సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 562వ భాగం.....


ఈ భాగంలో అనుభవాలు:
  1. నమ్మినవారికి బాబానే తోడూ నీడ
  2. 'సాయీ! నువ్వు ఉన్నావయ్యా... నీ భక్తులను కాపాడుకోవడానికి!'

నమ్మినవారికి బాబానే తోడూ నీడ

సాయిభక్తురాలు లక్ష్మి తనకు ఇటీవల జరిగిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

అందరికీ సాయిరాం! నా పేరు లక్ష్మి. నేను హైదరాబాద్ నివాసిని. 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా ప్రణామాలు. బ్లాగును చాలా అద్భుతంగా నిర్వహిస్తున్న మీకు ధన్యవాదాలు. ప్రతిరోజూ ఈ బ్లాగులో ప్రచురితమయ్యే భక్తుల అనుభవాలను నేను చదువుతూ ఉంటాను. అవి చదువుతుంటే బాబాపై నమ్మకం, విశ్వాసం రెట్టింపు అవుతున్నాయి. ఈమధ్య నాకు జరిగిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను.

'అభయప్రదాత సాయి - మా తండ్రి ఐశ్వర్యదాత సాయి
ఆరోగ్యదాత సాయి - మా తండ్రి ఆనందదాత సాయి'.

2020, ఆగస్టు 19, బుధవారంనాడు రోజులానే పూజ, పనులు చేసుకొని భోజనం చేయడానికి కూర్చునేసరికి ఆలస్యమైంది. భోజనం చేస్తుంటే విపరితమైన నీరసంగా, గుండెదడగా అనిపించి చాలా భయం వేసింది. తిన్నాక కూడా పరిస్థితి అలానే ఉంది. కొంతసేపు నిద్రపోదామన్నా నిద్రపట్టలేదు. స్థిమితంగా ఉండలేక ఇబ్బందిపడ్డాను. సాయంత్రమైనా అలాగే ఉంది. డాక్టరు దగ్గరకు వెళ్లి చెకప్ చేయించుకుందామంటే కరోనా కారణంగా చిన్న చిన్న క్లినిక్‌లు తెరవడంలేదు. అందువల్ల మన సాయినాథుని తలుచుకొని, "స్వామీ! ఎలాగైనా నా ఆరోగ్యం కుదుటపడేలా చేయండి. మీ కృపతో నాకు నయమైనట్లైతే నా అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాన"ని ప్రార్థించి, భారం ఆయన మీదే వేశాను. తరువాత కొంచెం బాబా ఊదీని నీళ్ళలో వేసుకొని, దాన్నే పరమౌషధంగా భావించి త్రాగాను. మరుసటిరోజు ఉదయానికి అంతా నార్మల్‌గా ఉంది. తరువాత బి.పి చెక్ చేయించుకుంటే సాయి దయవల్ల నార్మల్‌గా ఉంది. ఎంతో ఆనందంగా బాబాకు ధన్యవాదాలు తెలుపుకున్నాను. నమ్మినవారికి బాబానే తోడూ నీడ.

సాయిరామ్!

'సాయీ! నువ్వు ఉన్నావయ్యా... నీ భక్తులను కాపాడుకోవడానికి!'

సాయిభక్తురాలు కమల తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

సాయిబాబా భక్తులకు, ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారాలు. నా పేరు కమల. బాబా దయవల్ల ఒక చిన్న అనుభవాన్ని నేనీరోజు ఈ బ్లాగ్ ద్వారా మీ అందరితో పంచుకుంటున్నాను.

ప్రస్తుతం మన చుట్టూ ఉన్న భయానక పరిస్థితి అందరికీ తెలిసిందే. ఏ నోట విన్న కరోనా! ఆ మాట వింటేనే భయంతో వణుకుపుడుతోంది. ఇటువంటి సమయంలో ఒకరోజు మా తమ్ముడు ఫోన్ చేసి, "అక్కా! మా అత్తగారి కుటుంబంలో అందరికీ కరోనా పరీక్షలు జరిగాయి. అందరికీ పాజిటివ్ వచ్చింది" అని చెప్పాడు. ఒక్కసారిగా చాలా భయంగానూ,  బాధగానూ అనిపించింది. ప్రతిరోజూ మా అమ్మకి, డాడీకి ఫోన్ చేసి, "వాళ్ళకి ఎలా ఉంది?" అని అడిగేదాన్ని. కానీ మా మరదలితో మాట్లాడటానికి బాధగా ఉండేది. మాటిమాటికీ అడిగి బాధపెట్టినదాన్ని అవుతానేమోననిపించి అమ్మావాళ్ళతోనే మాట్లాడుతుండేదాన్ని. 'పర్వాలేద'ని 'జ్వరం తగ్గింద'ని, 'మళ్ళీ వచ్చింద'ని, 'జలుబు ఉంద'ని ఇలా పరిపరివిధాల వాళ్ళు తెలుసుకున్నది వాళ్ళు చెప్పేవారు. ఇదిలా ఉండగా ఒకరోజు ఈ బ్లాగులోని కొందరి భక్తుల అనుభవాలు చదువుతున్నపుడు, "బాబా! వాళ్ళ కుటుంబమంతా ఈ కరోనా బారినుండి ఆరోగ్యవంతులుగా బయటపడితే, ఆ అనుభవాన్ని ఈ బ్లాగ్ ద్వారా అందరితో పంచుకుంటాను. ఒక్క వారంలో అందరి ఆరోగ్యం బాగుందన్న శుభవార్త వినేలా చేయండి సాయి" అని అనుకున్నాను. బాబా అనుగ్రహించారు. వాళ్ల కుటుంబమంతా కరోనాను జయించి ఆరోగ్యవంతులయ్యారు. ఆ మాట విన్నాక నాకు చాలా ఆనందంగా అనిపించింది. "సాయి! నువ్వు ఉన్నావయ్యా... నీ భక్తులని కాపాడుకోవడానికి" అని అనుకుంటూ ఇదిగో.. మీ అందరిముందు ఈ అనుభవాన్ని పంచుకున్నాను.

జై సాయిరామ్!


7 comments:

  1. 🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏

    భయములో గల వారి కాశ్రయము నీవు
    కలుషితాత్ముల పాలిటి గంగవీవు
    దుఃఖసాగరమీదగ దొప్పవీవు
    దళిత జనపాళి పాలి చింతామణీవు!

    విశ్వవిశ్వంభరాన నావిర్భవించు
    విమల చైతన్య మీవ - యీ విధివిలాస
    జగతి నీదు లీలావిలాసమ్మె సుమ్ము
    సాధుజన పోష!మృదుభాష సాయినాధ!!
    🌺🌟🌺🌟🌺🌟🌺🌟🌺🌟🌺🌟🌺🌟🌺🌟🌺

    ReplyDelete
  2. Baba please bless us and every time stay with us sai thandri

    ReplyDelete
  3. 🙏🙏🙏 Om srisairam Om srisairam Om srisairam thankyou sister.

    ReplyDelete
  4. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo