- సాయి ప్రేమ అనంతం
సాయిబంధువులందరికీ నా నమస్కారం. నా పేరు రాజేశ్వరి. ఈరోజు నేను సజీవంగా, మనశ్శాంతిగా ఉన్నానంటే దానికి నా సాయితండ్రి అనుగ్రహమే కారణం. బాబా ఏనాడో నా జీవితంలో ప్రవేశించి అన్నివేళలా నన్ను కాపాడుతున్నారు. కానీ, నేను మాత్రం 12 సంవత్సరాల క్రితం నుండే ఈ విషయం గ్రహించటం ప్రారంభించాను. కాలేజీలో చదువుతున్నప్పుడే నా మెడలోని గొలుసులో బాబా లాకెట్ ఉండేది. నేను నవ గురువారాల పూజ కూడా చేశాను. కానీ ఇవన్నీ బాబా అంటే పూర్తిగా తెలిసి చేయలేదు. ఎవరు చెబితే ఈ పూజలు చేశానో నాకు ఇప్పటికీ తెలియదు. అలా చేయాలని అనిపించేది, చేశాను. పూర్తిగా ‘బాబానే నాకు అన్నీ’ అని తెలుసుకున్నది మాత్రం నేను మా చిన్నబాబుని ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మాత్రమే. అప్పటివరకు మా పూజగదిలో బాబా ఫోటో ఏమీ లేదు. ఒకసారి మా ఎదురింట్లో ఉండేవాళ్ళు శిరిడీ వెళ్ళి వచ్చాక నాకు బాబా ప్రసాదం, బాబా ఫోటో ఇచ్చారు. నేను ఆ ఫోటోని మా పూజామందిరంలో పెట్టాను. ఇప్పుడు తలచుకుంటే, ఆ తరువాత నాకు జరిగిన భయంకరమైన సమస్యల నుండి రక్షించడానికే బాబా మా ఇంటికి వచ్చారని అర్థమైంది. బాబా ఫోటో వచ్చిన కొద్దిరోజులకి 5వ నెల గర్భవతిగా ఉన్న నాలో ఉన్నట్టుండి శారీరకంగానూ, మానసికంగానూ చాలా చాలా తేడా వచ్చింది. ఎంతలా అంటే నన్ను, నా కడుపులోని బిడ్డను కాపాడటానికి నా కుటుంబం మొత్తం ఎన్నోరకాలుగా చాలా కష్టపడ్డారు. 9వ నెల రాగానే నాకు సిజేరియన్ జరిగింది. కానీ బాబు పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. డాక్టర్లు, “బాబు పరిస్థితి ఆశాజనకంగా లేదు. భగవంతునిపై భారం వేసి ట్రీట్మెంట్ ప్రారంభిస్తాము, ఆపైన మీ అదృష్టం” అన్నారు. అలా 15 రోజులు హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ ఇప్పించాక బాబు గండం నుంచి గట్టెక్కాడు. తరువాత మరో 3 నెలల పాటు తల్లిగా నేను తప్ప ఎవరూ బాబు గదిలోకి రాకుండా కంటికి రెప్పలా కాపాడితే బాబు సాధారణ స్థితికి వచ్చాడు. నిజానికి అప్పటి నా పరిస్థితి బిడ్డను చూసుకునే స్థితిలో లేదు, కానీ బాబా ప్రేమవల్ల ఆ గండం నుండి బయటపడ్డాము.
మా చిన్నబ్బాయికి 10 సంవత్సరాలు నిండేవరకు ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్య ఉంటూ ఉండేది. దానివల్ల బాబుతోపాటు నేను, మావారు కూడా ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాళ్ళం. ఆ సమయంలో బాబా తమ కృపను ఎంతో అద్భుతంగా చూపించారు. ఒకరోజు ఇలా ఎంతో బాధపడుతూ బాబా పటం దగ్గర కూర్చుని, “బాబా! మీ కరుణ నా కుటుంబంపై నిజంగా ఉంటే మీరు నిదర్శనం చూపించండి” అని ఏడ్చాను. తరువాత పనిమీద బయటికి వెళ్తూ మా కారు పార్కింగ్ దగ్గరకు వెళ్ళాను. అక్కడ మా కారు ప్రక్కనున్న స్తంభంలోని గూటిలో ఒక పోస్టల్ కవర్ ఉంది. ఆ కవర్ని నేను సరిగ్గా గమనించలేదు. కానీ ఆ కవర్ని చూసిన మరుక్షణమే నాలో ఎవరో, “అది నీ కవర్, తీసుకో!” అని చెబుతున్నట్లుగా అనిపించింది. ఈలోపు మా వాచ్మన్ వచ్చి, “అమ్మా, అది మీకు వచ్చిన పోస్టే, తీసుకోండి” అన్నాడు. ఆ కవర్ ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ తీసి చూస్తే, అది శిరిడీ సంస్థాన్ వారి పోస్టల్ అడ్రస్ ఉన్న కవర్. దానిలో బాబా ఊదీ ప్యాకెట్ ఉంది. ఆశ్చర్యం ఏమిటంటే, అది వేరే అడ్రస్ వారిది. కానీ ఆ అడ్రస్ లో ఉన్న ఫ్లాట్ నెంబర్, మా ఫ్లాట్ నెంబర్ ఒక్కటే. దాంతో పోస్ట్ మ్యాన్ అది మా ఫ్లాట్ కే వచ్చిందని చెప్పి ఆ కవర్ ఇచ్చి వెళ్ళిపోయాడట. శిరిడీ నుండి వచ్చిన బాబా ఊదీ చూడగానే ఆయన నాపై చూపిన కరుణకు ఎంతో ఆనందంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఇలా ఎన్నో విధాలుగా ఆ సాయితండ్రి తమ కృపను మాపై చూపుతూనే ఉన్నారు. బాబా అనుగ్రహం మనమీద ఉన్నా, పూర్వజన్మ కర్మానుసారం మనం కొన్ని బాధలను అనుభవించాల్సివస్తుంది. అలా బాబా సన్నిధిలో బాధలు అనుభవిస్తున్నప్పటికీ మనకు ఒక ధైర్యం ఉంటుంది. అదెలా అంటే, నాకేదైనా కష్టం కలిగితే, “నా కష్టాన్ని తీర్చడానికి బాబా ఉన్నారు, నా కష్టాన్ని పదే పదే చెప్పుకోవటానికి బాబా ఉన్నారు. నా బాధను పంచుకోవటానికి నాకంటూ ఒకరున్నారు” అని అనుకుంటాను. నేను సంతోషంగా ఉన్నా, బాధగా, బెంగగా, భయంగా, కోపంగా, చిరాకుగా ఎలా ఉన్నా బాబాతోనే మాట్లాడుతూ ఉంటాను. బాబాతో “నేను ఇంతే బాబా, నన్ను ఇలాగే మీరు భరించాల్సిందే, తప్పదు” అన్నట్టుగా ప్రవర్తిస్తుంటాను.
ఒకసారి మా చిన్నబ్బాయికి 6 సంవత్సరాల వయసున్నప్పుడు బాగా జ్వరం వచ్చి చాలారోజులు నీరసపడి కోలుకున్నాడు. హమ్మయ్య అనుకుంటుండగా మరలా జ్వరం తిరగబెట్టింది. బాగా నీరసపడిన మా బాబుని చూసేటప్పటికి నాకు ఏడవటానికి కూడా ఓపిక లేకపోయింది. ఒకరకమైన నిర్వేదమైన స్థితిలోకి వెళ్ళిపోయాను. ఏదో లోకంలో ఉంటూ, ఏదో ఆలోచిస్తూ ఉండేదాన్ని. ఆరోజు కూడా అలాగే చాలా బెంగపడుతూ పడుకున్నాను. మరుసటిరోజు మావారు ఆఫీసుకి, మా పెద్దబ్బాయి స్కూలుకి వెళ్ళాక, మా చిన్నబ్బాయి నిద్రలేచి నా దగ్గరకు వచ్చి నా ఒళ్ళో కూర్చుని, “అమ్మా! రాత్రంతా బాబా, మారుతి నాతోనే ఉన్నారమ్మా!” అని అన్నాడు. నాకు ఒక్కక్షణం వాడేమంటున్నాడో అర్థంకాక, “ఏంటమ్మా, ఏమిటి అంటున్నావు?” అన్నాను. వాడు తన బుజ్జి బుజ్జి మాటలతో, “అమ్మా! రాత్రి మనం అందరమూ పడుకున్నామా! అప్పుడు బాబా, మారుతి వచ్చి నన్ను, అన్నయ్యని నిద్రలేపి చాలాసేపు మాతో మాట్లాడారు. మేము నిన్ను, డాడీని లేపుతుంటే, “వద్దు, వాళ్లని పడుకోనీ, మేము మీతో ఆడుకోవటానికి వచ్చాము” అని బాబా అన్నారు. బాబా గ్రీన్ కలర్ ఫుల్ డ్రెస్ వేసుకుని ఉన్నారు. ఆయన చేతుల్లో ఓం గుర్తు, ప్లస్ గుర్తు (స్వస్తిక్ అని చెప్పటం తెలీక) ఉన్నాయి. బాబా నాకు, అన్నయ్యకి ఊదీ పెట్టి, “ఇంక నువ్వు చాలా బాగుంటావు, ఆరోగ్యంగా ఉంటావు. నీకు చాలా బలం వచ్చింది. చూడు, కావాలంటే మారుతిని గద ఇవ్వమను, అది పట్టుకునేంత బలం నీకు వచ్చింది” అని అనగానే, మారుతి తన గద ఇచ్చి పట్టుకోమంటే నేను ఆ గద తీసుకుని ఆడుకున్నాను” అని చెప్పాడు. అంతేగాక, బాబా మా అబ్బాయితో, “మీ అమ్మ అనవసరంగా మీ ఇద్దరి గురించి చాలా టెన్షన్ పడుతోంది. తను అలా ఏమీ టెన్షన్ పడక్కరలేదు. మీ ఇద్దరినీ నేను చూసుకుంటాను. మీరిద్దరూ డాక్టర్లు అవుతారు” అని చెప్పారట. నేను మా ఇద్దరి పిలల్ల కోసం సాయికోటి వ్రాస్తూ ఉంటాను. ఆ పుస్తకాలు వ్రాయటం పూర్తయ్యాక శిరిడీ వెళ్లినప్పుడు వాటిని అక్కడ హుండీలో వేస్తుంటాను. మా చిన్నబ్బాయి తన కలలో మా పూజగదిని బాబాకు చూపిస్తే బాబా అంతా పరికించి చూసి చిరునవ్వుతో నేను వ్రాసిన సాయికోటి పుస్తకం ఒకటి తమ చేతిలోకి తీసుకుని పేజీలు త్రిప్పుతూ నవ్వుకుంటూ ఉన్నారట. పిల్లలిద్దరికీ ఊదీ పెట్టి చాలాసేపు ఇద్దరితోనూ మాట్లాడుతూ ఉన్నారట. ఇలా మా అబ్బాయి తన కల గురించి చెప్పగానే బాబా చూపిన కరుణకు కదిలిపోయి నేను ఎంతసేపు ఏడ్చానో నాకే తెలీదు. ఇప్పుడు ఆ అనుభవాన్ని వ్రాస్తున్నప్పుడు కూడా ఆనందంతో నా కళ్ళవెంట కన్నీరు ఆగటం లేదు. బాబా స్వప్నదర్శనం ప్రసాదించి ఆశీర్వదించినప్పటినుంచి మా అబ్బాయిలో చాలా మార్పు కనిపించింది. తను ఎప్పుడూ మారుతి లాకెట్ మెడలో వేసుకుంటాడు. అస్సలు ఎప్పుడూ తీయడు. తనకు ఎలాంటి భయం వేసినా మా పూజగదిలో బాబా దగ్గరకు వెళ్ళి చెప్పుకుంటాడు. ఎప్పుడూ “బాబా, మారుతి నా ఫ్రెండ్స్” అంటూ ఉంటాడు.
రేపటిభాగంలో మా పెద్దబ్బాయికి సంబంధించిన అనుభవాలు పంచుకుంటాను.
nice babas leela om sai ram
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Wow! It is really nice experience.Baba! Nee karuna andaru meedha unchu tandri!!🙏🙏🙏🙏
ReplyDeleteOm sai ram..nice experience..
ReplyDeleteBaba ne karunakyi nenu vechi chustuna thandri
ReplyDeleteOm sai Ram
ReplyDeleteఓం సాయిరాం
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏
Om Sai Ram Jai Sai Master����
ReplyDelete