సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తి సాధన రహస్యం - సద్గురు సన్నిధిలో సాధన – దాని తత్త్వశోధన


సద్గురు సన్నిధిలో సాధన – దాని తత్త్వశోధన

శ్రీసాయిబాబా వంటి సమర్థ సద్గురుమూర్తి యొక్క సన్నిధి ప్రభావం సాధకుని అంతరంగంలో ఎటువంటి మార్పులు కలుగజేస్తుందో పరిశీలిద్దాం! అది ప్రత్యక్ష (భౌతిక) సాన్నిధ్యం కావచ్చు, లేదా పరోక్షమైన దివ్యసన్నిధి కావచ్చు! సద్గురు కృపావిశేష ప్రభావం వల్ల మన అంతరంగంలో సాగే ఆ మౌనరాగం యొక్క శృతిలయవిన్యాసాలు అవగతం కావాలంటే, ముందు మన అంతరంగం యొక్క స్వరూపస్వభావాలేమిటో కొంచెంగానయినా అవగహనమవ్వాలి కదా? సరి!

మన అంతరంగం ఒక కొలనువంటిదనుకొంటే, అందులోని నీరే మనలోని ఎఱుక లేదా చైతన్యం. సహజంగా నిశ్చలంగా ఉండే నీటిపై గాలి వీచడమో, ఏదైనా వస్తువులు బయటనుండి నీటిలో పడటమో జరగడం వలన చలనం కలిగి, ఆ చలనం అలల (తరంగాల) రూపంలో వ్యక్తమవుతుంది. అలానే బాహ్యజగత్తులోని వివిధ వస్తువుల, వ్యక్తుల, సంఘటనల పట్ల (వల్ల) మన ‘ఎఱుక’లో జరిగే వివిధ ప్రతిస్పందనలే అలలు అలలుగా మన మనస్సులో చెలరేగే ఆలోచనలు. ఆ బాహ్య విషయాలనే ప్రేరణలు కొలనులోనికి విసరబడ్డ మట్టిబెడ్డలవలె నీటి ఉపరితలాన్ని (మనస్సును) తాకి అలల సుడులు (ఆలోచనలు) రేపి, కొలను అట్టడుగుకు (హృదయంలోకి) చేరుకొని (విషయవాసనల రూపంలో) పేరుకుపోతాయి. నీటి (మనస్సు) ఉపరితలాన్ని తాకే వస్తువు (విషయప్రేరణ) యొక్క పరిమాణం, వేగాన్నిబట్టి అది సృష్టించే అలల తరంగదైర్ఘ్యం, వేగం ఆధారపడి వుంటాయి. ఒక్కొక్కసారి ఎన్నో విషయాలు ఒక్కసారిగ వెంటవెంటనే మనస్సును తాకడం వల్ల అవి సృష్టించే సుడుల నుండి బయలుదేరే కెరటాలు ఒకదానితో ఒకటి కలసి మరో సరిక్రొత్త కెరటంగా రూపుదిద్దుకోవచ్చు; లేదా రెండుకెరటాలు పరస్పర విరుద్ధంగా ఢీకొని వాటి బలాన్ని కోల్పోనూవచ్చు! ఈ బాహ్య విషయప్రేరణలు సామాన్యంగా మన మనస్సుయొక్క మెలకువ స్థితిలోనే (జాగ్రదావస్థలోనే) మనకనుభవమౌతాయి. కనుక మెలకువ స్థితి యొక్క అంచు – అంటే, మెలకువకు నిద్రకు మధ్యనుండే సంధి – కొలను గట్టు వంటిదన్నమాట.

మెలకువ స్థితిలో మన మనస్సనే కొలనులో పడ్డ విషయప్రేరణలు సృష్టించిన అలలు ఒడ్డుకుచేరి, గట్టును ఢీకొని వెనక్కు ప్రతిస్పందిస్తాయి. అలా వెనక్కు ప్రతిస్పందించే అలల ప్రకంపనలే మనకనుభవమయ్యే కలలు (స్వప్నాలు)! ఒడ్డును ఢీకొనే అలల స్వరూపస్వభావాల మీద, వాటి వేగాన్ని బట్టి, వెనక్కు మరలే ప్రతికంపన ఆధారపడి వుంటుంది. అందుకనే జాగ్రదావస్థలో మనకు కలిగే అనుభవాల ‘నీడల’ మాదిరి కలలు మనకనుభవమవుతుంటాయి. ఈ కంపన – ప్రతికంపనల మధ్య నీరు (మనస్సు) తన సహజస్థితియైన స్థిరత్వం కోసం చేసే ప్రయత్నమే ‘సుషుప్తి’. వివిధ విషయాల ప్రేరణల వల్ల చెలరేగిన అలలతో అల్లకల్లోలంగా వుండే కొలనులా వుంటుంది సామాన్యంగా మన మనఃస్థితి. నీటి ఉపరితలం అలలతో అల్లకల్లోలంగా వున్నప్పుడు కొలనుయొక్క అడుగు స్పష్టంగా కనిపించనట్లే, చిత్తవృత్తుల తెరల మాటున అంతరంగపు అట్టడుగు పొరలలో చిరకాలంగా పేరుకొని పోయిన విషయవాసనలు మనకవగతం కావు.

ఈ స్థితిలో సద్గురు కృపావిశేషం వల్ల, జన్మాంతర ఋణానుబంధంవల్ల సాధకుడు ఆర్తితో సద్గురు సన్నిధిచేరి, ఆయనను ఆశ్రయిస్తాడు. అలా సద్గురు సన్నిధిని ఆర్తితో ఆశ్రయించే ‘అవసరం’ కలగడానికి దోహదం చేసే వివిధ సంఘటనలు అనుభవాలే ‘నిజానికి’ సద్గురు 'ప్రభావంవల్ల' మన అంతరంగంలో జరిగే ‘సాధన’ యొక్క మొదటిదశ! ప్రత్యక్షంగా సద్గురువును ఆశ్రయించడానికి ముందు జరిగే యీ ‘దశ’ సాధనలో ఒక దశగా మన ఎఱుకలోనికి రాదు. మన దృష్టిలో సద్గురువును ఆశ్రయించడంతోనే ‘సాధన’ మొదలయినట్లు లెక్క. కానీ, సద్గురు దర్శనానికి ‘దారితీసే’ పరిస్థితులను తమ దివ్యశక్తిచే మలచడంలో శ్రీసాయి వంటి సద్గురుమూర్తి ప్రసాదించే ‘మార్గదర్శకత్వం’ పూర్తిగ ఆ సద్గురుమూర్తికే ఎఱుక. “నా భక్తుణ్ణి నేనే ఎన్నుకొంటాను!” “నా భక్తుడు ఎంత దూరాన వున్నా – పిచ్చుక కాలికి దారం కట్టి లాక్కొన్నట్లు – రకరకాల మిషలమీద నేనే వారిని నా దగ్గరకు రప్పించుకొంటాను. ఎవరూ వారంతటవారుగ నా వద్దకు రారు!” అని శ్రీసాయిబాబా చెప్పిన మాటల్లోని పరమార్థం ఇదే!

ఆర్తితో సద్గురు సన్నిధిని చేరగానే, సచ్చిదానంద స్వరూపమైన సద్గురు సన్నిధాన ప్రభావం వల్ల మన అంతరంగంలో సాగే కల్లోలం తక్షణం శాంతించి, అంతఃకరణ స్థిరత్వాన్ని పొందుతుంది. ఇదే సాధారణంగా మహాత్ముల సన్నిధిలోకి అడుగిడగానే మనకనుభవమయ్యే శాంతి ఆనందాలు, భద్రతాభావము! ఆ అనుభవం వల్ల సద్గురు సన్నిధిన చేరిన వ్యక్తి సద్గురువు పట్ల మరింతగా ఆకర్షింపబడతాడు. శ్రీసాయిబాబా, భగవాన్ శ్రీరమణమహర్షివంటి సద్గురుమూర్తులను దర్శించిన భక్తులందరికీ ఈ శాంతి ఆనందాలు ‘కొట్టొచ్చినట్లు’ అనుభవమయ్యేవి. ఈ అపూర్వ శాంతి ఆనందాలను గూర్చి శ్రీ జి.యస్.ఖాపర్డే, శ్రీమతి తార్కాడ్ మొదలైన భక్తుల స్మృతులు శ్రీసాయి చరిత్రలలో చూడవచ్చు. ఇది సద్గురు సన్నిధిలో సాధకుడు పొందే రెండవ దశ.

అలా సద్గురు సాన్నిధ్యానికి ఆకర్షింపబడ్డ భక్తుడు, మరికొంతకాలం ఆ శాంతి ఆనందాలను అనుభవిస్తూ, వాటిని సుస్థిరం చేసుకుందామనే తపనతో సద్గురు సాన్నిధ్యంలోనే వుంటూ ‘సాధన’ చేసుకోవాలని తలుస్తాడు. గురుకృప వుంటే అలా సద్గురు సాన్నిధ్యంలో వుండాలనే తలంపు నెరవేరుతుంది కూడా! కానీ, ఆ దివ్య సన్నిధిలో కొంతకాలం గడిపేసరికి, క్రమంగా సాధకుని అంతరంగంలో ఎప్పుడూ లేనంత భావతీవ్రతతో రకరకాల కోరికలు, విషయవాంఛలు, ప్రాపంచిక వ్యామోహాలు చెలరేగి, మనస్సు తిరిగి చంచలమవుతుంది! శాంతి ఆనందాల స్థానే ఏదో తెలియని హృదయవేదన చోటు చేసుకోనారంభిస్తుంది. మనసు ఓ పట్టాన ధ్యానంలో నిలువదు. ధ్యాస విషయానుభవాలవైపుకు లాగుతుంటుంది. మొదట బాగా జరుగుతూండిన జపధ్యానాలు అసలు జరగకుండా పోతుంటాయి. ఎందుకో అర్థం కాదు! చాలావరకు జయించేశామని 'అనుకొంటుండిన' కామము, కోపము, అసూయ మొదలయిన మనోవికారాలు ఇనుమడించిన భావతీవ్రతతో మనస్సును ఆక్రమించుకొంటాయి. నానారకాల ‘అపవిత్రపు’టాలోచనలు మనసులో తొంగిచూస్తుంటాయి. “ఛీ! ఛీ!! ఇదేమిటి? పవిత్ర సద్గురు సన్నిధిలో కూడా ఇటువంటి పాడుఆలోచనలు వస్తున్నాయే! నా అంతటి పాపాత్ముడు మరొకడుంటాడా?” అని తనను తాను ఛీదరించుకుంటాడు. చిత్తంలో తలెత్తే చెత్త ఆలోచనలను అణచివేయడానికి ప్రయత్నించేకొద్దీ, అవి రెట్టింపు బలంతో పైకి తన్నుకొస్తుంటాయి. 'ఆత్మసాక్షాత్కారం కోసం కూర్చుంటే నా పాపాత్మస్వరూపం ఇలా నగ్నంగా సాక్షాత్కరిస్తున్నదేమిటి?' అని కించపడతాడు.

ఒకవైపు తాను సాధింపదలచుకొన్న ఉన్నత లక్ష్యం; మరోవైపు విజృంభించిన మనో ‘బలహీనతల’ బలం! ఈ రెండింటి సంఘర్షణలో సాధకుడు నలిగిపోతాడు. తన స్థితి తనకే దుర్భరంగా తోస్తుంది. ఈ దుర్భరస్థితిలో సాధకుని అంతరంగంలో సాగే సంతాప సంఘర్షణా రూపమైన ‘మథనమే’అసలైన తపస్సు! ఈ సంఘర్షణ ఎంత తీవ్రంగా సాగితే సాధకుని స్థితి అంత దుర్భరంగా దుస్సహంగా తయారవుతుంది. ఈ దుర్భరస్థితి సాధకుని శ్రేయస్సుకేనని తెలిసిన సద్గురువుకు మాత్రం అతని ‘స్థితి’ ఎంతో సంతోషదాయకంగా ఉంటుంది! సద్గురువు యొక్క ఆ సంతోషాన్ని గమనించిన సాధకుడు మాత్రం తన గురుదేవుడు తన బాధను అర్థం చేసుకోవడంలేదనీ, తన పరిస్థితి ‘పిల్లికి చెలగాటం – ఎలుకకు ప్రాణసంకటం’లా వుందని ఇంకా కృంగిపోతాడు.

వాసనల యీ హఠాద్విజృంభణకు కారణమేమిటి? కొలనులోని నీటి ఉపరితలం పైన అలల ఉధృతి (చలనం) తగ్గి నిశ్చలంగా అయ్యేకొలదీ, కొలను అడుగు స్పష్టంగా గోచరించడమేగాక, అంతకు ముందు అడుగున పేరుకొని వున్న కుళ్ళు నెమ్మదిగా పైకి తేలడం మొదలవుతుంది. ఇదే యీ దశలో సాధకుని అంతరంగంలో కూడా జరిగేది. ఒక్కొక్కసారి కొందరు వ్యక్తుల విషయంలో అంతర్గతమైన వాసనలు ఒక్కసారిగా – కట్టలు త్రెంచుకొని ప్రవహించే వరద నీటిలా – అతి ఉధృతమైన వేగంతో వెలికి వస్తాయి. ఆ ఉధృతికి మనస్సుపై సామాన్యంగా వుండే అదుపు కోల్పోయి, చూచేందుకు వారు మనఃస్థిమితం తప్పినవారిలా ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే, ఇది తాత్కాలికం! చాలా అరుదుగా జరిగే విషయం! వాసనలు బహిర్గతమయ్యే వేగం తగ్గగానే, అంతకు ముందుకంటే ఎక్కువ స్థిరమైన నిర్మలమైన వ్యక్తిత్వాన్ని వారు సంతరించుకుంటారు. స్వభావసిద్ధంగా మనసులో బలంగా ఏర్పడ్డ కోరికలు, వాసనలు సహజరీతిన బహిర్గతం కానివ్వకుండా బలవంతంగా త్రొక్కిపట్టి, బాహ్యంగా దానికి భిన్నమయిన మరో వ్యక్తిత్వాన్ని (personality) వ్యక్తంచేస్తూ, పరస్పర విరుద్ధమైన వ్యక్తిత్వపు ధోరణుల సంఘర్షణలో వ్యవహరించే వ్యక్తుల్లోనే సామాన్యంగా పైన చెప్పిన ‘ఉధృతపరిణామం’ కనిపిస్తుంది.

స్వభావసిద్ధంగా మనసులో బలంగా ఏర్పడ్డ కోరికలు, వాసనలు సహజరీతిన బహిర్గతం కానివ్వకుండా బలవంతంగా త్రొక్కిపట్టి, బాహ్యంగా దానికి భిన్నమయిన మరో వ్యక్తిత్వాన్ని (personality) వ్యక్తంచేస్తూ, పరస్పర విరుద్ధమైన వ్యక్తిత్వపు ధోరణుల సంఘర్షణలో వ్యవహరించే వ్యక్తుల్లోనే సామాన్యంగా పైన చెప్పిన(ఇక్కడ పైన అంటే నిన్నటి భాగంలో) ‘ఉధృతపరిణామం’ కనిపిస్తుంది. క్రమంగా ప్రాపంచిక వాసనల బలం పెరిగి, తన లక్ష్యం పట్ల శ్రద్ధ-దీక్ష క్షీణించడం ప్రారంభమవుతుంది. ‘ఎప్పుడెప్పుడు సద్గురు సన్నిధినుండి బయటపడదామా!’ - అని మనసు ఉవ్విళ్ళూరుతుంటుంది. సాధనలో మనసు నిలువక, తిరిగి లౌకికవ్యవహారాలు చేపట్టానని చెప్పుకోడానికి అవమానం కనుక, సద్గురు సన్నిధినుండి బయటపడేందుకు అవసరమైన ఉపాయాలు కారణాలు వెతుక్కొంటాడు. అంతకు ముందు జ్ఞప్తికి రాని ధర్మాలు, సాంసారిక బాధ్యతలు - కర్తవ్యాలపట్ల హఠాత్తుగా ‘కళ్ళు తెరుస్తాడు’. వాటికి తానే అనివార్యమనే ప్రాముఖ్యాన్నిచ్చి, సద్గురువు యొక్క ప్రత్యక్ష సాన్నిధ్యపు కక్ష్యనుండి రాకెట్ వేగంతో బయట పడతాడు. కాదు! బయట పడ్డానని భావిస్తాడు. కానీ, సద్గురుని ప్రేమ పంజరం నుండి బయట పడ్డాననుకునే ఆ సాధకుడనే పిచ్చుక, తన కాలికి సద్గురు కృపావీక్షణమనే దారం కట్టబడివున్నదని గ్రహించడు. సర్వత్రా నిండివున్న సద్గురు అనుగ్రహశక్తి సాధకుణ్ణి తిరిగి సాధన కక్ష్యలోకి రప్పించే పరిస్థితులను కల్పించసాగుతుంది. సామాన్యంగా ఎక్కువ శాతం సాధకులు ఈ దశలోనే శ్రద్ధాయుతమైన సాధనకు తాత్కాలికంగా దూరం అవుతారు.

