్వమని బాబా, గురువుగారి పాదాలకి సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నాను.


సాయిమహారాజుని వేడుకోగానే చేకూరిన స్వస్థత


సద్గురు సాయినాథునికి పాదాభివందనాలు. సాయి బంధువులకు నమస్కారాలు. నా పేరు మహేష్. ఈమధ్యకాలంలో మా బాబాయి కాలం చేశారు. రెండు రోజుల్లో ఆయన దశదినకర్మ ఉందనగా నాకు విపరీతమైన నీళ్ల విరోచనాలు పట్టుకున్నాయి. దానికి తోడు పొడిదగ్గు, జ్వరం కూడా ఉన్నాయి. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే,  దశదిన కర్మకు నేను ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంది. అందువల్ల, "బాబా! నాకు ఈ విరోచనాలు, జ్వరం, దగ్గు తగ్గితే మీ అనుగ్రహాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా తోటి సాయి బంధువులతో పంచుకుంటాన"ని అని మనస్ఫూర్తిగా బాబాని వేడుకొని ఊదీ నీళ్లలో కలుపుకొని తాగాను. ఇక బాబా అద్భుతం చేశారు. తెల్లవారేలోపు జ్వరం, దగ్గుతోపాటు విరోచనాలు తగ్గుముఖంపట్టాయి. దాంతో సంతోషంగా దశదిన కర్మకి వెళ్లి నా విధి నిర్వర్తించి వచ్చాను. "బాబా! మీరు లేకుంటే నాకు మాట వచ్చేది. మీకు వేలవేల కృతజ్ఞతలు బాబా".


సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!


సాయిభక్తుల అనుభవమాలిక 1782వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. భక్తుల అనుభవాల ద్వారా సమస్యకు పరిష్కారం చూపే బాబా
2. పారాయణ పూర్తయ్యేలోపు, 'నేను ఉన్నాను' అని తెలియజేసిన బాబా

భక్తుల అనుభవాల ద్వారా సమస్యకు పరిష్కారం చూపే బాబా


సాయితండ్రికి సాష్టాంగ ప్రణామాలు. నా పేరు కోమలి. మాది నల్గొండ. నాకు 2023, అక్టోబర్ నుండి నా శరీరంపై దురద వస్తుండేది. అలా ఎందుకు వస్తుందో నాకు తెలియలేదు. మా ఇంట్లో ఎవరికీ ఎలర్జీ వంటివి లేవు. నాకు మాత్రమే అలా వస్తుండేసరికి కాస్త మెడికల్ నాలెడ్జ్ ఉన్న మావారు ఫుడ్ ఎలర్జీ ఏమోనని టాబ్లెట్లు, అపై ఆయింట్మెంట్ ఇస్తే వాడుతుండేదాన్ని. వాటితోపాటు ఊదీ శరీరానికి రాసుకుంటూ ఉండేదాన్ని. కానీ దురద తగ్గలేదు. ఆ విషయం అలా ఉంచితే, శ్రీసాయి జ్ఞానయజ్ఞం ట్రస్ట్, విజయవాడవారు 'శ్రద్ధ- సబూరీ' అని రోజుకు రెండు రూపాయల చొప్పున నెలకు 60 రూపాయలు సేకరించే కార్యక్రమం ఒకటి చేస్తున్నారు. దానికోసం మేము ప్రతినెలా ట్రస్ట్‌కి 60 రూపాయలు పంపిస్తూ ఉంటాము. అలా మాలాంటి భక్తులు పంపిన డబ్బుని ఆ ట్రస్ట్‌వాళ్ళు అనాధాశ్రమంలోని పిల్లలకు, వృద్ధులకు, అలాగే కష్టాల్లో ఉన్న పేద కుటుంబాలకు సేవ రూపంలో ఎంతో సహాయం అందిస్తున్నారు. ప్రతి సంవత్సరం డిసెంబరులో ట్రస్ట్ వార్షికోత్సవం సందర్భంగా బాబాకు సంబంధించిన బుక్ ప్రింట్ చేసి భక్తులకు ఉచితంగా పంపిణీ చేసారు. 2023, సంవత్సరానికి చెందినటువంటి బాబా భక్తుల అనుభవాల బుక్ 2024, జనవరి 8న నా దగ్గరకి వచ్చింది. అదేరోజు నేను ఆ బుక్‌లో ఏమేమి ఉన్నాయో చూద్దామని మామూలుగా పుస్తకం మధ్యలో తెరిచాను. అక్కడ బాబా సశరీరులుగా ఉన్నప్పుడు భక్తులకు జరిగినటువంటి అనుభవాలు కొన్ని ఉన్నాయి. నేను ఒక రెండు అనుభవాలు చదువుదామని మొదలుపెడితే ఒక అనుభవం ఇలా ఉంది: 'ఒక తండ్రి తన కొడుకు శరీరమంతా ఎలర్జీ వస్తే బాబా అభిషేకం కోసం వాడినటువంటి నీళ్లను ఒక బకెట్ సేకరించి, ఒక వారం రోజులు ఆ నీళ్లతో తన కొడుకు శరీరమంతా బలంగా రుద్ది స్నానం చేయడంతో కొడుకు ఎలర్జీ అంతా తగ్గిపోయింది' అని. అది చదివాక నేను బాబాకు దణ్ణం పెట్టుకొని, "బాబా! నేను కూడా అలాగే చేస్తాను. ఇన్ని నెలలుగా ఉన్న ఎలర్జీని ఈ వారం రోజుల్లో తగ్గించండి బాబా" అని ప్రార్థించి మా ఇంట్లో ఉన్న చిన్న బాబా ప్రతిమకు వారం రోజులు అభిషేకం చేసి, ఆ నీటిలో కొంచెం ఊదీ కలిపి నా శరీరంపై ఎలర్జీ ఉన్నచోట శుభ్రం చేశాను. ఇంకా చూడండి! అప్పటినుంచి నేటివరకు మళ్లీ ఎలర్జీ కనపడలేదు. నాకు చాలా సంతోషమేసింది. మందులకు నయం కానటువంటి ఆ ఎలర్జీ బాధ నుండి బాబా నన్ను ఈ రకంగా బయటపడవేశారు. ఆ బుక్ నా దగ్గరకి రావడం, మధ్యలో ఓపెన్ చేస్తే నాకు సంబంధించిన సమస్యే అక్కడ ఉండటం, నేను దాన్ని చదవడం, అలా చేయడం వల్ల ఆ బాధ నుండి బయటపడడం ఇవన్నీ తలుచుకుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. భక్తుల అనుభవాలు మరొక భక్తుల సమస్యలకు పరిష్కారాలని ఎక్కడో బాబా పుస్తకంలో చదివాను. అది ముమ్మాటికీ నిజమని నాకు అనిపిస్తుంది. అంతా బాబా లీల. "థాంక్యూ సో మచ్ బాబా".


2024, జనవరి 19వ మా పెద్దపాప తన స్కూల్ తరఫున ఒక వారం రోజులు ఊటీ, మైసూరు, బెంగళూరు టూర్‌కి వెళ్ళింది. "పిల్లలందరూ క్షేమంగా వెళ్లి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేలా దయ చూపమ"ని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల పిల్లలు అందరూ క్షేమంగా వెళ్లి, సంతోషంగా గడిపి క్షేమంగా తిరిగి ఇల్లు చేరుకున్నారు. "థాంక్యూ సో మచ్ బాబా".


