సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తి సాధన రహస్యం - సాయిభక్తి సంప్రదాయంలో శిరిడీ ఆరతులు



సాయిభక్తి సంప్రదాయంలో శిరిడీ ఆరతులు

శిరిడీ సందర్శించి అక్కడ శ్రీసాయిబాబా సమాధిమందిరంలో నిత్యం జరిగే నాలుగు ఆరతులలో పాల్గొన్న సాయిభక్తులకు, ఆ తరువాత ఎక్కడ ఆ ఆరతులు వింటున్నా పాడుతున్నా మానసికంగా శిరిడీలో వున్న అనుభూతి కలగడం సామాన్య అనుభవం. శిరిడీయాత్ర చేయని సాయిభక్తులకు కూడా ఆ ఆరతుల బాణీలు వింటుంటే వారి హృదయాలలో అవి ఒక చిత్రమైన అనుభూతిని కలిగిస్తాయి. అద్భుతమయిన శ్రీసాయిమహాత్మ్య ప్రాభావం వల్ల బాబా మహాసమాధి చెందిన అచిరకాలంలోనే దేశంలో అసంఖ్యాకంగా సాయి మందిరాలు వెలిసాయి. వాటిలోని చాలా సాయిమందిరాలలో భక్తులు శిరిడీలో మాదిరి నిత్యం నాలుగు ఆరతులు జరుపుకుంటున్నారు. ఎందరో సాయిభక్తులకు శిరిడీ ఆరతులు ‘వేదమంత్రాలవంటివి’. 'శిరిడీ ఆరతులు జరుగని సాయిమందిరాలు అసలు సాయిమందిరాలే కావ'ని మరికొందరి విశ్వాసం. ఏది ఏమైనా శిరిడీ ఆరతులు ఈనాడు సాయిభక్తి సాంప్రదాయంలో ఒక భాగమైనాయి. సాయిసంప్రదాయంలో ఇంత ప్రాముఖ్యాన్ని సంతరించుకొన్న యీ శిరిడీ ఆరతులు శిరిడీలో ఎలా ప్రారంభమయినాయి? వాటి రచయితలెవరు? ఆ ఆరతుల స్థూలస్వరూపమేమి? అవి వెదజల్లే భావసౌరభాల స్వరూపస్వభావాలేమి? మొదలయిన విషయాలు తెలుసుకోవాలనుకోవడం సాయిభక్తులకు సహజం!

మహారాష్ట్రదేశంలో దైవానికి ఆరతులు చేయడం – దక్షిణాదిన నిత్యదీపారాధన చెయ్యడంలాగా – చాలా సామాన్యమైన ఆరాధన విధి. దైవమందిరాలలోనూ, మహాత్ముల సన్నిధిలోనే గాక, ఇండ్లలో కూడా కుటుంబసభ్యులందరూ కలిసి ఆరతులు చేసే పద్ధతి ఈనాటికీ మనం అక్కడ చూడవచ్చు. శ్రీజ్ఞానేశ్వర్ మహరాజ్, సంత్ నామ్ దేవ్, శ్రీతుకారాం మహరాజ్ మొదలయిన పాండురంగభక్తులు ఆవిష్కరించిన యీ (వార్కరీ) సాంప్రదాయం మహారాష్ట్రలో విశేషప్రాచుర్యం పొంది, క్రమేణా సామాన్య ప్రజానీకం యొక్క ఆధ్యాత్మిక జీవనస్రవంతిలో ఒక అంతర్భాగమైంది.

ఈనాడు మనం పాడుకొంటున్న శిరిడీ ఆరతులను స్థూలంగా విశ్లేషిస్తే, నాలుగు ఆరతులలోనూ కలిపి ముప్ఫై ఆరతి గీతాలున్నాయి. వాటిలో 14 తుకారాం మహరాజ్ తదితర సంత్ కవులు రచించిన ఆరతిగీతాలు, అభంగాలు. వాటిలో 5 పాటలు శ్రీతుకారాం మహరాజ్, 2 పాటలు శ్రీనామదేవ్ మహరాజ్, 2 పాటలు సంత్ జానాబాయి రచించినవి. మిగిలిన ఐదింటిలో ఒకటి శ్రీరామజనార్దనస్వామి రచించిన జ్ఞానేశ్వర్ మహరాజ్ ఆరతి కాగా, మరొకటి శ్రీరామేశ్వర్ భట్ రచించిన తుకారాం మహరాజ్ ఆరతి; ఇవిగాక ఒక వేదసూక్తము (మంత్రపుష్పము), రెండు సాంప్రదాయక ప్రార్థనలు ఉన్నాయి. ప్రత్యేకంగా బాబాపై రచింపబడ్డ 16 ఆరతి గీతాలలో 9 పాటలు శ్రీకృష్ణజోగీేశ్వర భీష్మ, 3 పాటలు శ్రీదాసగణు మహరాజ్ రచించగా, శ్రీఉపాసనీమహరాజ్, శ్రీమాధవ అడ్కర్, శ్రీమోహినీరాజ్, శ్రీబి.వి.దేవులు ఒక్కొక్కటి రచించారు. మొత్తం 30 ఆరతిగీతాలలో 25 మరాటీభాషలోను, 3 స్తోత్రాలు సంస్కృతంలోను, 2 పాటలు హిందీలోను వున్నాయి. ఈ విధంగా యీనాడు మనం పాడుకొంటున్న శిరిడీ ఆరతులు వేరువేరు కవులు, వేరువేరు కాలాలలో – సందర్భాలలో, వివిధ భాషలలో రచించిన మధుర భక్తిరసగుళికలు!

          శిరిడీ ఆరతుల్లోని భావసౌందర్యం

సంక్షిప్తంగా ఇదీ, ‘శిరిడీ ఆరతుల’ స్థూలరూపం. ఇక ఆ ‘ఆరతుల’ ప్రాశస్త్యాన్ని, వాటిలో ప్రకటమౌతున్న అద్భుత భావసౌందర్యాన్ని, అర్థగాంభీర్యాన్ని, అవి వెదజల్లుతున్న భక్తిరస భావసౌరభాలను ఆస్వాదించడానికి యత్నిద్దాం!

దేవాలయాలలో సాంప్రదాయక అర్చన విధిననుసరించి జరుపబడే వివిధసేవలలో భాగంగా శిరిడీలోనూ యీ ఆరతులు చెయ్యడం జరుగుతున్నది. శిరిడీలో ప్రతినిత్యం భక్తులు పాడే ఆరతి పాటలను స్థూలంగా నాలుగు భాగాలుగా విభజించవచ్చు. కాకడ (ఉదయ) ఆరతి; మధ్యాహ్నఆరతి; సాయంత్ర ఆరతి; శేజ (రాత్రి) ఆరతి.

కాకడ (ఉదయ) ఆరతి

అర్చన విధిలో భగవంతునికి భక్తులు భక్తిపూర్వకంగా చేసే నిత్యసేవలు సుప్రభాత సేవతో ప్రారంభమౌతాయి. సుప్రభాతం చేయడమంటే దైవాన్ని నిద్ర లేపటమన్న మాట! నవవిధ భక్తులలోని దాస్యభక్తి భావానికనుగుణంగా ఇది ఏర్పడింది. ఈ సుప్రభాత సేవే, శిరిడీ ఆరతుల్లోని ‘కాకడ ఆరతి’. కాకడ ఆరతి, స్థూలంగా – శ్రీసాయినాథుణ్ణి నిద్ర మేల్కొల్పడం! కానీ, నిద్ర, స్వప్నము, మెలకువ, ఈ మూడింటికి ఆధారమైన తురియావస్థకు కూడా అతీతుడై, సదా సర్వజీవ హృదయాలలో ‘ఎఱుక’ రూపంలో ప్రకాశిస్తున్న ఆ యోగనాథునికి నిద్రపోవడమన్నది అసలున్నదా? (బాబా మాటల్లోనే చెప్పాలంటే) “కళ్ళు తెరుచుకొని మెలకువగా నిద్రపోగలిగిన” శ్రీసాయిని మనము నిద్రలేపడమేమిటి? నిజానికి, చాలామంది భావిస్తున్నట్లు, కాకడ ఆరతి బాబాకు మేలుకొలుపు సేవ కాదు! అందుకనే కాకడ ఆరతి గీతాల్లో బాబాను నిద్రలేపడమనే భావం కన్నా “భక్తులను ఆపదలనుండి కాపాడడానికి సదా జాగరూకుడై సావధానుడుగ కూర్చునివున్న” (“అహా సుసమయా సియా గురు ఉఠోనియా బైసలే”...) శ్రీసాయిని దర్శించి స్తుతించడమనే భావమే ప్రధానంగా వ్యక్తమవుతుంది. ఆ సుప్రభాతగీతం బాబాను నిద్రమేల్కొనమని ప్రార్థించదు! “ఓ సద్గురూ! ధ్యాన సమాధినుండి లేచి మమ్ములనుద్ధరించేందుకు మసీదుకు రండి!” (“సమాధి ఉతరోనియా గురుచలా మసీదీ కడే”...) అనే ప్రార్ధిస్తున్నది. అంతేకాదు! 'కాకడ ఆరతి' నిజానికి మేల్కొల్పుపాడుతున్నది బాబాకు కాదు! “ఓ సాధు సజ్జనులారా లేవండి! లేచి మీ హితము చేకూర్చుకొనండి!” (“ఉఠా సాధుసంత సాదా –  ఆపులాలే హిత”) అని భక్తులనే నిద్రలేపుతున్నది. ఏ నిద్రనుండి? మామూలుగ రోజూ మనం పొయ్యే నిద్ర నుండి కాదు! అరిషడ్వర్గాలతో కప్పబడి, ఎఱుకనుండి మరపులోనికి జారిన నిద్ర నుండి! ఆ నిద్ర నుండి మనస్సులను జాగరూకం చేస్తున్నది. ఎలా? “కామ క్రోధాది ప్రవృత్తి గల మనస్సును దీపపు ఒత్తిగా చేసి, వైరాగ్యమనే నేతితో తడిపి, సాయిభక్తి అనే అగ్నితో వెలిగించి” బాబాకు ఆరతి చెయ్యడం ద్వారా ఆత్మతదాకారవృత్తి యనే వెలుగులో సద్గురువు (మన అంతరంగంలో) ప్రకాశిస్తూ దర్శనమిస్తాడని (“కామక్రోధ. ....ప్రకాశ పాడియలా!") ప్రబోధిస్తున్నది. “మాలోని భక్తిభావమే ఆరతి. పంచప్రాణాలతో వెలిగే జీవభావమే కాకడజ్యోతి” అనే భావంతో ఆరతి చెయ్యాలని నిక్కచ్చిగా నిర్దేశిస్తున్నది. అంతేకాదు! ఇంతటి ఉన్నతభావాన్ని హృదయంలో జాగరూకతతో నిలుపుకొని, “ఓ సద్గురూ! నా హృదయమందిరంలో నిలిచి ఈ సమస్త జగత్తూ సద్గురు స్వరూపంగా నాకు భాసించేటట్లు చెయ్యి! ఎప్పుడూ జగత్కళ్యాణ కార్యాలు చెయ్యాలనే సద్బుద్ధిని ప్రసాదించు!” (“గురో వినతి మీకరీ హృదయ మందిరీ యా బసా సమస్త జగ్ హే గురు స్వరూపచీ ఠసో మానసా కరో సతత  సత్కృతీ మతి హిదే జగత్పావనా”) అని సాయిని మనసారా ప్రార్థించి, ఆపై మన నిత్యదైనందిన కార్యాలకు ఉపక్రమించాలి. ఈ ప్రార్థనలో ప్రకటమౌతున్న ఉత్కృష్టభావమే సాయిభక్తులకు పవిత్ర గాయత్రీమంత్రం.

“ఓ సద్గురు సాయిబాబా, ఈ ప్రపంచంలో నీవు తప్ప నాకు ఆశ్రయమిచ్చి రక్షించేవారు లేరు” (“శ్రీసద్గురు బాబా సాయి, తుజవాచుని ఆశ్రయనాహీ భూతలీ...”) అనే ఆరతి గీతం అనన్య శరణాగతికి సోపానమయితే, “నేను నీ మసీదును ఊడ్చే చీపురున”ని (“అపనే మసీద్ కా ఝాడూ గణూహై”) శ్రీదాసగణు పలికిన పలుకుల్లోని భావం దాస్యభక్తి భావానికి పరాకాష్ట. “జయామనీ జైసాభావ తయాతైసానుభావ” అనే ఆరతిపాట 'ఎవరి భావం ఎట్లా వుంటే వారు పొందే అనుభవం కూడా అట్లాగే వుంటుంది' అంటూ, పైన చెప్పిన భావాన్ని హృదయంలో నిలుపుకోకుండా, కేవలం ఐదు ఒత్తుల దీపాన్ని యాంత్రికంగ త్రిప్పుతూ వల్లెవేతగా ఆరతిపాటలు పాడటం వ్యర్థమని కూడా హెచ్చరిస్తున్నది!

మధ్యాహ్న-సాయంత్ర ఆరతులు

“స్థిరమైన మనస్సుతో, గంభీరమైన శ్రీసాయితత్త్వంపై ధ్యానం చేద్దాం!” (“కరూనియా స్థిరమన – పాహు గంభీర హేధ్యాన....”) అంటూ సాయిబంధువులను “లెండి, రండి, రారండి!” (“ఉఠా ఉఠాహో బాన్ ధవ”) అనే ఆహ్వానంతో ప్రబోధిస్తూ ప్రారంభమవుతున్నది యీ ఆరతి. అలా సాయిపాదాల వద్ద చేరిన ‘జడచిత్తులైన’ భక్తులను 'సదా సాయి పాదధూళిలో విశ్రమించేట్లు అనుగ్రహించమని, కామవికారాలను దహింపచేయమని, వారి సర్వస్వం సాయి పదసేవకే సద్వినియోగమయ్యేటట్లు చేసి సన్మార్గంలో నడిపించమ'ని, ‘దేవాధిదేవుడు’, ‘కలియుగ అవతారమూర్తి’, ‘సగుణబ్రహ్మరూపుడు’ అయిన సాయినాథునికి చేసే ప్రార్థన౼ రెండవ ఆరతి గీతం. ఈ ఆరతి గీతం బాబాను సర్వజీవసౌఖ్యప్రదాతగా దర్శిస్తున్నది. అయితే బాబా అనుగ్రహించే సుఖం ఎటువంటిది? సామాన్య సుఖం కాదది! అది తరుగులేని ఆనందరూపమైన – అసలైన ‘సుఖము’ (“నిజసూఖ”). పై గీతం సర్వజీవులకు ఆత్మసౌఖ్యాన్ని ప్రసాదించే శ్రీసాయియొక్క ‘సమర్థ సద్గురు’ తత్త్వాన్ని వర్ణిస్తే, ఆ తరువాత గీతం సామాజికంగా బాబా నిర్వహిస్తున్న ‘కలియుగ అవతార’ కార్యాన్ని వివరిస్తున్నది. తమ ఆదర్శ జీవిత విధానం ద్వారా, అసంఖ్యాకమైన అద్భుత లీలలద్వారా, నాస్తికులను కూడా సాధకులుగా మార్చగలగడమేగాక ('అవతరసే తూయేతా ధర్మాన్ తే గ్లాని, నాస్తికా తావీతూ లావిసి నిజభజనీ, దావిసి నానాలీలా అసంఖ్యారూపాని...'), శ్రీసాయి ప్రధాన అవతార రహస్యాన్ని యీ గీతం ఇలా వర్ణిస్తున్నది: 'బాబా,  నీవు మోమిన్ వంశంలో జన్మించి ముసల్మాను రూపంలో దర్శనమిచ్చి మూఢులను ఉద్ధరిస్తున్నావు. ద్వైతభావము వీడిన నీకు హిందూ-ముస్లిం భేదము లేదు. మానవ రూపంలో అవతరించి, రెండు మతాల వారిని సమానంగా ఆదరించి వారిచే (మతభేదాల కతీతమైన) సర్వవ్యాప్తమయిన ఆత్మతత్త్వాన్ని దర్శింపచేస్తున్నావు!”

అంతేకాదు! "యవనస్వరూపీఏక్యా దర్శన త్వాధిదలే......’, ‘మోమిన వంశి జన్ముని లోక తారియల...’ అంటూ సంకుచిత మతమౌఢ్యంతో, సంకుల కులతత్త్వంతో కుళ్ళిపోతున్న సమాజానికి శ్రీసాయి ప్రసాదించిన ప్రబోధం ఈ కలియుగంలో మానవాళికందిన ‘మహితగీత’. ఈ ఆరతి గీతంలో ఇంకో విశేషమున్నది. హైందవ విధిలో శ్రీసాయి మహిమకు హారతి పాడుతున్న ఈ గీతం బాబాను "మోమినవంశజుడుగ" "యవన(ముస్లిం)స్వరూపి"గా నిష్కపటంగా కీర్తిస్తున్నది! ఇది శ్రీసాయి యొక్క మతాతీత మహావృక్షానికి కాచిన ఒక మధురఫలం! అన్యచింతనలు లేకుండా మనస్సు ఒకే రూపం ధరించడం ఆధ్యాత్మిక సాధనలో (సగుణోపాసనలో) ప్రాధమిక నియమం. సాధన విషయానికొస్తే, సాధకుని ఇష్టదైవం (ఉపాసనాదైవం) తప్ప ఇతర (అన్య) దేవతామూర్తుల చింతన కూడా ఉపాసనకు విక్షేపమే! సాధకునిలో తన ఉపాసనాదైవం పట్ల ఎంతగా ‘అనన్య’ ప్రేమ, భక్తి, శరణాగతి కలుగుతుందో, అంతగా అతడు ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి సాధించగలడు. శ్రీసాయిని (ఇష్ట) ఉపాసనాదైవంగా ఎంచుకున్న సాయిభక్తులకు శ్రీసాయియే సకల దేవతాస్వరూపుడు, సకల సాధుస్వరూపుడు, సకల ధర్మస్వరూపుడు. వారికి శ్రీసాయియే పరదైవతము. ఈ దృష్ట్యా, ఉపాసనా తత్పరులైన సాయిభక్తులకు – అనన్యదేవతారాధన నిషిద్ధమే! (అయితే- ముక్కోటి దేవతలకు మూడు కోట్ల దణ్ణాలు పెడుతూ, బాబాను కూడా ఆ ముక్కోటి దేవుళ్ళలో ఒకడుగా భావించే (లౌక్య) భక్తులకు ఈ సూత్రం వర్తించదు!) ఈ కారణంగా ఆధ్యాత్మిక సాధన సిద్ధి గమ్యం మొదలయిన వాటిపట్ల ఆసక్తి, దీక్ష గల సాయిభక్తులకు మాత్రం అది ఎప్పటికైనా అనుల్లంఘనీయం. తమ యోగక్షేమాలు సంపూర్ణంగా వహించి తమను సదా కంటికి రెప్పవలె కాపాడే శ్రీసాయివంటి ‘సమర్థుడై’న సద్గురువు లభించాక కూడా సాయిభక్తులు అన్య(అనేక) దేవతారాధనలు  వ్రతాలు అభిషేకాలు గ్రహశాంతులు వాస్తుశాంతులు మొదలయిన వాటికి పూనుకోవడం ప్రోత్సహించడం కేవలం అవివేకం.  ఇది సాయిభక్తి ఉద్యమానికి పట్టిన ‘గ్రహచారం’. శ్రీసాయి చూపిన ‘శుభ్రమార్గ’ విస్తరణకు అపచారం.

అంతేకాక వివిధ దేవతామూర్తుల ఉపాసన ‘సాధన’లో ప్రారంభదశ మాత్రమేనని, ఆ ఉపాసనలన్నీ శ్రీసాయి వంటి సద్గురుమూర్తిని చూపడానికి కేవలం ‘నిమిత్తమాత్రాలని’ మహాత్ములు స్పష్టం చేస్తున్నారు. ఆయా దేవతామూర్తులను ఉపాసించే భక్తులకు వారి ఇష్టదేవతామూర్తుల రూపంలో బాబా వారికి దర్శనమివ్వడంలోని పరమార్థం ఇదే! ఈ ఉపాసనాసూత్రాన్నే రమణీయంగా ఉద్ఘాటిస్తున్నది, “శిరిడీ మాఝే పండరిపూర, సాయిబాబా రమావర.....” అని శ్రీదాసగణు మహరాజ్ రచించిన ఆరతిగీతం. ఈ ఆరతిపాట పై సూత్రాన్ని భక్తిభావయుతంగా చెబితే, శ్రీఉపాసనీమహరాజ్  రచించిన “సదాసత్ స్వరూపం..” అని మొదలయ్యే ‘శ్రీసాయిమహిమ్న స్తోత్రం’ భక్తిజ్ఞానాలనే దీపాల వెలుగులో శ్రీసాయి మహిమకు ఆరతి పడుతున్నది. శ్రీసాయిమహిమ్నస్తోత్రం లోని ‘మనోవాగతీతం మునిర్ ధ్యానగమ్యమ్’‘అహంభావహీనం ప్రసన్నాత్మభావం’, ‘మాయయోపహత చిత్తశుద్ధయే’, ‘సంసార జన్య దురితౌఘవినిర్గతాస్తే’, ‘కైవల్య థామపరమం సమవాప్నువంతి’ మొదలయిన శ్రీసాయి శుద్ధజ్ఞాన స్థితిని తెలిపే వాక్యాలు బాబా సద్గురుతత్త్వాన్ని వివరిస్తే, ‘జగత్సంభవ స్థాన సంహారహేతుం’, ‘స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం’, ‘కలౌ సంభవంతం’, ‘అనేకాశ్రుతా తర్క్యలీలా విలాసైః’ ‘భక్తిభద్రప్రదంతం’, ‘అఖిల నృణాం సర్వార్థసిద్ధిప్రద’ మొదలయిన సిద్ధి వాక్యాలు బాబాలోని సిద్ధత్వాన్ని ఈశ్వరతత్వాన్ని వర్ణిస్తున్నాయి.  శ్రీసాయిని ‘ఉపాసనా దైవతంగా’, భక్తులకు ‘భుక్తి  ముక్తి ప్రదాతగా’ ఈ స్తోత్రం ప్రకటిస్తున్నది. బాబాలోని ఈ జ్ఞానసిద్ధత్వాన్ని అమోఘంగా వర్ణిస్తున్న ఈ స్తోత్రం యొక్క మకుటం ‘నమామీశ్వరం సద్గురుం సాయినాథం’ అన్నది సాయితత్త్వాన్ని వివరించే అన్ని స్తోత్రాలకు, ఆరతులకు మకుటాయమానం. అంతేకాదు! శ్రీఉపాసనీ మహరాజ్ ఆధ్యాత్మిక సాధన అత్యున్నత స్థితిలోనున్నప్పుడ శ్రీసాయి అనుగ్రహవిశేషంగా తన ధ్యాననిష్ఠలో దర్శించి, సాయిభక్తులకు అందించిన మహామంత్రమిది!

భోజనం చేసేముందు, తరువాత, నిద్రపోయేముందు, లేచిన తరువాత, విభూతి ధరించేప్పుడు, జంధ్యం వేసుకొనేటప్పుడు,.. అలా, మనం చేసే అన్ని పనులకు ఏ మంత్రం పఠించాలో, ఏ భావం మనస్సులో ధరించాలో చెప్పే మంత్రాలు తంత్రాలు మనకు కోకొల్లలుగా వున్నాయి.  కాని నమస్కారం చేసేటప్పుడు హృదయగతమైన ఏ ‘భావసూత్రం’ మన రెండు చేతులను నమస్కారంగా కట్టిపడేయాలో చెప్పే స్తోత్రాలు మాత్రం అరుదు. ఆ లోటును ఏ లోటూలేకుండా తీరుస్తున్నది శిరిడీ ఆరతుల్లోని ‘నమస్కారాష్టకం’. ఈ 'అష్టకం' బాబాకు నమస్కారం ఏ భావంతో చెయ్యాలో చెప్పడమే కాదు, మనచే అప్రయత్నంగా చేయిస్తుంది కూడా! అలా మన మనోకరణాలను కట్టి పడేసిన భక్తిభావాన్ని దేహంలోని అణువణువుకూ వ్యాపింపచేసి, తన ఐదు ద్విపదలను మనలోని ఐదుప్రాణాలతో ‘లయింప’చేసి నృత్యం చేయిస్తుంది, “ఐసా యేయీబా! సాయిదిగంబరా!” అన్న ప్రార్థనాగీతం. దైనందిన జీవితంలోని వివిధ సంబంధాల రుసరుసలు, బుసబుసలతో విసిగి వేసారిన మన మనస్సులను సాయంత్రమయ్యేసరికి, శ్రీసాయి ప్రేమామృతధారలతో స్నానం చేయించి ఎవ్వరి యెడల ద్వేషము, దేనియందు కోరిక హృదయంలో లేకుండా, 'సదా సాయినాథుని ధ్యానము జరుగుగాక! సద్గురు పాదములయందు భక్తి స్థిరముగా వుండుగాక! జగమంతా శ్రీసాయిరూపంగా గోచరించుగాక!'  (“కుణాచిహి ఘృణా... దృశ్యబాబా దిశో...") అనే కమ్మని  ‘సంకల్ప’ సంగీతంతో, అనన్య ‘శరణాగతి అనే పట్టుపాన్పుపై’ సేదతీరేట్లు చేస్తుంది – సాయంసంధ్యారతిలోని ‘రుసోమమ’.

శేజ్ ఆరతి

బాబాకు చేసే పవళింపు సేవలో భాగం శేజారతి. బాబా నిద్ర ఎంత అసాధారణమైందో, ఆయన శయ్య (పడక) కూడా అంత అలౌకికమైనదే! 'నవవిధ భక్తులే మెట్లుగా కలిగి, నిశ్చలభక్తి అనే మంచంపైన (భక్తులు అజ్ఞానంలో చేసే అపరాధాలను దయతో క్షమించే) క్షమాగుణమనే చక్కని పరుపుపై' బాబా శయనిస్తారు. ఆ శయ్య 'సద్భావాలనే పువ్వులతో అలంకరించబడి వుంది. బాబా యొక్క శయ్యామందిరంలో జ్ఞానమనే మణిదీపం వెలుగుతున్నది. ఆయన ఏకాంత సమాధికి ఏ మాత్రం భంగం రాకుండా ద్వైతభావమనే ఆ శయ్యా మందిరపు తలుపులు మూసి బిగించబడ్డాయి...'

అలాంటి శయ్యపై, “బాబా, ఇక ఏకాంతంగా చిన్మయమైన స్వసుఖ సమాధిలో నిద్రించండి!” (“ఆతా స్వామీ సుఖేనిద్రా”) అని భక్తులు ప్రార్థిస్తున్నారు. భక్తపాలన కొరకు “ఓ సద్గురూ! ధ్యానసమాధినుండి లేచి మమ్ములనుద్ధరించండి!” (“సమాధి ఉతరోనియాగురు...”) అని ఉదయమే సుప్రభాత గీతమాలపించిన భక్తులు, తాము నిద్రకుపక్రమించబోయే ముందు బాబా అనుజ్ఞఆశీర్వాదప్రసాదాలకై అర్థిస్తూ(“ఆజ్ఞస్తవహా ఆశీప్రసాద...”), తిరిగి బాబాను స్వసుఖసమాధిలో ఏకాంతంగా విశ్రమించమని ప్రార్థిస్తున్నారు! ఆ ప్రార్థన యొక్క ఆర్ద్రతతో మేను వాల్చిన భక్తులకు ‘సాయిస్మరణ’ అనే ‘మరపులేని నిద్ర’ లోనికి సునాయాసంగా జారుకొనేట్లు జోలపాట పాడుతున్నది యీ శేజారతి! ఇక 'ఓవాళూ ఆరతి...' అనే ఆరతి గీతం, ఋగ్వేదంలోని ‘నాసదీ సూక్తం’, ‘పురుషసూక్తం’ లోని కొన్ని ఋక్కుల సారం. ఇప్పటివరకు ‘శిరిడీ ఆరతుల’ లోని భావసౌందర్యాన్ని క్లుప్తంగా మాత్రమే సమీక్షించుకొన్నాం. ఆ (మరాటీ) ఆరతులలోని ప్రతివాక్యానికి క్షుణ్ణంగా అర్థం తెలుసుకొని పరిశీలనతో చింతన చేస్తే, ఇంకా ఎన్నో అమూల్యమైన ఆధ్యాత్మిక రహస్యాలు మనకు గోచరిస్తాయి.

ఏ సాహిత్యానికైనా భాష దేహంవంటిదైతే, భావం ఆత్మవంటిది. భావరహితమైన (అర్థం తెలియని) శబ్దసముదాయం నిర్జీవ కళేబరం వంటిది. కేవలం యాంత్రికంగా చేసే మంత్రాలు స్తోత్రాలు ఆరతులవల్ల భావప్రకంపనలకు కేంద్రమయిన మన హృదయాలు స్పందించవు. హృదయస్పందన లేని పూజ ఆత్మోన్నతిని కలిగించలేదు. అందుకే “జ్ఞాత్వా కర్మాణి కుర్వీత” అంటే, “చేసే పూజకు, చెప్పే మంత్రానికి అర్థం తెలుసుకొని చెయ్యి!” అని వేదం ఘోషిస్తున్నది.

“మంత్రోహి భావేన యుతో ఫలప్రదః౹
మౌర్వాసు సజ్జీకృత బాణవద్ధృవం౹౹
భావేన హీనస్తు వినిష్ఫలో భవేత్ ౹
కీరస్య వాగీరత రామ శబ్దవత్!!”

ఏ మంత్రాన్నయినా అర్థం తెలుసుకొని పునఃశ్చరణ చేస్తేగాని ఫలప్రదం కాదు. భావయుతమైనప్పుడు మంత్రం చక్కగా సంధించిన బాణంలా లక్ష్యాన్ని చేరుతుంది. భావహీనమైన మంత్రం నిష్ఫలం. చిలక ఎన్నిసార్లు ‘రామ’ శబ్దాన్ని పలికినా అది వ్యర్థమే కదా?” అని శాస్త్రాలు ఉగ్గడిస్తున్నాయి. మంత్రజపమైనా భావహీనంగా చేస్తే ఫలితం సున్న అని ఆగమాలు నిర్దేశిస్తుండగా, ఇక ఆరతుల వంటి ప్రార్థనాగీతాల విషయం చెప్పాలా? ‘అనే’వాడికి, ‘వినే’వాడికి అర్థం తెలియని శబ్దాడంబరం కేవలం చిలకపలుకుల కంఠశోష; యోగి వేమన మాటల్లో చెప్పాలంటే అవి – వొట్టి ‘వెర్రికూతలు’! హృదయగతమైనపుడే ఏ ప్రార్థనైనా ఫలిస్తుంది. మనం వల్లించే మంత్రాలకు, శ్లోకాలకు, స్తోత్రాలకు, ఆరతిగీతాలకు సరైన అర్థం తెలిసినపుడే అవి మన హృదయాలలో ఆర్ద్రతను కలిగించగలవు. ఆర్ద్రత లేకుంటే అది ప్రార్థనే కాదు!

మొత్తం శిరిడీ ఆరతుల యొక్క సవివరమైన అర్థతాత్పర్యవిశేషాలు శ్రీబాబూజీ రచించిన ‘Arati Sai baba (మూలము-ఆంగ్లానువాదము-వ్యాఖ్యానము) అన్న (ఆంగ్ల) గ్రంథంలో చూడగలరు. ఆసక్తి గల భక్తులకోసం ఆ ఆంగ్ల గ్రంథం యొక్క లింక్ దిగువ ఇవ్వడమైనది.


 ౼ పబ్లిషర్స్.

Source: సాయిభక్తి సాధన రహస్యం, రచన: పూజ్యశ్రీ సాయినాథుని శరత్ బాబూజీ.

4 comments:

  1. om sai ram it is nice to sing babas haratis

    ReplyDelete
  2. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  3. ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo