ఈ భాగంలో అనుభవం:
- ఏ ఆపదా లేకుండా చూసుకుంటున్న బాబా
ఒక అజ్ఞాత సాయిభక్తుడు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
అందరికీ సాయిరాం! ఈ బ్లాగ్ నిర్వాహకులకు ముందుగా నా ధన్యవాదాలు. నేను ఇంతకుముందు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను, నా ఆలోచనలను, అభిప్రాయాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటాను.
మొదటి అనుభవం:
2020, జులై 19వ తారీఖున నాకు కాస్త జ్వరంగాను, నీరసంగాను అనిపించింది. అసలే ఇవి కరోనా రోజులు. దాంతో నాకు భయం వేసి, "ఈ సమస్య నుండి బయటపడేయమ"ని బాబాను ప్రార్థించి, బాబా ఊదీని నీళ్ళలో కలుపుకొని త్రాగాను. తరువాత నేను మా బావకి ఫోన్ చేసి నాకున్న లక్షణాల గురించి చెప్పాను. మా బావ వెంటనే నన్ను కొన్ని పరీక్షలు చేయించుకోమని చెప్పాడు. నేను ఆ పరీక్షలు చేయించుకున్నాను. అన్ని రిపోర్టులు పాజిటివ్గా వచ్చాయి. దాంతో మా బావ "నీకు వచ్చింది మామూలు జ్వరమే అయివుంటుంది" అని చెప్పాడు. నేను ఆరోజు జ్వరం తగ్గటానికి మందులు వేసుకుని, ఇంకొకరోజు వేచి చూస్తానని చెప్పాను. రెండవరోజుకి జ్వరం, ఒళ్ళునొప్పులు తగ్గిపోయాయి. కానీ వాసనగానీ, రుచిగానీ తెలియటంలేదు. పైగా నీరసంగా కూడా ఉంది. నేను వెంటనే నా భార్యకి విషయాన్ని వివరించి చెప్పి వేరే గదిలో ఉండిపోయాను. మేము ఉండేది హైదరాబాదులో, మా తల్లిదండ్రులు ఉండేది ఆంధ్రాలో. నాకు ఏమి చేయాలో అర్థం కాలేదు. వెంటనే నేను నా కుటుంబంతో కలిసి ఆంధ్రా వెళ్ళాను. అక్కడ మా బావ మరియు సిస్టర్ ఉన్నారు. వాళ్ళు మా అందరికీ కోవిడ్-19 పరీక్షలు చేస్తే నాకు, నా భార్యకు పాజిటివ్ వచ్చింది. బాబా దయవల్ల మా అమ్మాయికి నెగిటివ్ వచ్చింది. బాబా దయవలన హోమ్ క్వారంటైన్ లో ఉండటానికి మాకు చుట్టాల ఇల్లు దొరికింది. ఆ ఇంట్లో బాబా ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడు నాకు బాగానే ఉంది. కానీ, నా భార్యకు మాత్రం తీవ్రమైన జ్వరం మరియు గొంతునొప్పి ఉండేవి. నేను బాబానే నమ్ముకొని ప్రతిరోజూ ఆయననే ప్రార్థించేవాడిని. బాబా దయవలన కొద్ది రోజులకు మాకు కరోనా తగ్గిపోయింది.
రెండవ అనుభవం:
2020, ఆగస్టు 22వ తారీఖున మా పాపకి కొద్దిగా జ్వరంగాను, నీరసంగాను ఉంది. అసలే కరోనా సమయం అవటంతో నాకు భయం వేసింది. పాపకు ఆరోగ్యాన్ని ప్రసాదించమని బాబాను ప్రార్థించి, బాబా ఊదీని నీళ్ళలో కలిపి మా పాపకి త్రాగించాను. కానీ, మరుసటిరోజుకి జ్వరం ఎక్కువైంది. దాంతో మేము మా పాపని చిల్డ్రన్ డాక్టర్ వద్దకు తీసుకొని వెళితే డాక్టర్ బ్లడ్ టెస్ట్ చేసి, అది వైరల్ ఫీవర్ అని చెప్పాడు. పాప ఆరోగ్యం కోసం నేను ప్రతిరోజూ బాబాను ప్రార్థించసాగాను. బాబా అనుగ్రహంతో నాలుగు రోజుల్లో మా పాపకి జ్వరం తగ్గిపోయింది. బాబా అన్నివిధాలా పాపను కాపాడారు. "థాంక్యూ సో మచ్ బాబా. ఇన్సూరెన్స్ బిల్స్ క్లెయిమ్లో మీ సహాయం కావాలి బాబా. తొందరగా బిల్స్ అన్నీ ప్రాసెస్ చేసి డబ్బు ఇప్పించండి బాబా!"
మూడో అనుభవం:
నేను బాబా దయవలన రెండేళ్ళ క్రితం ఒక ఇల్లు కొన్నాను. ఆ ఇంటిని అద్దెకు ఇచ్చాను. (సింగల్ బెడ్రూమ్ మరియు డబుల్ బెడ్రూమ్లకు అద్దె తక్కువైనా బాబా దయతో ఆ ఇల్లు కొన్నాను). ఉన్నట్టుండి డబుల్ బెడ్రూమ్ ఇంటిలో అద్దెకు ఉండేవాళ్ళు ఇల్లు ఖాళీ చేస్తామని చెప్పారు. అసలే కరోనా సమయం, అన్నిచోట్లా టు-లెట్ బోర్డులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో క్రొత్తగా ఎవరూ అద్దెకు రారేమోనని భయపడ్డాను. దాంతో నేను బాబాను ప్రార్థించి, త్వరగా ఎవరైనా అద్దెకు వచ్చేలా సహాయం చేయమని వేడుకున్నాను. కేవలం పదిరోజుల్లోనే మా ఇంటికి క్రొత్తవాళ్ళు అద్దెకు వచ్చేలా బాబా సహాయం చేశారు.
నాలుగవ అనుభవం:
బాబా దయవలన 2019లో నేను శిరిడీ వెళ్లి బాబాను దర్శించుకున్నాను. అప్పుడు నేను నా ఉద్యోగంలో ప్రమోషన్ రావటానికి సహాయం చేయమని బాబాను ప్రార్థించాను. నా ప్రమోషన్ సంగతి బాబాకు అప్పగించి, నేను ప్రశాంతంగా పారాయణ గ్రూపులో భాగస్వామినై ప్రతి వారం బాబా చరిత్ర పారాయణ చేశాను. రోజులు గడిచేకొద్దీ కోవిడ్-19 కారణంగా పరిస్థితులు జటిలంగా తయారయ్యాయి. మా కంపెనీలో చాలామందిని ఉద్యోగాలనుండి తొలగించారు. జీతంలో పెంపుదలలు, బోనస్లు రద్దు చేశారు. ప్రమోషన్స్ కూడా తగ్గించారు. కానీ నా ప్రమోషన్ విషయంలో బాబా అద్భుతం చేశారు. మా టీం మొత్తంలో నాకు ఒక్కడికే ప్రమోషన్ వచ్చింది. ఎంతో సంతోషంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఇలా నాకు ఏ చిన్న సమస్య వచ్చినా బాబాకు చెప్పుకుంటాను. మా కుటుంబాన్నంతటినీ బాబా ఏ ఆపదా లేకుండా చూసుకుంటున్నారు. ఎల్లప్పుడూ బాబా మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారు.
"బాబా! మేము ఎల్లప్పుడూ మీతోనే ఉండేలా దీవించి మమ్మల్ని మీ దారిలో నడిపించండి. మా ఆరోగ్యం ఎల్లప్పుడూ బాగుండాలని దీవించండి. ఈ అనుభవాన్ని పంచుకోవడంలో ఆలస్యం అయినందుకు క్షమించండి బాబా!"
సాయి సర్వాంతర్యామి! సర్వజీవ హృదయనివాసి! మనం అడిగేవాటికి, అడగనివాటికి కూడా సమాధానమిచ్చే ప్రేమమూర్తి!
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు! శుభం భవతు!
జై జై సాయిరామ్!
om sai ram
ReplyDeleteOm sai ram! 🙏🙏🙏
ReplyDeleteఓం సాయిరాం
ReplyDeleteOm Sai ram
ReplyDeleteBaba ra baba baba sai sai sai
ReplyDelete