పారాయణ పూర్తయ్యేలోపు, 'నేను ఉన్నాను' అని తెలియజేసిన బాబా


సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. నా పేరు వెంకటేష్. నా జీవితంలో ప్రతిక్షణం బాబా నన్ను, నా కుటుంబాన్ని కనిపెట్టుకొని వస్తున్నారని చెప్పటానికి నేను ఎంతో అదృష్టవంతుడిగా బావిస్తున్నాను. నేను ఒక ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో పని చేస్తున్నాను. నేను నా గత అనుభవంలో నా బార్య గర్భవతిగా వున్నప్పుడు మా హెచ్ఓడి నన్ను ఇబ్బంది పెట్టారని, ఆ సమయంలో నేను, నా కుటుంబసభ్యులు నన్ను వేరే డిపార్ట్‌మెంట్‌కి బదిలీ చేస్తే బాటుంటుందని బాబాని ప్రార్థించేవాళ్లమని, ఆ తండ్రి దయవలన నాకు బదిలీ అయిందని పంచుకున్నాను. చాలారోజుల తర్వాత ఇటీవల ఒక ఉద్యోగి తప్పు చేస్తే, అత్తన్ని తొలగించి, అతని స్థానంలో నన్ను క్యాంటీన్ సూపర్‌వైజర్‌గా నియమించాలని కొందరు చూస్తున్నారని నాకు తెలిసింది. నిజానికి మా కాలేజీలో ప్రతిదీ గోప్యంగా ఉంచుతారు. అలాంటిది ఆ విషయం ముందుగా నాకు తెలిసేటట్టు బాబానే అనుగ్రహించారు. దాంతో నేను మా కాలేజీ డైరెక్టర్ దగ్గర ఉండే మా బ్రదర్‌కి విషయం చెప్పాను. వాడు, "నాకు ఈ విషయం గురించి తెలియదు. నేను సార్‌కి చెప్తాను" అని అన్నాడు. క్యాంటీన్‌‌ పని చాలా రిస్క్‌తో కూడుకున్నది. నా భార్యకి ఆరోగ్య సమస్యలున్నాయి. మాకు చిన్నబాబు కూడా ఉన్నాడు. అందువల్ల నేను ప్రతిరోజూ "నన్ను క్యాంటీన్‌‌కి మార్చకుండా చూడు బాబా. అదే జరిగితే మీ అనుగ్రహం బ్లాగు ద్వారా తోటి సాయి భక్తులతో పంచుకుంటాను" అని బాబాను వేడుకుంటూ ఉండేవాడిని. అలాగే "సచ్చరిత్ర పారాయణ చేసి అనాధాశ్రమంలో 15 మందికి భోజనం పెట్టిస్తాన"ని కూడా బాబాకి మొక్కుకున్నాను. నేను ఒక 10 రోజులు నిద్ర లేని రాత్రులు గడిపాను. సాయి సచ్చరిత్ర పారాయణ పూర్తి చేసిన మరుసటిరోజు గురువారం నాడు మా బ్రదర్, "అన్నా! నేను సార్ కి చెప్పాను. క్యాంటీన్‌‌కి నిన్ను మార్చట్లేదు. వేరే వాళ్లని మారుస్తున్నారు" అని చెప్పాడు. నేను ఆనందంగా వేలవేల ధన్యవాదాలు బాబా అని అనుకున్నాను. అలా బాబా పారాయణ పూర్తయ్యేలోపు, 'నేను ఉన్నాను' అని నాకు చూపించారు. “ధన్యవాదాలు బాబా”.



సాయిభక్తుల అనుభవమాలిక 1781వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సందర్భానుసారం బాబా చేసిన సహాయం
2. బాధను తీసేసి ఆనందంగా తిరిగి పంపిన బాబా

సందర్భానుసారం బాబా చేసిన సహాయం

నా పేరు కమలిని. మాది శ్రీకాకుళం. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. నేను పదవ తరగతి చదువుతున్నప్పుడు బాబాని, "నాకు బోర్డు పరీక్షలలో 575 మార్కులు రావాల"ని ఒక కోరిక అడుగుతుండేదాన్ని. పరీక్షలు వ్రాసాక ఫలితాలు రేపు విడుదల అవుతాయనగా ముందురోజు నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నాకు 532 మార్కులు వచ్చినట్లు కనిపించింది. మరుసటిరోజు నాకు అవే మార్కులు వచ్చాయి. అప్పుడు నేను ఎంత బాధపడ్డానో మాటల్లో చెప్పలేను. కానీ బాబా దయవల్ల రీవెరిఫికేషన్లో నేను కోరుకున్న మార్కులు నాకు వచ్చాయి.


ఇంటర్ మొదటి సంవత్సరంలో నాకు బాగానే మార్కులు వచ్చాయి. కానీ రెండవ సంవత్సరంలో నా మీద నాకు విశ్వాసం తక్కువగా ఉన్నందున 'నాకు జెఈఈ మైన్స్‌లో నాకు మంచి సీట్ వస్తుందా? నా తల్లిదండ్రులతో డొనేషన్ కట్టించకుండా నేను నా చదువు పూర్తి చేయగలనా?' అని అనిపించేది. అటువంటి సమయంలో జాతకాలను అస్సలు నమ్మని మా నాన్న నన్ను ఒక జ్యోతిష్యుని దగ్గరకు తీసుకెళ్లారు. బాబా భక్తుడైన ఆయన నాకు మార్గనిర్దేశం చేసారు. నా జాతకంలో ఉన్న దోషాలు తొలగడానికి ఆయన నాకు కొన్ని పరిహారాలు చెప్పారు. నేను వాటిని పాటించాను. తర్వాత బాబా దయవల్ల మా కళాశాలలో జరిగే పరీక్షలలో నాకు ఎప్పుడూ మొదటి స్థానం రావడంతో నాకు కాస్త నమ్మకం వచ్చింది. ఒక శనివారంనాడు నాకు వారాంతం పరీక్ష ఉందనగా మందురోజు నేను ఉపవాసం ఉన్నాను. అందువల్ల పొద్దున్నుంచి కొన్ని పళ్ళు మాత్రమే తిన్నాను. ఆరోజు మధ్యాహ్నం నేను ఇంటికెళ్లి మర్నాటి పరీక్షకోసం చదువుకుందామని కాలేజీలో హాఫ్ డే సెలవు తీసుకున్నాను. నేను కాలేజీ నుండి బయటకి వచ్చాక మా నాన్నకి నా బ్యాగు ఇవ్వబోతుంటే ఆయన, "నువ్వే వేసుకో(వీపుపై)" అనడంతో నేను వేసుకున్నాను. కానీ, 'పొద్దున్నుంచి నేనేమీ తినలేద'ని తెలిసి కూడా నాన్న నన్నే బ్యాగు మోయమని ఎందుకు అన్నారో నాకు అప్పుడు అర్థం కాలేదు. కొంతదూరం వెళ్ళాక నాకు కళ్ళు తిరిగి బండి మీద నుండి చాలా రద్దీగా ఉండే రోడ్డు మధ్యలో పడిపోయాను. నాకు అస్సలు చలనం లేదు. కాసేపటికి స్పృహలోకి వచ్చి చూస్తే రోడ్డు మధ్యనున్నాను. ఏం జరిగిందో నాకు అస్సలు తెలీలేదు. మా నాన్న నేను వెనక్కి జారీ పడిపోయానని చెపితే విషయం అర్థమైంది. ఆ ఘటనలో నా వీపుపై ఉన్న బ్యాగు ముందుగా రోడ్డుకు ఆనడంతో నా తలకు గాయం కాలేదు. అలా కాకుంటే చాలా దారుణం జరిగేది. మా నాన్న బ్యాగు ఎందుకు తీసుకోనన్నారో నాకు అప్పుడు అర్థమైంది. సమయానికి బాబానే బ్యాగు తీసుకోకుండా ఉండేలా నాన్నకు ప్రేరణనిచ్చి నన్ను, నాన్నని కాపాడారని కూడా అర్థమైంది.


