సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తి సాధన రహస్యం - సాయియోగంలో నిద్రానియమం




సాయియోగంలో నిద్రానియమం

సర్వజీవులకు నిద్ర ఒక సాధారణ ధర్మం. కొందరిది మొద్దునిద్ర; మరికొందరిది మాగన్ను నిద్ర; కొంతమందిది కలతనిద్ర; ఇంకొంతమందిది సరిగా ‘పట్టని’ నిద్ర! కల్మషంలేని మనసుకు, కాయకష్టానికి వెరువని కాయానికి నిద్రకు కొదవుండదు. నిద్ర సోమరితనానికి నెచ్చెలి; అటు ఆధ్యాత్మిక లక్ష్యాన్ని సాధింపబూనిన యోగసాధకునికి, ఇటు లౌకిక లాభాన్ని పొందగోరే కార్యసాధకునికి – ఇరువురికి – బద్ధకపు నిద్ర ఓ బద్ధశత్రువు!

ఎందరో కవులు నిద్రపై కవితలల్లారు. నిద్ర–మరణాలు రెండూ కవలలవంటివన్నాడో కవి. మృత్యువనే ‘అసలు’కు నీడవంటి నకిలీయే నిద్రన్నాడింకో కవి. నిద్రలోని నిజతత్త్వాన్ని నిర్వచించడానికి నిర్నిద్రులైనారు కొందరు తాత్త్వికులు. అయితే, నిద్రయొక్క అసలు తత్త్వాన్ని ఆకళింపు చేసుకోవడం – ఆవులిస్తూ నిద్రపోయినంత – తేలికకాదు! ఎందుకంటే, నిద్రలోని 'అనుభవం' మరపు; మెలకువ ఎఱుక! నిద్రలోని ‘నిజం’ నిద్ర మేల్కొనగానే మఱుగవుతుంది. నిద్రయొక్క నిజతత్త్వాన్ని నిగ్గుదీయడమంటే, – అదొక ఎఱుక మరపుల ఏరువాకే!

ఆహార నిద్రాభయ మైథునాలు జీవులకందరికీ సామాన్య ధర్మాలని, వాటిలో జీవుల మనుగడకు ఆధారమైన ఆహారం అత్యంత ప్రాధమికమని ముందు వ్యాసంలో చెప్పుకున్నాం. అయితే, బొత్తిగా ఆహారం లేకుండా కొన్ని వారాలపాటైనా మనగలమేమో గానీ, ‘అస్సలు’ నిద్రపోకుండా కొన్ని రోజులు కూడా వుండటం అసాధ్యం!

ఆధ్యాత్మిక సాధనలో ఆహారనియమం ఎంత అవసరమో నిద్రానియమం కూడా అంతే అవసరం. సామాన్యంగా ఆహారనియమంలో చూపినంత శ్రద్ధ జాగ్రత్తలు సాధకులు నిద్ర విషయంలో చూపకపోవడం చూస్తాం. యోగశాస్త్రగ్రంథాలలో నిద్రను నియమించేందుకు ఎన్నో రకాలయిన పద్ధతులు చెప్పబడ్డాయి. అవి అన్నీ అందరికీ వర్తించవు. సాధకుని పరిపాకాన్ని బట్టి, గురువు నిర్ణయాన్ని బట్టి అనుసరించవలసినవి. కానీ ఈ నియమాలన్నింటికి మూలసూత్రం మాత్రం – అతిగా నిద్రపోవడం, లేదా అసలు నిద్రలేకపోవడం కానీ గాక, మితంగా నిద్రించడం. అయితే ఈ మితానికి కొలబద్ద ఏమిటి? ఎంతసేపు నిద్రిస్తే మితం? ఎంత ఎక్కువయితే అమితం? ఇంతకుముందు ఆహారవిషయక చర్చలో వివరించినట్లు, ఈ ‘పరిమితి’- సాధకుని సంస్కారం, పరిణతి, వయస్సు, చేసేపని, దేహారోగ్యం, మానసిక స్థితి మొదలైన అంశాలమీద ఆధారపడివుంటుంది. ఏ విధమైన ప్రాపంచిక వ్యాపకాలూ లేకుండా, పూర్తిగా ఆధ్యాత్మికసాధనలో నిమగ్నమయిన సాధకునికి ఒకటి రెండు గంటల నిద్ర సరిపోతే, సామాన్య సాధకులకు సుమారు నాలుగు గంటల నిద్ర సరిపోతుందని మహాత్ముల మాట! అందుకే సామాన్య గృహస్తుకు మూడు సంధ్యలలో – ప్రొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం – జపధ్యానాలను విధిస్తే, సన్యాసి మాత్రం అర్థరాత్రిలో నాల్గవ సంధ్య కూడా చేయాలని సంప్రదాయం. ‘ఎంత’ నిద్ర సరిపోతుంది అనేదానికి ‘ఇంత’ అని నిర్దిష్టంగా చెప్పడానికి వీలులేకపోయినా, స్థూలంగా ఒక మార్గదర్శకసూత్రాన్ని మాత్రం చెప్పవచ్చు. ఒకసారి నిద్రపట్టాక, మనోదేహాలకు అవసరమైన విశ్రాంతి లభించగానే, ఒక్కక్షణం మెలకువ కలుగుతుంది. సామాన్యంగా నిద్రమత్తు వల్ల దాన్ని మనం గుర్తించకుండా తిరిగి నిద్రలోకి జోగిపోతాం! ఆ మెలకువ పొందిన క్షణాన్ని గుర్తించాలని గట్టిగా సంకల్పం చేసుకొని పడుకుంటే, క్రమంగా నిద్ర సరిపోగానే సహజంగా కలిగే ఆ మెలకువ స్థితి స్పష్టమవుతుంది. అలా మొదటిసారి సహజంగా మెలకువ రాగానే, మళ్ళీ బద్ధకంతో నిద్రలోకి జారిపోకుండా వెంటనే లేచేయాలి! అలా చెయ్యడం అటు దేహారోగ్యానికి, ఇటు మానసికంగా చురుకుగా వుండడానికి ఎంతో దోహదకారి.

బుద్ధుడు శ్రావస్తిలో మాద్గల్యాయునుడనే శిష్యునికి చేసిన శిక్షణా విధానం యొక్క బోధనలో ఇలా అంటాడు.

“మెలకువను పొంది జీవించు! దినంలో నువ్వు కూర్చుని వున్నా, నడుస్తున్నా మరేమి చేస్తున్నా సరే, నిన్ను కలవరపరచే విషయాన్ని నీ హృదయం నుండి తొలగించివేయి. రాత్రికాలంలో కూడా హృదయాన్ని క్షాళన చేసుకుంటూ వుండు. కుడివైపు తిరిగి పడుకో. ఒక కాలుపై మరొక కాలు ఆనించి పడుకో! శాంత మనస్సు కలిగివుండు. స్వస్థుడవై వుండు. క్రియాశీలతకు దోహదంచేసే ఆలోచనలకే మనసులో తావివ్వు! రాత్రి గతించి మెలకువ కలుగుతూ వుండగా, లేచి కూర్చో! హృదయాన్ని వ్యాకులపరచే విషయాలను తొలగించుకో. లేచి అటుఇటు కొంతసేపు నడువు! ఇది నిద్రకు సంబంధించిన పాఠం.”

శ్రీరామకృష్ణ పరమహంస తన శిష్యులచేత రాత్రంతా యోగసాధనలు చేయించి, అవసరమైనంత వరకు పగలు ఒకటి రెండు గంటలు నిద్రకు అనుమతించేవారు. శ్రీసాయిబాబా కూడా మహల్సాపతి, అబ్దుల్ బాబా, వజే తదితరులకు రాత్రంతా పారాయణధ్యానాలలో గడపమని ఆదేశించడం చూస్తాం. అంతేకాక, ప్రజలు – ముఖ్యంగా మనతోటివారు – వివిధ ప్రాపంచిక వ్యాపకాలు వ్యాపారాల గురించి చేసే మనోసంకల్పవికల్పాలు మన మనస్సులను ప్రభావితం చేస్తుంటాయి. రాత్రిళ్ళు అందరూ నిద్రావస్థలో వున్నప్పుడు ఆ సంకల్పాల బలం క్షీణించి వాటివల్ల విక్షేపం కలగదు. దీనికితోడు రాత్రివేళలలో వుండే సహజ ప్రశాంతత ఆధ్యాత్మిసాధనకెంతో అనుకూలమైనది!

మనసును నియమించే మార్గాలలో నిద్రను నియంత్రించడం మొదటి మెట్టేకాదు! సులభసాధనం కూడా!! జపమో, ధ్యానమో చేయడానికి కూర్చుంటే కొంతసేపటికి తెరలుతెరలుగా ఏవో ఆలోచనలు దృశ్యాలు కలల మాదిరి మనస్సును ఆవరించడం, తరువాత దేహం కునుకుపాటుగా తూలడం ధ్యానం చేసుకోవాలని కూర్చునేవారికి సామాన్యంగా ఎదురయ్యే ‘అనుభవం’. జపధ్యానాల పట్ల మనం నిలుపుకోదలచిన జాగరూకత ఆ సమయంలో ‘మరపు’లోకి అప్రయత్నంగా జారిపోతుందన్న మాట. ఆ ‘మరపు’నే వేదాంత గ్రంథాలు ‘తమస్సు’ (చీకటి, అజ్ఞానం, మరపు అని అర్థం) అనీ, అలా నిద్రలోకి – అంటే పైన చెప్పిన నిద్రవంటి స్థితిలోకి – జారిపోయే నైజాన్నే ‘తమోగుణ’మనీ పేర్కొన్నాయి. ఆ విధంగా మనస్సును ఆవరించే ‘మరపు’ను జాగరూకతతో గమనిస్తూ, పట్టుదలతో ఆ మత్తును విదల్చుకొని ధ్యానాన్ని కొనసాగించాలి. ఆ ప్రయత్నంలో ధ్యానం ఇంకా ఇంకా లోతుగా జరగడమే కాకుండా, మనస్సులో సంకల్పాలు ఎలా పుడుతున్నాయి? అవి ఎలా వృద్ధి చెంది మనస్సును ఆక్రమిస్తున్నాయి? మనల్ని మరపులో పడవేసేందుకు మనస్సుచేసే ఎత్తులేమిటి? ఆ ఎత్తులను చిత్తుచేసే సుళువులేమిటి? మనస్సుయొక్క నైజమేమిటి? మనో సంకల్పవికల్పాలకు 'బలం' ఎక్కడినుండి వస్తుంది? - అనే ఎన్నో 'మనోగత'రహస్యాలు మనకవగతమౌతాయి.

ఈ విధంగా నిద్రను – తద్వారా మనస్సునూ – నియమించే ప్రయత్నంలో జాగరూకులమై (అంటే, జాగ్రత్త కలిగి) వుండటమే జాగరణ అంటే! అందుకే బౌద్ధధ్యానయోగగ్రంథమైన ప్రజ్ఞాపారమితి సూత్రం, “అర్థరాత్రి ముందు తర్వాత ఆధ్యాత్మిక సాధనను ఎప్పుడూ మానవద్దు! జీవితం నుండి ఏదీ పొందనీయకుండా, లక్ష్యశుద్ధి లేకుండా చేసి, జీవితాన్ని వ్యర్థం చేసేది నిద్ర! దానికి సాధకుడు ఎన్నటికీ బానిస కాకూడదు” అని సాధకులను హెచ్చరిస్తున్నది. మనోసంయమనం కోసం పట్టుదలగా చేసే యత్నమే నిష్ఠ. ఆ నిష్ఠను నీరుగార్చే వ్యసనం అతినిద్రాలోలత్వం. అందుకే, నిద్ర పట్ల అప్రమత్తతతో వుండమని హెచ్చరిస్తూ, “నిద్ర మరచినపుడే నిష్ఠుండు తానాయె, నిద్రలో పడినపుడు నిష్ఠపోయె” అంటాడు వేమనయోగి!

యోగసాంప్రదాయంలో నిద్రను నియమించే సాధనలకు, కాలాంతరంలో కలిగిన వికృతరూపమే మనం యీనాడు చూస్తున్న, చేస్తున్న శివరాత్రి-ముక్కోటి జాగరణలు! మనసును మరపు అనే ‘నిద్ర’ లోకి జారిపోకుండా జాగరూకతతో ఎఱుకలో నిలుపుకొనేందుకు అభ్యాసాలుగ యేర్పరచబడ్డ యీ ఆచారాలు ఆయా పర్వదినాల్లో 'సినిమా చూస్తూ మేల్కొన్నా శివసాయుజ్యం, చతుర్ముఖ పారాయణ చేస్తూ కాలక్షేపం చేసినా బ్రహ్మలోక దర్శనం, వైకుంఠపాళి ఆడుతూ మేలుకున్నా వైకుంఠప్రాప్తి', అనే మూఢవిశ్వాసాలకు దిగజారింది. ఎలా మేల్కొనాలో ఎందుకు మేల్కొనాలో అనే అంశాన్ని, అలా మేల్కొని వుండటంలోని లక్ష్యాన్ని నిద్రపుచ్చి ఎలాగైనా మేల్కొని వుండటమే పరమార్థంగా పరిణమించింది. మన ఆచారవ్యవహారాల వెనుక నిద్రాణంగా వున్న యీ ఆధ్యాత్మపరమైన అంశాలను, సూక్ష్మాలను మేల్కొలిపి వెలికితీసి, మనం ఆచరించి, సాటివారికి తెలియజెప్పడం మన కనీస నైతిక బాధ్యత; సిసలైన సదాచార పాలన! 

Source: సాయిభక్తి సాధన రహస్యం, రచన: పూజ్యశ్రీ సాయినాథుని శరత్ బాబూజీ.

4 comments:

  1. Baba! Bless me with Job 🙏🙏🙏

    ReplyDelete
  2. Om Sairam
    Sri Sachhidananda Sadguru Sainath Maharaj Ki Jai

    ReplyDelete
  3. ఓం సాయిరాం

    ReplyDelete
  4. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo