- మొట్టమొదటి శిరిడీ దర్శనం
సాయిభక్తురాలు జ్యోతి తన మొదటి శిరిడీ దర్శనానుభవాలను ఇలా పంచుకుంటున్నారు:
సాయిరామ్! సాయి బిడ్డలందరికీ నమస్కారములు. నేను 1979లో పుట్టాను. మూడేళ్ళ వయస్సులో నేను మా ఇంటికి ఎదురుగా జరుగుతుండే సత్సంగం ద్వారా బాబాకి ఆకర్షితురాలినయ్యాను. ఆ వయసులో బాబా వైపుకి మళ్ళిన నా దృష్టి ఇంకే దేవతల వైపుకి మళ్లలేదు. నాకు దైవం అంటే బాబానే. బాబా కన్నా ఎక్కువగా నా ఆలోచనల్లో ఎవ్వరూ ఉండరు. బాధ కలిగినా, సంతోషం కలిగినా నేను ఆయనతోనే చెప్పుకుంటాను. తల వంచాల్సి వస్తే అది నా సాయి ముందే వంచుతాను, ఇతరుల ముందు కాదు. కన్నీరు కారిస్తే అది నా బాబా ముందే కార్చాలిగానీ, ఇంకొకరి దృష్టిలో ఒక్క కన్నీటి బొట్టైనా కనపడకూడదు. ఏ స్థితిలో అయినా అలా జరగడానికి కూడా నేను ఇష్టపడను. ఇంతవరకూ నా జీవితంలో అటువంటి సందర్భాన్ని బాబా కల్పించలేదు. ఇకపై ఇవ్వడు కూడా. నా అవసరాలన్నీ నా తండ్రి సాయి కన్నతల్లి కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు. అమ్మ అయినా అడగందే అన్నం పెట్టదేమోగానీ మన బాబా మనకోసం అన్నీ ముందుగానే సిద్ధం చేసి పెడతారు. జీవితంలో మనకేది అవసరమో, శ్రేయస్కరమో దానిని తండ్రి తప్పకుండా ఇస్తాడు. అనుగ్రహం కోసం దేవతలనైనా ఆరాధించాలేమోగానీ మన సద్గురు సాయి తండ్రి మాత్రం తలచినంతనే పలుకుతాడు, అవసరమైతే ప్రత్యక్షమవుతాడు కూడా. ఎంతని వర్ణించను సాయి గొప్పతనాన్ని? అందుకు ఎన్ని జన్మలైనా సరిపోవు. సాయిబాబా అంటే సాయిబాబానే. ఆయనకెవరూ సాటిరారు. ఇక నా మొదటి శిరిడీ దర్శనం గురించి మీతో పంచుకుంటాను.
2011లో మా అమ్మ చనిపోయింది. ఆ తర్వాత శిరిడీ వెళ్లి బాబా ఆశీర్వాదం పొందాలని నాకు బలంగా అనిపించి, "బాబా! మీరు నన్ను శిరిడీకి రప్పించుకోండి" అని బాబాని అడిగాను. నన్ను ఎంతగానో ప్రేమించే బాబా నా కోరిక మన్నించకుండా ఉంటారా? 2012లో మా అత్తమామల ద్వారా నా శిరిడీ ప్రయాణానికి ఏర్పాటు చేశారు. 'అడిగినంతనే తమ దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు నా బాబా' అని నేను చాలా సంతోషించాను. ఇక ఎప్పుడెప్పుడు శిరిడీ ప్రయాణమవుతానా అని ఎదురుచూస్తూ, క్షణమొక యుగంలా రోజులు గడిపాను. ఆరోజు రానే వచ్చింది. బాబాకు ఏమైనా తీసుకొని వెళదామని నాకు తెలిసినంతలో కొన్ని తినుబండారాలు ఇంట్లో తయారుచేశాను. బాబా కోసమని ఒక ప్యాకెట్టు, మేము తినడానికని ఒక ప్యాకెట్టు వేర్వేరుగా సిద్ధం చేశాను. అయితే మరుసటిరోజు మధ్యాహ్నం ప్రయాణమనగా ఆ రాత్రి నుంచి నాకు ఒకటే కడుపునొప్పి, రక్తవిరోచనాలు కూడా. రాత్రంతా నిద్రలేదు. ప్రతిక్షణం బాత్రూం వచ్చినట్టే అనిపిస్తూ చాలా బాధపడ్డాను. ఎప్పుడూ ఎరుగని రక్తవిరోచనాలతో తెల్లవారేసరికి చాలా నీరసించిపోయాను. నా పరిస్థితి చూసి నా భర్త, "నీ ఆరోగ్యం ఏమీ బాగాలేదు. శిరిడీకి మరోసారి ఎప్పుడైనా వెళ్ళవచ్చు. టికెట్ వేస్ట్ అయితే కానీలే" అన్నారు. నేను మావారితో, "శిరిడీ వెళ్లాలని ఎంతగానో నిరీక్షించిన నేను బాబా ఇచ్చిన అవకాశాన్ని ఎలా వదులుకుంటాను? శిరిడీలో చావనైనా చస్తాను కానీ శిరిడి వెళ్ళకుండా మాత్రం ఉండను" అని చెప్పాను. ఉదయమంతా నా పరిస్థితి అలానే ఉంది. ఇంకో గంటలో ప్రయాణం కావాల్సి ఉండగా అప్పుడు నేను, "బాబా! నేను డాక్టర్ దగ్గరకు వెళ్ళొస్తాను. ప్రయాణంలో ఎటువంటి కష్టం కలగకుండా మీరే చూసుకోవాలి" అని బాబాతో చెప్పుకొని, డాక్టర్ దగ్గరకు వెళ్ళాను. డాక్టర్ టాబ్లెట్స్ ఇచ్చారు. అప్పుడు నేను డాక్టరుతో, "నేను శిరిడీ వెళ్తున్నాను. ప్రయాణంలో ఏ ఇబ్బందీ లేకుండా మంచి మందులు ఇవ్వండి" అని అన్నాను. దానికి డాక్టర్, "ఇంత బలహీనంగా ఉన్నావు. కడుపునొప్పి కూడా ఎక్కువగా ఉంది. ఈ స్థితిలో ప్రయాణమవడం మంచిది కాదు. అందులోనూ శిరిడీ ఏమీ దగ్గర కాదు, చాలా దూరం కదా!" అని అన్నారు. అవేమీ పట్టించుకొనే స్థితిలో లేని నేను బాబా మీద భారం వేసి ప్రయాణమయ్యాను. నిలబడడానికి శక్తి కూడా లేని నేను నా కూతుర్ని తోడుగా తీసుకొని ఎలాగో ఒకలాగా ట్రైన్ ఎక్కాను. తీరా ట్రైనులో కూర్చున్నాక శిరిడీలో దీపాలు వెలిగించడానికి, బాబాకు ఒక లేఖ సమర్పించుకోవడానికి అవసరమైన వాటిని మర్చిపోయానని గుర్తొచ్చింది. నిజానికి వాటి గురించి ముందుగా ప్రణాళిక చేసుకొని అన్నీ సిద్ధంగా పెట్టుకున్నాను. కానీ ఆరోగ్యం బాగాలేని కారణంగా ఆ సంగతే మర్చిపోయాను. ఆ విషయం మా అత్తగారితో చెప్పి, ఒత్తులు, నెయ్యి, ప్రమిదలు మర్చిపోయానని చెప్పుకొని శిరిడీ చేరుకొనేవరకూ బాధపడుతూనే ఉన్నాను. ఎందుకంటే, శిరిడీ మొదటిసారి వెళ్తుండటంతో అక్కడ దీపాలు పెట్టడం గురించి, వాటికి అవసరమయ్యేవి ఎక్కడ దొరుకుతాయో తెలియదు.
అదలా ఉంచితే, నేను శిరిడీలో బాబాను తొలిసారి దర్శించుకోబోతున్నానని మనసులో ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ, "బాబా! మీరు నడయాడిన పుణ్యభూమి శిరిడీలో మొదటిసారి అడుగుపెడుతున్నాను. అమ్మ పోయింది. కాబట్టి ఇక మీ శిరిడియే నాకు పుట్టిల్లు, మీరే నాకు తల్లి. దయచేసి మీ ప్రేమను నాకు పంచండి సాయి. నా ఆరోగ్యాన్ని బాగా చూడండి, శిరిడీలో నేను ఏ రకంగా ఇబ్బందిపడకుండా సంతోషంగా ఉండేలా అనుగ్రహించండి. మీ ఆశీస్సులతో క్షేమంగా తిరిగి ఇంటికి చేరుకోవాలి" అని బాబాని వేడుకున్నాను. ట్రైన్లో ఏ ఆహారం తీసుకోకుండా కేవలం నీళ్లు మాత్రమే త్రాగి టాబ్లెట్ వేసుకున్నాను. ఉదయం లేచేసరికి బ్రష్ చేసుకోడానికి కూడా ఏ మాత్రం శక్తిలేదు. అయినా 'బాబా ఉన్నారు, ఆయన చూసుకుంటారు' అన్న మొండి ధైర్యం. శిరిడీ వెళ్తున్నానన్న సంతోషం ముందు నాకున్న నీరసం నాకు కనిపించలేదు. అంతలో శిరిడీ రానే వచ్చింది.
శిరిడీ నేలపై కాలు పెట్టగానే ఎంతో శక్తి వచ్చినట్లు అనిపించింది. 'బాబా దగ్గరకు వచ్చాము. మా అమ్మ దగ్గరకు వచ్చాను. ఎప్పుడెప్పుడు బాబా దర్శనం చేసుకుందామా?" అన్న ఆలోచనలతో నాలో కొత్త శక్తి పుంజుకుంది. ఆ సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. లాడ్జిలో రూమ్ తీసుకొని, స్నానాలు చేసి అందరమూ దర్శనానికి వెళ్ళాము. ముందుగా గురుస్థాన్‌కు వెళ్ళాము. అక్కడికి వెళ్ళగానే అక్కడున్న పూజారి అంతమంది జనంలో నన్ను పిలిచి బాబా పాదాలపై ఉన్న పూలమాల తీసి నాకిచ్చారు. బాబా ఆశీర్వాదానికి ఆనందంతో పొంగిపోయాను.
తర్వాత సమాధిమందిరంలోకి వెళ్ళాము. నాతోపాటు బాబా కోసం తెచ్చిన తినుబండారాల పార్సిల్ తీసుకెళ్ళాను. దాన్ని ఒక బ్లూ కలర్ బ్యాగులో పెట్టి, దానిపై మా అడ్రస్ కూడా రాసిపెట్టాను. నేను క్యూలో నడుస్తూ, "బాబా! ఇది మీరు స్వీకరించాలి. మీరే తీసుకున్నారన్న ఋజువు కూడా నాకు కావాలి" అని బాబాకు చెప్పుకొని ఆయన్ని స్మరిస్తూ బాబా పాదాల దగ్గరకు చేరుకున్నాను. అక్కడ పూజారులు భక్తులిస్తున్న ప్రసాదాలు తీసుకొని, వాటిని బాబాకు తాకించి, మళ్ళీ ఎవరివి వారికి తిరిగి ఇస్తున్నారు. అది చూసి, నేనిచ్చే ప్రసాదాన్ని కూడా నాకు తిరిగి ఇస్తారని భయమేసింది. దాంతో నేను వాటిని బాబా తీసుకోవాలనే ఉద్దేశ్యంతో వాళ్ల చేతికి ఇవ్వకుండా బాబా పాదాల దగ్గరకు తోసేశాను. తరువాత వాళ్ళెక్కడ నన్ను పిలిచి నా ప్యాకెట్ నాకు తిరిగి ఇస్తారోనని పాపను తీసుకుని గబగబా బయటికి వచ్చేశాను. కానీ, "బాబా తీసుకున్నారో లేదో? వేరే వాళ్ళకేమైనా ఇచ్చారేమో!" అని ఆలోచించుకుంటూ వచ్చిపోయే జనాన్ని చూస్తూ నిలబడ్డాను. కొద్దిసేపటికి మా అత్త, మామ బయటికి వచ్చారు. వాళ్ళతో మాట్లాడుతూ అక్కడే నిలబడి ఉన్నాను. అంతలో ఎరుపురంగు దుస్తులు ధరించిన సమాధిమందిరంలోని పూజారి నా ముందునుంచి వెళుతూ కనపడ్డారు. వారి చేతిలో నేను బాబాకు సమర్పించిన ప్యాకెట్ ఉంది. ఇక చూడండి నా ఆనందం! "బాబా! నా ప్రసాదం మీరు స్వీకరించారని నాకు తెలుస్తోంది. ఖచ్చితంగా మీరు స్వీకరించారు" అనుకుంటూ సమాధిమందిరంలో అర్చకులు ఎందరు ఉన్నారని చూశాను. నేను దర్శనానికి వెళ్లినప్పుడు నలుగురు ఉన్నారు. నేను చూస్తున్నప్పుడు కూడా నలుగురే ఉన్నారు. మరి ఆ వ్యక్తి బాబా కాక మరెవరు చెప్పండి! ఆనందంతో నా ప్రక్కన ఉన్నవాళ్లతో, "చూడండి.. చూడండి.. బాబా నా ప్రసాదం స్వీకరించారు. దాన్ని తీసుకుని వెళుతున్నారు. ఆయన చేతిలో ఉన్న బ్యాగుపై మా ఆడ్రస్ కూడా ఉంది, చూడండి" అని చెప్పాను. వాళ్ళకు ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. అలాగే చూస్తూ ఉండిపోయారు. ఇంక నా సంతోషం ఎలా ఉంటుంది మీరే చెప్పండి. బాబా నాపై ఎంత ఆప్యాయత కనబరుస్తున్నారో అని మురిసిపోయాను.
తరువాత ఎంతో సంతోషంతో లెండీబాగ్‌లో అడుగుపెట్టాను. నా వెంట మా అత్తగారు, నా కూతురు కూడా ఉన్నారు. లెండీలోకి అడుగుపెడుతూనే దీపాల గురించి నా మదిలో ఆలోచనలు మొదలయ్యాయి. కానీ ఏం చేయను? బాబా ఆశీర్వాదం లభించిందిలే అని మనసును సమాధానపరుచుకొని లెండీవనమంతా చూసుకొని బాబా నాటిన వేప, రావి చెట్ల దగ్గరకు వెళ్ళాము. దీపాలు పెట్టాలన్న నా కోరికను నెరవేర్చడానికి బాబా అక్కడ ఏర్పాటు చేసి ఉండటం చూసి నాకెంత సంతోషం కలిగిందో మాటల్లో చెప్పలేను. 'నా సాయి తండ్రి ఎంతలా నావెంట ఉంటున్నారో కదా!' అని అనుకున్నాను. అసలు విషయమేమిటంటే, అక్కడ పిండితో తయారుచేసిన రెండు ప్రమిదలు, వాటిలో ఒత్తులు వేసి ఉన్నాయి. నేను ఆశ్చర్యంగా వాటివైపు చూస్తూ మా అత్తగారితో, "చూడండి! బాబా దీపాలు వెలిగించే అవకాశం నాకిచ్చారు. బాబాకు ఎంత కరుణ! తన బిడ్డలు కోరుకున్న కోరికలను ఆయన సదా నెరవేరుస్తుంటారు" అని అంటూ బహుశా ఎవరైనా వాటినక్కడ పెట్టి నూనె తేవడానికి వెళ్ళారేమో అనుకున్నాను. అక్కడే పది నిమిషాల పాటు ఎదురుచూస్తూ నిలబడ్డాను. కానీ ఎవరూ రాలేదు. మనసులో దీపాలు ఎప్పుడు వెలిగిస్తానా అని ఎంతో ఆత్రంగా ఉంది. బాబా ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని వదులుకోవాలని అనిపించలేదు. ఇంక ఎదురు చూడలేకపోయాను. అయితే నూనె లేదు. నూనె తేవడానికి వెళితే, 'తిరిగి వచ్చేలోపు ఆ ప్రమిదలు కనపడకపోతే?' అనే భయం. ప్రక్కనే ఉన్న పెద్ద ప్రమిద నిండా నూనెతో దీపం వెలుగుతోంది. దాన్ని చూసి అందులో నూనె కొద్దిగా తీసి ఆ రెండు ప్రమిదలలో పోసి దీపాలను వెలిగించాను. అలా బాబా నా చేత దీపాలు వెలిగించేసరికి నా కళ్ళు ఆనందభాష్పాలతో నిండిపోయాయి. ఆ సంతోషాన్ని, అనుభూతిని ఏమని చెప్పేది? మరుసటిరోజు బాబాకు ఒక లేఖ వ్రాసి సమర్పించుకున్నాను. ద్వారకామాయిలో కూడా బాబా ఆశీస్సులు చాలా లభించాయి. అలా నా మొదటి శిరిడీ దర్శనం బాబా కృపతో ఎప్పటికీ గుర్తుండిపోయేలా అద్భుతంగా జరిగింది.
మూడు సంవత్సరాల వయస్సులో వచ్చీరాని మాటలతో సాయి ఆరతులు పాడటం మొదలుపెట్టిన నేను 2019 జనవరిలో మహాపారాయణలో భాగస్వామినయ్యేవరకు ఒక్కసారి కూడా సాయి చరిత్ర పారాయణ చేయలేదు. ఏనాడూ అష్టోత్తరం చదవలేదు. కనీసం 'సాయి' అనే స్మరణ కూడా ఏకధాటిగా చేసింది లేదు. కానీ నా మనసు నిండా ఆయన ఆలోచనలే. ఆయన గుర్తొచ్చారా, నాకు నిద్ర కూడా పట్టదు. ఆయన ఊహల్లోనే నాకు తెల్లారిపోతుంది. నా బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ ప్రతిక్షణం నా మనసు నిండా ఆయననే నింపుకుంటాను. అంతటి అదృష్టాన్ని బాబా నాకు ప్రసాదించినందుకు నేను ఎంతో ధన్యురాలిని. "ఇంతటి భాగ్యాన్ని ప్రసాదించిన మీకు చాలా చాలా ధన్యవాదాలు బాబా! ఏ సేవా చేయని నన్ను మీరు సదా కనిపెట్టుకొని ఎంతో ప్రేమను పంచుతున్నా అప్పుడప్పుడు తోటి సాయిభక్తులతో పోల్చుకుంటున్నందుకు నేను సిగ్గుపడుతున్నాను బాబా!"
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏
ReplyDeleteఓం సాయిరాం!! ఓం సాయిరాం!!
ఓం సాయిరాం!! ఓం సాయిరాం!!
ఓం సాయిరాం!! ఓం సాయిరాం!!
🙏🌟🙏 చిదానంద రూప,సదా దివ్య తేజ🙏🌟🙏
🙏🌟🙏 సత్ చిత్ ఆనంద నిలయ,
సద్గురు సాయినాధ పాహిమాం పాహిమాం 🙏🌟🙏
om sai ram today is my sons brithday.please bless him with long life.be with him.take care .om sai ram
ReplyDeleteOm Sai ram
ReplyDeleteOm sairam
ReplyDeleteBaba please stay with us
ReplyDeleteBaba, మీ కృప అనిర్వచనీయం.బాబా ప్రేమను పొందినవారు ధన్యులు
ReplyDeleteఅఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sai ram Chala bhagundhi me anubhavam sai
ReplyDelete🙏🙏🙏 Om srisairam Om srisairam Om srisairam thankyou sister.
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ReplyDeleteఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏
Sai daya anantham, sai kripakarudu.
ReplyDeleteJai Sai Ram
🌺🌷🙏🌟🙏 Om SaiRam 🙏🌟🙏🌷🌺
ReplyDelete