ఇంకా జెఈఈ పరీక్షకి కొన్ని రోజులు ఉందనగా మాకు మాక్ టెస్టులు నిర్వహించారు. అవి నేను బాగానే రాసాను. కానీ ఆ పరీక్షలు వ్రాసేటప్పుడు నాకు చాలా భయమేసేది. పరీక్ష అంటే భయపడేదాన్ని. కాళ్ళుచేతులు చెమటలు పట్టేవి. దాంతో నేను ఎక్కడ భయంతో పరీక్షలో ఏడుస్తానో అని మా అమ్మ చాలా భయపడింది. ఇక జెఈఈ పరీక్షల ముందురోజు నేను ఒక మాక్ టెస్ట్ ఆన్సర్ చేస్తుంటే అందులో చాలా ఈజీ బిట్ ఒకటి నాకు రాలేదు. అప్పుడు నేను, 'రేపు పరీక్షలో ఇలా జరుగుతుందేమో!' అని చాలా భయపడి ఏడ్చాను. అప్పుడు మా అమ్మ నాతో, "నువ్వు రేపు పడాల్సిన బాధని బాబా ఇప్పుడే నీకు ఇచ్చేసారు. నువ్వు రేపు పరీక్ష బాగా రాస్తావు" అని అంది. నేను అమ్మ ద్వారా బాబా నన్ను సమాధానపరిచారని అనుకున్నాను. పరీక్ష జరిగేరోజు పొద్దున్న నేను దేవుని దగ్గర దీపం పెడుతున్నప్పుడు అగరబత్తీ తగిలి మా ఇంట్లో ఉన్న బాబా విగ్రహంకి తొడిగి ఉన్న వస్త్రం కాలింది. అలా జరిగినందుకు నేను చాలా బాధపడ్డాను. అప్పుడు అమ్మ, "బాబా నిన్ను బట్టలు కొని ఇవ్వమని అడుగుతున్నారు. బాబాకి కొత్త బట్టలు కొందాం" అని అంది. అమ్మ ద్వారా బాబానే అలా చెప్పారని నన్ను నేను సద్దిచెప్పుకున్నాను. తరువాత, "బాబా! నాతో రా, దగ్గరుండి నువ్వే నాతో పరీక్ష వ్రాయించు" అని చెప్పుకొని పరీక్షకి వెళ్ళాను. మాములుగా పరీక్షల్లో భయపడే నేను ఆరోజు అస్సలు భయపడకపోవడం విశేషం. కానీ అదే సమయంలో మా అమ్మ నేను మాములుగా పడే బాధకంటే రెండింతలు భయపడిందని మా నాన్న చెప్పారు. అప్పుడు నేను, 'బాబా నేను పడాల్సిన భయాన్ని మా అమ్మకి ఇచ్చి నాకు సహాయం చేసార'ని అనుకున్నాను. బాబా దయవల్ల నేను జెఈఈ మైన్స్ పరీక్ష బాగానే రాసాను. "ధన్యవాదాలు బాబా. నేను కోరుకున్న పెర్సెన్టైల్ వచ్చేలా దీవించండి".


ఓం శ్రీసాయినాథాయ నమః!!!


బాధను తీసేసి ఆనందంగా తిరిగి పంపిన బాబా


నా పేరు సరిత. సాయి కృపవల్ల కరోనా 2వ వేవ్‌కి ముందు 2021, జనవరిలో మేము శిరిడీ వెళ్ళాము. మేము ట్రైన్ ఎక్కాక 5 ఏళ్ల లోపు పిల్లల్ని మందిరంలోకి అనుమతించడం లేదని మాకు తెలిసింది. అప్పుడు మా పాపకి 3 సంవత్సరాలు. అందువల్ల తనకి బాబా దర్శనం కాలేదు. నేను చాలా బాధపడ్డాను. మరుసటిరోజు త్రయంబకేశ్వరం వెళ్లి కొన్ని ఆలయాలు సందర్శించి వచ్చాము. ఆ మరుసటిరోజు సాయంత్రం 5 గంటలకు మా తిరుగు ప్రయాణానికి ట్రైన్ ఉండగా ఆరోజు ఉదయం చావడి దగ్గర షాపింగ్ చేస్తూ సమాధి మందిరంకి దగ్గరగా వెళ్ళాం. ఆ సమయంలో నేను నా పాపకి బాబా దర్శనం కాలేదని చాలా బాధపడుతూ ఉండగా ఒక చోట కొంతమంది లైన్ కట్టి లోపలికి వెళ్తున్నారు. మేము అదేదో గుడి అనుకోని వెళ్లి ఆ లైన్లో నిల్చున్నాము. తీరా లోపలికి వెళ్తే దూరంగా సాయిబాబా దర్శనం ఇచ్చారు. ఆది సాయిబాబా సమాధి మందిరమే. అలా బాబా నా పాపకి దర్శనం ఇచ్చారని నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఆ ఆనందంలో మేము తిరుగు ప్రయాణమయ్యాము. "ధన్యవాదాలు బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 1780వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • భక్తితో ప్రార్థిస్తే కరుణించకుండా ఉంటారా బాబా?


నేను ఒక సాయి భక్తుడిని. మేము షోలాపూర్‌లో ఉంటున్నాము. మా అక్కవాళ్ళు ముంబాయిలో ఉంటున్నారు. తన అత్తగారి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల తరచూ ఆమెను హాస్పిటల్లో అడ్మిట్ చేస్తున్నారని తెలిసి, 'ఒకసారి వెళ్లి ఆమెను కలిసొస్తే బాగుంటుంద'ని మేము ట్రైన్ టికెట్లు బుక్ చేసుకున్నాము. అయితే ఆ టికెట్లు ట్రైన్ బయలుదేరే రోజు సాయంత్రం వరకు కూడా వెయిటింగ్ లిస్టులో ఉన్నాయి. మరి కొద్ది నిమిషాల్లో చార్ట్ ప్రిపేర్ అవుతుందనగా కూడా వెయిటింగ్ లిస్ట్‌‌లో ఉన్నాయి. అది చలికాలం, పైగా రాత్రి ప్రయాణమైనందున చిన్నబాబుతో నేను, నా భార్య ప్రయాణమెలా చేస్తామని టెన్షన్ వేసింది. వెంటనే మన ఆపద్బాంధవుడైన శిరిడీ సాయినాథుని, "బాబా! టికెట్లు ఎలాగైనా కన్ఫర్మ్ అయి మా ప్రయాణం సాఫీగా సాగినట్లైతే మీ అనుగ్రహం 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను" అని వేడుకున్నాను. బాబా దయవల్ల టికెట్లు వెయిటింగ్ లిస్ట్ పోయి ఆర్ఏసి‌లోకి వచ్చాయి. ఆర్ఏసి అంటే ఒకే బెర్తు ఇద్దరికి ఇస్తారని అందరికీ తెలిసిందే కదా! ఆ ఒక్క బెర్త్ మీద నేను, నా భార్య చిన్నబాబుతో ఎలా సర్దుకోగలమనిపించి, "ట్రైన్ ఎక్కాక మరో సీటు సెట్ అయ్యేలా చేయండి బాబా" అని బాబాను కోరుకున్నాను. బాబా దయవల్ల ట్రైన్ ఎక్కిన 3 గంటల తరువాత మాకు మరో సీటు దొరికింది. దాంతో నేను, నా భార్య, మా బాబు క్షేమంగా ముంబాయి చేరుకున్నాం.


ఒకరోజు రాత్రి హఠాత్తుగా నా ఒళ్లంతా దురదలు పుట్టాయి. మొదట దోమ కాట్లేమో అనుకున్నాను. కానీ అలెర్జీ వల్ల అని మరుసటిరోజు ఉదయం తెలిసింది. ఆ రోజు రాత్రి నిద్రపోయేముందు కూడా అలానే దురదలు మొదలై చేతులంతా ఎర్రగా దద్దుర్లు లేచాయి. అప్పుడు ఫుడ్ పాయిజన్ వల్ల అయ్యుండొచ్చు అనిపించింది. దాంతో భయమేసి బాబాని ప్రార్థించి, బాబా ఊదీ తీసుకొని దద్దుర్లు ఉన్న చోట పూసి, మరికొంత ఊదీ నోట్లో వేసుకున్నాను. తర్వాత నిద్రపోయేముందు, "ఉదయానికి ఈ బాధ తగ్గితే, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా తోటి భక్తులతో నా అనుభవం పంచుకుంటాను" అని బాబాని ప్రార్థించి పడుకున్నాను. బాబా దయతో ఉదయానికి దద్దుర్లు, దురద మటుమాయం అయ్యాయి. ఏ ఔషధానికి లేని శక్తి బాబా ఊదీకి ఉంది. అంతటి మహిమ, పవిత్రత ఊదీకి ఉన్నాయి. "ధన్యవాదాలు బాబా. మీ దీవెనలు ఎల్లప్పుడూ మీ భక్తులపై ఉండాలని కోరుకుంటున్నాను బాబా".


ఈమధ్య సంవత్సరం ఐదు నెలల వయసున్న మా బాబుకి వ్యాక్సిన్ వేయించాక తనకి తొడ నొప్పి, జ్వరం వచ్చాయి. వ్యాక్సిన్ వేసిన నర్సు ఒక రోజులో జ్వరం, నొప్పి తగ్గిపోతాయిని చెప్పింది. కానీ రెండోరోజు రాత్రికి కూడా జ్వరం, తొడ నొప్పి తగ్గలేదు. అదీకాక బాబు నడవలేక ఏడవసాగాడు. అప్పుడు నేను బాబాని ప్రార్థించి ఊదీ బాబు తొడకి రాసి, కొంచెం ఊదీ నోట్లో వేసి, “బాబా! మీ దయతో రేపటికి బాబుకి నయమై మంచిగా ఉంటే, మీ అనుగ్రహం 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా తోటి సాయి భక్తులతో పంచుకుంటాను" అని వేడుకున్నాను. బాబాని భక్తితో ప్రార్థిస్తే కరుణించకుండా ఉంటారా? మరుసటి రోజు ఉదయానికి అంతా సర్దుకుంది. బాబు నవ్వుతూ లేచాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. "ధన్యవాదాలు బాబా".


ఇంకోసారి బాబుకి జలుబు చేసి రాత్రి పడుకునే ముందు దగ్గు కూడా మొదలైంది. దగ్గు వల్ల బాబు 5, 6 సార్లు వాంతులు చేసుకున్నాడు. నిద్రొస్తున్నా దగ్గు వల్ల నిద్రపోలేక ఏడవసాగాడు. రెండు గంటలు చూశాక నేను బాబుకి బాబా ఊదీ పెట్టి, "బాబా! మీ దయవల్ల బాబుకి దగ్గు, వాంతులు తగ్గితే ముగ్గురికి అన్నదానం చేసి, మీ మందిరంలో 101 రూపాయల దక్షిణ సమర్పించుకుంటాను. అలాగే మీ అనుగ్రహాన్ని తోటి భక్తులతో పంచుకుంటాను" అని ప్రార్థించి బాబా మీద భారమేసాను. తర్వాత కొద్దిగా వేడినీళ్ళ బ్యాగుతో కాపడం పెట్టి బాబుని నిద్రపుచ్చాము. బాబా చూపిన అద్భుతం చూడండి. అప్పటివరకు దగ్గు, వాంతులతో సతమతమైన బాబు ఆ క్షణం నుండి చక్కగా నిద్రపోయాడు. బాబా లీలలను ఎంత వర్ణించినా తక్కువే. "ధన్యవాదాలు బాబా. మీ దీవెనలు ఎల్లప్పుడూ మీ భక్తులకు ఉండాలని కోరుకుంటున్నాను బాబా".


నా భార్య అక్క, తన భర్త, అత్తగారు షోలాపూర్ చుట్టుపక్కలున్న తీర్థ క్షేత్రాల దర్శనార్థం షోలాపూర్‌లో ఉన్న మా ఇంటికి వచ్చి శుక్రవారం ఉదయం బయలుదేరి కొల్హాపూర్‌లోని శ్రీమహాలక్ష్మి అమ్మవారిని, పండరీపురంలో ఉన్న పాండురంగ విఠలుని దర్శనం చేసుకొని రాత్రికి తిరిగి మా ఇంటికి చేరుకొని, శనివారం ఉదయం తుల్జాపూర్ భవానిమాత దర్శనం చేసుకుని మధ్యాహ్ననికి తిరిగి మా ఇల్లు చేరుకొని, ఇక అప్పటినుండి అంటే ఆరోజు మధ్యాహ్నం నుండి ఆదివారం సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యేవరకు షోలాపూర్‌లోని పలు ప్రదేశాలు చూస్తూ మాతో సమయం గడిపేలా ప్లాన్ చేసుకున్నారు. కానీ నాకు శుక్ర, శనివారాల్లో డ్యూటీ ఉండడం వల్ల కొల్హాపూర్, పండరీపురం, తుల్జాపూర్ వెళ్ళడం సాధ్యంకాక మొదటి రెండు రోజులు వాళ్లతో గడపలేకపోయాను. కనీసం శనివారం మధ్యాహ్నం నుండి ఆదివారం సాయంత్రం వరకు వాళ్ళతో గడిపితే వాళ్ళు తృప్తి పడతారు, మేము కూడా వాళ్ళతో మాట పడకుండా ఉంటాము. కానీ నాది రైల్వేలో ఉద్యోగం, అది కూడా ఎమర్జెన్సీ సెక్షన్లో వర్క్. కాబట్టి ఏ సమయంలో నాకు కాల్ వచ్చినా నేను అన్ని పనులు పక్కన పెట్టి వెంటనే వెళ్లిపోవాలి. ఇలాంటి గందరగోళ స్థితిలో నాకు మొదట గుర్తుకు వచ్చింది బాబానే. ఆయన్ని, "బాబా! నువ్వే ఈ సమస్య నుండి మమ్మల్ని కాపాడాలి. ఆదివారం వాళ్ళు తిరుగు ప్రయాణమయ్యేవరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చేసి మా కుటుంబ సమేతంగా షోలాపూర్‌లో ఉన్న శ్రీపద్మావతిదేవి సమేత శ్రీవేంకటేశ్వరుని, శ్రీసిద్దరామేశ్వరస్వామి, అలాగే ఆ మందిర ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీదేవతల్ని దర్శించే భాగ్యం ప్రసాదించండి బాబా. అలాగే గ్రామదేవత జాతర, ఎలక్ట్రానిక్ ఎగ్జిబిషన్ చూసేలా చేయండి. మీకు 101 రూపాయల దక్షిణ సమర్పించి, ఒకరికి అన్నదానం చేసి, మీ అనుగ్రహాన్ని ఆధునిక సచ్చరిత్ర 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా మీ భక్తులందరితో పంచుకుంటాను" అని ప్రార్థించాను. బాబాకి చెప్పుకుంటే సాధ్యం కానిదంటూ ఉంటుందా? బాబా దయవల్ల శనివారం మధ్యాహ్నం నుండి ఆదివారం సాయంత్రం వరకు నాకు ఆఫీస్ నుండి కాల్ రాలేదు, ఎక్కడా డ్యూటీ వేయలేదు. కుటుంబమంతా చాలా ఆనందంగా గడిపాము. మేము, వచ్చిన బంధువులు అందరమూ సంతోషం. బాబా చేసిన మేలుకి ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే. "బాబా! మీ దీవెనలు ఎల్లప్పుడూ మీ భక్తులపై ఉండాలి.


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!!


సాయిభక్తుల అనుభవమాలిక 1779వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. పోగొట్టుకున్న బిడ్డను తిరిగి ప్రసాదించిన బాబా

2. సాయి అనుగ్రహ వీక్షణలు


పోగొట్టుకున్న బిడ్డను తిరిగి ప్రసాదించిన బాబా


సాయిభక్తులందరికీ నా నమస్సుమాంజలి. నా పేరు కావ్య. నేను తెలియక చేసిన తప్పు వల్ల ఐదవ నెలలో నా కడుపులోని బాబు చనిపోయి పుట్టాడు. ఆ బాధ నన్ను చాలారోజుల వరకు వెంటాడుతుండటంతో నేను ఏడుస్తూ వుండేదాన్ని అలా ఉండగా సంవత్సరం నిండకుండానే నేను మళ్ళీ గర్భవతినయ్యాను. అప్పుడు నేను మునుపు పోగొట్టుకున్న బిడ్డే మళ్ళీ నాకు పుట్టాలని అనుకున్నాను. కానీ అదెలా సాధ్యమనిపించింది. నాలుగో నెల వచ్చాక నేను నా గత అనుభవంలో చెప్పినట్టుగానే అనూహ్య రీతిన బాబా ఊదీ నాకు అందింది. అప్పుడు, "బాబా! నేను మునుపు పోగొట్టుకున్న బిడ్డే మళ్ళీ నాకు పుట్టాలి. అప్పుడే నా బాధ పోతుంది" అని బాబాకి చెప్పుకొని రోజూ ఊదీ నా కడుపు మీద రాసుకుంటూ, కొంచెం నోట్లో వేసుకుంటుండేదాన్ని. ఇలా ఉండగా ఒకరోజు చెకప్ కోసం హాస్పిటల్‌కి వెళ్తే, అక్కడ బాబా ఫోటో రూపంలో దర్శనం ఇచ్చారు. అప్పుడు బాబా ఎలా అయిన నా కోరిక తీరుస్తారని నాకు కొంచెం నమ్మకం కుదిరింది. డాక్టర్ కూడా బాబా భక్తురాలు అవ్వడంతో నా నమ్మకం ఇంకా బలపడింది. 9 నెలలయ్యాక ఒకరోజు నేను హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాను. మరుసటిరోజు ఉదయం ఆపరేషన్ అనగా ఆ రాత్రి నాకు గది కేటాయించారు. ఆ గదిలో కూడా ఫోటో రూపంలో బాబా దర్శనం ఇచ్చారు. ఆ రాత్రంతా నేను, "బాబా! నాకు బాబే పుట్టాలి" అని బాబాకి మొక్కుకుంటూ గడిపాను. తెల్లవారుజామున నర్స్ వచ్చి, నన్ను లేపి చేతి నరంకి లిక్విడ్స్ ఎక్కించడానికి ప్రయత్నేస్తే అస్సలు సెట్ అవ్వలేదు. 2 చేతులకి కలిపి పది సార్లు ఇంజెక్షన్ గుచ్చి తీశారు. దాంతో రెండు చేతులు ఒకటే నొప్పి. అసలే ఇంజెక్షన్ అంటే భయం నాకు. అందువల్ల నేను బాబా ఫోటోని చూస్తూ, "ఏంటి బాబా, నన్ను ఇలా పరీక్షిస్తున్నారు? అని ఏడుస్తూ అన్నాను. బాబా దయవల్ల అప్పుడు సెట్ అయింది. తరువాత నన్ను ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్లారు. ఆపరేషన్ సమయమంతా నేను బాబాని స్మరించుకున్నాను. డాక్టర్ కడుపులోని బిడ్డను తీసి బాబు పుట్టాడని చెప్పారు. విచిత్రంగా గతంలో 5వ నెలలో నేను పోగొట్టుకున్న బాబు రూపంలోనే పుట్టిన బాబు ఉన్నాడు. నేను చాలా సంతోషంగా బాబాకి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. "థాంక్యూ బాబా. మీరు నాకు అడిగిన వెంటనే సమాధానం ఇస్తున్నారు. ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోగలను? మీరు కోరుకున్నట్లు నడుచుకోవడం తప్ప! అందరినీ కాపాడండి బాబా".


సాయి అనుగ్రహ వీక్షణలు


నా తండ్రి సాయినాథునికి సాష్టాంగ నమస్కారాలు. సాయిభక్తులందరికీ శతకోటి వందనాలు. నా పేరు శ్రీరంజని. 2023, జూన్ నెల చివరిలో మా అమ్మకి మణిపాల్ హాస్పిటల్లో ఫుల్ బాడీ చెకప్ చేయించాము. బాబా దయవల్ల డాక్టరు, "బి12 లోపం, LDL అంటే చెడు కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ ఉండటం తప్పా వేరే ఏ ఇబ్బంది లేద"ని చెప్పి, చెడు కొలెస్ట్రాల్ తగ్గడానికి పాటించాల్సిన ఆహార నియమాలు చెప్పారు. అలాగే 3 నెలలకోసం మందులిచ్చారు. అయితే అమ్మ ఆ మందులు 5 నెలల వరకు వేసుకుంది. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ చెకప్‌కి వెళ్ళలేదు. చివరికి 2024, జనవరి 23న నేనే అమ్మని మా మావయ్య వాళ్ళింటి దగ్గర్లో ఉండే డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లి, బ్లడ్ శాంపిల్ ఇచ్చాము. మా మావయ్య, "3 నెలలకని ఇచ్చిన మందులు 5 నెలలు వాడితే పని చేయవని, అంత ఎక్కువ LDL ఉంటే గుండె సమస్యలు వస్తాయ"ని అన్నారు. అది విని నాకు భయమేసి, "బాబా! నార్మల్ రిపోర్టు రావాలి. అలా జరిగితే మీ అనుగ్రహాన్ని బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాన"ని బాబాను వేడుకున్నాను. మరుక్షణమే నాకు బాబా దర్శనం ఇచ్చారు. అదెలా అంటే, ఆ సమయంలో మా మావయ్య శిరిడీ ప్రసాదం తింటూ ఉన్నారు. ఆ ప్యాకెట్ మీద బాబా ఫోటో ఉంది. ఇది బాబా చేసిన అద్భుతం. రిపోర్టులో కొలెస్ట్రాల్ 162 - 18 అని వచ్చింది. డాక్టర్ ఇక టాబ్లెట్లు వాడాల్సిన అవసరం లేదని అన్నారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


మా అత్తగారి కిడ్నీపై గడ్డలా వచ్చింది. ఈమధ్య క్యాన్సర్ సమస్యలు ఎక్కువగా ఉండటం వల్ల డాక్టర్లు క్యాన్సర్ ఏమోనని అనుమానం వ్యక్తం చేశారు. దాంతో నేను, "బాబా! అది మామూలు గడ్డ అయుండి, ఆవిడ ఇబ్బందిపడకుండా చూడండి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల ఆవిడ రిపోర్టులు నార్మల్ అని వచ్చాయి. సర్జరీ చేసి గడ్డని తొలగించారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 1778వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఇబ్బంది లేకుండా చూసిన బాబా
2. సాయిని మించిన వైద్యుడు ఎవరు?

ఇబ్బంది లేకుండా చూసిన బాబా


సాయిభక్తులందరికీ నమస్కారాలు. నా పేరు రేవతిలక్ష్మి. అందరిలానే నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. మా నాన్నగారు ఉన్నప్పుడు ఆయన ఎవరింటికీ వెళ్లేవారు కాదు, అమ్మను కూడా ఎక్కడికీ పంపేవారు కాదు. 2022లో మా నాన్న స్వర్గస్తులయ్యాక అమ్మ ఒంటరిదైపోయింది. అమ్మను నా దగ్గరకు తెచ్చుకొని చూసుకోవాలని నాకు అనిపించింది. కానీ మేము ఉండేది ఢిల్లీలో. అప్పుడు మా ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు. అందువల్ల అమ్మను తెచ్చుకోవడం కుదరలేదు. తర్వాత మావారికి ఉద్యోగం వచ్చి అంతా బాగానే ఉందని అనుకుంటే పిల్లలకి స్కూలు సెలవులు లేనందున అమ్మని తీసుకొని రావడానికి వెళ్లడం కుదరలేదు. అమ్మ, 'నాన్న సంవత్సరీకానికి నేను ఖచ్చితంగా వచ్చి తనని తీసుకొని వెళ్లన'ని అనుకుంది. కానీ నేను అప్పుడు కూడా వెళ్ళలేకపోయాను. దాంతో అమ్మ చాలా బాధపడింది. ఆ విషయం అక్కవాళ్ళు నాకు చెప్పారు. నేను అది విన్న వెంటనే ఏదేమైనా అమ్మను తీసుకొని రావాలని టికెట్లు బుక్ చేశాను. కానీ, 'రానున్నది చలికాలం. అమ్మకి ఆరోగ్య సమస్యలున్నాయి. తనని రెండు రోజులు రైలులో ఎలా తేవాలి? చలి నుండి అమ్మను ఎలా సంరక్షించుకోవాలి? ఇక్కడ చలికి తను తట్టుకోలేదేమో!' అని నాకు భయం పట్టుకుంది. "బాబా! అంతా నీదే భారం. అమ్మను తెచ్చుకుంటున్నాను. తనకి ప్రయాణంలో ఏ ఇబ్బంది కలగకూడదు. తను ఎటువంటి ఇబ్బంది పడకుండా నేను చూసుకోవాలి. తను సంతోషంగా ఉండాలి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయతో అమ్మని క్షేమముగా నావద్దకు తెచ్చుకున్నాను. తను నా దగ్గర రెండు నెలలు సంతోషంగా గడిపింది. ఒకసారి బాగా దగ్గు వచ్చి అమ్మ ఇబ్బందిపడితే, "బాబా! అమ్మకి ఏమి కాకూడదు. ఇప్పటిదాకా మంచిగా ఉంది. ఇప్పుడు కొత్తగా ఏ కష్టాలు రాకూడదు, ఆరోగ్యంగా ఉండాల"ని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. బాబా దయవల్ల అమ్మకి పెద్దగా ఇబ్బంది కాలేదు. తొందరగానే తగ్గిపోయింది. అమ్మని అక్షరధామ్‌కి, అలాగే బిర్లా మందిరంకి తీసుకెళ్లి బిర్లా మందిరంలో అమ్మచేత బాబాకి శాలువా ఇప్పించాను. అమ్మ చాలా సంతోషించింది. అమ్మను మార్చి వరకు నా దగ్గర ఉంచుకోవాలని అనుకున్నాను కానీ జనవరిలో చలి బాగా పెరుగుతుందని అమ్మని విజయవాడలో దించి వచ్చాము. బాబా దయతో అమ్మను మళ్ళీ తెచ్చుకొని బాగా చూసుకుంటాను. బాబా ఉండగా నాకు ఏం భయం లేదు. ఆయన మన మంచికోసం ఏదైనా చేస్తారు. "శతకోటి వందనాలు సాయి".


సాయిని మించిన వైద్యుడు ఎవరు?


శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!


నేను సాయిబాబాకి అనన్య భక్తురాలిని. నేనే కాదు మా ఇంట్లో అందరూ సాయి భక్తులే. మాకు ఏ సమస్య వచ్చినా సాయికే చెప్పుకుంటాం. సాయి తప్ప మాకు ఈ భూమి మీద ఇంకే దేవుడూ లేడు. అంత గుడ్డిగా మేము సాయిని విశ్వసిస్తాం. ఒక సంవత్సరంన్నరపాటు మా చెల్లి చేతి మీద చర్మవ్యాధితో బాధపడింది. మొదట్లో మేము దాన్ని అంతగా పట్టించుకోలేదు. కానీ రానురానూ ఆ చర్మవ్యాధి కారణంగా మచ్చలు ఏర్పడి నల్లగా అయిపోయి చూడడానికి కొంచెం అసహ్యంగా కనిపించడం మొదలైంది. అప్పుడు మాకు ఏం చేయాలో తోచలేదు. కనీసం సాయికి చెప్పుకోవాలి, మొక్కుకోవాలి అన్న ఆలోచన కూడా రాలేదు. ప్రారబ్దం అడ్డుపడితే సాయి కూడా గుర్తుకు రారేమో! మేము ఒక డెర్మటాలజిస్ట్(చర్మవ్యాధి నిపుణుడు)ని సంప్రదించాము. ఆ డాక్టర్ చూసి ఒక లిక్విడ్, ఆయింట్మెంట్, టాబ్లెట్లు ఇచ్చారు. అయితే వాటిని వాడుతున్నా మా చెల్లికి ఆ చర్మవ్యాధి నుంచి ఉపశమనం లభించలేదు. మాకు ఏం చేయాలో అర్థంకాక, "సబ్బు ఏమన్నా మార్చమంటారా?" అని డాక్టర్ని అడిగాం. అందుకాయన, "మీరు ఇప్పుడు ఏం వాడుతున్నారు?" అని అడిగారు. మేము మామూలుగా మైసూర్ శాండిల్ సబ్బు లేదా ఏదైనా ఒంటిసబ్బు వాడుతున్నాము అని చెప్పాము. డాక్టరు, "అవేవీ వద్దు. పియర్స్ వాడండి" అని సూచించారు. కానీ ఆయన చెప్పినట్టు ఆ సబ్బు వాడినా కూడా చర్మవ్యాధిలో కించెత్తు కూడా మార్పు లేదు సరికదా మచ్చలు ఇంకా ఎక్కువయ్యాయి. ఇక అప్పుడు సాయికి మొరపెట్టుకొని మందులు వాడడం ఆపేసాము. సాయికి మా బాధ చెప్పుకొని, "ఏ సబ్బు వాడమంటావు సాయి?" అని చీటీలు వేసాము. మేము అనుకున్న నాలుగు సబ్బులూ వాడొద్దని బాబా చెప్పారు. మాకు ఏం తోచలేదు. అంతలో మా అమ్మ మరో సబ్బు గురించి చెప్తే, ఆ సబ్బు వాడొచ్చో, లేదో తెలిపమని సాయినాన్న దగ్గర చీటీ వేసాము. ఆ సబ్బు వాడమని బాబా చెప్పారు. అంతే, సాయి అద్భుతం మొదలైంది. మేము డాక్టరు ఇచ్చిన మందులు, సబ్బు వాడకుండా కేవలం సాయి సూచించిన సబ్బు వాడిన రెండోరోజు నుంచే సంవత్సరంన్నర నుంచి బాధపడుతున్న చర్మవ్యాధి తగ్గుముఖం పట్టడం మొదలై మా చెల్లి చేతి మీద ఏర్పడ్డ నల్లమచ్చలతో సహా ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. ఆనవాళ్లు కూడా లేనంతగా నయమైపోయింది. సాయిని మించిన వైద్యుడు ఎవరు? ఆయనకు తెలియని విద్య ఏంటి? ఆయన దేన్నైనా సరి చేయగలరు. ఈ చర్మవ్యాధి ఒక లెక్కా? "థాంక్యూ సో మచ్ సాయి. ఇలా మేము ఏమి అడిగినా మాకు సలహా ఇస్తూ ఇంటి పెద్దలా మాకు తోడు ఉంటున్నందుకు జన్మజన్మలకి మీకు ఋణపడి ఋణపడి ఉంటాము తండ్రీ".


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!


సాయిభక్తుల అనుభవమాలిక 1777వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • ఏ ఆటంకం లేకుండా శిరిడీ, కొల్హాపూర్ దర్శనం చేయించిన బాబా

నా పేరు ప్రసన్న. నేను కడప వాస్తవ్యురాలిని. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాను. బాబా నాపై చూపుతున్న ప్రేమని అంత ఇంతని చెప్పలేను. నాకు ఆయన మీద ఉన్న నమ్మకం, ప్రేమని కూడా మాటల్లో వర్ణించడం నాకు కష్టమనిపిస్తుంది. ఆయనే నా తండ్రి. తండ్రి అన్నందుకు నిజంగా తండ్రిలా నా భాద్యతలన్నీ చూసుకుంటున్నారు బాబా. నేను ఆరవ తరగతి చదువుతున్నప్పుడు నాకు బాబాతో పరిచయముంది. ఒకరోజు మా ఎదురింటివాళ్ళు తమ ఇంట్లో బాబా పూజ ఉందని పిలిచారు. నాకు ఆ సమయంలో బాబా గురించి అసలేం తెలీదు. కానీ మా అమ్మ పూజకు వెళ్ళమంటే వెళ్లాను. అది కూడా అంత ఇంట్రెస్ట్‌గా ఏం వెళ్ళలేదు. అలా వెళ్లిన నేను పూజలో కూర్చోని బాబా చక్కటి ముఖారవిందాన్ని వీక్షిస్తుండగా అంతలో ఒకరు సాయి సచ్చరిత్రలోని అధ్యాయాలు చదవడం మొదలుపెట్టారు. ఆ కధలను వింటుంటే నాలో ఏదో తెలియని ఆనందం కలిగి, 'బాబా ఎంత గొప్పవారు?' అనిపించింది. పూజ నుండి వచ్చాక అమ్మతో బాబా గురించి చెప్పాను. మెల్లగా అమ్మ బాబాని నమ్మడం ప్రారంభించింది. క్రమంగా మా ఇద్దరి నమ్మకం పెరుగుతూ ‘బాబా మమ్మల్ని ఎప్పుడు శిరిడీకి పిలుస్తారా?’ అని ఎదురుచూసాము. అలా 10 ఏళ్ళు గడిచిపోయాయి. ఒకరోజు హఠాత్తుగా 'ఈ సంవత్సరం(2024) సంక్రాంతి సెలవలకి శిరిడీ వెళితే బాగుండు' అనుకున్నాను. కానీ మాకై మేము తెలుసుకొని అంత దూరం వెళ్ళలేము. మా మామయ్యవాళ్లే మమ్మల్ని తీసుకెళ్లాలి. అందువల్ల, "బాబా! నేను ఒక్కదాన్నే శిరిడీ రావాలనుకుంటే అయ్యే పని కాదు కదా. మా మావయ్యవాళ్ళు అనుకుంటేనే రాగలం" అని బాబాతో అనుకొని నా ఆలోచనను అక్కడితో వదిలేసాను. ఎందుకంటే, మా మావయ్యవాళ్ళు శిరిడీ వస్తారన్న నమ్మకం నాకు అప్పుడు లేదు. కానీ బాబా తన బిడ్డలని ఎప్పుడూ నిరాశపరచరు. ఆ రాత్రి నేను మా మామయ్యవాళ్ళతో ఫోన్లో మాట్లాడుతుంటే మామయ్య తనంతట తానే, "ఈ సంక్రాంతికి శిరిడీ, కొల్హాపూర్ వెళదామని టిక్కెట్లు చూస్తున్నాం. నువ్వు కూడా చూడు. నీకు సెలవులు ఎప్పుడు కుదురుతాయో అప్పుడు చేసుకుందాం" అని అన్నారు. అది విన్న నా ఆనందానికి ఇంక అవధులు లేవు. నా తండ్రి తన బిడ్డ కోరికను వెంటనే ఎలా నెరవేరుస్తున్నారో అని అనుకున్నాను. తీరా టికెట్స్ బుక్ చేద్దామంటే, కడప నుంచి శిరిడీకి జనవరి 9న ఉన్న వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లో శిరిడీ వెళ్లి బాబాను దర్శించుకొని, తర్వాత కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మ దర్శనానికి వెళ్దామంటే రెండు చోట్లకు వెళ్ళడానికి టిక్కెట్లు సరిగా కుదరలేదు. ఆ మాట విని నాకు చాలా బాధేసి, "బాబా! టికెట్లు బుక్ అవ్వట్లేదు. నాకు భోజనం తినాలని లేదు" అని మధ్యాహ్నం భోజనం తినకుండా ఏడుస్తూ కూర్చున్నాను. కాసేపటికి నా మనసుకి, "నేను ఇలా పస్తుంటే బాబాకి నచ్చదు. నేను ఇలా చేస్తే బాబా బాధపడతారు' అని అనిపించి బాబాని బాధపెట్టడం ఇష్టం లేక వెళ్లి భోజనం చేసి వచ్చాను. ఇంతలో మామయ్యవాళ్ళు పోనే చేసి, "అందరికీ టికెట్లు బుక్ చేసాం" అని చెప్పారు. ఇంకా నేను, అమ్మ 'జనవరి 9 ఎప్పుడొస్తుందా?' అని సంతోషంగా ఎదురుచూసాం. 'మొదటిసారి శిరిడీ వెళుతున్నాం. బాబాని చూస్తే, అంతే చాలు' అని ఎంతో ఆరాటంతో ఆరోజు కోసం నిరీక్షించాము. అలాగే జనవరి 5కి నా నెలసరి సమయం అయినందున బాబాని చూడగలనో, లేదో అన్న టెన్షన్ కూడా ఉండింది. ఒకరోజు బాబా గుడికి వెళ్లి, తిరిగి వచ్చేటప్పుడు ఎందుకో తెలీదుగాని, 'నేనైతే బాబాని చూడకుండా ఉండలేను. ఒకవేళ నెలసరి అయిన కూడా నేను బాబాని చూడకుండా ఉండలేక మందిరంకి వెళ్ళిపోతానేమో!' అని అన్నాను. ఆ మాట గుర్తొచ్చినప్పుడల్లా బాబా నేను అలా అన్నందుకు నన్ను పరీక్షిస్తున్నారేమో అనిపించేది. చివరికి జనవరి 6, రాత్రి ఈ 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో నెలసరి సమయంలో శిరిడీలో దర్శనం చేసుకోవచ్చా, లేదా అన్న కొందరి భక్తుల సందేహాన్ని బాబా స్వయంగా తీర్చిన అనుభవాలను చదివాను. దాంతో నెలసరి సమయంలో బాబాను నిశ్చింతగా దర్శించుకోవచ్చని నిర్ధారణ అయి నా సందేహాలన్నీ తీరిపోయాయి. కానీ మరోవైపు నెలసరి ఎక్కడొస్తుందో, వస్తే అమ్మవారినైతే దర్శించుకోలేనుగా అని అనిపించింది. అందుచేత, "బాబా! ఏ సమస్య లేకుండా మీ దర్శనం, అమ్మవారి దర్శనం చేసుకోవాలి. అంతా సవ్యంగా అయితే మీ అనుగ్రహాన్ని బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను" అని అనుకొని నెలసరి ఆగడానికి టాబ్లెట్లు తెచ్చుకున్నాను. వాటివల్ల ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో, లేదో నాకు తెలీదుకాని నేను బాబాను, అమ్మవారిని చూడాలన్న ఆరాటంతో వేసుకోబోతున్నాను కాబట్టి వాళ్లే నన్ను రక్షిస్తారనే నమ్మకంతో వేసుకున్నాను.


మేము జనవరి 9న బయలుదేరి జనవరి 10న శిరిడీ చేరుకున్నాము. నేను బాబాను, "తండ్రీ! అమ్మ ఎవరినీ ఏది అడగదు. తను ఏ కష్టమొచ్చినా ఆదుకోమని మిమ్మల్నే అడుగుతుంది. మీరు తనకి చక్కటి దర్శనాన్ని ప్రసాదించి మీ కరుణను తనపై ప్రసరించండి" అని ప్రార్థించాను. బాబా దర్శనానికి మా అమ్మవాళ్ళు లైన్‌లో ముందు వెళ్ళారు. వాళ్ళకి బాబా చక్కటి దర్శనాన్ని అనుగ్రహించారు. నేను అదే లైన్‌లో వెనుక వెళ్తుంటే మా మామయ్య వచ్చి, "చివరి లైన్‌లో వెళితే బాబాకి దగ్గరగా వెళ్లొచ్చు" అని చెప్పారు. సరేనని నేను ఆ లైన్‌లోకి వెళ్లాను. ఆ లైన్ బాబాని చూసాక నేరుగా బయిటికి వెళ్లిపోయేలా ఉన్నందున నేను కొన్ని క్షణాలే బాబాని చూడగలిగాను. అందుచేత సరిగా బాబా దర్శనం కాలేదని నాకు బాధగా అనిపించింది. మేము మా రూమ్‌కి వచ్చేసరికి రాత్రి ఒంటిగంట అయింది. అమ్మ పెద్దమ్మ, అత్తవాళ్ళతో పడుకుంటే నేను అక్కవాళ్ళతో వేరే గదిలో పడుకున్నాను. తెల్లారితే గురువారం. అమ్మవాళ్ళు పొద్దున్నే లేచి బాబా దర్శనానికి వెళుతూ మా గది తలుపు తట్టారు కానీ, మాకు వినిపించలేదు. నిద్రలేచాక గురువారంనాడు దర్శనానికి వెళ్ళలేకపోయానని నాకు చాలా బాధగా అనిపించి, "ఏంటి బాబా, నాకు మీ దర్శనం లేదా?" అని అనుకున్నాను. అంతలో 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ వాట్సాప్ ఛానెల్‌లో "నువ్వు నా దర్శనానికి వచ్చావా? నేను నీకు ఋణపడ్డాను. నేనే నీ వద్దకు రావాలి" అని బాబా మెసేజ్ వచ్చింది. అది చూశాక ఎలాగైనా వెళ్లి బాబాని దర్శించుకోవాలని అనుకున్నాను. అదే విషయం మా అమ్మతో చెప్పాను. కానీ పెదమ్మవాళ్ళు, మామయ్యవాళ్ళు నాసిక్ వెళ్ళాలి. ఇప్పుడు దర్శనానికి వెళితే టైం సరిపోదు అన్నారు. నేను, “ఏదేమైనా గాని బాబా దర్శనంకి వెళ్ళాలనుకుంటున్నాను. నేను ఎక్కడికీ రాను" అని చెప్పేసి నేను మా అమ్మ దగ్గరకు వెళ్ళిపోయాను. అమ్మ మావయ్యవాళ్ళతో, "మీరందరూ నాసిక్ వెళ్లిరండి. మేము బాబా దర్శనంకి వెళ్ళొస్తాము" అని చెప్పింది. ఇంకా పెద్దమ్మవాళ్ళు నా భాద చూడలేక బాబా దర్శనంకి వెళ్ళిరా అని చెప్పారు. ఈసారి దర్శనానికి మధ్య లైన్‌లో వెళ్లాను. ఆ లైన్‌లో నుంచి బాబాని చూస్తుంటే బాబా నా వైపే చూస్తున్నారనిపించింది. దర్శనం చాలా బాగా జరిగింది. నేను దణ్ణం పెట్టుకుంటూ బాబా దగ్గర ఉండగా మా బావవాళ్ళు దణ్ణం  పెట్టుకొని వెనక్కి వెళ్తుంటే అక్కడున్న సెక్యూరిటీ అతను మా బావని ఆపి కొద్దిసేపు అక్కడ ఉండమని చెప్పారు. నేను మా బావవాళ్ల దగ్గరకి వెళ్ళాక ఆ సెక్యూరిటీ అతను బాబాకి సమర్పించిన స్వస్తిక్ గుర్తు ఉన్న ఒక వస్త్రాన్ని మాకు ఇచ్చారు. నేను అది బాబా దయ అని బావించాను.


తర్వాత మేము 4 నెంబర్ గేటుకి ఎదురుగా బాబా కాంస్య విగ్రహం ఉన్న చోటకి పార్క్‌లోకి వెళ్తుంటే బాబా ఫోటో ఒకటి మా ముందు వచ్చి పడింది. అది ఎక్కడి నుండి వచ్చిందో నాకు తెలియదుగాని అది నా తండ్రి నాపై చూపిన ప్రేమ, కరుణ. మేము బాబా విగ్రహాలు తీసుకున్నాం. వాటిని తీసుకొని దర్శనానికి వెళితే, సమాధికి తాకించి ఇస్తారని మొదటిసారి శిరిడీ వెళ్ళినందువల్ల మాకప్పుడు తెలీదు. తర్వాత సాయంత్రం ముఖదర్శనం చేసుకొనే సమయంలో విగ్రహాలను ఎవరికైనా ఇస్తే సమాధికి తాకించి ఇస్తారని చాలా ప్రయత్నం చేసాం కానీ, అక్కడ సెక్యూరిటీ మమ్మల్ని లోపలికి అనుమతించలేదు. ఇంతలోపు మా అమ్మ, "బాబా వస్తున్నారు" అని అంది. చూస్తే, ఎదురుగా బాబా పల్లకి వస్తుంది. ఉదయం సాయి తమ వచనం ద్వారా "నేను నీవద్దకు వస్తాను" అని చెప్పారు, అలానే నా తండ్రి వచ్చారు. మేము తీసుకున్న బాబా విగ్రహాలను ఆ పల్లకికి తాకించాను. 


2024, జనవరి 11 సాయంత్రం మేము కొల్హాపూర్‌కి ప్రయాణమయ్యాము. అదృష్టంకొద్దీ జనవరి 12, శుక్రవారంనాడు మహాలక్ష్మి అమ్మవారి దర్శనభాగ్యం మాకు కలిగింది. అదేరోజు అమ్మవారి పల్లకి దర్శనం కూడా అద్భుతంగా జరిగింది. మరుసటిరోజు శనివారం ఉదయం మేము మళ్ళీ అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడు సరిగ్గా అమ్మవారి దగ్గరకి వెళ్లేసరికి అమ్మవారిని నిజరూప దర్శనానికి సిద్దం చేసారు. అలా ఆ చల్లటి తల్లి నిజరూప దర్శనభాగ్యం కూడా మాకు లభించింది. అలా నా తండ్రి శిరిడీ, కొల్హాపూర్ రెండూ దర్శనాలు ఏ ఆటంకం లేకుండా మంచిగా జరిగేలా అనుగ్రహించారు. ఇలా బాబా ఎప్పుడూ మాతోనే ఉంటారని నా నమ్మకం.


ఒకసారి నా ఛార్జర్ పని చేయలేదు. అప్పుడు నేను, "బాబా! ఇది నాకు ఇప్పుడు ఎంతో అవసరం. ఇది పని చేసేలా చూడండి. మీ అనుగ్రహం తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకున్నాను. అంతలోనే నా ఛార్జర్ పనిచేసింది. చిన్న విషయమైనా, పెద్ద విషయమైనా బాబా ఎప్పుడూ నా వెంటే ఉన్నారు. ఒక్క నా వెంటే కాదు, తమను నమ్మిన ప్రతి ఒక్కరి బాగోగులు ఆయన చూసుకుంటారు. మనం నిర్భయంగా ఉంటూ  స్వచ్ఛమైన మనసుతో ఆయనను నమ్మితే చాలు. "ధన్యవాదాలు బాబా. మీరు నా ఉద్యోగ విషయాలలో నా కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఇచ్చారు. అందుకు నా కృతఙ్ఞతలు. అలాగే నేను ఈ సంవత్సరం సాదించాలని అనుకున్నవన్నీ జరిగేలా చూడండి. అమ్మానాన్నకి చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. మాలాగే ఎంతో మంది ‘మీరు ఉన్నారు, చూసుకుంటారు’ అన్న నమ్మకంతో మీ సహాయం కోసం చూస్తున్నారు. మా అందరికి మీరే దైర్యం, మీరే రక్ష, మీరే మా ఆధారం”.


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo