1. పోగొట్టుకున్న బిడ్డను తిరిగి ప్రసాదించిన బాబా2. సాయి అనుగ్రహ వీక్షణలు
పోగొట్టుకున్న బిడ్డను తిరిగి ప్రసాదించిన బాబా
సాయిభక్తులందరికీ నా నమస్సుమాంజలి. నా పేరు కావ్య. నేను తెలియక చేసిన తప్పు వల్ల ఐదవ నెలలో నా కడుపులోని బాబు చనిపోయి పుట్టాడు. ఆ బాధ నన్ను చాలారోజుల వరకు వెంటాడుతుండటంతో నేను ఏడుస్తూ వుండేదాన్ని అలా ఉండగా సంవత్సరం నిండకుండానే నేను మళ్ళీ గర్భవతినయ్యాను. అప్పుడు నేను మునుపు పోగొట్టుకున్న బిడ్డే మళ్ళీ నాకు పుట్టాలని అనుకున్నాను. కానీ అదెలా సాధ్యమనిపించింది. నాలుగో నెల వచ్చాక నేను నా గత అనుభవంలో చెప్పినట్టుగానే అనూహ్య రీతిన బాబా ఊదీ నాకు అందింది. అప్పుడు, "బాబా! నేను మునుపు పోగొట్టుకున్న బిడ్డే మళ్ళీ నాకు పుట్టాలి. అప్పుడే నా బాధ పోతుంది" అని బాబాకి చెప్పుకొని రోజూ ఊదీ నా కడుపు మీద రాసుకుంటూ, కొంచెం నోట్లో వేసుకుంటుండేదాన్ని. ఇలా ఉండగా ఒకరోజు చెకప్ కోసం హాస్పిటల్‌కి వెళ్తే, అక్కడ బాబా ఫోటో రూపంలో దర్శనం ఇచ్చారు. అప్పుడు బాబా ఎలా అయిన నా కోరిక తీరుస్తారని నాకు కొంచెం నమ్మకం కుదిరింది. డాక్టర్ కూడా బాబా భక్తురాలు అవ్వడంతో నా నమ్మకం ఇంకా బలపడింది. 9 నెలలయ్యాక ఒకరోజు నేను హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాను. మరుసటిరోజు ఉదయం ఆపరేషన్ అనగా ఆ రాత్రి నాకు గది కేటాయించారు. ఆ గదిలో కూడా ఫోటో రూపంలో బాబా దర్శనం ఇచ్చారు. ఆ రాత్రంతా నేను, "బాబా! నాకు బాబే పుట్టాలి" అని బాబాకి మొక్కుకుంటూ గడిపాను. తెల్లవారుజామున నర్స్ వచ్చి, నన్ను లేపి చేతి నరంకి లిక్విడ్స్ ఎక్కించడానికి ప్రయత్నేస్తే అస్సలు సెట్ అవ్వలేదు. 2 చేతులకి కలిపి పది సార్లు ఇంజెక్షన్ గుచ్చి తీశారు. దాంతో రెండు చేతులు ఒకటే నొప్పి. అసలే ఇంజెక్షన్ అంటే భయం నాకు. అందువల్ల నేను బాబా ఫోటోని చూస్తూ, "ఏంటి బాబా, నన్ను ఇలా పరీక్షిస్తున్నారు? అని ఏడుస్తూ అన్నాను. బాబా దయవల్ల అప్పుడు సెట్ అయింది. తరువాత నన్ను ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్లారు. ఆపరేషన్ సమయమంతా నేను బాబాని స్మరించుకున్నాను. డాక్టర్ కడుపులోని బిడ్డను తీసి బాబు పుట్టాడని చెప్పారు. విచిత్రంగా గతంలో 5వ నెలలో నేను పోగొట్టుకున్న బాబు రూపంలోనే పుట్టిన బాబు ఉన్నాడు. నేను చాలా సంతోషంగా బాబాకి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. "థాంక్యూ బాబా. మీరు నాకు అడిగిన వెంటనే సమాధానం ఇస్తున్నారు. ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోగలను? మీరు కోరుకున్నట్లు నడుచుకోవడం తప్ప! అందరినీ కాపాడండి బాబా".
సాయి అనుగ్రహ వీక్షణలు
నా తండ్రి సాయినాథునికి సాష్టాంగ నమస్కారాలు. సాయిభక్తులందరికీ శతకోటి వందనాలు. నా పేరు శ్రీరంజని. 2023, జూన్ నెల చివరిలో మా అమ్మకి మణిపాల్ హాస్పిటల్లో ఫుల్ బాడీ చెకప్ చేయించాము. బాబా దయవల్ల డాక్టరు, "బి12 లోపం, LDL అంటే చెడు కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ ఉండటం తప్పా వేరే ఏ ఇబ్బంది లేద"ని చెప్పి, చెడు కొలెస్ట్రాల్ తగ్గడానికి పాటించాల్సిన ఆహార నియమాలు చెప్పారు. అలాగే 3 నెలలకోసం మందులిచ్చారు. అయితే అమ్మ ఆ మందులు 5 నెలల వరకు వేసుకుంది. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ చెకప్‌కి వెళ్ళలేదు. చివరికి 2024, జనవరి 23న నేనే అమ్మని మా మావయ్య వాళ్ళింటి దగ్గర్లో ఉండే డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లి, బ్లడ్ శాంపిల్ ఇచ్చాము. మా మావయ్య, "3 నెలలకని ఇచ్చిన మందులు 5 నెలలు వాడితే పని చేయవని, అంత ఎక్కువ LDL ఉంటే గుండె సమస్యలు వస్తాయ"ని అన్నారు. అది విని నాకు భయమేసి, "బాబా! నార్మల్ రిపోర్టు రావాల"ని బాబాను వేడుకున్నాను. మరుక్షణమే నాకు బాబా దర్శనం ఇచ్చారు. అదెలా అంటే, ఆ సమయంలో మా మావయ్య శిరిడీ ప్రసాదం తింటూ ఉన్నారు. ఆ ప్యాకెట్ మీద బాబా ఫోటో ఉంది. ఇది బాబా చేసిన అద్భుతం. రిపోర్టులో కొలెస్ట్రాల్ 162 - 18 అని వచ్చింది. డాక్టర్ ఇక టాబ్లెట్లు వాడాల్సిన అవసరం లేదని అన్నారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
మా అత్తగారి కిడ్నీపై గడ్డలా వచ్చింది. ఈమధ్య క్యాన్సర్ సమస్యలు ఎక్కువగా ఉండటం వల్ల డాక్టర్లు క్యాన్సర్ ఏమోనని అనుమానం వ్యక్తం చేశారు. దాంతో నేను, "బాబా! అది మామూలు గడ్డ అయుండి, ఆవిడ ఇబ్బందిపడకుండా చూడండి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల ఆవిడ రిపోర్టులు నార్మల్ అని వచ్చాయి. సర్జరీ చేసి గడ్డని తొలగించారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

