సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1759వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాయినాథుని నమ్మితే ఇక దేని గురించి ఆలోచించాల్సినవసరం లేదు
2. బాబా అనుగ్రహంతో దక్కిన బిడ్డ 

సాయినాథుని నమ్మితే ఇక దేని గురించి ఆలోచించాల్సినవసరం లేదు


నా పేరు రాజు. ప్రియమైన సాయిబంధువులందరికీ నమస్కారాలు. సాయినాథుడు నాకు ప్రసాదించి ఒక అనుభవాన్ని ఈ బ్లాగు ద్వారా మీ అందరితో పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. 2011లో నేను స్విట్జర్లాండ్‌లో ఉద్యోగం చేస్తున్నప్పుడు మార్చి నెలలో ఉన్నట్టుండి నాకు జ్వరమొస్తే హాస్పిటల్‌కి వెళ్ళాను. అక్కడ అన్ని టెస్టులు చేసి, "రిపోర్టులు రావడానికి నాలుగు రోజులు పడుతుంది" అని అన్నారు. రిపోర్టులు వచ్చాక నన్ను హాస్పిటల్‌కి రమ్మంటే ఏమైందోనని భయపడుతూ వెళ్లాను. నేను భయపడినట్లే వాళ్ళు నాతో, "నీకు లింఫోమా కాన్సర్" అని చెప్పి తదుపరి చికిత్సకోసం అక్కడ ఉండే పెద్ద మెడికల్ యూనివర్సిటీకి వెళ్ళమని సూచించారు. నేను "సాయీ! నాకు ఇటీవలే బాబు పుట్టాడు. మీరు నాకు ఇలా వ్రాసి పెట్టి ఉంటే నాకెందుకు పెళ్లి చేశారు? ఎందుకు పిల్లాడిని ప్రసాదించారు. నాకు ఏమైనా అయితే వాళ్లని ఎవరు చూసుకుంటారు?" అని సాయికి మొరపెట్టుకుంటూ నేను చాలా నరకయాతన అనుభవించాను. పెద్ద హాస్పిటల్‌కి వెళితే, ఒక నెల రోజులు రకరకాల మెడికల్ పరీక్షల కోసం నన్ను తిప్పారు. నేను రోజూ సాయిదేవుని, "నాకు ఏమీ కాకూడదు" అని వేడుకుంటూ ఆ టెస్టులకి వెళ్తుండేవాడిని. అలా ఉండగా ఏప్రిల్ నెలలో ఒకరోజు టెస్టుల రిజల్ట్స్ వచ్చాయని రమ్మంటే భయపడుతూ హాస్పిటల్‌కి వెళ్లాను. అక్కడికి వెళ్ళగానే డాక్టర్ అంతా స్పష్టంగా వివరించి, "ఇది లింఫోమా క్యాన్సర్ కాదు" అని చెప్పారు. కాకపోతే అదేదో సీరియస్ కండిషన్ అని చెప్పి, దానికోసం ఆరు నెలలు మందులు వాడాలని అన్నారు. ఆరోజు నేను సాయికి, “సాయీ! నన్ను ఈ కష్టం నుండి బయటపడేస్తే నా జీవితాంతం నేను మీకు ఋణపడి ఉంటాన”ని మొక్కుకున్నాను.


మందుల వలన శరీర ఆకృతి మరియు మానసిక మార్పులు, ఇంకా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ మొదలై వచ్చిన జబ్బు కంటే వేరే సమస్యలు నన్ను చాలా బాధ పెట్టసాగాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పాలి. అదేమిటంటే, ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో సాయి స్వప్న దర్శనమిచ్చి నా బాధను తప్పిస్తుండేవారు. ఒకరోజు రాత్రి నాకు నిద్రలో ఊపిరి ఆడలేదు. అప్పుడు సాయి నా పక్కనే కూర్చొని నా నాసిక రంధ్రాల లోపల శుభ్రం చేసి మళ్ళీ నేను శ్వాస తీసుకొనేలా సహాయం చేశారు. ఇంకోరోజు నేను నొప్పులతో నా శరీరం కదిలించడానికి వీలు లేకుండా ఉన్నప్పుడు బాబా నా మీదగా దాటుకుని వెళ్లారు. ఆ క్షణం నుండి నొప్పులు తగ్గి నేను ప్రశాంతంగా నిద్రపోయాను. ఇంకొకరోజు నేను భయపడుతూ ఉన్నప్పుడు సాయి నా దగ్గర కూర్చొని, "నేను ఉన్నాను. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు" అని అన్నారు. నాకు మెలకువ వచ్చి చూసేసరికి ఆయన వెళ్లిపోయారు. ఇలా రోజులు గడిచాక 2011, అక్టోబర్లో చివరిగా ఎంఆర్ఐ స్కాన్ వుండింది. ఆ టెస్టుతో, 'ఇంకా మందులు వాడటం కొనసాగించాలా, వద్దా' అన్నది తెలుస్తుందనగా ఆ ముందురోజు నేను సాయి సత్సంగంకి వెళ్లాను. అక్కడ బాబా ఫోటోకి నమస్కరిస్తున్నప్పుడు, "నీకు ఏమీ కాదు, పో!" అని నాకు ఒక స్వరం వినపడింది. ఆ స్వరం నేను హాస్పిటల్‌కి వెళ్లి, తిరిగి వచ్చేవరకూ నా చెవిలో మారుమ్రోగింది. సాయి చెప్పిందే జరిగింది. ఆ టెస్ట్ చేసాక డాక్టరు, "నీకు ఏ సమస్యా లేదు. అన్నీ ఇన్ఫెక్షన్లు క్లియర్ అయిపోయాయి. ఇక మందులు వాడాల్సిన అవసరం లేదు" అని చెప్పారు. అది విని నేను చాలా ఆనందించాను. మనం సాయినాథుని నమ్మితే ఇక దేని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. "ధన్యవాదాలు బాబా".

బాబా అనుగ్రహంతో దక్కిన బిడ్డ 


సాయిబంధువులకు నమస్కారం. నా పేరు లక్ష్మి. నేను గత 20 సంవత్సరాలుగా బాబా భక్తురాలిని. నేను నా భర్తతో కలిసి ఆస్ట్రేలియాలో ఉంటున్నప్పుడు బాబా నాకు ప్రసాదించిన ఒక అద్భుతమైన అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. మా పెద్దపాప నా గర్భంలో ఉన్నప్పుడు 20 వారాలకు మామూలుగా చేసే స్కాన్ అనంతరం మమ్మల్ని ఒక గదిలోకి తీసుకెళ్లి, "కడుపులోని బిడ్డకు పుట్టకకు ముందుండే కొన్ని సమస్యలు ఉండొచ్చు. కాబట్టి మీరు ఈ గర్భం కొనసాగించకూడదనుకుంటే మేము బిడ్డను తొలగిస్తాము" అని బిడ్డను ఎలా తొలగిస్తారో వివరంగా చెప్పారు. ఆ విధానం చాలా భయంకరంగా అనిపించి నన్ను నేను నియంత్రించుకోలేకపోయాను. 6 ఏళ్ళ అత్యంత కష్టం తర్వాత ఆ బిడ్డ నా గర్భంలో పడింది. ఆ కష్ట సమయంలో నేను డిప్రెషన్‌లోకి కూడా వెళ్ళిపోయాను. ఎందుకంటే, నేను మొదట్లో కొన్నిసార్లు నా కడుపులో బిడ్డల్ని పోగొట్టుకున్నాను. ఈసారి కూడా నా కడుపులోని బిడ్డ విషయంలో అలాంటి వార్తే వినేసరికి నేను అస్సలు తట్టుకోలేకపోయాను. "బాబా! నా బిడ్డ క్షేమంగా ఉండటానికి ఏదైనా అద్భుతం చేయండి" అని బాబాను ప్రార్థిస్తూ ఆ గది నుండి బయటకు వచ్చి నా భర్తతో అక్కడే కూర్చున్నాను. కొంత సమయం తర్వాత డాక్టర్లు మమ్మల్ని గదిలోకి పిలిచి, "సమస్యను నిర్ధారించడానికి మరిన్ని పరీక్షలు చేద్దామ"ని అన్నారు. నేను, "నా బిడ్డను సురక్షితంగా ఉంచండి" అని బాబాను ఎంతగానో ప్రార్థించి, "అంతా సవ్యంగా జరిగితే, నేను నా బిడ్డని శిరిడీ తీసుకువస్తాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల అన్ని పరీక్షలు బాగానే జరిగి బిడ్డకు ఎలాంటి సమస్యలు లేవని తేలింది. బాబా చేసిన అద్భుతానికి నేను ధన్యవాదాలు చెప్పుకున్నాను. బాబా దయవల్ల ఎటువంటి సమస్యలు లేక పాప ఆరోగ్యంగా పుట్టింది. నేను భారతదేశానికి వచ్చిన వెంటనే తనని శిరిడీకి తీసుకెళ్లాను. ఇటీవలే తనకి 12 సంవత్సరాలు నిండాయి. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo