ఈ భాగంలో అనుభవాలు:
1. సుదీర్ఘకాలం నడిచిన కోర్టు కేసు నుండి బయటపడేసిన బాబా
2. ఉదయానికి నొప్పి అదృశ్యమయ్యేలా దయ చూపిన బాబా
సుదీర్ఘకాలం నడిచిన కోర్టు కేసు నుండి బయటపడేసిన బాబా
ప్రియమైన సోదరసోదరీమణులకు నమస్కారం. నేను చాలా సంవత్సరాలుగా సాయిబాబా భక్తురాలిని. అనవసరమైన కారణాలతో మాకు సంబంధించిన ఒక ఇంటర్నేషనల్ కోర్ట్ కేసు సుదీర్ఘకాలం నడిచింది. ఆ కేసు నడిచే సమయంలో నాకు నేనే ప్రతిరోజూ, 'బాబా సహాయం చేస్తారు. ఆయనకు మనకేమి కావాలో తెలుసు. అన్నీ ఆయనే చూసుకుంటార'ని అనుకుంటూ ఉండేదాన్ని. అయితే, ఒక్కో రోజు గడిచేకొద్దీ కేసు అలాగే కొనసాగుతూ న్యాయవాదుల ఖర్చులు, డాక్యుమెంటేషన్ మరియు ఇతర ఛార్జీలు పెరుగుతూ పోసాగాయి. అలా ఒకటి కాదు, రెండు కాదు ఏడేళ్లు గడిచిపోయాయి. చివరికి మా సమయం, శక్తి, డబ్బు వృధా అయిపోతున్నాయనిపించి కేసు వదులుకోవడమే మంచిదని భావించే స్థాయికి మేము చేరుకున్నాము. అప్పుడొకరోజు నేను చివరి ప్రయత్నం చేయాలని నిర్ణయించుకొని సహాయం కోసం బాబాను ఆశ్రయించి, "రేపటి నుండి నేను స్వీట్లు తినడం మానేస్తాను" అని ఆయనకు మాటిచ్చాను. అలా స్వీట్లు అంటే ప్రాణమైన నేను పెద్ద త్యాగం చేశాను. నేను ఏమనుకున్నానంటే, 'బాబా స్వీట్లపట్ల నాకున్న ప్రేమ(ఇష్టాన్ని)ను అర్థం చేసుకొని మాకు సహాయం చేయడానికి ఏదైనా త్వరగా చేస్తార'ని. అలా నేను 2022, ఫిబ్రవరిలో స్వీట్లు తినకుండా ఉండటం ప్రారంభించాను. కానీ నెలలు గడుస్తున్నా పరిస్థితిలో ఎటువంటి ఆశ కనిపించలేదు. డాక్యుమెంటేషన్ ఏ స్థాయికి చేరిందంటే సబ్మిట్ చేయడానికి ఏంకేమీ మిగలలేదు. రోజురోజుకు మా నిరాశ పెరిగిపోతూ అక్టోబర్లో దీపావళి వచ్చేసరికి తట్టుకోలేక స్వీట్లు తిని 'బాబా నా సమస్యను అర్థం చేసుకున్నప్పటికీ కేసు విషయంలో ఆయన కూడా నిస్సహాయంగా ఉన్నారని, ఆయన ఇంకా ఆ కేసు గందరగోళాన్ని భరించలేరని' ఆయనని బలవంతపెట్టడం మానేసాను. ఆయనకి క్షమాపణలు చెప్పి నవంబర్లో కూడా ఒకటి, రెండుసార్లు చాక్లెట్ తిన్నాను. డిసెంబర్ నాటికి అకస్మాత్తుగా మా కేసు ఒక ముగింపుకు చేరుకున్నట్లనిపించి ఏదో ఒక రిజల్ట్ వస్తుందని ఆశించాము. ఈలోగా నా భర్త పుట్టినరోజు వచ్చింది. ఆరోజు మావారు కేకు కట్ చేసాక నేను ఒక ముక్క తీసుకొని బాబాకి క్షమాపణలు చెప్పి నేనిక వేచి ఉండలేనని బాబాకి చేసిన వాగ్దానాన్ని మరచిపోవాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే, నాకు స్వీట్లు తినకుండా 10 నెలలు గడపడమన్నది చాలా సుదీర్ఘ కాలం. అయితే నేను నా వాగ్దానానికి కట్టుబడి ఉండకపోయినా బాబా నన్ను మరచిపోలేదు.
2023, జనవరిలో ఒక గురువారంనాడు కేసు మాకు అనుకూలంగా ఉందని, తదుపరి విచారణకు డాక్యూమెంట్లు సమర్పించానని మా న్యాయవాది వద్ద నుండి మాకు ఇమెయిల్ వచ్చింది. అది చూసి నేను నా ఆనందాన్ని అదుపు చేసుకోలేకపోయాను. వెంటనే నా వాగ్దానాన్ని ఉల్లంఘించినందుకు బాబాకు క్షమాపణలు చెప్పుకున్నాను. తరువాత మేము చివరిసారిగా కేసుకు సంబంధించి పేపర్ వర్క్ పూర్తిచేసాము. ఆపై ప్రతి గురువారం మేము కేసు విషయంలో శుభవార్తలు అందుకున్నాము. చివరికి ప్రతిదీ సజావుగా సాగి కేసు మాకు అనుకూలంగా పరిష్కారమైంది. నేను ఆ సంతోషంలో ఈ అనుభవాన్ని మీతో పంచుకుంటానని బాబాకి మాటిచ్చాను. కానీ పనిలో పడి ఆలస్యం చేస్తూ వచ్చాను. చివరికి ఒక గురువారం బాబాకిచ్చిన మాటను మరచిపోయానని నా మనసుకనిపించి అన్నీ పనులు ఆపేసి ఈ అనుభవాన్ని వ్రాసాను. ఏ ఆశలేని సమయంలో బాబా ఆశాకిరణం వంటివారు. ఆయనపట్ల దృఢమైన విశ్వాసంతో ఉండండి. ఆయన మీ పక్కన ఉంటే ఏదీ అసాధ్యం కాదు. "బాబా! మీరు గ్రేట్. మీకు చాలా చాలా ధన్యవాదాలు".
ఉదయానికి నొప్పి అదృశ్యమయ్యేలా దయ చూపిన బాబా
అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.
ముందుగా పాఠకులకు నా హృదయపూర్వక ప్రణామాలు. నేను సాయిబాబా భక్తురాలిని. నేను జర్మనీ వాసిని. నేను ఇప్పుడు మన ప్రియమైన సాయి నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. ఒకరోజు అకస్మాత్తుగా నాకు నడుము నొప్పి వచ్చింది. వెన్ను భాగంలో పట్టేసి నడుము, కడపు కూడా నొప్పిగా అనిపిస్తూ వంగడానికిగానీ, నిద్రపోవడానికి కూడా కష్టమైంది. అప్పటికి రెండేళ్ల క్రితం కూడా ఇలాగే నొప్పొచ్చి మూడు, నాలుగు రోజులకు పైగా కొనసాగింది. అందువల్ల ఈసారి కూడా నొప్పి అలాగే ఉంటుందేమో అని నేను ఆందోళన చెందాను. మావారు రెండుసార్లు మేడికేట్డ్ ఆయిల్ రాసినప్పటికీ అది పెద్దగా ఉపశమనం ఇవ్వలేదు. దాంతో నేను కొన్నిరోజుల ఆ నొప్పి అనుభవించడానికి సిద్ధపడిపోయాను. అయితే ఆ రాత్రి నొప్పి వల్ల నిద్రపోవడానికి నాకు చాలా కష్టంగా అనిపించి, "బాబా! ఈ నొప్పి తగ్గిపోతే మీ అనుగ్రహాన్ని తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. అద్భుతాలలోకెల్లా అద్భుతం! ఉదయానికి నొప్పి పూర్తిగా అదృశ్యమైంది. నేను ఎటువంటి ఇబ్బందీ లేకుండా నా ఇంటి పనులన్నీ యధావిధిగా చేసుకోగలిగాను. "చాలా చాలా ధన్యవాదాలు సాయి. నా జీవితంలో జరిగే ప్రతిదీ మీకు తెలుసు. ఈ నొప్పిని నేనింకా భరించలేను. దయచేసి ఆ బాధను పూర్తిగా నయం చేసి నన్ను ఆశీర్వదించండి. మా అందరికీ మీ పాదాల చెంత ఆశ్రయమిచ్చి మమల్ని అనుగ్రహించండి సాయి".
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.