సద్గురువు సశరీరులుగా వుంటే ఇంకో ప్రమాదం కూడా వుంది! బాహ్యంగా సద్గురు సన్నిధినుండి దూరంగా పోలేని పరిస్థితులే వుంటే, - హృదయాంతరాళాల లోపలి పొరలనుండి బహిర్గతమవుతున్న విషయవాసనా ప్రకోపం వల్ల – మనసు సద్గురుసన్నిధిలోనే తన లౌకికవాసననల అభివ్యక్తీకరణకు పరిస్థితులు కల్పించుకునేందుకు ఆయత్తమౌతుంది. అందుకే సద్గురుమూర్తులను ఆశ్రయించిన ఎందరో సాధకులు క్రమంగా తాము అక్కడకొచ్చిన లక్ష్యం మరచిపోయి సాటి భక్తులతోటి వర్గపోరాటాలతో మత్సరాలతో, (సంస్థలుంటే) సంస్థాగతమైన వ్యవహారాలలో తలదూర్చి ‘ఆధ్యాత్మిక రాజకీయాల్లో మునిగి’పోతారు. శ్రీసాయి వంటి సద్గురుమూర్తుల సన్నిధిలో జరిగే ఈ వాసనా చక్రభ్రమణ విజృంభణాన్ని తట్టుకొని ‘శ్రద్ధా సబూరీలతో' ఎంతవరకు తనను తాను నిలువరించుకోగలడోనన్న దానిపై సాధనలో జయాపజయాలు ఆధారపడి ఉంటాయి!

శ్రీఉపాసనీబాబాను తరచు తమ దర్శనానికి కూడా మసీదుకు రాకుండా ఖండోబా ఆలయంలోనే ఏకాంతంగా ‘ఊరక కూర్చోమని’ బాబా ఆదేశించిన కారణాలలో ఇదీ ఒకటి. అయినా, ఈ విషయంలో సాయిభక్తులకు మాత్రం ఎటువంటి భయానికి తావులేదు. ఎందుకంటే, తన 'భక్తుని ఎన్నటికీ పతనం కానివ్వననీ', (ఆంతర్యంలోగానీ, బాహ్యంగాగానీ) 'అతడు తనకెంత దూరానవున్నా – సప్తసముద్రాల కావలవున్నా – పిచ్చుక కాలికి దారం కట్టి లాక్కొన్నట్లు – తమ వద్దకు రప్పించుకొంటాననీ' కదా బాబా ఇచ్చిన హామీ! ఇకనేమి? (ఉపాసనీబాబా విషయంలో జరిగినట్లు) సద్గురు కృపాబలం వల్ల తప్పనిసరైతేనేమి, సాధకుని వివేకబలం వల్లనైతేనేమి, తన లక్ష్యశుద్ధిని కాపాడుకొని సద్గురు సన్నిధిలో సాధన కొనసాగిస్తే ఈ వాసనాక్షయపర్వంలో నాల్గవ అధ్యాయం ఆరంభమౌతుంది. ఈ దశలో సాధకుడు తన ప్రయత్నం ఒట్టి భ్రమేననీ, నిజానికి తన సాధనను నడిపించేది సద్గురుకృపాహస్తమేననీ స్పష్టంగా గ్రహిస్తాడు.

శ్రీసాయిబాబా వంటి సమర్థ సద్గురువు తన దివ్యశక్తిచేత సాధకుని అంతరంగంలో పేరుకొనివున్న మలిన వాసనలను కొన్నిదివ్యానుభవాల ద్వారా నిర్మూలిస్తాడు. ఎన్నో జన్మలు కఠోరతపస్సు చేసినా క్షాళనకాని ఎన్నో మలిన విషయవాసనలను సద్గురువు కేవలం తన కృపావిశేషంతో మటుమాయం చేస్తాడు. బాబా తమ లీలాప్రబోధాల ద్వారా సద్భావనలు మన అంతరంగపు లోతులలో నాటుకొనేలా ఎలా చేయగలరనేది శ్రీసాయిబాబా చరిత్ర చదివితే ఇట్టే అవగతమవుతుంది. ఇక అంతఃకరణ మాలిన్యాన్ని శుద్ధి చేసేందుకు సద్గురువు సామాన్యంగా ఎన్నుకొనేది, వివిధ ‘స్వప్నానుభవాలు’, దివ్యదర్శనాలు. ఎందుకంటే, నిద్రావస్థలోను, సరైన ధ్యానస్థితిలోను సాధకుని అహంకారం బలహీనంగా పలుచగా వుండి, సద్గురు ప్రభావాన్ని నిరోధించకుండా గ్రహించి, ఆయన సంస్కరణ కార్యాన్ని సుగమం చేస్తుంది.

జాగ్రదావస్థలో కలిగిన అనుభవాల ప్రతికంపనలే కలల (స్వప్నాల) రూపంలో మనకవగతమవుతాయని ముందు తెలుసుకొన్నాము. కానీ, సామాన్యంగా మనకొచ్చే స్వప్నాలు మన విషయవాసనలను ఇంకా బలపరచి, వాటిని భద్రంగా హృదయపులోతుల్లోకి నెట్టివేస్తాయి. కానీ, సద్గురుసన్నిధిలో సాధకునికి అనుభవమయ్యే స్వప్నాలు అతని అంతరాళపు లోపలి పొరలలో దాగిన వాసనలను బయటికి నెట్టి, వాటిని నిర్మూలిస్తాయి. అటువంటి దివ్యానుభవం కలిగిన తరువాత సాధకుని మనఃస్థితిలోను, ఆలోచనాధోరణిలోను, దృక్పథంలోను పెద్ద మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఒక్కోసారి ఆ స్వప్నానుభవాలు సాధకునికి భౌతికంగానూ, తన చుట్టూవున్న పరిస్థితులలోను కూడా మార్పులు కలుగజేస్తుంది. భీమాజీ పాటిల్ కు వచ్చిన ప్రమాదకరమైన క్షయరోగాన్ని బాబా రెండు స్వప్నానుభవాల ద్వారా నివారించిన లీల మొదలైనవి ఇందుకుదాహరణలు. అదే మనో చాంచల్యరూపాలైన సాధారణ స్వప్నాలకు, గుర్వనుగ్రహం వల్ల కలిగిన దివ్యస్వప్నాలకు ఉన్న తేడా. ఉప్పుకప్పురాల వలే అవి చూచేందుకు ఒకేలా వున్నా, అనుభవించి చూస్తే కానీ వాటి రుచులలోని తేడా బోధపడదు. ఈ కారణంగానే మహాత్ముల దర్శనానికి, వారి సమాధిస్థానాలయిన పవిత్రక్షేత్రాలకు వెళ్ళినపుడు కనీసం మూడు రోజులైనా ‘నిద్రచేయాలనే’ నియమం పెద్దలు విధించినది.

అయితే ఇక్కడ ఇంకొక్కమాట! సద్గురు సాన్నిధ్యంలో దీర్ఘకాలం వుంటూ సాధన చేసుకొనేవారిలోనే యీ సాధన పరిణామ దశలు ప్రస్ఫుటంగా కన్పిస్తాయి. ఇతరుల్లో యీ పరిణామం అంత స్పష్టంగా గమనికకు రాదు. కొందరి విషయంలో, వారివారి వాసనాబలం దృష్ట్యాగానీ, మరే కారణంచేత గానీ, ఆ సాధకునిలోని కొన్ని వాసనల క్షయం భౌతికానుభవాల ద్వారానే జరగాలనేది సద్గురుని సంకల్పమయితే, తదనుగుణమయిన పరిస్థితులు కల్పించబడి ఆయా అనుభవాలద్వారానే వాసనాక్షయమవుతుంది. ఈ దశలో అత్యున్నత స్థితికి చేరిన సాధకులు, సద్గురు భక్తులు కూడా ఇంద్రియ భోగలాలసతకు, ధనవ్యామోహానికి, కీర్తికాముకత్వానికి లోనయినట్లు కనిపిస్తారు. ప్రపంచంవారిని యోగభ్రష్ఠులుగా పరిగణిస్తుంది. అయితే, ఎవరు వాస్తవంగా యోగభ్రష్టులో, ఎవరు వాసనాక్షయ సాధనమైన యోగంలో వున్నారో గ్రహించే యోగ్యత, సామర్థ్యం, అధికారం – సాయి వంటి పరిపూర్ణ సద్గురు మూర్తులకే తప్ప అన్యులకు అసాధ్యం!

ఈ సందర్భంలో మరో విషయం ప్రస్తావించడం అప్రస్తుతం కాదు. పైన వివరించిన సద్గురు సన్నిధి ప్రభావం గురించి చదివిన తరువాత, అటువంటి ప్రభావం శ్రీసాయి సశరీరులుగా వున్నప్పుడు వుండేదేమోగానీ, యీనాడు శిరిడీలో అంతటి ప్రభావం వుంటుందా?– అనే సందేహం కొందరు సాయిభక్తులకు కలుగవచ్చు. సరైన రీతిలో శ్రీసాయిసచ్చరిత్ర చదువని వారికి, శ్రద్ధతో శిరిడీ దర్శించనివారికి మాత్రమే కలిగే సందేహమిది! ఎందుకంటే సమాధి అనంతరం మరింత ముమ్మరంగా తమ అవతార కార్యాన్ని కొనసాగిస్తాననీ'పిలిస్తే పలుకుతాననీ, తలిస్తే దర్శనమిస్తాననీ' బాబా చేసిన ప్రతిజ్ఞలు నిత్యసత్యాలని అసంఖ్యాక సాయిభక్తుల అనుభవం. అంతేకాదు! శిరిడీ దర్శించిన వేలాది భక్తులకందరకూ సామాన్యంగా కలిగే అనుభవం ఒకటున్నది. అది ‘కాలగతి’ (Passing of time) స్ఫురణకు రాకపోవడం! అక్కడున్నన్ని రోజులు (వారం పదిరోజులయినా) మన సమస్యలు, ప్రాపంచిక బంధాలు, బాధ్యతలు గుర్తుకురావు. రోజులు క్షణాల్లా దొర్లిపోతాయి. “అరె! మనం శిరిడీ వచ్చి అప్పుడే ఇన్ని రోజులయిందా? నిన్నమొన్న వచ్చినట్లుందే!” అని శిరిడీ వదలి వెళ్ళేరోజు సామాన్యంగా అందరూ అనుకోవడం కద్దు! చూచేందుకు ఇది చాలా చిన్న విషయంగా కనిపించినా, సూక్ష్మంగా ఆలోచిస్తే ఇది చాలా అద్భుతమైన విషయమని అవగతమవుతుంది. అహంకారపు లోపలి పొరలు బలహీనమయితే గాని, ‘కాలగతి’ స్ఫురణకు రాకుండా పోదు. నిర్వికల్ప సమాధిలో మాత్రమే కాలగతి పూర్తిగా స్ఫురణకు రాకుండా పోతుందని యోగశాస్త్రం చెబుతున్నది. ఆ స్థితికి కూడా అతీతమయిన స్థితిలో వున్న శ్రీసాయియొక్క సన్నిధి ప్రభావం వల్లనే శిరిడీలో మనం ఆ అనుభవం యొక్క అంచులు రుచి చూస్తాం! ఇది సామాన్యంగా మన గుర్తింపుకు రాకుండానే జరిగిపోయే విషయం. కేవలం ఆయన సన్నిధి ప్రభావం వల్లనే మన వంటి పామరులకు కూడా రోజులు క్షణాల్లా గడిచినపుడు, శ్రీసాయి తన వయస్సు లక్షల సంవత్సరాలని చెప్పడంలో ఆశ్చర్యం ఏముంది? శిరిడీలో శ్రీసాయిసన్నిధి నిత్యసత్యం; ఆయన కృపారసం కుండపోతగా ఇప్పటికీ వర్షిస్తూనే వుంది. సాయిలీలాప్రబోధం నిరంతరం కొనసాగుతూనే వుంది!

Source: సాయిభక్తి సాధన రహస్యం, రచన: పూజ్యశ్రీ సాయినాథుని శరత్ బాబూజీ.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo