అసాధ్యమనుకున్నది సాధ్యం చేసి చూపించారు బాబా
నేను ఒక సాయి భక్తురాలిని. ముందుగా ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయి అన్నయ్యకు నమస్కారం. నా మనసులో వచ్చే ఎన్నో ప్రశ్నలకు బాబా ఈ బ్లాగులో నిత్యం నాకు సమాధానాలు ఇస్తూ ఉంటారు. “అన్నయ్యా! బాబా మీకు నిండు నూరేళ్ళు సకల ఐశ్వర్యాలు, మంచి ఆరోగ్యం, సంతోషం ఇవ్వాలని మనసారా వేడుకుంటున్నాను”. ఇంతకుముందు ఈ బ్లాగు ద్వారా నేను మీతో కొన్ని అనుభవాలను పంచుకున్నాను. ఇప్పుడు ఇటీవల బాబా ప్రసాదించిన మరో రెండు అనుభవాలను మీతో పంచుకుంటున్నాను.
మొదటి అనుభవం:
నేను బెంగళూరులో ఒక కార్పొరేట్ స్కూల్లో ఉద్యోగం చేస్తున్నాను. కరోనా కాలంలో మా స్వస్థలానికి వెళ్లి ఇంటి నుంచే పని చేస్తుండేదాన్ని. కొన్నిరోజులకు నాకు బెంగళూరు నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మా స్కూలువాళ్ళు మీటింగ్ పెట్టి, నన్ను ఖచ్చితంగా బెంగళూరు బ్రాంచికి రావాలని చెప్పారు. కానీ బెంగళూరులో కరోనా కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా, కరోనాకి భయపడి మా ఇంట్లోవాళ్ళు నన్ను 6 నెలల నుంచి ఇంటి గేటు కూడా దాటనివ్వడం లేదు. మేమందరం అంత స్ట్రిక్ట్‌గా, జాగ్రత్తగా ఇంట్లోనే ఉన్నాము. అందువలన, ‘మావాళ్లు నన్ను ఇంటి గేట్ కూడా దాటినివ్వరు, ఇంక బెంగళూరుకి పంపడం అసాధ్యం’ అనుకున్నాను. ‘సరే, బాబా ఏం చెబితే అదే చేద్దాం’ అనుకుని, బాబాను ప్రార్థించి, “బెంగళూరు వెళ్ళనా, వద్దా’ అని బాబా ముందు చీటీలు వేశాను. బాబా నన్ను బెంగుళూరుకి వెళ్ళమన్నారు. బాబా సమాధానం చూసి, “నాకేమీ అర్థం కావట్లేదు బాబా! ఈ పరిస్థితుల్లో ఇంట్లోవారిని ఒప్పించి సాహసించి బెంగుళూరుకి వెళ్లడం నావల్ల కాదు. కానీ మీరెందుకు ఇలా చెబుతున్నారు?” అని బాబాను అడిగాను.
ఇంట్లోవారికి నా ప్రయాణం గురించి చెప్పే ధైర్యం లేక ఆరోజంతా బాధపడుతూనే ఉన్నాను. చివరికి ధైర్యం చేసి మా తాతయ్యతో, “నేను బెంగళూరుకి వెళ్లాలనుకుంటున్నాను” అన్నాను. మా తాతయ్య ఒకే మాట – “రిజైన్ చెయ్యి!” అన్నారు. నాకు ఏడుపు వచ్చేసింది. ఏడుస్తూ బాబా దగ్గరకు వెళ్ళి, “బాబా! మీరేమో వెళ్లమంటారు, వీళ్లేమో వద్దంటారు, నేనేం చేయాలి? ఎందుకు మళ్ళీ నాకు ఇంకో పరీక్ష పెడుతున్నారు?” అని బాధపడ్డాను. తరువాత ధైర్యం చేసి ఇంకోసారి బాబా ముందు చీటీలు వేశాను. కానీ బాబాది ఒకే మాట – “బెంగళూరుకి వెళ్లు!” అని. ఇంక నేను బాబా చెప్పినట్టు చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. “నువ్వు చెప్పింది నేను చేస్తాను బాబా! కాదు, నువ్వే చేయించాలి. నేను నీ మాటే వింటాను” అని మనసులో అనుకుని మా తాతయ్యతో చెప్పాను. ఆయన, “నీ ఇష్టం, ఏమైనా చేసుకో, నన్ను అడగకు” అన్నారు. దాంతో నాకు విపరీతమైన తలనొప్పి వచ్చింది. మూడురోజులైనా తలనొప్పి తగ్గలేదు. ఒకప్రక్క బాబా, ఇంకొకప్రక్క ఇంట్లోవాళ్లు. కానీ, ‘నా బాబా నిర్ణయమే నా నిర్ణయం’ అనుకున్నాను. చివరికి మా తాతయ్య నా పరిస్థితి చూసి నేను బెంగళూరుకి వెళ్లడానికి ఒప్పుకున్నారు. నా తండ్రి నా విశ్వాసాన్ని గెలిపించాడు. నేను ఎప్పుడు ఏ సందేహం వచ్చినా చీటీల ద్వారానే బాబా అనుమతి పొందుతాను. దాన్ని కూడా నిజమని నిరూపించారు, అసాధ్యమనుకున్నది సుసాధ్యం చేసి చూపారు నా సాయి. “బాబా! మీకు ఏమి ఇచ్చినా, ఎంత చేసినా మీ ఋణం తీర్చుకోలేను తండ్రీ! ఎప్పుడూ మీ పాదధూళి క్రింద నాకు చోటివ్వండి. ఈ జన్మకి నాకు అంతే చాలు బాబా!”
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
రెండో అనుభవం:
నేను ఒక కార్పొరేట్ స్కూల్లో ఉద్యోగం చేస్తున్నానని చెప్పాను కదా! అక్కడ పని చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా, నేను ఉద్యోగం చేసే చోటు మా ఇంటికి చాలా దూరంలో ఉంటుంది. కాబట్టి మా ఇంట్లోవారికి నేను అక్కడ ఉద్యోగం చేయడం సుతరామూ ఇష్టం లేదు. ఎప్పుడు చూసినా ‘అక్కడ ఉద్యోగానికి రాజీనామా చేయి’ అని అంటూ ఉంటారు. ఎందుకంటే అంత కష్టంగా ఉంటుంది అక్కడి పని. కానీ నాకు మాత్రం ఆ ఉద్యోగ వాతావరణం బాగా అలవాటయిపోవటం వల్ల వాళ్లకు నచ్చజెబుతూ ఉద్యోగం కొనసాగించేదాన్ని. కానీ ఒకరోజు మా ఇంట్లోవాళ్ళు నాతో ఖరాఖండీగా, “వచ్చే సంవత్సరం నుండి నువ్వు అక్కడ ఉద్యోగం చేయడానికి వీల్లేదు. ఇంటికి దగ్గరగా ఏదైనా ఉద్యోగం చూసుకో, లేదంటే ఇంట్లో ఉండాల్సిందే” అన్నారు. కానీ, నా మనసుకు మాత్రం ఆ ఉద్యోగాన్ని వదులుకోవడం అస్సలు ఇష్టం లేదు. ఇంక చేసేది లేక బాబా ముందు చీటీలు వేశాను. ఇంటి దగ్గరగా వున్న బ్రాంచికి బదిలీ చేయించుకోమని బాబా సమాధామనిచ్చారు. కానీ ఆ బ్రాంచిలో ఆదివారాలలో, పండుగల సమయంలో కూడా సెలవులు ఉండవు. పైగా పని ఒత్తిడి చాలా ఎక్కువగా కూడా ఉంటుంది. కానీ చేసేది లేక ఇంట్లోవారి మాట కోసం అయిష్టంగానే బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నాను. నేను ఇంతకుముందు పనిచేసిన బ్రాంచివాళ్ళు నాకు కాల్ చేసి, “ఇక్కడికే వచ్చేయండి, ఆ బ్రాంచి బాగలేదు, మీకు ఇంకా కష్టం అవుతుంది” అన్నారు. నేను, “లేదు, నేను రాలేను” అని చెప్పాను, ఆ బ్రాంచి నుంచి నా స్నేహితురాలు కాల్ చేసి, “ప్లీజ్! మీరు ఇక్కడికి వచ్చెయ్యండి, మీరు లేకుండా ఇక్కడ నాకు ఏం బాగలేదు” అని బ్రతిమాలింది. “మా ఇంట్లోవారు నూరుశాతం పంపించరు, నేను ఏమీ చెయ్యలేను. నేను అక్కడికి రావాలని అంతగా నీకు ఉంటే బాబాను వేడుకో!” అని చెప్పాను.
ఇక మరుసటిరోజు బదిలీ విషయం తెలుస్తుందనగా నేను బాబా ముందు చీటీలు వేశాను. బాబా నన్ను అంతకుముందు పనిచేసిన బ్రాంచిలోనే ఉద్యోగం చేయమన్నారు. అంతే! నా ఆనందానికి అవధులు లేవు. కానీ అంతలోనే, “బాబా! నువ్వు అనుమతి ఇచ్చావు. కానీ ఇంట్లోవారు నన్ను అక్కడికి అస్సలు పంపరు” అని బాబా ముందు ఏడ్చాను. ఏదైతే అదవుతుందని బాబా మీద ఉన్న నమ్మకంతో బదిలీని రద్దు చేయించుకున్నాను. తరువాత నా నిర్ణయాన్ని ఇంట్లోవారికి చెప్పాను. దానికి వాళ్ళు, “సరే అయితే, నువ్వు ఇంట్లోనే వుండు, నువ్వక్కడ ఉద్యోగం చెయ్యడం అస్సలు కుదరదు” అన్నారు. నేను బాబా ఇచ్చిన సందేశంపై నమ్మకంతో “నేను అక్కడే ఉద్యోగం చేస్తాన’ని చెప్పాను. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. ఆ తరువాత ఒక అంకుల్ మా తాతయ్యకు కాల్ చేసి, నేను వర్క్ చేస్తున్న బ్రాంచి చాలా బాగుందని చెప్పి, “ఎందుకు మీరు అమ్మాయిని అక్కడ ఉద్యోగం చేయొద్దంటున్నారు? అలా చెయ్యకండి” అని చెప్పి మా తాతయ్యను ఒప్పించారు. నాకైతే బాబానే ఆయన రూపంలో వచ్చి మా ఇంట్లోవారిని ఒప్పించినట్టు అనిపించింది. దాంతో నాకు పాత బ్రాంచిలోనే ఉద్యోగం చేయడానికి ఇంట్లోవారి నుండి అనుమతి వచ్చింది. అసాధ్యమనుకున్నది సాధ్యం చేసి చూపించారు నా బాబా. నా స్నేహితురాలు కూడా, “నిజమే! నీ బాబా చాలా గ్రేట్!” అని చాలా ఆనందించింది.
బాబా ప్రణాళికలను అర్థం చేసుకోవడానికి మనకు చాలా సమయం పడుతుంది. కానీ, ఆయన ప్రణాళికలు మాత్రం చాలా పక్కాగా ఉంటాయి. చివరివరకు ఆయన ప్రణాళిక మన గమ్యానికి చాలా వ్యతిరేకంగా ఉంటుంది, కానీ చివరకు ఆయన మనలను మన గమ్యానికి సురక్షితంగా చేరుస్తారు.
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
Jai sairam
ReplyDeleteOm sai ram please bless my daughter, son, hubby with long life. Please be with them. Please save us from corona virus
ReplyDeleteOm sai ram please bless my family with long life. Please save us from corona virus.
ReplyDeleteOm sai ram
ReplyDeleteBaba memu anukunavi tondarga jargile chudu thandri
ReplyDeleteశ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Nene naaku lone vaste e blacklo naa anubhavam panchukuntaanani babaku mokkukunnanu. Naku lone sanction ayyi naa ardhika paristiti marindi. Babaku satakoti namaskaralu.... jai sairam jaisairam jaisairam
ReplyDeletemee anubhvanni kinda telipina vidhamgaa chakkagaa vrasi pampandi sai. blogulo prachuristam. andaru baba miku prasadinchina anandanni aswadistaru. comment lo pedite yevaro koddimandi matrame chustaru sai.
Deleteవిజ్ఞప్తి: సాయి భక్తులకు మనవి. బాబా మీకు ప్రసాదించిన అమూల్యమైన అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా తోటి సాయిభక్తులతో పంచుకోవాలనుకుంటే మీ అనుభవాలను...
1. వీలయితే తెలుగులో టైపు చేయండి.
2. లేకుంటే ఇంగ్లీషులో అంటే *'sai bandhuvulaku namaskaram'* ఇలా టైపు చేయండి.
3. లేకుంటే స్పష్టంగా పేపర్ మీద వ్రాసి, ఫోటో తీసి పంపండి.
4. తెలుగు వ్రాయడం రాని వారు ఇంగ్లీషులో టైపు చేసి పంపొచ్చు.
5. పైవేవీ మీకు సాధ్యపడనిచో చివరి ప్రయత్నంగా మాత్రమే ఆడియో రూపంలో పంపండి.
అలా సిద్ధం చేసిన మీ అనుభవాలను క్రింద ఇవ్వబడిన మెయిల్ఐడి/వాట్సాప్/టెలిగ్రామ్ నెంబరుకి పంపించండి.
saimaharajsannidhi@gmail.com
+917842156057
Baba,om srisairam
ReplyDelete