సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1758వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. పర్సు దొరికేలా దయచూపిన బాబా
2.  బాబా కృప
3. చిటికేసినంత తొందరగా రోజంతా ఉన్న నొప్పిని తగ్గించిన బాబా

పర్సు దొరికేలా దయచూపిన బాబా


సాయిబంధువులకు నమస్కారం. నా పేరు రాణి. మాది విశాఖపట్నం. 2023, డిసెంబర్ 25న మేము పండగ షాపింగ్‌కి వెళ్ళాము. మామూలుగా నేను ఎప్పుడు బయటకు వెళ్లినా నా పర్సు తీసుకొని వెళ్ళను. ఎందుకంటే, అందులో ఆధార్, పాన్ వంటి ముఖ్యమైన కార్డులు ఉంటాయి. కానీ ఆరోజు నేను పర్సు తీసుకొని షాపింగ్‌కి వెళ్ళాను. 3 రోజుల తర్వాత చూస్తే, పర్సు కనిపించలేదు. అప్పుడు నేను వేరే పని మీద ఉండడం వల్ల ఇంట్లోనే ఎక్కడో ఉంటుందని సరిపెట్టుకున్నాను. తర్వాత 2024, జనవరి 1న బ్యాంకు అఫ్ బరోడాలో అకౌంట్ ఓపెన్ చేసేందుకు నా పర్సుకోసం ఇల్లంతా వెతికాను. కానీ పర్సు ఎక్కడా కనిపించలేదు. చివరికి కారులో మరిచిపోయానేమోనని కారులో వెతికాను. కానీ అక్కడ కూడా పర్సు దొరకలేదు. దాంతో నాకు టెన్షన్ మొదలై బాబాతో నా బాధ చెప్పుకున్నాను. ఆయన మాత్రమే ఈ సమస్య నుండి  బయటపడే మార్గం చూపిస్తారని నా నమ్మకం. సరే, బాబాకి చెప్పుకున్న తర్వాత నా భర్తకి ఫోన్ చేస్తే, "ఆధార్ డూప్లికేట్ వస్తుంది కానీ, పాన్ కార్డు రాదు. ఇక చేసేది ఏం లేదు" అని అన్నారు. నేను మాత్రం, "ఈరోజే పర్సు దొరకాలి బాబా" అని బాబాని వేడుకున్నాను. బ్లాగులోని సాయి భక్తుల అనుభవాలు చదివే నేను, "నా పర్సు దొరికినంతనే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని కూడా బాబాను వేడుకొని ఆయన మీద భారమేసి నా పని నేను చేసుకున్నాను. ఇక బాబా చేసిన అద్భుతం చూడండి. సాయంత్రం నా భర్త బ్యాంకు నుంచి ఇంటికి వచ్చాక, "పర్సు  దొరకలేదు. ఇప్పుడు ఏం చేద్దాం" అని అన్నాను. అందుకాయన, "సరే, నేను ఒకసారి కారులో ఉందేమో చూస్తాన"ని కారు తాళాలు తీసుకొని వెళ్తుంటే, "నేను కారులో మొత్తం చూసాను. అక్కడ లేదు" అని చెప్పాను. అయినా ఆయన, "నేను ఒకసారి చూస్తాను" అని వెళ్లి చూస్తే, పర్సు కారులోనే ఉంది. ఇది ఎలా సాధ్యమో బాబాకే తెలియాలి! "ధన్యవాదాలు బాబా. మీ ఆశీస్సులు మా అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తండ్రీ".


బాబా కృప


సాయి మహరాజుకి, సాయిబందువులకి నమస్కారం. నా పేరు రాంబాబు. మాది విజయవాడ. నేను కుటుంబ సమేతంగా శిరిడీ వెళ్ళాలని అనుకుంటూ ఉండగా 2023, డిసెంబర్ 23న ఒక వాట్సాప్ గ్రూప్‌లో శిరిడీ వెళ్లాలనుకునేవారు పేర్లు ఇవ్వండి, స్పెషల్ ట్రైన్‌కోసం మాట్లాడుతున్నామని మెసేజ్ పెట్టారు. మేము ఎంతో సంతోషంగా మా కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలు ఇచ్చాము. అయితే వెళ్లాల్సిన సమయం దగ్గర పడుతుండగా గ్రూపువాళ్ళు 'ట్రైన్ ఖర్చులు ఎక్కువ అవుతున్న కారణంగా ఎవరి టికెట్లు వాళ్లే తీసుకోవాలని మెసేజ్ చేసారు. అప్పటికే ట్రైన్లన్నీ ఫుల్ అయిపోయాయి. అందువల్ల మాకు ఏమి చేయాలో తెలియలేదు. 'ఇప్పుడు ఎలా శిరిడీ రావాడం సాయి?' అని ఆలోచిస్తూ బాబానే అడుగుదామని ‘రావాలో’, ‘వద్దో’ తెలియజేయమని చీటీలు వేస్తే, 'రమ్మని' వచ్చింది. సాయి ఇచ్చిన సమాధానంతో ధైర్యంగా శిరిడీ వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. బాబా దయవల్ల తత్కాల్లో మాకు టికెట్లు బుక్ అయ్యాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము శిరిడీ వెళ్ళాము. బాబా దయవల్ల మంచి రూమ్ దొరికింది, వారి దర్శనం కూడా బాగా జరిగింది.


ఒకసారి నేను నా స్నేహితుని బదిలీ విషయంలో మధ్యవర్తిత్వం చేశాను. నా స్నేహితుడు నా ద్వారా సదరు వ్యక్తులకి కొంత పెద్ద మొత్తంలో డబ్భులు కూడా ఇచ్చాడు. తర్వాత ఒక నెల రోజులలో బదిలీ అవుతుందని మేము అనుకున్నాము. కానీ ఏరోజుకారోజు ఆలస్యం అవుతూ 8 నెలలైనా నా స్నేహితుడికి బదిలీ కాలేదు. నా ద్వారా డబ్బులు ఇవ్వడం వలన నా స్నేహితుడు నాపై ఒత్తిడి తెచ్చాడు. ఆ టెన్షన్ భరించరానిదిగా ఉండటంతో నేను రోజూ, "బాబా! నా స్నేహితునికి బదిలీ అయ్యేటట్టు చూసి నన్ను ఈ టెన్షన్ నుండి బయటపడేయండి" అని బాబాను వేడుకుంటూ ఉండేవాడిని. బాబా ఏమి చేసారో, ఏమోగాని 8 నెలలుగా పెండింగ్‌లో ఉన్న నా స్నేహితుని బదిలీ సమస్య తీరింది. తదుపరి బదిలీ జాబితాలో నా స్నేహితుడి పేరు ఉంది. అలా ఆ రోజుతో నా టెన్షన్ తీరింది. "చాలా ధన్యవాదాలు బాబా".


చిటికేసినంత తొందరగా రోజంతా ఉన్న నొప్పిని తగ్గించిన బాబా


ఓం శ్రీసాయినాథాయ నమః!!! నా పేరు ఉష. బాబా మనకు గురువుగా, దైవంగా లభించడం మన అదృష్టం. 2024, జనవరి 1 మధ్యాహ్నం నుంచి నా పొట్టలో నొప్పిగా వుంటుంటే గ్యాస్ ప్రాబ్లం అనుకొని టాబ్లెట్ వేసుకున్నాను. దాంతో నొప్పి కొంచెం తగ్గింది కానీ, రాత్రి అన్నం తిని పడుకున్నాక మళ్ళీ వచ్చింది. అప్పుడు నొప్పి ఎక్కువగా ఉండి, నడుములోకి కూడా వచ్చింది. అప్పుడు, "బాబా! నొప్పి భరించలేకుండా ఉన్నాను, తగ్గించు" అని బాబాను వేడుకున్నాను. కానీ నొప్పి తగ్గలేదు. రాత్రి 11 గంటలప్పుడు కూర్చున్నా, పడుకున్నా నొప్పి ఉండటంతో ఇక అప్పుడు బాబా ఊదీ నుదుటన పెట్టుకొని, మరికొంత ఊదీ నోట్లో వేసుకొని, 'నొప్పి తగ్గితే, నా అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాన'ని అనుకున్నాను. మరుక్షణం అసలు నాకేనా నొప్పి అని అనిపించేంతగా నొప్పి పూర్తిగా అదృశ్యమైంది. అలా చిటికేసినంత తొందరగా రోజంతా ఉన్న నొప్పిని తగ్గించారు బాబా. "చాలా చాలా కృతజ్ఞతలు సాయి. ఓ సాయిదేవా, సాయిశ్వరా, సాయినాథా! నీ భక్తులను ఎప్పుడూ రక్షించు తండ్రీ".


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo