సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తి సాధన రహస్యం - సాయిభక్తి సంప్రదాయంలో శిరిడీ ఆరతులు



సాయిభక్తి సంప్రదాయంలో శిరిడీ ఆరతులు

శిరిడీ సందర్శించి అక్కడ శ్రీసాయిబాబా సమాధిమందిరంలో నిత్యం జరిగే నాలుగు ఆరతులలో పాల్గొన్న సాయిభక్తులకు, ఆ తరువాత ఎక్కడ ఆ ఆరతులు వింటున్నా పాడుతున్నా మానసికంగా శిరిడీలో వున్న అనుభూతి కలగడం సామాన్య అనుభవం. శిరిడీయాత్ర చేయని సాయిభక్తులకు కూడా ఆ ఆరతుల బాణీలు వింటుంటే వారి హృదయాలలో అవి ఒక చిత్రమైన అనుభూతిని కలిగిస్తాయి. అద్భుతమయిన శ్రీసాయిమహాత్మ్య ప్రాభావం వల్ల బాబా మహాసమాధి చెందిన అచిరకాలంలోనే దేశంలో అసంఖ్యాకంగా సాయి మందిరాలు వెలిసాయి. వాటిలోని చాలా సాయిమందిరాలలో భక్తులు శిరిడీలో మాదిరి నిత్యం నాలుగు ఆరతులు జరుపుకుంటున్నారు. ఎందరో సాయిభక్తులకు శిరిడీ ఆరతులు ‘వేదమంత్రాలవంటివి’. 'శిరిడీ ఆరతులు జరుగని సాయిమందిరాలు అసలు సాయిమందిరాలే కావ'ని మరికొందరి విశ్వాసం. ఏది ఏమైనా శిరిడీ ఆరతులు ఈనాడు సాయిభక్తి సాంప్రదాయంలో ఒక భాగమైనాయి. సాయిసంప్రదాయంలో ఇంత ప్రాముఖ్యాన్ని సంతరించుకొన్న యీ శిరిడీ ఆరతులు శిరిడీలో ఎలా ప్రారంభమయినాయి? వాటి రచయితలెవరు? ఆ ఆరతుల స్థూలస్వరూపమేమి? అవి వెదజల్లే భావసౌరభాల స్వరూపస్వభావాలేమి? మొదలయిన విషయాలు తెలుసుకోవాలనుకోవడం సాయిభక్తులకు సహజం!

మహారాష్ట్రదేశంలో దైవానికి ఆరతులు చేయడం – దక్షిణాదిన నిత్యదీపారాధన చెయ్యడంలాగా – చాలా సామాన్యమైన ఆరాధన విధి. దైవమందిరాలలోనూ, మహాత్ముల సన్నిధిలోనే గాక, ఇండ్లలో కూడా కుటుంబసభ్యులందరూ కలిసి ఆరతులు చేసే పద్ధతి ఈనాటికీ మనం అక్కడ చూడవచ్చు. శ్రీజ్ఞానేశ్వర్ మహరాజ్, సంత్ నామ్ దేవ్, శ్రీతుకారాం మహరాజ్ మొదలయిన పాండురంగభక్తులు ఆవిష్కరించిన యీ (వార్కరీ) సాంప్రదాయం మహారాష్ట్రలో విశేషప్రాచుర్యం పొంది, క్రమేణా సామాన్య ప్రజానీకం యొక్క ఆధ్యాత్మిక జీవనస్రవంతిలో ఒక అంతర్భాగమైంది.

ఈనాడు మనం పాడుకొంటున్న శిరిడీ ఆరతులను స్థూలంగా విశ్లేషిస్తే, నాలుగు ఆరతులలోనూ కలిపి ముప్ఫై ఆరతి గీతాలున్నాయి. వాటిలో 14 తుకారాం మహరాజ్ తదితర సంత్ కవులు రచించిన ఆరతిగీతాలు, అభంగాలు. వాటిలో 5 పాటలు శ్రీతుకారాం మహరాజ్, 2 పాటలు శ్రీనామదేవ్ మహరాజ్, 2 పాటలు సంత్ జానాబాయి రచించినవి. మిగిలిన ఐదింటిలో ఒకటి శ్రీరామజనార్దనస్వామి రచించిన జ్ఞానేశ్వర్ మహరాజ్ ఆరతి కాగా, మరొకటి శ్రీరామేశ్వర్ భట్ రచించిన తుకారాం మహరాజ్ ఆరతి; ఇవిగాక ఒక వేదసూక్తము (మంత్రపుష్పము), రెండు సాంప్రదాయక ప్రార్థనలు ఉన్నాయి. ప్రత్యేకంగా బాబాపై రచింపబడ్డ 16 ఆరతి గీతాలలో 9 పాటలు శ్రీకృష్ణజోగీేశ్వర భీష్మ, 3 పాటలు శ్రీదాసగణు మహరాజ్ రచించగా, శ్రీఉపాసనీమహరాజ్, శ్రీమాధవ అడ్కర్, శ్రీమోహినీరాజ్, శ్రీబి.వి.దేవులు ఒక్కొక్కటి రచించారు. మొత్తం 30 ఆరతిగీతాలలో 25 మరాటీభాషలోను, 3 స్తోత్రాలు సంస్కృతంలోను, 2 పాటలు హిందీలోను వున్నాయి. ఈ విధంగా యీనాడు మనం పాడుకొంటున్న శిరిడీ ఆరతులు వేరువేరు కవులు, వేరువేరు కాలాలలో – సందర్భాలలో, వివిధ భాషలలో రచించిన మధుర భక్తిరసగుళికలు!

          శిరిడీ ఆరతుల్లోని భావసౌందర్యం

సంక్షిప్తంగా ఇదీ, ‘శిరిడీ ఆరతుల’ స్థూలరూపం. ఇక ఆ ‘ఆరతుల’ ప్రాశస్త్యాన్ని, వాటిలో ప్రకటమౌతున్న అద్భుత భావసౌందర్యాన్ని, అర్థగాంభీర్యాన్ని, అవి వెదజల్లుతున్న భక్తిరస భావసౌరభాలను ఆస్వాదించడానికి యత్నిద్దాం!

దేవాలయాలలో సాంప్రదాయక అర్చన విధిననుసరించి జరుపబడే వివిధసేవలలో భాగంగా శిరిడీలోనూ యీ ఆరతులు చెయ్యడం జరుగుతున్నది. శిరిడీలో ప్రతినిత్యం భక్తులు పాడే ఆరతి పాటలను స్థూలంగా నాలుగు భాగాలుగా విభజించవచ్చు. కాకడ (ఉదయ) ఆరతి; మధ్యాహ్నఆరతి; సాయంత్ర ఆరతి; శేజ (రాత్రి) ఆరతి.

కాకడ (ఉదయ) ఆరతి

అర్చన విధిలో భగవంతునికి భక్తులు భక్తిపూర్వకంగా చేసే నిత్యసేవలు సుప్రభాత సేవతో ప్రారంభమౌతాయి. సుప్రభాతం చేయడమంటే దైవాన్ని నిద్ర లేపటమన్న మాట! నవవిధ భక్తులలోని దాస్యభక్తి భావానికనుగుణంగా ఇది ఏర్పడింది. ఈ సుప్రభాత సేవే, శిరిడీ ఆరతుల్లోని ‘కాకడ ఆరతి’. కాకడ ఆరతి, స్థూలంగా – శ్రీసాయినాథుణ్ణి నిద్ర మేల్కొల్పడం! కానీ, నిద్ర, స్వప్నము, మెలకువ, ఈ మూడింటికి ఆధారమైన తురియావస్థకు కూడా అతీతుడై, సదా సర్వజీవ హృదయాలలో ‘ఎఱుక’ రూపంలో ప్రకాశిస్తున్న ఆ యోగనాథునికి నిద్రపోవడమన్నది అసలున్నదా? (బాబా మాటల్లోనే చెప్పాలంటే) “కళ్ళు తెరుచుకొని మెలకువగా నిద్రపోగలిగిన” శ్రీసాయిని మనము నిద్రలేపడమేమిటి? నిజానికి, చాలామంది భావిస్తున్నట్లు, కాకడ ఆరతి బాబాకు మేలుకొలుపు సేవ కాదు! అందుకనే కాకడ ఆరతి గీతాల్లో బాబాను నిద్రలేపడమనే భావం కన్నా “భక్తులను ఆపదలనుండి కాపాడడానికి సదా జాగరూకుడై సావధానుడుగ కూర్చునివున్న” (“అహా సుసమయా సియా గురు ఉఠోనియా బైసలే”...) శ్రీసాయిని దర్శించి స్తుతించడమనే భావమే ప్రధానంగా వ్యక్తమవుతుంది. ఆ సుప్రభాతగీతం బాబాను నిద్రమేల్కొనమని ప్రార్థించదు! “ఓ సద్గురూ! ధ్యాన సమాధినుండి లేచి మమ్ములనుద్ధరించేందుకు మసీదుకు రండి!” (“సమాధి ఉతరోనియా గురుచలా మసీదీ కడే”...) అనే ప్రార్ధిస్తున్నది. అంతేకాదు! 'కాకడ ఆరతి' నిజానికి మేల్కొల్పుపాడుతున్నది బాబాకు కాదు! “ఓ సాధు సజ్జనులారా లేవండి! లేచి మీ హితము చేకూర్చుకొనండి!” (“ఉఠా సాధుసంత సాదా –  ఆపులాలే హిత”) అని భక్తులనే నిద్రలేపుతున్నది. ఏ నిద్రనుండి? మామూలుగ రోజూ మనం పొయ్యే నిద్ర నుండి కాదు! అరిషడ్వర్గాలతో కప్పబడి, ఎఱుకనుండి మరపులోనికి జారిన నిద్ర నుండి! ఆ నిద్ర నుండి మనస్సులను జాగరూకం చేస్తున్నది. ఎలా? “కామ క్రోధాది ప్రవృత్తి గల మనస్సును దీపపు ఒత్తిగా చేసి, వైరాగ్యమనే నేతితో తడిపి, సాయిభక్తి అనే అగ్నితో వెలిగించి” బాబాకు ఆరతి చెయ్యడం ద్వారా ఆత్మతదాకారవృత్తి యనే వెలుగులో సద్గురువు (మన అంతరంగంలో) ప్రకాశిస్తూ దర్శనమిస్తాడని (“కామక్రోధ. ....ప్రకాశ పాడియలా!") ప్రబోధిస్తున్నది. “మాలోని భక్తిభావమే ఆరతి. పంచప్రాణాలతో వెలిగే జీవభావమే కాకడజ్యోతి” అనే భావంతో ఆరతి చెయ్యాలని నిక్కచ్చిగా నిర్దేశిస్తున్నది. అంతేకాదు! ఇంతటి ఉన్నతభావాన్ని హృదయంలో జాగరూకతతో నిలుపుకొని, “ఓ సద్గురూ! నా హృదయమందిరంలో నిలిచి ఈ సమస్త జగత్తూ సద్గురు స్వరూపంగా నాకు భాసించేటట్లు చెయ్యి! ఎప్పుడూ జగత్కళ్యాణ కార్యాలు చెయ్యాలనే సద్బుద్ధిని ప్రసాదించు!” (“గురో వినతి మీకరీ హృదయ మందిరీ యా బసా సమస్త జగ్ హే గురు స్వరూపచీ ఠసో మానసా కరో సతత  సత్కృతీ మతి హిదే జగత్పావనా”) అని సాయిని మనసారా ప్రార్థించి, ఆపై మన నిత్యదైనందిన కార్యాలకు ఉపక్రమించాలి. ఈ ప్రార్థనలో ప్రకటమౌతున్న ఉత్కృష్టభావమే సాయిభక్తులకు పవిత్ర గాయత్రీమంత్రం.

“ఓ సద్గురు సాయిబాబా, ఈ ప్రపంచంలో నీవు తప్ప నాకు ఆశ్రయమిచ్చి రక్షించేవారు లేరు” (“శ్రీసద్గురు బాబా సాయి, తుజవాచుని ఆశ్రయనాహీ భూతలీ...”) అనే ఆరతి గీతం అనన్య శరణాగతికి సోపానమయితే, “నేను నీ మసీదును ఊడ్చే చీపురున”ని (“అపనే మసీద్ కా ఝాడూ గణూహై”) శ్రీదాసగణు పలికిన పలుకుల్లోని భావం దాస్యభక్తి భావానికి పరాకాష్ట. “జయామనీ జైసాభావ తయాతైసానుభావ” అనే ఆరతిపాట 'ఎవరి భావం ఎట్లా వుంటే వారు పొందే అనుభవం కూడా అట్లాగే వుంటుంది' అంటూ, పైన చెప్పిన భావాన్ని హృదయంలో నిలుపుకోకుండా, కేవలం ఐదు ఒత్తుల దీపాన్ని యాంత్రికంగ త్రిప్పుతూ వల్లెవేతగా ఆరతిపాటలు పాడటం వ్యర్థమని కూడా హెచ్చరిస్తున్నది!

మధ్యాహ్న-సాయంత్ర ఆరతులు

“స్థిరమైన మనస్సుతో, గంభీరమైన శ్రీసాయితత్త్వంపై ధ్యానం చేద్దాం!” (“కరూనియా స్థిరమన – పాహు గంభీర హేధ్యాన....”) అంటూ సాయిబంధువులను “లెండి, రండి, రారండి!” (“ఉఠా ఉఠాహో బాన్ ధవ”) అనే ఆహ్వానంతో ప్రబోధిస్తూ ప్రారంభమవుతున్నది యీ ఆరతి. అలా సాయిపాదాల వద్ద చేరిన ‘జడచిత్తులైన’ భక్తులను 'సదా సాయి పాదధూళిలో విశ్రమించేట్లు అనుగ్రహించమని, కామవికారాలను దహింపచేయమని, వారి సర్వస్వం సాయి పదసేవకే సద్వినియోగమయ్యేటట్లు చేసి సన్మార్గంలో నడిపించమ'ని, ‘దేవాధిదేవుడు’, ‘కలియుగ అవతారమూర్తి’, ‘సగుణబ్రహ్మరూపుడు’ అయిన సాయినాథునికి చేసే ప్రార్థన౼ రెండవ ఆరతి గీతం. ఈ ఆరతి గీతం బాబాను సర్వజీవసౌఖ్యప్రదాతగా దర్శిస్తున్నది. అయితే బాబా అనుగ్రహించే సుఖం ఎటువంటిది? సామాన్య సుఖం కాదది! అది తరుగులేని ఆనందరూపమైన – అసలైన ‘సుఖము’ (“నిజసూఖ”). పై గీతం సర్వజీవులకు ఆత్మసౌఖ్యాన్ని ప్రసాదించే శ్రీసాయియొక్క ‘సమర్థ సద్గురు’ తత్త్వాన్ని వర్ణిస్తే, ఆ తరువాత గీతం సామాజికంగా బాబా నిర్వహిస్తున్న ‘కలియుగ అవతార’ కార్యాన్ని వివరిస్తున్నది. తమ ఆదర్శ జీవిత విధానం ద్వారా, అసంఖ్యాకమైన అద్భుత లీలలద్వారా, నాస్తికులను కూడా సాధకులుగా మార్చగలగడమేగాక ('అవతరసే తూయేతా ధర్మాన్ తే గ్లాని, నాస్తికా తావీతూ లావిసి నిజభజనీ, దావిసి నానాలీలా అసంఖ్యారూపాని...'), శ్రీసాయి ప్రధాన అవతార రహస్యాన్ని యీ గీతం ఇలా వర్ణిస్తున్నది: 'బాబా,  నీవు మోమిన్ వంశంలో జన్మించి ముసల్మాను రూపంలో దర్శనమిచ్చి మూఢులను ఉద్ధరిస్తున్నావు. ద్వైతభావము వీడిన నీకు హిందూ-ముస్లిం భేదము లేదు. మానవ రూపంలో అవతరించి, రెండు మతాల వారిని సమానంగా ఆదరించి వారిచే (మతభేదాల కతీతమైన) సర్వవ్యాప్తమయిన ఆత్మతత్త్వాన్ని దర్శింపచేస్తున్నావు!”

అంతేకాదు! "యవనస్వరూపీఏక్యా దర్శన త్వాధిదలే......’, ‘మోమిన వంశి జన్ముని లోక తారియల...’ అంటూ సంకుచిత మతమౌఢ్యంతో, సంకుల కులతత్త్వంతో కుళ్ళిపోతున్న సమాజానికి శ్రీసాయి ప్రసాదించిన ప్రబోధం ఈ కలియుగంలో మానవాళికందిన ‘మహితగీత’. ఈ ఆరతి గీతంలో ఇంకో విశేషమున్నది. హైందవ విధిలో శ్రీసాయి మహిమకు హారతి పాడుతున్న ఈ గీతం బాబాను "మోమినవంశజుడుగ" "యవన(ముస్లిం)స్వరూపి"గా నిష్కపటంగా కీర్తిస్తున్నది! ఇది శ్రీసాయి యొక్క మతాతీత మహావృక్షానికి కాచిన ఒక మధురఫలం! అన్యచింతనలు లేకుండా మనస్సు ఒకే రూపం ధరించడం ఆధ్యాత్మిక సాధనలో (సగుణోపాసనలో) ప్రాధమిక నియమం. సాధన విషయానికొస్తే, సాధకుని ఇష్టదైవం (ఉపాసనాదైవం) తప్ప ఇతర (అన్య) దేవతామూర్తుల చింతన కూడా ఉపాసనకు విక్షేపమే! సాధకునిలో తన ఉపాసనాదైవం పట్ల ఎంతగా ‘అనన్య’ ప్రేమ, భక్తి, శరణాగతి కలుగుతుందో, అంతగా అతడు ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి సాధించగలడు. శ్రీసాయిని (ఇష్ట) ఉపాసనాదైవంగా ఎంచుకున్న సాయిభక్తులకు శ్రీసాయియే సకల దేవతాస్వరూపుడు, సకల సాధుస్వరూపుడు, సకల ధర్మస్వరూపుడు. వారికి శ్రీసాయియే పరదైవతము. ఈ దృష్ట్యా, ఉపాసనా తత్పరులైన సాయిభక్తులకు – అనన్యదేవతారాధన నిషిద్ధమే! (అయితే- ముక్కోటి దేవతలకు మూడు కోట్ల దణ్ణాలు పెడుతూ, బాబాను కూడా ఆ ముక్కోటి దేవుళ్ళలో ఒకడుగా భావించే (లౌక్య) భక్తులకు ఈ సూత్రం వర్తించదు!) ఈ కారణంగా ఆధ్యాత్మిక సాధన సిద్ధి గమ్యం మొదలయిన వాటిపట్ల ఆసక్తి, దీక్ష గల సాయిభక్తులకు మాత్రం అది ఎప్పటికైనా అనుల్లంఘనీయం. తమ యోగక్షేమాలు సంపూర్ణంగా వహించి తమను సదా కంటికి రెప్పవలె కాపాడే శ్రీసాయివంటి ‘సమర్థుడై’న సద్గురువు లభించాక కూడా సాయిభక్తులు అన్య(అనేక) దేవతారాధనలు  వ్రతాలు అభిషేకాలు గ్రహశాంతులు వాస్తుశాంతులు మొదలయిన వాటికి పూనుకోవడం ప్రోత్సహించడం కేవలం అవివేకం.  ఇది సాయిభక్తి ఉద్యమానికి పట్టిన ‘గ్రహచారం’. శ్రీసాయి చూపిన ‘శుభ్రమార్గ’ విస్తరణకు అపచారం.

అంతేకాక వివిధ దేవతామూర్తుల ఉపాసన ‘సాధన’లో ప్రారంభదశ మాత్రమేనని, ఆ ఉపాసనలన్నీ శ్రీసాయి వంటి సద్గురుమూర్తిని చూపడానికి కేవలం ‘నిమిత్తమాత్రాలని’ మహాత్ములు స్పష్టం చేస్తున్నారు. ఆయా దేవతామూర్తులను ఉపాసించే భక్తులకు వారి ఇష్టదేవతామూర్తుల రూపంలో బాబా వారికి దర్శనమివ్వడంలోని పరమార్థం ఇదే! ఈ ఉపాసనాసూత్రాన్నే రమణీయంగా ఉద్ఘాటిస్తున్నది, “శిరిడీ మాఝే పండరిపూర, సాయిబాబా రమావర.....” అని శ్రీదాసగణు మహరాజ్ రచించిన ఆరతిగీతం. ఈ ఆరతిపాట పై సూత్రాన్ని భక్తిభావయుతంగా చెబితే, శ్రీఉపాసనీమహరాజ్  రచించిన “సదాసత్ స్వరూపం..” అని మొదలయ్యే ‘శ్రీసాయిమహిమ్న స్తోత్రం’ భక్తిజ్ఞానాలనే దీపాల వెలుగులో శ్రీసాయి మహిమకు ఆరతి పడుతున్నది. శ్రీసాయిమహిమ్నస్తోత్రం లోని ‘మనోవాగతీతం మునిర్ ధ్యానగమ్యమ్’‘అహంభావహీనం ప్రసన్నాత్మభావం’, ‘మాయయోపహత చిత్తశుద్ధయే’, ‘సంసార జన్య దురితౌఘవినిర్గతాస్తే’, ‘కైవల్య థామపరమం సమవాప్నువంతి’ మొదలయిన శ్రీసాయి శుద్ధజ్ఞాన స్థితిని తెలిపే వాక్యాలు బాబా సద్గురుతత్త్వాన్ని వివరిస్తే, ‘జగత్సంభవ స్థాన సంహారహేతుం’, ‘స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం’, ‘కలౌ సంభవంతం’, ‘అనేకాశ్రుతా తర్క్యలీలా విలాసైః’ ‘భక్తిభద్రప్రదంతం’, ‘అఖిల నృణాం సర్వార్థసిద్ధిప్రద’ మొదలయిన సిద్ధి వాక్యాలు బాబాలోని సిద్ధత్వాన్ని ఈశ్వరతత్వాన్ని వర్ణిస్తున్నాయి.  శ్రీసాయిని ‘ఉపాసనా దైవతంగా’, భక్తులకు ‘భుక్తి  ముక్తి ప్రదాతగా’ ఈ స్తోత్రం ప్రకటిస్తున్నది. బాబాలోని ఈ జ్ఞానసిద్ధత్వాన్ని అమోఘంగా వర్ణిస్తున్న ఈ స్తోత్రం యొక్క మకుటం ‘నమామీశ్వరం సద్గురుం సాయినాథం’ అన్నది సాయితత్త్వాన్ని వివరించే అన్ని స్తోత్రాలకు, ఆరతులకు మకుటాయమానం. అంతేకాదు! శ్రీఉపాసనీ మహరాజ్ ఆధ్యాత్మిక సాధన అత్యున్నత స్థితిలోనున్నప్పుడ శ్రీసాయి అనుగ్రహవిశేషంగా తన ధ్యాననిష్ఠలో దర్శించి, సాయిభక్తులకు అందించిన మహామంత్రమిది!

భోజనం చేసేముందు, తరువాత, నిద్రపోయేముందు, లేచిన తరువాత, విభూతి ధరించేప్పుడు, జంధ్యం వేసుకొనేటప్పుడు,.. అలా, మనం చేసే అన్ని పనులకు ఏ మంత్రం పఠించాలో, ఏ భావం మనస్సులో ధరించాలో చెప్పే మంత్రాలు తంత్రాలు మనకు కోకొల్లలుగా వున్నాయి.  కాని నమస్కారం చేసేటప్పుడు హృదయగతమైన ఏ ‘భావసూత్రం’ మన రెండు చేతులను నమస్కారంగా కట్టిపడేయాలో చెప్పే స్తోత్రాలు మాత్రం అరుదు. ఆ లోటును ఏ లోటూలేకుండా తీరుస్తున్నది శిరిడీ ఆరతుల్లోని ‘నమస్కారాష్టకం’. ఈ 'అష్టకం' బాబాకు నమస్కారం ఏ భావంతో చెయ్యాలో చెప్పడమే కాదు, మనచే అప్రయత్నంగా చేయిస్తుంది కూడా! అలా మన మనోకరణాలను కట్టి పడేసిన భక్తిభావాన్ని దేహంలోని అణువణువుకూ వ్యాపింపచేసి, తన ఐదు ద్విపదలను మనలోని ఐదుప్రాణాలతో ‘లయింప’చేసి నృత్యం చేయిస్తుంది, “ఐసా యేయీబా! సాయిదిగంబరా!” అన్న ప్రార్థనాగీతం. దైనందిన జీవితంలోని వివిధ సంబంధాల రుసరుసలు, బుసబుసలతో విసిగి వేసారిన మన మనస్సులను సాయంత్రమయ్యేసరికి, శ్రీసాయి ప్రేమామృతధారలతో స్నానం చేయించి ఎవ్వరి యెడల ద్వేషము, దేనియందు కోరిక హృదయంలో లేకుండా, 'సదా సాయినాథుని ధ్యానము జరుగుగాక! సద్గురు పాదములయందు భక్తి స్థిరముగా వుండుగాక! జగమంతా శ్రీసాయిరూపంగా గోచరించుగాక!'  (“కుణాచిహి ఘృణా... దృశ్యబాబా దిశో...") అనే కమ్మని  ‘సంకల్ప’ సంగీతంతో, అనన్య ‘శరణాగతి అనే పట్టుపాన్పుపై’ సేదతీరేట్లు చేస్తుంది – సాయంసంధ్యారతిలోని ‘రుసోమమ’.

శేజ్ ఆరతి

బాబాకు చేసే పవళింపు సేవలో భాగం శేజారతి. బాబా నిద్ర ఎంత అసాధారణమైందో, ఆయన శయ్య (పడక) కూడా అంత అలౌకికమైనదే! 'నవవిధ భక్తులే మెట్లుగా కలిగి, నిశ్చలభక్తి అనే మంచంపైన (భక్తులు అజ్ఞానంలో చేసే అపరాధాలను దయతో క్షమించే) క్షమాగుణమనే చక్కని పరుపుపై' బాబా శయనిస్తారు. ఆ శయ్య 'సద్భావాలనే పువ్వులతో అలంకరించబడి వుంది. బాబా యొక్క శయ్యామందిరంలో జ్ఞానమనే మణిదీపం వెలుగుతున్నది. ఆయన ఏకాంత సమాధికి ఏ మాత్రం భంగం రాకుండా ద్వైతభావమనే ఆ శయ్యా మందిరపు తలుపులు మూసి బిగించబడ్డాయి...'

అలాంటి శయ్యపై, “బాబా, ఇక ఏకాంతంగా చిన్మయమైన స్వసుఖ సమాధిలో నిద్రించండి!” (“ఆతా స్వామీ సుఖేనిద్రా”) అని భక్తులు ప్రార్థిస్తున్నారు. భక్తపాలన కొరకు “ఓ సద్గురూ! ధ్యానసమాధినుండి లేచి మమ్ములనుద్ధరించండి!” (“సమాధి ఉతరోనియాగురు...”) అని ఉదయమే సుప్రభాత గీతమాలపించిన భక్తులు, తాము నిద్రకుపక్రమించబోయే ముందు బాబా అనుజ్ఞఆశీర్వాదప్రసాదాలకై అర్థిస్తూ(“ఆజ్ఞస్తవహా ఆశీప్రసాద...”), తిరిగి బాబాను స్వసుఖసమాధిలో ఏకాంతంగా విశ్రమించమని ప్రార్థిస్తున్నారు! ఆ ప్రార్థన యొక్క ఆర్ద్రతతో మేను వాల్చిన భక్తులకు ‘సాయిస్మరణ’ అనే ‘మరపులేని నిద్ర’ లోనికి సునాయాసంగా జారుకొనేట్లు జోలపాట పాడుతున్నది యీ శేజారతి! ఇక 'ఓవాళూ ఆరతి...' అనే ఆరతి గీతం, ఋగ్వేదంలోని ‘నాసదీ సూక్తం’, ‘పురుషసూక్తం’ లోని కొన్ని ఋక్కుల సారం. ఇప్పటివరకు ‘శిరిడీ ఆరతుల’ లోని భావసౌందర్యాన్ని క్లుప్తంగా మాత్రమే సమీక్షించుకొన్నాం. ఆ (మరాటీ) ఆరతులలోని ప్రతివాక్యానికి క్షుణ్ణంగా అర్థం తెలుసుకొని పరిశీలనతో చింతన చేస్తే, ఇంకా ఎన్నో అమూల్యమైన ఆధ్యాత్మిక రహస్యాలు మనకు గోచరిస్తాయి.

ఏ సాహిత్యానికైనా భాష దేహంవంటిదైతే, భావం ఆత్మవంటిది. భావరహితమైన (అర్థం తెలియని) శబ్దసముదాయం నిర్జీవ కళేబరం వంటిది. కేవలం యాంత్రికంగా చేసే మంత్రాలు స్తోత్రాలు ఆరతులవల్ల భావప్రకంపనలకు కేంద్రమయిన మన హృదయాలు స్పందించవు. హృదయస్పందన లేని పూజ ఆత్మోన్నతిని కలిగించలేదు. అందుకే “జ్ఞాత్వా కర్మాణి కుర్వీత” అంటే, “చేసే పూజకు, చెప్పే మంత్రానికి అర్థం తెలుసుకొని చెయ్యి!” అని వేదం ఘోషిస్తున్నది.

“మంత్రోహి భావేన యుతో ఫలప్రదః౹
మౌర్వాసు సజ్జీకృత బాణవద్ధృవం౹౹
భావేన హీనస్తు వినిష్ఫలో భవేత్ ౹
కీరస్య వాగీరత రామ శబ్దవత్!!”

ఏ మంత్రాన్నయినా అర్థం తెలుసుకొని పునఃశ్చరణ చేస్తేగాని ఫలప్రదం కాదు. భావయుతమైనప్పుడు మంత్రం చక్కగా సంధించిన బాణంలా లక్ష్యాన్ని చేరుతుంది. భావహీనమైన మంత్రం నిష్ఫలం. చిలక ఎన్నిసార్లు ‘రామ’ శబ్దాన్ని పలికినా అది వ్యర్థమే కదా?” అని శాస్త్రాలు ఉగ్గడిస్తున్నాయి. మంత్రజపమైనా భావహీనంగా చేస్తే ఫలితం సున్న అని ఆగమాలు నిర్దేశిస్తుండగా, ఇక ఆరతుల వంటి ప్రార్థనాగీతాల విషయం చెప్పాలా? ‘అనే’వాడికి, ‘వినే’వాడికి అర్థం తెలియని శబ్దాడంబరం కేవలం చిలకపలుకుల కంఠశోష; యోగి వేమన మాటల్లో చెప్పాలంటే అవి – వొట్టి ‘వెర్రికూతలు’! హృదయగతమైనపుడే ఏ ప్రార్థనైనా ఫలిస్తుంది. మనం వల్లించే మంత్రాలకు, శ్లోకాలకు, స్తోత్రాలకు, ఆరతిగీతాలకు సరైన అర్థం తెలిసినపుడే అవి మన హృదయాలలో ఆర్ద్రతను కలిగించగలవు. ఆర్ద్రత లేకుంటే అది ప్రార్థనే కాదు!

మొత్తం శిరిడీ ఆరతుల యొక్క సవివరమైన అర్థతాత్పర్యవిశేషాలు శ్రీబాబూజీ రచించిన ‘Arati Sai baba (మూలము-ఆంగ్లానువాదము-వ్యాఖ్యానము) అన్న (ఆంగ్ల) గ్రంథంలో చూడగలరు. ఆసక్తి గల భక్తులకోసం ఆ ఆంగ్ల గ్రంథం యొక్క లింక్ దిగువ ఇవ్వడమైనది.


 ౼ పబ్లిషర్స్.

Source: సాయిభక్తి సాధన రహస్యం, రచన: పూజ్యశ్రీ సాయినాథుని శరత్ బాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 579వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:

  1. బాబా దయవల్ల తీరిన సమస్యలు
  2. మహామహిమాన్వితమైన సాయి ఊదీ


బాబా దయవల్ల తీరిన సమస్యలు

పేరు వెల్లడించని ఒక సాయి భక్తురాలు ఇటీవల తనకి జరిగిన రెండు అనుభవాలను మనతో పంచుకుంటున్నారు:

ముందుగా సాయినాథునికి హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నమస్కారం. నేను సౌదీలో నివాసం ఉంటున్నాను. నాకు ఇద్దరు పిల్లలు, ఒక బాబు, ఒక పాప. సంవత్సరంన్నర వయసున్న మా పాప ఆరాధ్య సాయి వరప్రసాదం. ఇటీవల ఒకరోజు తన అరిచేతులు పసుపుపచ్చగా కనిపించాయి. ఏమిటి ఇలా ఉన్నాయని తన అరికాళ్ళు, కళ్ళు, నాలుక చూశాను. అరిచేతులు అరికాళ్ళు పసుపు పచ్చగా ఉన్నాయి. వెంటనే నాకు తెలిసిన పిల్లల డాక్టర్ కి ఫోన్ చేసి, విషయం చెప్పాను. తను, "ఫోటో తీసి పంపించమ"ని చెప్పారు. నేను అలాగే చేశాను. తాను ఆ ఫోటోలు చూసి, "పసుపురంగు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమ"ని చెప్పారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా డాక్టర్ దగ్గరికి వెళ్లడానికి నాకు భయమేసింది. ఈ విషయం తెలిసి మా వారు తనకు తెలిసిన పిల్లల డాక్టర్ కి ఫోటోలు పంపించారు. అవి చూసిన డాక్టర్ ఇంటికి రమ్మని చెప్తే, పాపను తీసుకుని వెళ్ళాము. డాక్టర్ పాపని చూసి, "అవును, కాళ్లుచేతులు పచ్చగా ఉన్నాయి. కిడ్నీ, లివర్ సమస్యలేమైనా ఉంటే కష్టం. కారోటేనేమియా అనే సమస్య కూడా అయి ఉండొచ్చు. చాలావరకు సమస్య ఉండకపోవచ్చు కానీ, ఎందుకైనా మంచిది అన్ని టెస్టులు చేయిద్దాం. రోజు పాపకి క్యారెట్ ఇస్తూ ఉండండి. విరోచనం మాత్రం లేత పసుపురంగు రాకూడదు" అని చెప్పారు. తర్వాత మేము ఇంటికి వచ్చేసాము. మరుసటిరోజు పాప విరోచనం లేత పసుపురంగులో అయ్యింది. దాంతో నాకు చాలా భయం వేసింది. వెంటనే అన్ని టెస్టులు చేయించమంటే, చేయించాము. నేను బాబాని ప్రార్థించి, "పదకొండు వారాలు సాయి దివ్యపూజ చేస్తాన"ని మొక్కుకున్నాను. బాబా దయవల్ల రిపోర్టులన్నీ నార్మల్ గా వచ్చాయి. పాపకి ఐరన్, కాల్షియం తక్కువగా ఉన్నాయని తెలిసింది. భయపడినట్లు లివర్ వంటి పెద్ద సమస్యలు ఏవీ లేవు. అంతా బాబా దయ అనుకుని హృదయపూర్వకంగా కృతఙ్ఞతలు చెప్పుకున్నాము.

రెండవ అనుభవం:

మావారు డెంటల్ డాక్టర్. సంవత్సరంన్నర క్రితం రియాద్ లోని ఒక కాలేజీలో మావారు పనిచేశారు. ఆ తర్వాత అక్కడినుంచి వేరే చోటుకి వచ్చి, ఒక డెంటల్ క్లినిక్ లో ఉద్యోగం చేస్తున్నారు. సౌదీలో ఉద్యోగం చేయాలంటే, సౌదీ లైసెన్స్ ఎగ్జామ్ క్లియర్ చేయాలి. సర్టిఫికెట్ ని మళ్ళీ మూడేళ్ళకి రెన్యువల్ చేయించుకోవాలి. ఇప్పుడు లైసెన్స్ రెన్యువల్ చేయించుకోవాల్సిన సమయం వచ్చింది. నాలుగు నెలల నుంచి మావారు సౌదీ కమ్యూనిటీకి వెళ్లి సర్టిఫికెట్ రెన్యువల్ కోసం ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు, "మేము రెన్యువల్ చేయము, నీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ లో కేవలం టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది,ఇప్పుడు మీరు క్లినిక్ లో వర్క్ చేస్తున్నారు" అని చెప్తున్నారు. చాలామంది డాక్టర్లకి చేశారుకానీ మావారికి చేయలేదు. అప్పుడు మావారు తాను అదివరకు పనిచేసిన కాలేజీకి ఫోన్ చేసి అడిగితే, వాళ్లు సరైన రెస్పాన్స్ ఇవ్వలేదు. దాంతో మావారు నేరుగా కాలేజీ హెచ్.ఆర్ డిపార్ట్మెంట్ కి వెళ్లారు. అక్కడ అంతా కొత్త అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఉన్నారు. వాళ్లు, "మాకు ఏమీ తెలియదు,మేము ఎక్స్పీరియన్స్ లెటర్ ఇవ్వము" అని చెప్పేశారు. దాంతో మావారు కాలేజీ డీన్ ని సంప్రదించారు. అతను మరుసటిరోజు రమ్మని చెప్పారు. సరేనని మావారు మరుసటిరోజు వెళితే, 5 గంటలు వెయిట్ చేయించి మావారు ఇచ్చిన లెటర్ పై డీన్ 'ఇది నాకు సంబంధించినది కాదు' అని రాసి సంతకం చేశారు. చేసేదిలేక మళ్ళీ మావారు హెచ్.ఆర్ డిపార్ట్మెంట్ కి వెళ్లారు. వాళ్ళు మళ్ళీ అదే సమాధానం చెప్పారు. ఆ సమయమంతా మావారు బాబాని స్మరిస్తూనే ఉన్నారు. ఆయన నాకు ఫోన్ చేసి విషయం చెప్పారు. నేను, "అన్న దానం చేస్తానని, రెండు కొబ్బరికాయలు కొడతానని బాబాకి మ్రొక్కుకొమ్మ"ని  చెప్పాను. తర్వాత నేను 'మావారు ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ పని జరగటం లేద'ని బాధపడి, సెల్ ఫోన్ తీసి, బాబాని ప్రార్థించి, సాయిబాబా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సైట్ లో చూశాను. "నీ కోరికకు అతుక్కుపోకు. శ్రీసాయిబాబాని తలుచుకో. నీ పని జరుగుతుంది" అని బాబా సమాధానం వచ్చింది. దాంతో నాకు ధైర్యం వచ్చి, మావారికి ఫోన్ చేసి, "ఇంకోసారి డీన్ ని కలిసి మాట్లాడమ"ని చెప్పాను. నేను "పని పూర్తయితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి చెప్పుకున్నాను. వెంటనే మావారు డీన్ ని కలిసి, "హెచ్. ఆర్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఇవ్వట్లేద"ని చెప్పారు. ఆయన "సరే,  నేను వాళ్లకి ఫోన్ చేసి చెప్తాన"ని వెంటనే హెచ్.ఆర్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేసి మాట్లాడారు. దాంతో వాళ్ళు, "ప్రక్రియ మొదలుపెట్టి, రెండురోజుల్లో మీకు సర్టిఫికెట్ పంపుతాము" అని చెప్పారు. చెప్పినట్లుగానే టీచింగ్ & క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు  మా వారికి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఇచ్చారు. దాంతో బాబా దయవల్ల సౌదీ లైసెన్స్ రెన్యువల్ అయింది. అనుకున్నట్లుగా మావారు ఒక వారం సచ్చరిత్ర పారాయణ చేసారు.

"బాబా మీకు శతకోటి వందనాలు. నాపై, నా కుటుంబంపై మీ దివ్యప్రేమానుగ్రహాలు సదా ఉండాలని కోరుకుంటున్నాను".


మహామహిమాన్వితమైన సాయి ఊదీ

సాయిభక్తురాలు 'సాయి' తనకి ఇటీవల బాబా ప్రసాదించిన అనుభవాన్నిలా మనతో పంచుకుంటున్నారు:

'సాయిమహరాజ్ సన్నిధి' బ్లాగు నిర్వాహకులకి, పాఠకులకి నా హృదయపూర్వక నమస్కారములు, ప్రతిరోజు ఈ బ్లాగులో వచ్చే భక్తుల అనుభవాలను చదివి నేను ఎంతగానో సంతోషిస్తుంటాను. నేనిప్పుడు ఇటీవల నాకు జరిగిన అనుభావాన్ని మీతో పంచుకుంటాను.

2020, సెప్టెంబర్ 25 రాత్రి ఉన్నట్టుండి మా డాడ్ తుమ్మడం మొదలుపెట్టారు. అవి తగ్గుతూనే దగ్గు మొదలయ్యింది. ఎంతకీ దగ్గు తగ్గలేదు. అలా ఇదివరకెప్పుడూ జరగలేదు. అందువలన నాకెంతో ఆందోళనగా అనిపించి బాబాని తలుచుకుని, "సాయిదేవా! మాకు నీవు తప్ప ఎవ్వరూ లేరు. దయచేసి 'డాడ్' దగ్గడం ఆపేసి, హాయిగా నిద్రపోయేలా చేయి" అని వేడుకుంటూ, నీళ్లలో ఊదీ కలిపి,  ఊదీ మంత్రాన్ని చదివి డాడ్ కివ్వడానికి వెళ్ళాను. డాడ్ 'వద్దు' అన్నారు. నేను మనసులో బాబానే స్మరిస్తూ, "తండ్రి! దయచేసి డాడ్ ఈ నీళ్లు తాగేలా చేయి, తన పరిస్థితి మెరుగుపడేలా చేయి" అని వేడుకున్నాను. కాసేపటికి డాడ్ ఒప్పుకుని, నీళ్లు తాగారు. పదినిమిషాల్లో దగ్గు ఆగిపోయి, హాయిగా నిద్రపోయారు. మహామహిమాన్వితమైన సాయి ఊదీ వల్లనే ఇది సాధ్యమైంది. డాడ్ కి నయమైతే ఈ బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటానని బాబాకి మాటఇచ్చినట్లే మీ అందరితో పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. బాబా ఎన్నో రకాలుగా నన్ను అనుగ్రహిస్తూ, "నేను నీతోనే ఉన్నాను" అని తెలియజేస్తూ ఉన్నారు. "సాయిదేవా! నీ ఆశీర్వాదం ఎప్పుడూ నీ బిడ్డలమైన మా అందరిమీద ఉండాలి. నా భయాలు, బాధలు, భారం అంతా నీ పాదాల చెంత విడుస్తున్నాను. నాకు నీవు తప్ప ఇంకో దిక్కులేదు. ఎప్పుడూ నిన్నే స్మరిస్తూ ఆధ్యాత్మిక చింతనలో ఉండేలా అనుగ్రహించు".

సాయి శరణం.



సాయిభక్తి సాధన రహస్యం - కులాల కుళ్ళు – మతాల మళ్ళు! మానవతకే ముళ్ళు – ముక్తికి సంకెళ్ళు!



కులాల కుళ్ళు – మతాల మళ్ళు! 
మానవతకే ముళ్ళు – ముక్తికి సంకెళ్ళు!

మానవునిలోని పశు సంస్కారాలను సంస్కరించి, మానవత్వాన్ని మేల్కొలిపి, క్రమంగా దైవస్వరూపునిగా రూపొందించడమే మతం యొక్క ముఖ్య ప్రయోజనం. వివిధ దేశకాలాలలో ప్రభవించిన సద్గురుమూర్తులు ప్రవక్తలు పై ప్రయోజనాన్ని సాధించడానికి ఆయా దేశకాలాలలోని సామాజిక రాజకీయ సాంస్కృతిక పరిస్థితుల కనుగుణమైన ధర్మాలను విధివిధానాలను ఆచారవ్యవహారాలను ఏర్పరచారు. కానీ, కాలక్రమంలో మతానికి-మతానికి మనిషికి-మనిషికి మధ్య ‘అడ్డుగోడలు’ కల్పించి, మత విద్వేషాగ్నిని రగుల్కొల్పి, మానవత్వపు మనుగడకే జీవకఱ్ఱయైన మతాన్ని ఆ మతవిద్వేషాగ్నిలో సమిధలుగా చేసింది – మానవునిలోని అజ్ఞానం స్వార్థం. పర్యవసానం?... ఈనాడు మనం చూస్తున్న మతకల్లోలాలు, కరుడుకట్టిన మతమౌఢ్యం, పాశవిక హింసావాదం, వీటన్నింటి వెనుక మంట గలుస్తున్న కనీసపు మానవతా విలువలు! మానవునిలోని సమతను మమతను పెంపొందించి, మనిషిని దివ్యునిగా రూపొందించగల మార్గమయిన మతమే, తద్విరుద్ధమైన పాశవిక పైశాచిక ప్రయోజనాలకు సాధనం కావడమే నిజమైన ధర్మగ్లాని! అంటే, ధర్మానికి పట్టిన జబ్బు! సమాజంలో ఈ ‘ధర్మగ్లాని’ ముదిరి శృతిమించి రాగాన (౼రోగాన౼) పడే సమయంలో మానవాళికి సన్మార్గాన్ని చూపటానికి అవతార పురుషులుదయిస్తారు. పైన ప్రస్తావించిన ధర్మగ్లానిని మాన్పి ‘లక్షలాదిమందిని’ శుభ్రమార్గంలో నడిపించడానికి ఈ యుగంలో అవతరించిన యుగపురుషుడు శ్రీసాయిబాబా.

శ్రీరామకృష్ణ పరమహంస, శ్రీరమణమహర్షి మొదలైన మహాత్ములు సర్వమతాల సారం ఒక్కటేనని, అన్ని భేదాలకతీతమైన ఆధ్యాత్మికానుభూతే పరమసత్యమని బోధించినా వారు ‘జన్మతః’ ఒక మతానికి చెందినవారని తెలియటం చేత, ఇతర మతస్తులకు వారి హితవు అంతగా చెవికెక్కకపోవడం చూస్తాం. ఆ మహాత్ములు ఏ మతానికి చెందారో, ఆ మతానుయాయులు కూడా, వారి దివ్యసందేశాన్ని ఆచరించడానికి బదులు, అంతటివారు ‘మా మతానికి’ చెందినవారని చాటుకుని ‘గర్వించడానికి’ మాత్రమే ఉపయోగించుకోవడం కూడా చూస్తున్నాం.

అందుకే, శ్రీసాయి తమ జన్మవివరాలను ఒక ‘దేవరహస్యంగా’ వుంచారు. బాబా హిందువులకు హిందువు, ముస్లిములకు ముస్లిం! సర్వమతాలలోని శ్రేష్ఠలక్షణాలు ఆయనలో మూర్తీభవించి గోచరిస్తాయి. ఈ సామరస్యం ఎంత అద్భుతంగా ఆయనలో ఇమిడిందంటే, వివిధమతాల ఛాందసవాదులు కూడా ఏ మాత్రం సంకోచం లేకుండా ఆయనను ‘తనవాడిగా’ అనుకొనేంత కనిపిస్తుంది. ఇది మానవాళి ఆధ్యాత్మిక చరిత్రలోనే అపూర్వం. మతవిద్వేషాగ్నిలో సమిధలవుతున్న మనలోని అరిషడ్వర్గాలను స్వార్థపరత్వాన్ని తమ జ్ఞానాగ్ని అనే ‘ధుని’ లో భస్మంచేసి, దానికి ఫలమైన మహిమాన్వితమైన ‘ఊదీ’ ని మనకు ప్రసాదిస్తున్నారు శ్రీసాయి. శ్రీసాయిలోని యీ అద్భుతతత్త్వాన్నే “గురుదేవ గురుదేవ దత్తావధూతా” అనే ఆరతిగీతం ఒకవైపు శ్రీసాయిని దత్తస్వరూపంగా దర్శిస్తూనే, మరోవైపు “మోమిని జన్ముని లోకాతారియలే...” అని కీర్తిస్తున్నది.

శ్రీసాయిబాబా అవతారకార్యంలో ప్రధాన అంశమైన యీ సర్వమతసమరసభావాన్ని త్రికరణశుద్ధిగా ఆచరించనిదే ఎప్పటికీ మనం సాయిభక్తులమవలేము. సాయి తమ మతం కబీరు మతమని, కులం దైవమనీ (పర్వర్థిగర్) చెప్పారు. అలాగే శ్రీసాయిభక్తులందరూ తమ మతం (సర్వమతసారమైన) సాయిమతమనీ, కులం సాయికులమనీ సగర్వంగా నిర్ద్వంద్వంగా చెప్పుకొనగలగాలి. సాయిమందిరాలను కులమతభేదాలకతీతంగా నిర్వహించగలగాలి. అప్పుడే శ్రీసాయి తమ భౌతిక జీవితపర్యంతం ఆచరించి ఆవిష్కరించిన ఉన్నత ఆదర్శాన్ని కొంతవరకైనా అనుసరించగలిగి, శ్రీసాయికృపకు పాత్రులు కాగలం!

Source: సాయిభక్తి సాధన రహస్యం, రచన: పూజ్యశ్రీ సాయినాథుని శరత్ బాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 578వ భాగం.....


ఈ భాగంలో అనుభవాలు:
  1. సచ్చరిత్ర పారాయణతో నా కోరిక నెరవేర్చిన బాబా
  2. సాయినాథుడే రక్ష!

సచ్చరిత్ర పారాయణతో నా కోరిక నెరవేర్చిన బాబా

హైదరాబాదు నుండి సాయిభక్తురాలు శ్రీమతి అనిత ఇటీవల తనకి జరిగిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:

అందరికి నమస్కారం. నేను సాయిబాబా భక్తురాలిని. బాబా లీలలు, మహిమలు నా జీవితంలో అనేకం. లాక్డౌన్ వల్ల మావారికి బిజినెస్ లో నష్టం వచ్చింది. మేము అప్పుడు ఢిల్లీలో ఉండేవాళ్ళం. మూడునెలలు ఉద్యోగం లేక అక్కడ చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. ఇంటి అద్దె కట్టడానికి కూడా డబ్బు లేకపోయేది. కానీ బాబా దయవల్ల  మా ఇంటి యజమాని అద్దెకోసం ఎప్పుడూ ఇబ్బంది పెట్టేవాడు కాదు. ఖర్చులకు మాత్రం హైదరాబాదులో ఉన్న మా తల్లిదండ్రులు డబ్బు పంపుతుండేవారు. మూడునెలల తర్వాత రైళ్ల రాకపోకలు మొదలయ్యాయి. దాంతో హైదరాబాదుకి వెళ్లి, అక్కడ ఉద్యోగం చూసుకుందామన్న ఉద్దేశ్యంతో నేను, మావారు, మా బాబు హైదరాబాదులోని మా అమ్మవాళ్ళ ఇంటికి వచ్చేసాము. నేను ప్రతి గురువారం సాయిసచ్చరిత్ర చదువుతాను. కానీ ఢిల్లీ నుండి వచ్చేటప్పుడు సచ్చరిత్ర పుస్తకాన్ని తెచ్చుకోవటం మరచిపోయాను. దాంతో ఏమి చేయాలో నాకు అర్థం కాలేదు.

హైదరాబాదు వచ్చాక ఉద్యోగంకోసం మావారు చాలా ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. అన్నీ చివరి రౌండ్ వరకు వచ్చేవి కానీ, ఉద్యోగం నిశ్చయం అయ్యేది కాదు. నాకు చాలా బాధగా అనిపించేది. ఇదిలా ఉంటే, గురువారం వస్తుంది సచ్చరిత్ర ఎలా చదవాలి అని నేను అనుకునేంతలో మా అక్కయ్య కాల్ చేసి సాయి మహాపారాయణ గురించి చెప్పి, తన జూనియర్ గ్రూపులో నన్ను చేరుస్తానని చెప్పింది. చాలా సంతోషంగా నేను ఓకే అన్నాను. మంగగారు నన్ను ఎల్లో గ్రూపులో చేర్చారు. నా రోల్ నెంబర్:45. నాలుగు వారాల పారాయణ పూర్తయ్యేసరికి బాబా నా కోరిక నెరవేర్చారు. నా భర్తకి ఉద్యోగం వచ్చింది. అది కూడా హైదరాబాదులోనే. ఉద్యోగం వస్తే, నా అనుభవాన్ని పంచుకుంటానని బాబాకి మొక్కుకున్నాను. అందుకే నా ఆనందాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది.

ఒక్కోసారి మనం ఎంతో ఎదురుచూస్తాం, అనుకున్న సమయానికి ఏదీ జరగటం లేదని చాలా బాధపడతాం, జీవితంపై విరక్తి కూడా కలుగుతుంది. కానీ అలాంటి సమయంలోనే బాబా యందు స్థిరమైన భక్తివిశ్వాసాలు ఉంచి, 'శ్రద్ధ', 'సబూరి'లతో వేచి ఉండాలి. బాబా అనుగ్రహం వలన మనం అనుకున్నది తప్పకుండా నెరవేరుతుంది. "బాబా నన్ను క్షమించు. బాబా! నా తండ్రి మీకు వేల వేల కోట్ల ప్రణామాలు. మిలియన్ల కొద్దీ ధన్యవాదాలు".


సాయినాథుడే రక్ష!

ఓం శ్రీసాయినాథాయ నమః

నా పరాత్పర గురువైనటువంటి సాయినాథుని దివ్య పాదపద్మములకు నమస్కరిస్తూ, వారు చూపిన మరో మహత్యాన్ని వివరిస్తున్నాను. నాపేరు కృష్ణ, నేను వైద్య సంబంధిత వృత్తిలో ఉన్నాను. నా స్నేహితుడొకడు వైద్యుడు. మా ఇంటిలోని వారందరూ నా స్నేహితుని వద్దనే వైద్యం చేయించుకుంటారు. అయితే నేను ఎప్పుడూ నా స్నేహితుడు వైద్యం చేస్తున్నాడని అనుకోను. నా స్నేహితుని ద్వారా సాయిబాబానే వైద్యం చేస్తున్నారని ప్రగాఢంగా విశ్వసిస్తాను. మా వాళ్ళందరితో కూడా నేను అదే చెప్పి, "మీరు మీ బాధలు ఎదురుగా ఉన్న నా స్నేహితుడికి కాదు, అతనిలో ఉన్న సాయిబాబాకి చెబుతున్నారని గుర్తుంచుకోండి" అని చెప్తుంటాను. నా స్నేహితునికి వచ్చే ఆలోచన రూపంలోనూ, ఇచ్చే మందు రూపంలోనూ ఆ సాయినాథుడే ఉన్నాడని, ఆయనే స్నేహితుని రూపంలో మా ఇంట్లో వారందరికీ సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నారని నేను పూర్ణంగా విశ్వసిస్తాను. అందుకు నిదర్శనమైన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

2020, సెప్టెంబర్ నెల చివరి వారంలో మా అమ్మగారికి కాస్త ఆయాసంగా అనిపించింది. ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో శ్వాస సంబంధిత సమస్య తలెత్తితే, ఎంత కంగారుగా ఉంటుందో మనందరికీ తెలుసు. కానీ నా పరాత్పర గురువు సాయిబాబా నాకు తోడు ఉన్నారని ఎప్పుడూ నేను ధైర్యంగా ఉంటాను. అలా ఉండగలగడం కూడా నా సాయిబాబా ప్రసాదమే. ఎప్పటిలాగే మా అమ్మ నా స్నేహితునితో (అతని రూపంలో ఉన్నటువంటి సాయిబాబాతో) తన సమస్య యొక్క లక్షణాల గురించి చెప్పింది. నా స్నేహితుడు ఒక మందుని సూచించాడు. నేను కూడా వైద్య సంబంధిత వృత్తిలో ఉండటం వల్ల, నాకున్న పరిజ్ఞానంతో అతను సూచించిన మందు ఇప్పుడున్న పరిస్థితుల్లో మా అమ్మకి సరైనది కాదని దృఢంగా అనిపించింది. కానీ నా స్నేహితుని రూపంలో సాయిబాబానే మందిస్తారన్న ఖచ్చితమైన నా విశ్వాసం గురించి ముందే చెప్పాను కదా! అందుకే నేను ఇంకేమీ ఆలోచించకుండా, ఏవిధమైనటువంటి టెన్షన్ పెట్టుకోకుండా ఆరోజు సాయంకాల ప్రార్థన పూర్తయిన తరువాత బాబాకి నమస్కరించి ఆ మందు అమ్మకి వేశాను. మీరు నమ్ముతారో, లేదో! కేవలం 15 నిమిషాల్లో ఆమెకి స్వస్థత చేకూరింది. ఆ క్షణాన నాకు ఆమెకున్న సమస్య పూర్తిగా నివారింపబడుతుంది, ఇందులో ఆశ్చర్యపోవటానికి ఏమీ లేదు అనిపించింది. ఎందుకంటే, అపర ధన్వంతరి అయినటువంటి సాయినాథుడు ఎంతోమందికి మాట మాత్రం చేత స్వస్థత చేకూర్చారు.

నా పరాత్పర గురువు సాయిబాబా ఉండగా ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలగదని ఖచ్చితంగా చెప్పగలను. సాయిబంధువులారా! మీకు ఎటువంటి ఆరోగ్యసమస్య వచ్చినా, మీరు ఏ డాక్టర్ వద్దకు వెళ్లినా ఎదురుగా ఉన్న ఆ డాక్టరులో సాయినాథుడు ఉన్నాడన్న పూర్తి విశ్వాసంతో మీకున్న బాధలు వివరంగా చెప్పుకోండి. అప్పుడు ఆ సాయినాథుడే ఆ డాక్టర్  రూపంలో మీకు మందు నిర్ణయిస్తారు, ఆ మందు రూపంలో ఆయనే పనిచేస్తారు, మీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని చేకూరుస్తారు. మా ఇంటిలో వారందరినీ ఆ సాయినాథుడే అనుక్షణం వెన్నంటి ఉండి రక్షణ ఇస్తున్నారు, సంపూర్ణ ఆరోగ్యాన్ని చేకూరుస్తున్నారు. మాకు ఆ సాయినాథుడే రక్ష. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

 అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ

తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష సాయినాథ.



సాయిభక్తి సాధన రహస్యం - అసలైన సాయిబాట! అందరకూ రాచబాట!



అసలైన సాయిబాట! అందరకూ రాచబాట!

మౌళికమైన ఆధ్యాత్మిక సూత్రాలు ఎన్నడూ మారవు! కానీ, శాశ్వతము సనాతనము అయిన ఆ ఆధ్యాత్మికసూత్రాల ఆచరణకు ‘సుళువులుగ’ ఆయా దేశకాలపరిస్థితులకు అనుగుణంగా మహాత్ములు యేర్పరచిన ఆచారవ్యవహారాలు మాత్రం కాలక్రమంలో మార్పుచెందక తప్పవు! మన దేహంలో సత్త్వం కోల్పోయిన నిర్జీవకణాలు ఎప్పటికప్పుడు విసర్జింపబడి, వాటి స్థానే క్రొత్త జీవకణాలు తయారవుతూ వున్నట్లు, సమాజమనే దేహంలో ఎప్పుడో యేర్పడిన బాహ్యాచారవ్యవహారాలు కాలగతిలో అర్థరహితము నిర్జీవము అయినప్పుడు, అవతారపురుషులయిన సద్గురుమూర్తులు ఉద్భవించి సమాజంలోని ఆ నిర్జీవ సంప్రదాయాలను తొలగించి, నూతన సాంప్రదాయాలను పాదుగొల్పి, ఆధ్యాత్మికతకు ప్రాణమైన సనాతన ధర్మసూత్రాన్ని కాపాడుతుంటారు. ఇది సృష్టిధర్మం; జీవధర్మం. “సంభవామి యుగే యుగే” అని శ్రీకృష్ణుడు చెప్పింది యీ సృష్టి‘ధర్మ’సూత్రం గూర్చే! కానీ ఆ సద్గురుమూర్తులు సమాజంలో ఆ ‘మార్పులను’ సాధించడానికి ఉద్యమించినప్పుడు, వారి ప్రయత్నాలు ఆయాకాలాలలో సాంప్రదాయవిరుద్ధమైన భ్రష్టాచారాలుగ పరిగణింపబడ్డాయి. అందుకే తాను బోధించేది ‘ఉపనిషత్తుల సారమైన సనాతన ధర్మాన్నే’నని గీతాచార్యుడు మళ్ళీ మళ్ళీ నొక్కివక్కాణించవలసివచ్చింది.

అలాగే, “నేను సనాతన ధర్మాన్ని ధ్వంసం చేయడానికి కాదు వచ్చింది; దాన్ని పరిపూర్ణం చేయడానికే!” (“I come not to destroy the law, but to fulfil it”) అని ఏసుప్రభువు ప్రకటించి, ఆయన సంస్కరణలను ప్రతిఘటించిన ఆనాటి ఛాందసులను శాంతపరచే ప్రయత్నం చేయవలసి వచ్చింది. ఆ యుగపురుషులు తమతమ ‘నూతన’ మార్గాలను ఆవిష్కరించినప్పుడు, అప్పటికి జవసత్త్వాలు కోల్పోయి, కేవలం యాంత్రికంగా మిగిలిన ‘ఆచారవ్యవహారాలు మతధర్మాలే’ సత్యమని మూర్ఖంగా నమ్మిన ఛాందసులనుండి ప్రతిఘటన తప్పలేదు. అప్పట్లో అలాంటి ఛాందసులే బుద్ధభగవానుని ప్రబోధాలను ‘నాస్తిక పాషాండమతం’గా దూషించి ప్రచారం చేసారు. ఆ వెర్రి ఎంతవరకు వెళ్ళిందంటే, బుద్ధుణ్ణి ఒక దొంగగా శ్రీరాముని చేత దూషింపచేసేంత వరకు వెళ్ళింది! వాల్మీకిరామాయణం (అయోధ్యకాండ 110-34)లో శ్రీరాముడు ఇలా అంటాడు: “యథా హి చోరస్య తథాహి బుద్ధః తథాగతం నాస్తిక మత్ర విద్ది!...” అని. అంటే, 'బుద్ధుడు ఒక చోరుడు; ఆ తథాగతుని మతం నాస్తికము, గర్హ్యము'౼ అని రాముడంటున్నాడు! కొంచెం ఆలోచిస్తే, ఎవడో బుద్ధిహీనుడయిన ఛాందస వైదికమతోన్మాది, శ్రీరాముడి తర్వాత ఎంతోకాలానికి బుద్ధుడు జన్మించాడనే విషయం కూడా యోచించక, బౌద్ధమతంపైని ద్వేషంతో యీ శ్లోకం కల్పించి, ‘వాల్మీకి రామాయణం’లో చొప్పించినాడని ఇట్టే స్పష్టమవుతుంది. కానీ, అది ప్రతిఘటనలో ఒక దశ మాత్రమే. బుద్ధుని ప్రబోధాల ప్రచండ ప్రభంజనాన్ని దూషణతో ఎదుర్కొనలేమని గుర్తించిన బుద్ధిమంతులు ఆ తరువాతి కాలంలో బుద్ధుణ్ణి విష్ణువు యొక్క తొమ్మిదవ అవతారంగా అవతారాల జాబితాలో చేర్చి, ... సరి! అదొక పెద్ద కథ! ఇక ఆ విషయం వదలి బాబా విషయానికొద్దాం!

“ఆమ్ చా ఘరాణె నిరాళా ఆహేత్!” 'మా సాంప్రదాయమే వేరు!' అన్నారు శ్రీసాయిబాబా! వేరంటే, దేన్నుండి వేరు? ఈనాడు ఆధ్యాత్మికత పేరున, సనాతన సంప్రదాయం పేరున చలామణి అవుతున్న మూఢనమ్మకాలు, దురాచారాలు, వ్యర్ధఆచారకాండ మొదలైనవాటి నుండి వేరు! అలాంటి విశిష్ఠమైన ఒక నూతన సంప్రదాయాన్ని ఈ యుగధర్మంగా శ్రీసాయిబాబా ప్రబోధించారు. అందుకనే శ్రీసాయిబాబా భౌతికరూపంతో సంచరించిన కాలంలో ఆయనకు ఇటు హిందూ, అటు ముస్లిం మతాలకు చెందిన ఛాందసుల నుండి ప్రతిఘటన ప్రాతికూల్యం తప్పలేదు. ప్రచండమైన సాయి మహిమ యొక్క ప్రాబల్యాన్ని తట్టుకోలేక ఆ ప్రతిఘటన బాబా కూడా పరమ వైదిక సంప్రదాయ ప్రవర్తకుడనే ప్రచారంగా రూపుమార్చుకొన్నది. 

బాబా యేనాడూ మంత్రోపదేశాలు చేయలేదు. సరికదా, ఇతరుల వద్దకు మంత్రోపదేశాలకై పరుగులిడటాన్ని కూడా ఆయన అంగీకరించలేదు. అలాంటిది, ఈనాడు శ్రీసాయి పేరున ‘మంత్రోపదేశాలు’ చేస్తున్న గురుస్వాములు మన మధ్యనున్నారు. మడి మైల అంటరానితనం కులతత్వం ఉపవాసాలు మొదలైన ఆచారకాండను బాబా నిర్ద్వంద్వంగా నిరసిస్తే, ఆ దురాచారాలన్నీ యీనాడు సాయిసాంప్రదాయంలో సాయిమందిరాల్లో చొప్పించబడటం మనం చూస్తున్నాం. ‘నేనెప్పుడూ చమత్కారాలు చెయ్యను’ అన్న శ్రీసాయినే తమ ‘కులదైవం’గా చెప్పుకుంటూ, తమ వృత్తులను నిరాటంకంగా చేసుకుంటున్న జోస్యాలరాయుళ్ళు, ‘ప్రశ్నల’ పరమహంసలు చెట్టుకొకరు పుట్టకొకరుగా పుట్టుకొస్తూనే వున్నారు. ‘సద్గురువుకు అనన్యంగా శరణాగతి’ చెందమని బాబా చెప్పిన ఉపాసన, అందరి దేవతలు ఒకటేనన్న విశాలదృక్పథం ‘పేరున’, శివరామకృష్ణగణేశదత్తమారుత్యాది రూపాలతోపాటు బాబాను కూడా చేర్చి అందరినీ మూకుమ్మడిగా పూజించే పద్ధతికి మారింది. మనస్సు వివిధ రూపాలు ధరించటం మాని, ఒకే రూపం ధరించడం ద్వారా చైతన్యఘనత లేక బ్రహ్మతథాకారవృత్తి సిద్ధిస్తుందని బాబా చెప్పిన ఉపాసనారహస్యం మరవడం వల్ల ఎందరో సాయిభక్తుల పూజామందిరాలు వివిధ దేవతామూర్తుల చిత్రపటాల ప్రదర్శనశాలలుగా మారుతున్నాయి. సాయిభక్తులందరు వివేకంతో ఈ పరిణామాలను గమనించి ఆత్మవిమర్శన చేసుకుంటూ, నిజమైన సాయిసాంప్రదాయమేమిటో విచారించి తెలుసుకొని ముందుకు సాగాలి! అలా ముందుకు సాగనీయకుండా అడ్డుపడే బూజుపట్టిన ఆచారవ్యవహారాలపట్ల మనకుండే మూర్ఖమైన మూఢవిశ్వాసమే మనలోని మహిషతత్త్వం. ఆ మూఢాచారాలను సమాజంలో ప్రచారం చేసేవారే ఆ మహిషతత్త్వం మూర్తీభవించిన మహిషాసురులు. మన ఆధ్యాత్మిక పురోగమనానికి నిరోధమయిన ఈ మహిషతత్త్వాన్ని ఒకరూపంలో జయిస్తే అది మరోరూపంలో తలెత్తుతూనే ఉంటుంది – మహిషాసురుని ప్రతి రక్తం బొట్టులో నుండి మరో మహిషాసురుడు పుట్టి విజృంభించినట్లుగ! మనలోని త్రికరణాలను ఏకం చేసి, ఒక మహిషాసుర మర్దన శక్తిగా రూపొందింపజేసుకొని, సాయిభక్తి వివేకము నిష్ట-సబూరీలనే ఆయుధాలతో పోరినపుడే ఆ మహిషాసుర మర్దనం జరుగుతుంది. అది జరిగిననాడే మనకు నిజమయిన విజయదశమి!

Source: సాయిభక్తి సాధన రహస్యం, రచన: పూజ్యశ్రీ సాయినాథుని శరత్ బాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 577వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:

  1. కరుణాసముద్రుడు, ఆపద్బాంధవుడు సాయి
  2. కష్టమేదైనా సాయి పాదాలే శరణం

కరుణాసముద్రుడు, ఆపద్బాంధవుడు సాయి

ఓం సాయినాథాయ నమః

ఆపద్బాంధవుడు, కరుణాసముద్రుడు, 'సాయీ' అని మనఃపూర్వకముగా పిలువగానే 'ఓయ్' అంటూ నేనున్నానని పలికే దైవం సాయిబాబా పాదారవిందములకు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, సాయి ప్రేమానురాగాలను సాటి సాయిబంధువులతో ఆనందంగా పంచుకుంటున్నాను. ముందుగా 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి, తోటి సాయిబంధువులకు నా నమస్కారములు తెలియజేస్తున్నాను.

నా పేరు బి.ఎమ్.ప్రసాద్. నేను రెవెన్యూ డిపార్ట్‌మెంటులో తహశీల్దారుగా పనిచేసి, 2009 డిసెంబరులో పదవీవిరమణ చేశాను. నా చిన్నతనంలో, అనగా నేను 9వ తరగతి చదువుకునే రోజుల్లో స్కూల్లో నాకు కమ్యూనిస్టు పార్టీకి చెందిన కొందరితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారేకొద్దీ ఆ పార్టీ భావాలు నన్ను ఆకర్షించాయి. దాంతో, దేవుడు లేడనే భావనకు లోనయ్యాను. కానీ, నా భావాలతో నా కుటుంబసభ్యుల మరియు ఇతరుల మనోభావాలకు వ్యతిరేకిగా కాక ఎవరి నమ్మకాలు వారివి అనే ధోరణిలో ఉండేవాడిని. కొంతకాలం అలానే గడిచాక అనుకోకుండా ఒకరోజు సాయినాథుని జీవితచరిత్రపై వచ్చిన సినిమా చూడటం తటస్థించింది. ఆ సినిమాలో చూపించిన సాయిబాబా బాల్యం మొదలు నిర్యాణపర్యంతం వారి జీవన విధానం, వారి భిక్షావృత్తి, వారు ఆచరించే సామాన్య పద్ధతులు, వారి ఉపదేశాలు, సూచనలు, సూక్తులు, రోగులకు ఆయన చేసిన విచిత్ర వైద్యం, భక్తులకు వారిపై గల పూర్ణ భక్తివిశ్వాసాలు నాకు చాలా చాలా నచ్చాయి. అవి నా మనస్సును ఎంతగానో హత్తుకున్నాయి. ఆ క్షణం నుండి భగవంతుడంటే 'సాయి', గురువు అంటే 'సాయి', నాకంటూ అత్యంత ఆప్తుడు ఎవరైనా ఉన్నారంటే అది 'సాయి' అనేంత పూర్తి నమ్మకం ఏర్పడింది. సాయిబాబా అనుగ్రహంతో అప్పటినుండి నేను అనునిత్యం సాయిని తలచుకుంటూ, పూజిస్తూ, సాయి నా కుటుంబంలో ఒకరని అనుకుంటూ, ఆయనపై పూర్ణ భక్తివిశ్వాసాలతో జీవిస్తున్నాను.

సాయి నన్ను సర్వవిధాలా కాపాడిన అనుభవం:

ఒకప్పుడు నేను రెవెన్యూ డిపార్ట్‌మెంటులో సీనియర్ అసిస్టెంట్ హోదాలో మండల సివిల్ సప్లై స్టాక్‌ పాయింట్ ఇన్‌ఛార్జిగా నియమింపబడ్డాను. నా విధులను అనుసరించి పేద ప్రజలకు ప్రభుత్వం అందించే నిత్యావసర సరుకులను మండలంలోని చౌక దుకాణ డీలర్లకు సప్లై చేయిస్తుండేవాడిని. అయితే, స్టాక్ పాయింట్ నుండి డీలర్లకు నిత్యావసర వస్తువులను చేరవేసే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టరు సకాలంలో సరుకును రవాణా చేస్తుండేవాడు కాదు. పైఅధికారుల ఒత్తిడి మేరకు నేను ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టరుని, "సరైన సమయంలో సరుకు రవాణా చేయించాలి, అలా చేయలేకుంటే కాంట్రాక్టు రద్దు చేయవలసి వస్తుంద"ని మందలించాను. దాంతో ఆ కాంట్రాక్టరు నాపై ద్వేషం పెంచుకుని, పగతో కక్షసాధింపుచర్య తలపెట్టాలని అనుకున్నాడు. కానీ బయటికి మాత్రం ఏమీ తెలియనట్లు మంచిగా నాతో ఉంటూ వచ్చాడు. సుమారు నెలరోజుల తర్వాత అతను నా దగ్గరకు వచ్చి, "రవాణా చేసే వాహనం రిపేరుకు వచ్చింది. అది బాగుచేయించేందుకు 1000 రూపాయలు అవసరం పడింది. ఆ డబ్బు చేబదులుగా ఇస్తే, డబ్బు సమకూరిన వెంటనే ఇచ్చేస్తాన"ని చెప్పాడు. సరేనని నేను అతనికి వెయ్యి రూపాయలు ఇచ్చాను. వారం రోజుల తర్వాత నా డబ్బులు నాకు తిరిగి ఇస్తూ, ఏసీబీ వాళ్లను పిలుచుకొచ్చి, నేను లంచం అడుగుతున్నానని నాపై కేసు బనాయించాడు. దాంతో నన్ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. ఆ సమయంలో వృద్ధాప్యంలో ఉన్న నా తండ్రి జబ్బులతో బాధపడుతున్నాడు. నాకు భార్య, పెళ్లీడుకొచ్చిన ఇద్దరు ఆడపిల్లలు, ఒక కొడుకు ఉన్నారు. వారందరి పోషణ భారం నాపై ఉంది. నాకు పెద్దలనుంచి ఆస్తిపాస్తులు వంటివేమీ రాలేదు. కేవలం జీతంతో బ్రతుకు బండిని నడిపిస్తూ జీవిస్తుండేవాడిని. హఠాత్తుగా  ఉద్యోగం నుండి సస్పెండ్ కావడంతో నా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆ కష్టకాలంలో మిత్రులుగాని, తోటి ఉద్యోగులుగాని, బంధువులుగాని ఎవరూ నన్ను ఆదుకోలేదు. రెండున్నర సంవత్సరాల పాటు కేసు విషయంగా కోర్టు వాయిదాలకు హైదరాబాదు తిరుగుతూ లాయర్ల ఖర్చుకు, కుటుంబపోషణకు చాలా అవస్థలుపడ్డాను. అలాంటి సమయంలో కరుణాసముద్రుడు, ఆపద్బాంధవుడు అయిన బాబా నా కర్మ పూర్తయ్యేంతవరకు నా వెన్నంటే ఉండి అభయమిస్తూ నడిపించారు. సర్వాంతర్యామి అయిన బాబా నన్ను ఎంతగానో ఆదుకున్నారు. ఆయన దయతో... 

1) నాపై ఏసీబీ వారు పెట్టిన కేసు నిర్ధారణ కాకుండా చేసి, హైదరాబాదు కోర్టులో కేసు కొట్టివేయించారు.

2) నాకు రావలసిన ప్రమోషన్ విషయంలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా చేశారు.

3) వృద్ధుడైన నా తండ్రి కాలం చేయడంతో ఆ కష్టకాలంలో నాకు కాస్త భారం తగ్గించారు.

4) నా ఇరువురి కుమార్తెలకు మంచి సంబంధాలు చూపించి, వివాహాలు చేయించారు.

5) నా కుమారుడి బీ.టెక్ పూర్తి చేయించి, ఉద్యోగాన్ని ప్రసాదించారు. మంచి కోడలిని, మనవరాలిని కూడా ప్రసాదించారు.

6) నివసించేందుకు చక్కటి గృహాన్ని కూడా బాబా ఇచ్చారు.

7) నేను పదవీవిరమణ చేశాక అదే డిపార్ట్‌మెంటులో డిప్యూటీ తహసీల్దార్ హోదాలో అవుట్‌సోర్స్ ఉద్యోగిగా నియమింపబడేలా అనుగ్రహించారు బాబా.

ఇప్పటికీ బాబా ఆశీర్వాదంతో ఆయనిచ్చిన ఉద్యోగం చేస్తూ ఆనందకరమైన జీవితాన్ని సాగిస్తున్నాను.

ఓం సాయిరాం!


కష్టమేదైనా సాయి పాదాలే శరణం

సాయిభక్తురాలు శ్రీమతి విద్యావతి తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

ఓం శ్రీ సాయినాథాయ నమః. పిలిచిన వెంటనే పలికే దైవం, ఆపద్బాంధవుడు, కరుణాసముద్రుడైన సాయిబాబా పాదాలకు నమస్కరిస్తున్నాను. నా పేరు విద్యావతి. నా జీవితంలో బాబా ఎన్నోవిధాలుగా నన్ను కాపాడారు. బాబా నా బాధలన్నీ తొలగించారు. నాకు ఏ కష్టం వచ్చినా నేను బాబా పాదాలనే శరణువేడుతాను. 

ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో నాకు ఒక ఆరోగ్య సమస్య వచ్చింది. నేను బాబా పాదాలను శరణు వేడాను. ఒకరోజు ఈ బ్లాగులో సాయిభక్తుల అనుభవాలు చదువుతున్నాను. అందులో ఒక సాయిభక్తురాలు, తనకు ఆరోగ్య సమస్య వస్తే ‘ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః’ అనే బాబా మంత్రం జపించాననీ, బాబా దయవల్ల ఇప్పుడు తన ఆరోగ్యం బాగుందనీ రాశారు. అది చదివి నేను కూడా ‘ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః’ అనే బాబా మంత్రాన్ని నిరంతరం జపించసాగాను. తరువాత ఒకరోజు ఆసుపత్రికి వెళ్ళి చెకప్ చేయించుకున్నాను. నన్ను పరీక్షించిన డాక్టర్ నాకేమీ ఇబ్బందిలేదని చెప్పారు. ఇదంతా బాబా చేసిన అద్భుతం. ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని బాబాకు చెప్పుకున్నాను. “మీరు ప్రసాదించిన అనుభవాన్ని ఇంత ఆలస్యంగా పంచుకుంటున్నందుకు నన్ను మన్నించండి బాబా! ఎల్లప్పుడూ మీ దయను నా మీద కురిపించండి తండ్రీ! నా జీవితమంతా మీ ఆశీస్సులతో నిండి ఉంది బాబా. నా తల్లి, తండ్రి మీరే బాబా. దయచేసి నాకు, నా భర్తకు, నా కుమారుడికి ఎల్లప్పుడూ అండగా ఉండండి. మా జీవితం చక్కగా, సంతోషంగా ఉండేలా మార్గనిర్దేశం చేయండి బాబా!”



సాయిభక్తి సాధన రహస్యం - గొలుసు ఉత్తరాల గోల!



గొలుసు ఉత్తరాల గోల!

మన పేరుతో పోస్టులో ఉత్తరం రాగానే ఆతృతగా “ఎక్కడనుంచబ్బా!” అనుకొంటూ అందుకొంటాము. ఇంతా చూస్తే అది ‘గొలుసు ఉత్తరం’! ఉఫ్.ఫ్.. నిత్యజీవితంలో ఎటూ వుండే సమస్యలకు తోడు ఈ గొలుసు ఉత్తరాల(లింక్ లెటర్స్)బెడద బెదిరింపు ఎక్కువౌతున్నదీ మధ్య. సాయిబాబా, వేంకటేశ్వరస్వామి, సంతోషిమాత తదితర దైవాల పేర్లు యే 11మందికో 21 మందికో తిరిగి ఉత్తరాలు వ్రాయమనీ, అలా వ్రాసిన ‘ఫలానా’ వారికి ఏవో సిరిసంపదలొచ్చాయనీ ఆశబెడుతూ, నిర్లక్ష్యంచేసి అలా వ్రాయని వారెందరో పెద్ద ఆపదలలో చిక్కుకొన్నారని బెదరిస్తూ,.. సాగే సంతకం లేని (ఆకాశరామన్న) ఉత్తరాలే – ఈ ‘గొలుసు ఉత్తరాలు’. ఇటీవల కాలంలో ఈ గొలుసు ఉత్తరాల ‘పిచ్చి’ మరీ ముదిరినట్లు కనిపిస్తున్నది. ఇలాంటి ఉత్తరాలు వస్తే ఏమి చేయాలి అన్నదానికి సాయిపథం వివరణ!

డబ్బు వస్తుందని ఆశ చూపో, ఆపదలొస్తాయని భయపెట్టో తమ పేరు ఉత్తరాలద్వారా ప్రచారం చేసుకొనే దుర్గతి ఖర్మ శ్రీసాయిబాబా వంటి దైవస్వరూపులకు లేదు. శ్రీసాయిస్వరూపం – శ్రీఉపాసనీబాబా స్తుతించినట్లు – ‘అహంభావహీనం ప్రసన్నాత్మ భావం’. అందరినీ అనుగ్రహించడమే తమ అవతారకార్యమని (“My mission is to give blessings!”) శ్రీసాయియే చెప్పారు కూడా! అంతేకాదు. తమకెప్పటికీ ఎవరి మీదా కోపం రాదని గూడా బాబా చెప్పారు. బాబా అనుగ్రహం ఎప్పుడూ అందరిమీదా కుండబోతగా వర్షిస్తూనే ఉన్నది. మన అజ్ఞానమనే గొడుగు ఆ అమృతధారలు మనమీద పడకుండా అడ్డుకొంటున్నది. అనన్యప్రేమతో శ్రీసాయిని శరణు పొందితే ఆ ‘అడ్డు’ తొలగిపోతుంది. అంతేకానీ, భయంచేత ఆశచేత కార్డు ముక్కల్లో బాబా పేరు వ్రాసి పదిమందికి పంపడం వల్ల శ్రీసాయికృపను పొందుదామని అనుకోవడం కేవలం భ్రమ. అలా తమ పేర్లు ప్రచారం చెయ్యకపోతే, – క్షుద్ర పిశాచగణాల్లా – ఆగ్రహించి ఆపదలు కలిగిస్తారని భావించడం శ్రీసాయివంటి దైవస్వరూపులను అవమానించినట్లే! ఆధ్యాత్మికతత్త్వం  సాధన మొదలయిన విషయాలలో ప్రాధమిక సూత్రాలపట్ల కూడా అవగాహన లేని మూర్ఖశిఖామణులే ఈ గొలుసు ఉత్తరాల వంటి అవివేకపు చర్యలను ప్రోత్సహిస్తుంటారు. “వారు వ్రాయమన్నదీ మనం వ్రాసేదీ కూడా శ్రీసాయినామమే కదా? వ్రాసి పంపితే మనకు పోయేదేమున్నది?” అని ఎవరైనా భావిస్తే, అది పైన చెప్పిన కారణంగా కేవలం ఆత్మవంచనే అవుతుంది. అంతే కాదు! వివేకాన్ని ఆత్మగౌరవాన్ని పోగొట్టుకొని, సంతకం కూడా పెట్టలేని భీరువుల్లా ‘ఆకాశరామన్న’ ఉత్తరాలు వ్రాసే దుస్థితికి మనలను దిగజారుస్తున్న ఈ బాపతు మూర్ఖత్వాన్ని ఏ కారణంగా ప్రోత్సహించినా అది శ్రీసాయిభక్తి సంప్రదాయానికి ‘అపచారమే’ అవుతుంది. సరి! అయితే మరిలాంటి ఉత్తరాలు వచ్చినప్పుడు ఏమి చెయ్యాలి?౼ అని మమ్మల్ని అడిగిన వారికి మేము చెప్పే సమాధానం ఒక్కటే!... వెంటనే చింపి చెత్తబుట్టలో పారవేయండి!

Source: సాయిభక్తి సాధన రహస్యం, రచన: పూజ్యశ్రీ సాయినాథుని శరత్ బాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 576వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:

  1. సదా తోడుగా ఉంటూ కాపాడుతున్న బాబా
  2. బాబా దయవలన మా నాన్నగారికి కోవిడ్ పరీక్షలో నెగిటివ్


సదా తోడుగా ఉంటూ కాపాడుతున్న బాబా

సాయిభక్తురాలు శ్రీమతి తేజశ్రీ తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో ఇలా పంచుకుంటున్నారు:

ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి

ఈ సృష్టిని సృష్టించిన దైవస్వరూపం శ్రీసాయి భగవానుడు. సాయిని నమ్మినచో సర్వకష్టాలు దూరం. ఆరోగ్యప్రదాయిని మన సాయినాథుని నామం.

నా పేరు తేజ. మేము సౌత్ ఆఫ్రికాలో ఉంటున్నాము. సాయిబాబా లీలలను ఎలా వర్ణించాలో నాకు అర్థం కావట్లేదు. ఆపద సంభవించనున్న ప్రతి సందర్భంలోనూ బాబా నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. నా జీవితంలో బాబా లీలలెన్నో జరిగాయి. వాటిలోనుండి మూడు అనుభవాలను ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. 

మొదటి అనుభవం: 

ఒకరోజు అర్థరాత్రి 12 గంటల నుండి 2 గంటల వరకు మావారు తీవ్రమైన ఛాతీనొప్పితో బాగా అల్లాడిపోయారు. ఛాతీనొప్పితో పాటుగా తనకు విరేచనాలు కూడా మొదలయ్యాయి. తన పరిస్థితి చూసి నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే, నేనది హార్ట్ స్ట్రోక్ అనుకున్నాను. 2.30 గంటలకి ఛాతీనొప్పి ఇంకా ఎక్కువైంది. తను కూర్చోలేకపోతున్నారు, నిల్చోలేకపోతున్నారు. బాబాను ప్రార్థించి వెంటనే తనను హాస్పిటల్లో చేర్పించాము. నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! రిపోర్టులలో హార్ట్ స్ట్రోక్ అని రాకూడదు, అది కేవలం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అని రావాలి” అని మ్రొక్కుకున్నాను. 2.30 గంటలకు మావారిని హాస్పిటల్లో జాయిన్ చేశాము, 4.30 గంటలకు ‘గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్’ అని రిపోర్టు వచ్చింది. చాలా సంతోషంగా అనిపించింది. బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. బాబా కృపతో అలాంటి అనుభవాలు నా జీవితంలో చాలా ఉన్నాయి.

రెండవ అనుభవం: 

ఒకటిన్నర సంవత్సరాల వయసున్న మా బాబు ఒకరోజు కడుపునొప్పితో బాధపడుతూ బాగా ఏడుస్తున్నాడు. నేను, “బాబా! 5 నిమిషాల్లో బాబు ఏడవకుండా హాయిగా పడుకోవాలి” అని బాబాను వేడుకున్నాను. అలా బాబాను వేడుకున్న 2 నిమిషాలలో బాబు ఏడుపు ఆపి హాయిగా నిద్రపోయాడు. అలా బాబా ఎల్లప్పుడూ నా వెంటనే ఉండి నన్ను రక్షిస్తూ ఉన్నారు.

మూడవ అనుభవం: 

ఒకరోజు మా బాబుకి ఆవిరిపడుతుంటే అనుకోకుండా వేడినీళ్ళు మావారి కాలిమీద పడి తన కాలు బాగా కాలిపోయింది. కాలిన గాయం దానంతటదే తగ్గిపోతుందని అలాగే నొప్పిని భరిస్తూ రెండు రోజులు వేచి చూశారు. గాయం తగ్గలేదు. తరువాతిరోజు ఆసుపత్రికి వెళ్తే డాక్టర్ మావారిని పరీక్షించి, “కాలు బాగా కాలింది, చికిత్స చేయాలి” అని చెప్పి కాలిన దగ్గర కాలిపైన చర్మం మొత్తం తీసేసి, “5 రోజుల్లో తగ్గిపోతుంద”ని చెప్పారు. 5 రోజులైనా గాయం తగ్గలేదు. తీవ్రమైన నొప్పితో మావారు రాత్రిపూట నిద్రపోయేవారు కూడా కాదు. ఒక గురువారంనాడు నేను బాబాకు నమస్కరించి, “బాబా! వచ్చే గురువారానికల్లా కాలిన గాయమంతా తగ్గిపోయేలా అనుగ్రహించండి” అని మ్రొక్కుకున్నాను. బాబా అనుగ్రహంతో 2 రోజుల్లో నొప్పి తగ్గిపోయింది. మరుసటి గురువారానికల్లా గాయం కూడా మానిపోయి పైన క్రొత్త చర్మం కూడా వచ్చింది. అలా ఎల్లప్పుడూ నా వెంటనే ఉంటున్న బాబాకు నా సాష్టాంగనమస్కారాలు. “బాబా! నన్ను ఎల్లప్పుడూ మీ పాదాలు విడువకుండా చూడు సాయీ!” బాబానే నా సర్వస్వం. నా గురువు. బాబాకన్నా ఎక్కువ నాకు ఎవరూ లేరు. బాబా లేనిదే నేను లేను. 

అంతా సాయిమయం

అంతా శిరిడిమయం

అంతా నీ సృష్టియేనయా

అంతా నీ నామమే

అంతా నీ ధ్యానమే

అంతా నీ రూపమేనయా

సాయిరాం సాయిరాం శిరిడీ సాయిరాం

ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


బాబా దయవలన మా నాన్నగారికి కోవిడ్ పరీక్షలో నెగిటివ్

పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు  తన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు:

ముందుగా ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా హృదయపూర్వక నమస్కారాలు. సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ప్రతిరోజూ ఈ బ్లాగులో ప్రచురించే బాబా లీలలను చదువుతుంటే బాబా పట్ల నమ్మకం, జీవితం పట్ల ధైర్యం కలుగుతున్నాయి.

ఇక నా అనుభవానికి వస్తే.. ఇటీవల మా నాన్నగారికి తరచూ జ్వరం వస్తోంది. హాస్పిటల్కి వెళ్లి డాక్టరును సంప్రదించి మందులు వాడినా జ్వరం తగ్గలేదు. అందరూ కోవిడ్ టెస్ట్ చేయించుకోమన్నారు. నాకు చాలా భయమేసింది. ఎందుకంటే, మా ఇంట్లో 9 నెలల గర్భవతియైన మా సిస్టర్ ఉంది. పైగా మా అమ్మగారికి ఆరోగ్యం కూడా బాగుండటం లేదు. నేను వెంటనే బాబాకు నమస్కరించి, "బాబా! కోవిడ్ పరీక్షలో నాన్నకి నెగిటివ్ వస్తే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను. మీకు కిచిడీని నైవేద్యంగా సమర్పిస్తాను బాబా" అని చెప్పుకున్నాను. బాబా దయవలన మా నాన్నగారికి కోవిడ్ పరీక్షలో నెగిటివ్ వచ్చింది. అందరం చాలా సంతోషించాము, మనసారా బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాము.

నాకున్న ఒక సమస్యకు బాబా నుండి సమాధానం కోసం ఎదురుచూస్తున్నాను. బాబా ఇచ్చే సమాధానంతో మరలా మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. "బాబా! ఎల్లప్పుడూ మీ దయ నా మీద, నా కుటుంబం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను".

సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!



సాయిభక్తి సాధన రహస్యం - పంచాంగాల పట్టు! ప్రపత్తికి గొడ్డలి పెట్టు!




పంచాంగాల పట్టు! ప్రపత్తికి గొడ్డలి పెట్టు!

“జాతకాలు చూడవద్దు! సాముద్రికాన్ని నమ్మవద్దు!”
~శ్రీసాయిబాబా 

{బాబా మాట: “సాంగె తయాస్ మాఝె మాన్, పత్రికా ఠేవీగుండాళూన్... జన్మపత్రికా పాహూ నకా... సాముద్రికా విశ్వాసూ నకా... ఠేవీ విశ్వాస్ మజవరీ!” (“నేను చెప్పే మాట వినుకో! జన్మకుండలిని చుట్టచుట్టి అవతల పారెయ్! జాతకాలు చూడొద్దు! సాముద్రికాన్ని నమ్మొద్దు! నాపై విశ్వాసముంచు!”)} --శ్రీసాయి సచ్చరిత్ర, అధ్యాయం:29; ఓవీ 108-110.

మన జ్యోతిష్కులు చెప్పే జోస్యాల శాస్త్రంలో నిజం ఎంతో ఆ జాతవేదునకే తెలుసు! మనకు మన భవిష్యత్తు గురించి సహజంగా వుండే భయాందోళనలు, భద్రతారాహిత్యభావం, ఎలాగైనా భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆతురత, యేమాత్రం వీలున్నా ఆ ‘భవిష్యత్తు’ను మనకనుకూలంగా మార్చుకోవాలన్న ఆశ... ఇవన్నీ కలిసి మనలను జ్యోతిషాల పాలబడేలా చేస్తున్నాయి. ఏది జరగాలని నిర్ణయింపబడి వుందో అదే ‘భవిష్యత్తు’ అయినట్లయితే, దాన్ని ముందుగా తెలుసుకొనే సామర్ధ్యం జ్యోతిష్కుల కెంతమందికున్నది? ఒకవేళ వున్నా, ఆ భవిష్యత్తును మార్చగలిగే ‘శక్తి’ వారు చేసే ‘గ్రహశాంతుల’ కున్నదా? అంత తేలిగ్గా మార్చుకోగలిగింది అసలు ‘భవిష్యత్తు’ ఎలా అవుతుంది?– అనే విషయాలను గురించి మనం యోచించం! ప్రజాబాహుళ్యానికి సంబంధించినంత వరకు యీ అనాలోచిత చర్యల సంగతెలావున్నా, శ్రీసాయిబాబా వంటి సద్గురువును ఆశ్రయించిన సాయిభక్తులకు మాత్రం ఇది అనుచితమని చెప్పక తప్పదు!

కొందరడగవచ్చు: “మరి, బాబా కూడా భవిష్యత్తు చెప్పారు గదా?” అని. ఇదే ప్రశ్న శ్రీనానాసాహెబ్ చందోర్కర్ ఒకసారి బాబానే అడిగాడు! దానికి బాబా తన సహజమైన నిగూఢరీతిన చెప్పిన సమాధానం గమనార్హం. బాబా అన్నారు: “లేదు నానా! నేను ఎట్టి చమత్కారాలు చెయ్యను! మీకు జ్యోతిష్కులు వున్నారు. వారు ఏవో గుణించి చూచి, ఓ రెండురోజుల ముందుగా భవిష్యత్తు చెప్తారు. వీనిలో కొన్ని నిజాలవుతాయి. నేను ఇంకా కొంచెం దూరం ముందుగా చూస్తాను. నేను చెప్పింది జరుగుతుంది. బాహ్యంగా, నేను చేసేది గూడా ఒకవిధమైన జ్యోతిషంలాగా కనబడవచ్చు. అయితే, దీని ఆంతర్యం పామరులు గ్రహించలేరు. నీకు ముందు ముందు ఏమి జరగబోతుందో తెలియదు గనుక, అది నేను చెప్తే, నీకు అది ఒక చమత్కారం (మహత్తు)గా కనిపిస్తుంది. అవి నా అద్భుతశక్తికి నిదర్శనాలని తలచి నా పట్ల భయభక్తులు చూపుతావు. నేను మాత్రం మీరు చూపే భక్తిగౌరవాలను ఆ భగవంతునికే సమర్పించి, మీరు నిజంగా అనుగ్రహింపబడేలా చూస్తాను”.

చాలా సునిశితంగా పరిశీలిస్తేగాని బాబా మాటలలోని అంతరార్థం బోధపడదు. తాము ఎప్పుడూ ‘చమత్కారాలు’ చేయమనీ, మన పామరత్వము వల్లనే ఆయన చేసే పనులు ‘చమత్కారాలు’గా ‘జోస్యాలు’గా కనిపిస్తాయనీ, అటువంటి వాటికోసమే ఆయన్ను ఆశ్రయిస్తే సద్గురువును ఒక జ్యోతిష్కుని స్థాయికి దిగజార్చడమేననీ, అలా చెయ్యడం శ్రీసాయి వంటి సమర్థ సద్గురుని ఓ సద్గురువుగా కాక, ఒక జ్యోతిష్కునిగా తలచి ఆశ్రయించడంతో సమానమేనని - బాబా మాటల్లోని శ్లేష. అంతేకాదు! బాబా చెప్పిన మాటలలో మరో సత్యాన్ని గుర్తించాలి. అదేమంటే, జ్యోతిష్కులు బహుశా కొంచెం ముందుగా జరుగబోయేది చెప్పగలరేమో కానీ, - బాబా 'చెప్పింది జరుగుతుంది'!

అయితే, అలా జోస్యాలుగా ‘కనిపించే’ చర్యలనయినా బాబా ఎందుకు చేసినట్లు? సద్గురువు తమ భూతభవిష్యద్వర్తమానాలు తెలిసిన త్రికాలజ్ఞులని, తన శ్రేయస్సు కోసం అవసరమైతే ‘విధి’నే మార్చగల సమర్థులనే విశ్వాసం బాబాయొక్క లీలల వల్ల భక్తునికి కలుగుతుంది. క్రమంగా ఆ విశ్వాసమే భక్తుని సద్గురువుకు సంపూర్ణ శరణాగతి చెందిస్తుంది. అప్పుడే సద్గురువుకు పూర్తిగా ‘పగ్గాలప్పగించడం’ సాధ్యం.

సద్గురువు తమ భూతభవిష్యద్వర్తమానాలు తెలిసిన త్రికాలజ్ఞులని, తన శ్రేయస్సుకోసం అవసరమైతే ‘విధి’నే మార్చగల సమర్థులనే విశ్వాసం బాబాయొక్క లీలల వల్ల భక్తునికి కలుగుతుంది. క్రమంగా ఆ విశ్వాసమే భక్తుని సద్గురువుకు సంపూర్ణ శరణాగతి చెందిస్తుంది. అప్పుడే సద్గురువుకు పూర్తిగా ‘పగ్గాలప్పగించడం’ సాధ్యం. శ్రీసాయిబాబా వంటి సమర్థసద్గురువును ఆశ్రయించనంత వరకే జాతకాలు గ్రహాలు మొదలైన వాటి ప్రసక్తియని, ఒక్కసారి (శ్రీసాయి వంటి) సద్గురువును ఆశ్రయించిన తరువాత ‘గ్రహాలు’ ఏమీ చెయ్యలేవని శాస్త్రం, మహాత్ముల ఉవాచ. ఈ విషయాన్ని సూచిస్తూ బాబా ఒక భక్తునితో, “నీ ప్రారబ్దంలో నీకు సంతానమెక్కడ వుంది? నా దేహాన్ని చీల్చి నీకు కుమారుణ్ణి ప్రసాదించాను” అనీ, మరో భక్తునితో, “ద్వారకామాయి బిడ్డలను గ్రహాలేం చెయ్యగలవు?” అనీ అభయమిచ్చారు. మరోసారి ఒక ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి బాబాను అంగసాముద్రికశాస్త్ర దృష్ట్యా పరిశీలించాలని శిరిడీ వచ్చాడు. అతడు మసీదు చేరి ఒక మూల కూర్చోబోతుండగా బాబా తమ ప్రక్కనున్న భక్తులకు ఆ సిద్ధాంతిని చూపుతూ, “ఇతడు నా ఇంటి వాసాలను లెక్కబెట్టడానికొచ్చాడు! నా దగ్గర అతడు చూడగలిగిందేమీ లేదు. అతణ్ణి వెంటనే ఇక్కణ్ణుండి బయటకు పంపివేయండి!” (“ఓ హమారా జోపిడీ కా బాంబు గిన్ నేకో ఆయా...”) అని కోపంగా కేకలేసారు.

ఒకసారి ఒక భక్తుడు ఒక జ్యోతిషశాస్త్ర గ్రంథాన్ని బాబా చేతికిచ్చి, ఆయన ప్రసాదంగా దాన్ని తిరిగి తనకివ్వమని ప్రార్థించాడు. అలాంటి సందర్భాలలో బాబా తమ అనుమతిని ఇవ్వదలచుకోకపోతే, ఆ ఆశీస్సులు కోరే వ్యక్తికి ఆ వస్తువును తిరిగి ఇచ్చేవారు కాదు. అయితే భక్తులు సమర్పించిన యే వస్తువును తమ వద్ద వుంచుకొనేవారు కూడా కాదు. కనుక అటువంటి వస్తువులను (పుస్తకాలు మొ౹౹నవి) తమ ప్రక్కనున్న షామావంటి భక్తులకు ఇచ్చేసేవారు. జ్యోతిషం వంటి విద్యల్ని ఎన్నడూ ప్రోత్సహించని బాబా, ఆ జ్యోతిషగ్రంథాన్ని ఆశీస్సులకోసం తమకిచ్చిన భక్తునికి తిరిగి ఇవ్వలేదు. ఆ పుస్తకాన్ని అటు, ఇటు తిరగేసి, ఆ సమయంలో తన ప్రక్కనున్న శ్రీబూటీకి ఇచ్చివేశారు.

((జ్యోతిషం మీద ఏ మాత్రం ఆసక్తి లేకపోయినా బాబా చేతిగుండా వచ్చింది కదా అని శ్రీబూటీ ఆ గ్రంథాన్ని చదవడం, ఒకసారి శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ ఎన్నికలలో పోటీచేయగా సరదాగా దీక్షిత్ గ్రహబలాన్ని గుణించి ఏ సమయంలో ఎన్నికలు జరిగితే అతను గెలుపొందే అవకాశముందో చెప్పడం, ఎన్నికలు అలానే జరిగి దీక్షిత్ గెలుపొందడమూ జరిగాయి. దీన్నిబట్టి బాబా జ్యోతిషాన్ని పరోక్షంగానైనా ప్రోత్సహించినట్లే కదా? అని కొందరు భక్తలు తలచడం సహజమే! కొందరు రచయితలు యీ వివరాన్ని ఆధారం చేసుకొని అలానే వ్యాఖ్యానించారు కూడా! కానీ, తాను గెలుపొందింది కేవలం "బాబా అనుగ్రహం" వల్లనేనని శ్రీదీక్షిత్ స్వయంగా తమ డైరీలో వ్రాసుకున్నారు. అంతేకాదు! శ్రీబూటీకి ఆ పుస్తకాన్ని ఇవ్వడం అనే బాబా చర్యవల్ల, అటు శ్రీబూటీగానీ, ఇటు శ్రీదీక్షిత్ గానీ జ్యోతిషం పట్ల జోస్యాలపట్ల ఆకర్షితులు కాలేదు. కాయను బట్టి చెట్టును నిర్ణయించమని (“Judge the tree by the fruit!”) కదా ఆర్యోక్తి!))

తమకేది మంచిదో అది బాబా తప్పక చేస్తారనే విశ్వాసం సాధనాపథంలో ప్రథమ సోపానం. అది మరచి సాయిభక్తులే జ్యోతిష్కుల చుట్టు, వాస్తు సిద్ధాంతుల చుట్టూ తిరగడం; కొందరు ప్రముఖ సాయిభక్తులే జాతకాలను ప్రోత్సహిస్తూ, జోస్యాలు చెప్పడం; ఎందరో ‘వృత్తి జ్యోతిష్కుల’కు శ్రీసాయి ‘కులదైవం’ కావడం – శోచనీయం! సద్గురు చరణాలనాశ్రయించి, వారిని శ్రేయోభిక్ష పెట్టమని అర్ధించిన చేతులను హస్తసాముద్రికుల ముందు దేబిరిస్తూ చాచడం – మనం ఆశ్రయించిన సద్గురువునే అవమానించి, కించపరచడం కాదా? ప్రసిద్ధ జ్యోతిషశాస్త్ర పండితుడు శ్రీముళేశాస్త్రి (నాసిక్) ఒకసారి బాబా చేయి చూస్తానని ప్రార్థిస్తే, బాబా ఓ చిరునవ్వు నవ్వి వూరుకున్నారేగానీ, ఆ హస్తసాముద్రికుని ముందు తమ చేయి చాపలేదు! ఈ జోస్యాల ఆకర్షణలలో గ్రహశాంతుల ఊబిలో పడకుండా, వివేకంతో తమను తాము నిగ్రహించుకోగలిగిననాడు మనం శ్రీసాయి శరణాగతిపథంలో ఒక మెట్టు పైనుంటాం!

Source: సాయిభక్తి సాధన రహస్యం, రచన: పూజ్యశ్రీ సాయినాథుని శరత్ బాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 575వ భాగం.....


ఈ భాగంలో అనుభవాలు:
  1. ఆరోగ్యప్రదాయి సాయి
  2. స్వప్న దర్శనమిచ్చి నాతో ఉన్నానని తెలియజేసిన బాబా

ఆరోగ్యప్రదాయి సాయి

సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఇంతకుముందు రెండుసార్లు ఈ బ్లాగ్ ద్వారా నా అనుభవాలను మీతో పంచుకున్నాను. సాయి అనుగ్రహంతో మరలా మీ ముందుకి వచ్చి నా అనుభవాలను పంచుకుంటున్నాను.

మా బావగారు ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటారు. 2020, జులై నెలలో వాళ్ళ కంపెనీలో ఒక చిన్న ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్లో మా బావగారు ఒక వ్యక్తితో సన్నిహితంగా ఉన్నారు. 3 రోజుల తర్వాత అతనికి జ్వరం వచ్చింది. పరీక్షలు చేయిస్తే తనకు కరోనా పాజిటివ్ అని తేలింది. మా బావగారికి కూడా కొంచెం ఛాతీలో నొప్పి వచ్చింది. గ్యాస్ట్రిక్ సమస్య వల్ల నొప్పి వచ్చిందేమోనని గ్యాస్ట్రిక్ సమస్యకు మందులు వాడారు. అయినా ఛాతీనొప్పి తగ్గలేదు. ఇంట్లో అందరం తనకు కరోనా సోకిందేమోనని భయపడ్డాము. మా బావగారు హైదరాబాద్ వెళ్ళి పరీక్షలు చేయించుకున్నారు. ఆ సమయంలో నేను, “బాబా! మా బావగారికి కరోనా లేదని రిపోర్టు రావాలి. అంతా నీ దయ. మేము చాలా ఆందోళనగా ఉన్నాము. మా బావగారికి కరోనా నెగిటివ్ అని రిపోర్టు వస్తే సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాను” అని బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల మా బావగారికి కరోనా నెగిటివ్ అని రిపోర్టు వచ్చింది. ఆ తరువాత, “అంతా నార్మల్ గానే ఉంది, కాకపోతే కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉంది” అని అసలు విషయం చెప్పారు డాక్టర్. బాబా దయవలన కేవలం మందులతోనే ఆ సమస్య పరిష్కారమవుతుందని చెప్పారు. “సాయీ! మీకు శతకోటి ధన్యవాదాలు”.

మరొక అనుభవం: 

ఆగస్టు 15వ తారీఖున మావారికి షుగర్ రీడింగ్ 360 యూనిట్లు ఉంది. అంతకుముందు తనకు షుగర్ నార్మల్ గానే ఉండేది. “ఏమిటి బాబా, షుగర్ ఇంత ఎక్కువగా ఉంది?” అని మేము చాలా ఆందోళనపడ్డాము. ఆరోజు బాగా వర్షం. డాక్టరును సంప్రదించడానికి తెల్లవారుఝామున బస్సుకి ఖమ్మం వెళదామని అనుకున్నాము. కానీ, కరోనా వల్ల బస్సులో ప్రయాణించాలంటే భయమేసింది. “ఇప్పుడు ఏం చేయాలి బాబా? మీరే దారి చూపించండి” అని బాబాను వేడుకున్నాను. అప్పుడు ఉన్నట్టుండి మాకు తెలిసినవాళ్ళకి కారు ఉందని గుర్తొచ్చింది. అయితే వాళ్ళని కారు ఇమ్మని అడగటానికి మేము మొహమాటపడ్డాము. చివరికి మొహమాటంగానే వాళ్ళను కారు అడిగితే వాళ్ళు కారు ఇవ్వటానికి ఒప్పుకున్నారు. వేరే అబ్బాయిని డ్రైవరుగా తీసుకొని ఖమ్మం వెళ్ళి మావారికి షుగర్ టెస్ట్ చేయించాము. “షుగర్ కొంచెం ఎక్కువగా ఉంది, మందులు వేసుకోండి” అని డాక్టర్ మందులు ఇచ్చారు. తరువాత అన్ని పరీక్షలు చేసి, “మరే సమస్యా లేదు” అని చెప్పారు. బాబా దయవల్ల మేమిప్పుడు ఏ ఆందోళనా లేకుండా ఆనందంగా ఉన్నాము.

సాయి రక్షకుడుగా వారి దయ నాపై ఎల్లప్పుడూ చూపుతున్నారు.

ఓం సాయిరామ్!

అఖిలాండకోటి బ్రహ్మాడనాయక రాజాధిరాజ యోగిరాజ శ్రీ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


స్వప్న దర్శనమిచ్చి నాతో ఉన్నానని తెలియజేసిన బాబా

సాయిభక్తురాలు ప్రసన్న తనకు బాబా ప్రసాదించిన స్వప్నానుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

ఓం సాయినాథాయ నమః. సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ నిర్వహించే సాయికి నా నమస్కారం. “సాయీ! మీకు నా కృతజ్ఞతలు. వెంకటదత్తసాయి ప్రేమను పంచుకునే అవకాశాన్ని ఈ బ్లాగ్ ద్వారా మాకు కల్పించినందుకు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆ వెంకటదత్తసాయి సదా రక్షిస్తూ, ఆశీర్వదిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను”. 

కొన్ని రోజుల క్రితం ఈ బ్లాగులో ఒక సాయిభక్తురాలు తనకు కలిగిన అనుభవాన్ని పంచుకున్నారు. తాను బాబా చరిత్ర పారాయణ చేస్తున్న సమయంలో బాబా తనకు స్వప్నదర్శనం ఇచ్చారని ఆమె ఆ అనుభవంలో తెలియజేశారు. అది చదివిన నేను, “నా వెంకటదత్తసాయి నాకు స్వప్నంలో దర్శనమిచ్చి చాలారోజులు అయింద”ని అనుకున్నాను. ఆ తరువాతిరోజు రాత్రి 2 గంటల సమయంలో నా వెంకటదత్తసాయి నాకు స్వప్నంలో దర్శనమిచ్చారు. నేను తరచూ దర్శించుకునే సాయిమందిరంలోని పల్లకీలో ఉండే బాబా ఫోటో ఆ కలలో నాకు చాలాసేపు కనిపించింది. అంతేకాకుండా, ఆ బాబా ఫోటో క్రింద మరో ముగ్గురు వ్యక్తుల ఫోటోలు కూడా కనిపించాయి. అలాగే మరోప్రక్కగా ఒక కాలువ, ఆ కాలువగట్టు మీద ఉన్న కుర్చీలో బాబా ఫోటో, క్రింద భరధ్వాజ మాస్టర్ ఫోటో, ప్రక్కన బాబా చరిత్ర పుస్తకం కనిపించాయి. అక్కడ బాబాకు పూజ చేసినట్టుగా కనిపించింది. భరద్వాజ మాస్టర్ కూడా చాలారోజుల తరువాత నాకు స్వప్నంలో దర్శనమిచ్చారు. ఇంతలో బాబా పల్లకీ ఊరేగింపు మొదలైంది. పల్లకీ మా ఇంటి ముందు నుంచి వెళుతోంది. పల్లకీ వెంట ఉన్నవారిలో ఒకరు, “11 రూపాయలు దక్షిణ ఇవ్వండి” అని నన్ను, మా అక్కను అడిగారు. పల్లకీ మా ఇల్లు దాటి ముందుకు వెళ్లిపోతోంది. దాంతో నేను బాబాకు దక్షిణ ఇవ్వలేనేమో అని బాధ కలిగింది. రెండు ఇళ్ళు దాటినప్పటికీ బాబా మా దక్షిణ స్వీకరించారు. నాకు ఎంతో సంతోషం కలిగింది. అప్పుడే పల్లకీ ప్రక్కనున్న ఒకావిడ నాతో, "బ్యాంకులో ఉన్న మా డబ్బులు పోయాయి” అని అన్నది. మళ్ళీ వెంటనే, “బాబా దయతో డబ్బులు దొరికాయి” అని అన్నది. ఆవిడ ఎందుకలా అన్నదో నాకు అర్థం కాలేదు. ‘వెంకటదత్తసాయిని కలలో చూసి చాలా రోజులైంది’ అని బాధపడినందుకు నాకు వెంటనే స్వప్నంలో దర్శనమిచ్చి తాము నాతో ఉన్నారని తెలియజేశారు బాబా. “మీకు చాలా చాలా ధన్యవాదాలు సాయిభగవాన్”. నాకు బాబా ప్రసాదించిన ప్రేమను మీ అందరితో పంచుకునే అవకాశం ఇచ్చిన సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ వారికి మరోసారి నా ధన్యవాదాలు. బాబా నాకు పంచిన ఆశీస్సులను ఇలాగే ఇంకా మీతో పంచుకుంటాను. వెంకటదత్తసాయికీ జై! సాయినాథ్ మహరాజ్ కీ జై! “ఐ ఆల్వేస్ లవ్ యూ సాయిరాం!”

నాకు కలలో కనిపించిన బాబా ఫోటోను, భరద్వాజ మాస్టర్ ఫోటోను మీరూ చూస్తారని ఈ క్రింద జతపరుస్తున్నాను.

                 



సాయిభక్తి సాధన రహస్యం - సాయి భక్తిపథంలో సాయి మందిరాలు




సాయి భక్తిపథంలో సాయి మందిరాలు

అద్భుతంగా అనంతంగా వృద్ధి చెందుతూ వ్యాపిస్తున్న సాయిభక్తి అనే మహావటవృక్షానికి వేసిన కొమ్మలు రెమ్మలే మనం ఈనాడు చూస్తున్న సాయిమందిరాలు. అయితే, సాయిమందిరాలు కేవలం పూజామందిరాలుగా, భజనకేంద్రాలుగా మాత్రమే కాక, శ్రీసాయిబాబా యే విశిష్ఠ సాంప్రదాయాన్ని ప్రవర్తిల్లజేయడానికి అవతరించారో, ఆ సత్సంప్రదాయానికి పట్టుకొమ్మలు కావాలి. మనకు తోచిన విధంగా మనమే ఏర్పరచుకున్న పూజావిధులు తదితర ‘తంతు’లకన్నా, శ్రీసాయి ఆవిష్కరించిన ఉత్కృష్టమైన ఆధ్యాత్మికసూత్రాలకు సాయిమందిరాలు నెలవులు కావాలి. “శిరిడీలోలాగా మందిరాన్ని ఎలా కట్టాలి? శిరిడీలోలాగా నాలుగు ఆరతులు ఎలా నిర్వహించాలి? శిరిడీలోని బాబావిగ్రహం ‘మాదిరి’ విగ్రహాన్ని ఎలా తయారుచేయించాలి? శిరిడీలో బాబా వెలిగించిన ధుని ‘మాదిరి’ అగ్నిహోత్రాన్ని మన మందిరంలో కూడా ఎలా ప్రతిష్ఠించుకోవాలి?౼ అనే అంశాలకంటే, శిరిడీని అంతటి మహామహిమాన్వితమైన క్షేత్రంగా రూపొందించటానికి కారణమైన బాబా ఆదర్శ జీవితవిధానము, ఆయన మనకందించిన ఆధ్యాత్మికసూత్రాలు, బాబా పాదుకొల్పిన విశిష్ఠ సాంప్రదాయము ప్రాముఖ్యతను సంతరించుకోవాలి. దానికి కావలసిన సాయి అనుగ్రహాన్ని అవగాహనను పెంపొందించుకొనేందుకు మనం యత్నించాలి. “ఇది మా సాయిమందిరం – అది మీ సాయిమందిరం – అది ఫలానావారి సాయిమందిరం” అని కాక, అన్నీ ‘మన సాయి’ మందిరాలేనన్న భావం మనలో బలపడాలి. మందిర నిర్వహణలో ఎవరి సమస్యలు సదుపాయాలు వారికున్నాయి. ‘మాది’ ‘మీది’ అనే హద్దులు తుడిచివేసి అందరూ పరస్పర సహకారంతో ఉద్యమించిననాడు, ఆ ‘సమస్యల’లో ఎక్కువభాగం అసలు ‘సమస్యలుగా’నే మిగలకుండా పోతాయి. ఆ శుభప్రదమైన శోభస్కరమైన పరిణామాన్ని బాబానే కలుగజేయాలి. ఆ అవగాహనతో, బాబా అనుగ్రహం కోసం ప్రార్థించడమే మనమిప్పుడు చేయగలిగింది!

Source: సాయిభక్తి సాధన రహస్యం, రచన: పూజ్యశ్రీ సాయినాథుని శరత్ బాబూజీ.

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo