“సాయి సర్వాంతర్యామి. ఆయన అంతటా వున్నారు. బాబాను ప్రార్థించడానికి శిరిడీయే వెళ్ళాల్సిన పనిలేదు! మనం వున్నచోటే వుంటూ, బాబాను ఎంచక్కా ధ్యానించుకోవచ్చు కదా!”
- ఇది శ్రద్ధాభక్తులతో తరచు శిరిడీ సందర్శించే సాయిభక్తులు అతి తరచుగా ఎదుర్కొనే ‘హితబోధ’. ఈ హితవు ‘తాత్త్వికపరంగా’ ముమ్మాటికీ సత్యం! “సాయి అంటే ఈ మూడున్నర మూరల దేహం మాత్రమే కాదు. బాబా శిరిడీలోనే ఉన్నాడని యెవరైనా అనుకొంటే, వారసలు నన్ను చూడనట్లే!” అని బాబా కూడా అన్నారు. అంతేకాదు! సర్వత్రా సర్వజీవులలోను ప్రకాశించే చైతన్యాన్ని మనచే దర్శింపచేయటమే శ్రీసాయి ద్వారా ప్రకటమయిన లీలాప్రబోధాల యొక్క పరమార్థం. ఆ సత్యాన్ని దర్శించడమే సాయిభక్తుల సాధనలక్ష్యం కూడా!
అయితే, తీర్థాలను తపోక్షేత్రాలను మహాత్ములను వారి సమాధి స్థానాలను తపోభూములను సాధకులు విధిగ దర్శించాలని అన్ని మతసాంప్రదాయాలు నిర్దేశిస్తున్నాయి. మన పురాణేతిహాసాలలో చాలాభాగం ఈ తపోక్షేత్రతీర్థాల మహత్మ్యాన్ని చెప్పేవే. ఇస్లాం సాంప్రదాయంలో ప్రతి ముస్లిం తన జీవితకాలంలో ఒక్కసారైనా ‘హజ్’ (మక్కాయాత్ర) చెయ్యాలని నిర్దేశిస్తున్నది. సూఫీ సాంప్రదాయం మహాత్ములను ఆశ్రయించటమేగాక, వారి సమాధులను(దర్గాలను) దర్శించి, అక్కడ సాధన చేసుకోవడానికి అత్యంత ప్రాముఖ్యాన్నిస్తుంది. ఐతరేయ బ్రహ్మణంలో (33.3) “యాత్ర చేయనివాడికి ఆనందమే లేదు; సంఘజీవితంలో ఎంతటి విశిష్ట వ్యక్తి అయినా ఏదో దోషం చెయ్యక తప్పదు. (పవిత్రక్షేత్రాల) యాత్ర చేసేవాడికి ఇంద్రుడు మిత్రుడై సహాయపడతాడు. అందువల్ల యాత్రలు చెయ్యి!” అని అర్థమొచ్చే మంత్రమున్నది. ఒకవైపు సర్వత్రా నిండి నిబిడీకృతమైవున్న పరబ్రహ్మతత్త్వాన్ని దర్శించమని ఉద్బోధిస్తున్న ఆధ్యాత్మిక శాస్త్రాలు, మరోవైపు పవిత్రక్షేత్రాలను విధిగా దర్శించమని మరి ఎందుకు విధిస్తున్నట్లు?
శాస్త్రాలే కాదు, మహాత్ముల ఆచరణ కూడా అలాగే వుంది. మహర్షులు, దేవతలు కూడా తపస్సు కోసం పవిత్రక్షేత్రాలకు వెళ్ళి నివసించినట్లు పురాణేతిహాసాలు చెబుతున్నాయి. పరమ అద్వైతాచార్యుడైన ఆదిశంకరుడు, రామానుజ, మధ్వ, వల్లభ మొదలయిన ఆచార్యులు పవిత్రక్షేత్రాలను భక్తి శ్రద్ధలతో దర్శించారు. సదా అవధులు లేని కృష్ణభక్తి రససాగరంలో ఓలలాడుతూ, సర్వత్రా దైవాన్ని దర్శించగలిగిన చైతన్యప్రభువు, మీరా, జ్ఞానేశ్వర్, నామదేవ్, తుకారాం, రామకృష్ణ పరమహంస మొదలైన మహాత్ములు కూడా పండరి, బృందావనం, పూరి, కాశీ మొదలైన క్షేత్రాలను అత్యంత ఉత్సాహంతో భక్తిశ్రద్ధలతో దర్శించడం గమనార్హం. వీరందరూ తామున్న చోటనే వుంటూ భగవంతుని దర్శించలేక పవిత్రక్షేత్రాలను దర్శించారని ఎవరైనా అనుకుంటే, అంతకంటే అజ్ఞానమింకొకటి వుంటుందా? పవిత్రక్షేత్రదర్శనం ఆ మహాత్ములు తాము స్వయంగా చేయడమే గాక, సాధకులు నియమంగా తరచు సందర్శించాలని కూడా ప్రబోధించారు. జ్ఞానేశ్వర్ మహరాజ్, నామదేవ్ లచే స్థాపించబడి, ఏకనాధ్ తుకారాంలవంటి మహాత్ములచే ప్రవర్తిల్లజేయబడిన ‘వార్కరీ’ పంథాలో కనీసం సంవత్సరానికొక్కసారైనా పండరి యాత్ర చెయ్యడం నియమం. ‘వార్కరీ’ అనే మరాఠీ పదానికి అర్థం ‘యాత్రికుడు’ అని. యాత్ర చెయ్యడం ఆ సాంప్రదాయంలో ఎంత ప్రధాన నియమమో, ఆ సంప్రదాయానికి పెట్టబడ్డ ‘వార్కరీ’ అనే పేరులోనే స్పష్టమవుతుంది. ఆ మహాత్ములు విధించిన యాత్ర, అటు బాహ్యమైనది ఇటు అంతరమైనది కూడా! ఆ యాత్ర యొక్క గమ్యం పండరిలో విఠలుని దర్శించి, ఆ దర్శన ప్రభావం వల్ల సర్వత్రా సర్వజీవులలోను విఠలుని దర్శించగలగడం.
అయితే, మనమిక్కడ గుర్తించవలసిన అంశం మరొక్కటున్నది. ఆధ్యాత్మిక శాస్త్రాలు, మహాత్ములు పవిత్ర క్షేత్రాలను దర్శించమని ఉద్బోధించడంలోని ప్రయోజనం అవి ఆత్మసంయమనానికి, ఆత్మసాక్షాత్కారానికి దోహదకారులనే తప్ప, చేసిన పాపాలను కడిగేసుకోవడానికో, పుణ్యాన్ని మూటకట్టుకోవడానికో కాదు! మనకు పురాణేతిహాసాలలో తీర్థాటన మహిమను వర్ణిస్తూ, అవి ‘పాపపరిహారార్థము పుణ్య సముపార్జనార్థమ’ని చెప్పే శ్లోకాలు, పైన చెప్పిన యోగసాధన లక్ష్యాన్ని సర్వజనాకర్షణం చెయ్యడానికి తరువాతి కాలంలో పురోహితవర్గాలు చేర్చిన ప్రక్షిప్తాలే. అందుచేతనే పాపకార్యాలు దుర్మార్గాలు విరివిగా చేస్తూ, ఆ దోషం తీర్థాటనతో పోగొట్టుకోవచ్చనే (మూఢ) విశ్వాసాన్ని ఇంతకు ముందు పేర్కొన్న మహాత్ములందరూ నిష్కర్షగా ఖండించారు. అంతేకాదు, ఇలాంటి దురాశను తూర్పారబడుతూ, దేవీభాగవతం ఇలా అంటున్నది: “ఎవరైతే తమ హృదయాన్ని పవిత్రంగా వుంచుకొంటారో, వారే పవిత్రక్షేత్రాలు దర్శించడం వల్ల ఫలితం పొందుతారు. ఇతరులు పవిత్రక్షేత్రాలకు యాత్ర చెయ్యడమే పాపం!” అని.
జాగ్రత్తగా పరిశీలిస్తే, అన్ని పవిత్రక్షేత్రాలు మూలంలో మహర్షుల మహాత్ముల తపోభూములు, వారి సమాధిస్థానాలుగానే వుండి, కాలగతిలో వాటి మూలరూపం మరుగునపడి, (పౌరాణికుల కల్పనాసామర్ధ్యం వల్ల) ఆ స్థానే వివిధ క్షేత్రపురాణాలు, క్షేత్రమహాత్మ్యాలు పుట్టుకొచ్చాయని అర్థమౌతుంది. హిమాలయాలు, గంగ మొదలైన సకలతీర్థక్షేత్రాల మహాత్మ్యానికి మూలం మహాత్ముల తపఃశ్శక్తేనని శాస్త్రాలు ఉద్ఘోషిస్తున్నాయి. ఈ దృష్ట్యా చూస్తే, పైన పేర్కొన్న పరిపూర్ణ సద్గురుమూర్తులు ఎందుకు పవిత్రక్షేత్రాలను దర్శించేవారో మరికొంచెం బోధపడుతుంది.
మహాత్ములు పవిత్రక్షేత్రాలను, తీర్థాలను ఇంకా ఇంకా పవిత్రం చేయడానికి దర్శిస్తే, సాధకులు తమ సాధనలో భాగంగా మనస్సును వివిధ వికల్పాలనుండి దూరం చేసుకొని తమ గమ్యాన్ని సులభంగా త్వరితగతిన సాధించుకొనేందుకు సందర్శించాలి
మనం నివసించే చోటనే కూర్చొని జపధ్యానాలు చేయడంకన్నా తపోక్షేత్రాలలో కూర్చుని సాధన చెయ్యడం ఎన్నోరెట్లు సులభతరం. మహాత్ముల తపోప్రభావంతో నిండినిబిడీకృతమైయున్న ఆ ప్రదేశాలలోనికి అడుగిడగానే మనస్సు అప్రయత్నంగా ధ్యానస్థమౌతుంది. సాధన అనే పడవలో ప్రపంచమనే ప్రవాహానికి మనస్సుతో తెడ్లు వేసుకుంటూ ఎదురుగా సాగడం వంటిది మనం వున్నచోటనే (ఇండ్లలోనే) వుంటూ సాధన చేసుకోవడం. మనం పయనించవలసిన దిక్కుకు బలంగా వీస్తున్న గాలివాటుకు తెరచాపనెత్తి నిశ్చింతగా సునాయాసంగా సాగిపోవడం వంటిది తపోక్షేత్రాలలోను, మహాత్ముల సన్నిధిలోను చేసే సాధన. ఎవరిలోనైనా బలమైన సంకల్పాలు, భావాలు కలిగినపుడు, ఆ మనోభావాల ప్రభావం ఆ వ్యక్తి అక్కడనుండి వెళ్ళిపోయినా ఆ ప్రదేశంలో ముద్రించుకుపోతుందని, ఆ ప్రదేశంలో అడుగిడిన ఇతరుల మనస్సులను తదనుగుణంగా ప్రభావితం చేస్తుందని ఆధునిక విజ్ఞానశాస్త్రంలో ఒక శాఖగ పరిగణింపబడే Psychotronics పరిశోధనలలో కూడా సశాస్త్రీయంగా గుర్తింపబడినదని చెబుతారు. కొద్దో గొప్పో జప ధ్యానానుష్టానాలలో అభ్యాసమున్న సాధకులెవరైనా కూడా యీ ప్రభావాన్ని ఇట్టే గుర్తించగలరు. అయితే, సమర్థుడైన గురువు యొక్క ప్రత్యక్ష మార్గదర్శకత్వం లేనపుడు సాధకుడు తన సాధన మార్గానికి అనుకూలమైన తపోక్షేత్రాన్ని జాగ్రత్తగా, వివేకంతో ఎన్నుకోవాలి. ఒక్కో తపోక్షేత్రానికి ఒక్కోరకమైన ప్రభావముంటుంది. తన సాధనమార్గానికి, హృదయగత సంస్కారానికి భిన్నమైన ప్రభావం కలిగిన తపోక్షేత్రాలలో సాధనచెయ్యడం సాధనకు దోహదకారి కాకపోగా, ఒక్కోసారి హానికరం కూడా కాగలదు!
ఈ సూత్రాన్ని ఆధారం చేసుకుని సాధన సాఫల్యానికి మరో సాధన రహస్యాన్ని మహాత్ములు బోధించారు. అదేమంటే లక్ష్యశుద్ధికల సామాన్య సాధకులు సాధ్యమైనంత తరచు తమతమ సద్గురుస్థానాలను సందర్శించాలనీ, తీవ్రసాధనకు అంకితమైన సాధకులు ఆ గురుస్థానాలనే ఆశ్రయించుకొని నివసించాలని. అలా బోధించడమే కాదు, ఎందరో మహాత్ములు అలా ఆచరించారు కూడా!
ఇటీవలి కాలంలో దీనికి చక్కని ఉదాహరణ భగవాన్ శ్రీరమణమహర్షి. హృదయకుహర మధ్యంలో కేవలం ‘నేను’ అన్న అహం స్ఫురణ రూపంలో ప్రకాశిస్తున్న ఆత్మతత్త్వాన్ని శోధించి దర్శించమని ఉద్బోధించిన భగవాన్ రమణులకు అరుణాచలంపై వున్న అవ్యాజమైన భక్తిప్రేమానురాగాలు భక్తులను ఒక్కోసారి ఆశ్చర్యపరచేవి. మదురైలోని తమ ఇంటిలో ఆత్మసాక్షాత్కారం పొందిన తరువాత కూడా ఆయన అరుణాచలేశ్వరుని దర్శించడానికే తపిస్తూ అరుణాచలానికి పరుగునచేరి, తమ జీవితపర్యంతం అక్కడే వుండిపోయారు. అరుణాచలేశ్వరుడే తమ గురువని చెప్పేవారు భగవాన్. ఈ దృష్ట్యా అరుణాచలం ఆయన గురుస్థానం. శుష్కమైన మెట్టవేదాంతాన్ని తలకెక్కించుకున్న కొందరికి 'మదురైలో లేనిది అరుణాచలంలో ఏముందని భగవాన్ అలా పరిగెత్తారో' అని అనిపించక మానదు! ఒకసారి ఒక భక్తుడు, “భగవాన్, మీ దివ్యశక్తే కదా అసంఖ్యాక భక్తులను దేశదేశాలనుండి ఇక్కడకు ఆకర్షిస్తున్నది!” అంటే, వెంటనే భగవాన్ ఆ మాటను ఖండిస్తూ, “మరి భగవాన్ ను ఇక్కడకు ఆకర్షించిన శక్తేమిటో? ఆ దివ్యశక్తే (అరుణాచలేశ్వరుడే) అందరినీ ఇక్కడకు ఆకర్షిస్తున్నది!” అన్నారు. భగవాన్ కేవలం వినమ్రత కోసం అన్న మాట కాదది. ఆ మాటలోని మర్మం బోధపడితే సాధన తత్త్వంలోని ఒక గొప్ప రహస్యం మన హృదయాలలో ఆవిష్కరింపబడుతుంది. అంతేకాదు! శ్రీసాయిబాబా శిరిడీలో స్థిరపడడంలోగల పరమార్థం, తద్వారా బాబా మనకందించిన ఆదర్శం అవగతమౌతుంది.
ఈనాడు లక్షలాదిమంది భక్తులను శిరిడీకి ఆకర్షిస్తున్నది శ్రీసాయి దివ్యశక్తే! కానీ, శ్రీసాయిని శిరిడీకి ఆకర్షించిన శక్తి ఏది? దానికి బాబాయే సమాధానమిచ్చారు. శిరిడీ తన గురుస్థానమనీ, అక్కడ తన గురువు సమాధి వున్నదనీ, కనుకనే తాము శిరిడీని తమ నివాసస్థానంగా చేసుకున్నామనీ! అన్యత్వానికి అతీతుడై, సర్వత్రా తానే వున్నానని నిదర్శనాపూర్వకంగా బోధించిన శ్రీసాయినాథుడే తన గురుస్థానాన్ని అలక్ష్యం చేయక శ్రద్ధతో ఆశ్రయించినపుడు, అన్యత్వభావంతో కొట్టుమిట్టాడే మనం “సాయి సర్వత్రా వున్నాడు కదా? శిరిడీకి పోవల్సిన పనేమి?” అని అనడం - కేవలం హాస్యాస్పదం! సామాన్యంగా ఇటువంటి మాటలు, శిరిడీ ప్రయాణానికి డబ్బు, శ్రమ, కాలం, ఖర్చు అవుతుందనే లుబ్ధత్వాన్ని, ఆ కొద్దికాలం కూడా ప్రాపంచికవ్యవహారాలు వదలి పెట్టలేని మనోదౌర్బల్యాన్ని కప్పిపుచ్చుకొని సమర్ధించుకొనేందుకు వేసుకొనే మేలిముసుగులు మాత్రమే. అందుకే పరమ అద్వైతాచార్యుడైన ఆదిశంకరులు కూడా, “భావనలో సదా అద్వైతాన్ని అనుష్ఠించు! కానీ, క్రియలో మాత్రం అద్వైతం చూపకు!” అని ఆదేశిస్తూ, “ముల్లోకాల్లో ఎక్కడయినా అద్వైతం పాటించుకానీ, గురువు విషయంలో మాత్రం ఏ పరిస్థితులలోనూ అద్వైతం చూపకు!” (“భావాద్వైతం సదా కుర్వాత్| క్రియాద్వైతం నకర్హిచిత్| అద్వైతం త్రిషులోకేషు| నా ద్వైతం గురుణాసహ||”) అని హెచ్చరించారు. సాయిభక్తులకు శ్రీసాయినాథుడే సద్గురువు. అంతటా అన్ని జీవులలోనూ సర్వత్రా వున్నది శ్రీసాయియేనని దర్శించడం సాయిభక్తుల పరమలక్ష్యమైనా, ఆ సత్యాన్ని మనకు చాటింది శిరిడీలో సంచరించిన ఆ శ్రీసాయిరూపమేననే సత్యాన్ని మనం మరువరాదు.
అందుకే, “ఎవరైనా సాయిబాబా అంటే యీ మూడున్నర మూరల దేహం మాత్రమేనని భావిస్తే వారసలు నన్ను చూడనట్లే!” అని చెప్పిన బాబానే, “ఎవరయితే భక్తితో యీ మసీదులో అడుగిడుతారో వారి కర్మ నశించినట్లే”ననీ, తాము 'సమాధినుండే తమ అవతార కార్యాన్ని నిర్వహిస్తామ'నీ, “నా మట్టి మాట్లాడుతుంది! సమాధి సమాధానమిస్తుంది” అని కూడా చెప్పారు. ఎందరో భక్తులకు వారు ‘శిరిడీలో వున్నంతవరకు’ వారికెటువంటి ఆపదకలగదని నిదర్శనాపూర్వకంగా తెలియచేసారు. మరెందరో భక్తులకు ప్రత్యక్షంగానూ, స్వప్నదర్శనాల ద్వారానూ తమ మనోవాంఛల సాఫల్యానికి ‘కేవలం’ శిరిడీ దర్శించమని ఆదేశించారు. యోగాభ్యాసతత్పరుడైన శ్రీఉపాసనీ మహరాజ్ తన యోగసాధనలో కలిగిన ఆటంకాలను అధిగమించలేక, ఎందరో యోగులను మహాత్ములను దర్శిస్తూ, చివరకు శిరిడీ చేరి బాబాను ఆశ్రయించాడు. అప్పుడు శ్రీసాయి ఆయనకు విధించిన సాధన – ‘శిరిడీలో నాలుగేళ్ళు వుండ’మని! మరి ఆ నాలుగేళ్ళు శిరిడీలో తానేం సాధన చేయాలని శ్రీఉపాసనీ అడిగినపుడు, “భోజనం చేసి, ఊరక కూర్చో! చాలు. చేయవలసినదంతా నేను చేస్తాను!” అన్నారు బాబా. అంటే లక్ష్యశుద్ధితో ఊరక శిరిడీలో గడపడమే ఒక మహత్తర ఆధ్యాత్మిక సాధనగ బాబా విధించారన్నమాట! శిరిడీలో ఎక్కడ కొన్నా అది తన స్వహస్తాలతో ఇచ్చిన ప్రసాదమనీ, 'ఎవరైతే (తమ) గురుస్థాన ప్రాంగణాన్ని ప్రతి గురు శుక్రవారాలు చిమ్మి శుభ్రం చేసి ధూపం వేస్తారో వారిని దైవం అనుగ్రహిస్తాడనీ' కూడా చెప్పారు. ఇవన్నీ శిరిడీ క్షేత్రానికి బాబా ఎంతటి ప్రాముఖ్యాన్నిచ్చారో తెలియజేస్తున్నాయి.
ఈనాటికీ, శిరిడీ దర్శించిన అసంఖ్యాక భక్తులకు శ్రీసాయి అద్భుత సన్నిధి అనుభవమౌతూనే వుంది. శిరిడీ దర్శించక ముందు, ఆ తరువాతకు తమ జీవిత గమనంలో ఎంతో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తుండటం ఎందరో భక్తుల అనుభవం. ముల్లును ముల్లుతో తీసినట్లు, మనలోని అన్యత్వభావాన్ని పోగొట్టుకోవాలంటే, (బాబా మాటల్లో, ఆయనకు మనకు వున్న ‘అడ్డుగోడ’ను పడగొట్టాలంటే) యీ అన్యత్వంలో భాగమైన శ్రీసాయిరూపం, సన్నిధి, శిరిడీ ప్రభావం మొదలయిన సాధనాలను ఆశ్రయించక తప్పదు!
Source :సాయిభక్తి సాధన రహస్యం, రచన: పూజ్యశ్రీ సాయినాథుని శరత్ బాబూజీ.
Om Sai
ReplyDeleteSri Sai
Jaya Jaya Sai
🙏🙏🙏
Om Sairam
ReplyDeleteఓం సాయిరాం
ReplyDelete