సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తి సాధన రహస్యం - సాయిభక్తులకు శ్రీగురుచరిత్ర పారాయణ విధాయకమా?




సాయిభక్తులకు శ్రీగురుచరిత్ర పారాయణ విధాయకమా?

గురుభక్తి ప్రబోధాత్మకమైన ‘శ్రీగురుచరిత్ర’ సాధకులకు శిరోధార్యమైనది. అందులో వర్ణింపబడ్డ గురుమహిమ, గురుస్తుతి వంటి గురుభక్తి ప్రబోధాత్మకమైన అంశాలు ఆధ్యాత్మిక సాధన మనుగడకు ఆహారం వంటివి. ప్రాతఃస్మరణీయులైన శ్రీపాద శ్రీవల్లభస్వామి, శ్రీనృసింహసరస్వతీస్వామి వంటి మహాత్ముల చరిత్రలు సాధకులు అవశ్యం పఠింపవలసినవి. అయితే, సంత్ కబీర్, జ్ఞానేశ్వర్ మహరాజ్, తుకారాం మహరాజ్, ఏకనాథ్ మహరాజ్, శ్రీసాయిబాబా మొదలైన ఎందరో సద్గురుమూర్తులచే ‘కాలదోషం’ పట్టించబడ్డ ఎన్నో ఛాందస ఆచారాలు, దురాచారాలు, మూఢవిశ్వాసాలు (కొన్ని చారిత్రక కారణాల ప్రభావం వల్ల) ఆ గ్రంథంలో ‘చొప్పించ’బడ్డాయి. దానికి తోడు, పరిపూర్ణమైన శ్రీసాయిసంప్రదాయం దత్తసంప్రదాయంలో ‘ఒక భాగం’ మాత్రమేనని, సాయిభక్తులకు సాయిచరిత్ర కంటే శ్రీగురుచరిత్ర పారాయణే ప్రధానమనే ప్రచారం ఒకటి ఇటీవల ప్రారంభమైంది. కానీ, శ్రీసాయిబాబా తమ లీలాప్రబోధాల ద్వారా మానవాళి కందించిన మహిత సంప్రదాయానికీ, శ్రీగురుచరిత్రలో చొప్పించబడ్డ కాలదోషం పట్టిన కొన్ని సంప్రదాయ ‘అవశేషాలకు’ మధ్యనున్న వైరుధ్యం దృష్ట్యా ఎందరో సాయిభక్తులు శ్రీగురుచరిత్ర పారాయణ వల్ల కొంత భావసంఘర్షణకు గురవుతున్నారు. ఈ పరిస్థితులలో దత్తసాంప్రదాయం యొక్క పుట్టుక-పరిణామం, ఆ సాంప్రదాయం యొక్క ముఖ్యలక్ష్యాలు-లక్షణాలు, అవి శ్రీగురుచరిత్రలో ఎంతవరకు ప్రతిబింబిస్తున్నాయి, ఇవి శ్రీసాయిసంప్రదాయంలో ఎంతవరకు ఇముడుతాయి, మొదలైన అంశాలను కొంతైనా పరిశోధించి అవగాహన చేసుకోవడం ఎంతైనా అవసరం! 

పరిపూర్ణ సద్గురు స్వరూపానికి పర్యాయపదం దత్తస్వరూపం. అన్ని మత సాంప్రదాయాల, ఆధ్యాత్మిక తత్త్వదర్శనాలకు మూలం సద్గురుమూర్తుల లీలాప్రబోధాలే. వేదాలు - సత్యద్రష్టలైన మహర్షుల దర్శనాలు; ఆ దర్శనాల ఆదర్శమే వైదిక మతానికి పునాదులు; హైందవ ధర్మానికి ఒరవడి - మహర్షుల నడవడి. అందుకే వేదాన్ని నిత్యం పారాయణ చేయమనీ, అలా పారాయణ చెయ్యటం ద్వారా వేదసారాన్ని గ్రహించి, తదనుగుణంగా నడచుకొమ్మని వైదికధర్మం ఉద్బోధిస్తున్నది, “వేదోనిత్యమధీయతాం, తదుతితం కర్మస్వనుష్ఠ్యతాం!”  అని. తత్త్వతః యీ వేదపారాయణ వైదిక సాంప్రదాయంలో విధించబడ్డ గురుచరిత్ర – ప్రబోధాల పారాయణే!

యూదులలో ఏసుక్రీస్తుకు ముందు ప్రభవించిన ప్రవక్తల (సద్గురువుల) జీవిత ప్రబోధాలు యూదుమతానుయాయుల పవిత్రపారాయణ గ్రంథమయితే, ఏసుప్రభువు యొక్క చరిత్ర-బోధనలు (బైబిల్) క్రైస్తవుల పవిత్రపారాయణ గ్రంథము. బైబిల్ లో ఏసుక్రీస్తును ‘రబ్బీ’ (the Master, సద్గురువు) అని ప్రస్తావించబడి వుంది. ఇక, మహమ్మద్ ప్రవక్త జీవితవిశేషాలు-బోధనల రూపమైన ఖురాన్ మహమ్మదీయులు శ్రద్ధగా పారాయణ చేసుకునే పవిత్రగ్రంథం. అంటే, అవన్నీ ఆయా మతసాంప్రదాయాలను ప్రవర్తిల్లచేసిన పరిపూర్ణ సద్గురుమూర్తుల చరిత్ర-బోధనల పారాయణన్న మాట!

తపస్సంపన్నులు, సత్యద్రష్టలు యైన మహర్షులు, సద్గురువులు, ఆచార్యులు వైదిక సంప్రదాయాన్ని ప్రభావితం చేస్తున్నంత కాలం వైదికమతం విజ్ఞానస్ఫూర్తితో విలసిల్లింది. క్రమంగా యజ్ఞయాగాది కర్మకాండ యొక్క ప్రాబల్యం పెరిగి, తాత్త్విక ఆధ్యాత్మికపరమైన గురుసాంప్రదాయం సన్నగిల్లింది. తపఃస్వాధ్యాయ నిరతి, జ్ఞానప్రబోధనా సామర్థ్యం ఆచార్యస్థానానికి అర్హతలవడం మాని, ఆచార్యపదవి కేవలం వంశపరంపరాగతమో, వారస్తవపరంగానో మిగిలింది. ఆచార్యపీఠాలు అర్చకపీఠాలుగా మారిపోయాయి. ఇలా, సమర్థమైన గురుసాంప్రదాయం గుప్తమై లుప్తమై, కేవలం జడమైన కర్మకాండ ప్రబలమైంది. కేవలం ‘తంతు’ తలకెక్కితే, ఏ మతసాంప్రదాయమైనా వి'తంతు'వు కాక తప్పదు!

ఆ పరిస్థితిలో అప్పటివరకు గుప్తవాహినియైన సరస్వతీ నదిలా ప్రవహిస్తున్న గురుసాంప్రదాయం వాసుదేవతత్త్వంగా వెలికి వచ్చి, శ్రీకృష్ణుని ద్వారా భారతీయసంస్కృతిని తిరిగి పరిప్లావితం చేసింది. సర్వజీవుల హృదయాలలో వసించే దివ్యత్వమే వాసుదేవుడు. ఈ సత్యాన్ని వారికి బోధించి, వారిచే ఆ దివ్యత్వాన్ని దర్శింపచేయడానికి ఆ వాసుదేవతత్త్వమే జీవులమధ్య అవతరించి సద్గురుమూర్తులుగా వసిస్తుంది. అలా మనమధ్య వసించే దివ్యస్వరూపులైన సద్గురుమూర్తులే వాసుదేవులు. ఇదే, తరువాతి కాలంలో భాగవతసాంప్రదాయంగా ప్రఖ్యాతమైంది.

శ్రీకృష్ణవాసుదేవుని కృషితో పెంచబడ్డ యీ భాగవతకల్పవృక్షం తరువాతి కాలాల్లో శాఖోపశాఖలై విస్తరించి, ప్రఖ్యాతమైన వివిధ భక్తి జ్ఞాన యోగ సాంప్రదాయాలకు మూలకందమైంది. జైనసాంప్రదాయాలలోని తీర్థంకరసిద్ధాంతం, బౌద్ధంలోని బోధిసత్వుల జనన సిద్ధాంతం, టిబెట్ బౌద్ధంలోని పద్మసంభవ సాంప్రదాయం, యీ వాసుదేవతత్త్వ ప్రభావం వల్ల ప్రభవించిన అవైదిక రూపాలు.

శ్రీకృష్ణనిర్యాణం తరువాత కొన్ని శతాబ్దాలకు కృష్ణవాసుదేవుని ఒక జగద్గురు స్వరూపంగాకాక, లీలామానుషవిగ్రహుడుగా ఆరాధింపబడటం ప్రారంభమై ‘వాసుదేవుడ’నేది శ్రీకృష్ణుని పర్యాయనామం అవడంతో, (మూల) వాసుదేవతత్త్వం (గురుసాంప్రదాయం) వేరువేరు పేర్లతో ప్రచారమైంది. వాటిలో ముఖ్యమైనది దత్తాత్రేయతత్త్వం.

శ్రీకృష్ణనిర్యాణం తరువాత కొన్ని శతాబ్దాలకు కృష్ణవాసుదేవుని ఒక జగద్గురు స్వరూపంగాకాక, లీలామానుషవిగ్రహుడుగా ఆరాధింపబడటం ప్రారంభమై ‘వాసుదేవుడ’నేది శ్రీకృష్ణుని పర్యాయనామం అవడంతో, (మూల) వాసుదేవతత్త్వం (గురుసాంప్రదాయం) వేరువేరు పేర్లతో ప్రచారమైంది. వాటిలో ముఖ్యమైనది దత్తాత్రేయతత్త్వం.

భాగవత సాంప్రదాయానికి వేదతుల్యమైన శ్రీమద్భాగవతము దత్తాత్రేయుల వారిని విష్ణుమూర్తి యొక్క 23 అవతారాలలో ఒకరిగా, యోగవిద్యను ప్రవర్తిల్లజేసిన సద్గురువుగా పేర్కొంటున్నది. భాగవత సాంప్రదాయమనే మహావృక్షం నుండి ఒక ప్రత్యేక శాఖగా బయలుదేరిన యీ దత్తసాంప్రదాయం ఉత్తర భారతదేశంలో – ముఖ్యంగా మహారాష్ట్ర దేశంలో – శాఖోపశాఖలుగా విస్తరించింది. నాథ, మహానుభావ, దత్త సాంప్రదాయాలు వీనిలో ముఖ్యమైనవి.

ఈ ఉపశాఖలలో దత్తాత్రేయులవారిని ప్రధానంగా ఆరాధించే దత్తసాంప్రదాయం మహారాష్ట్రదేశంలో శ్రీపాద శ్రీవల్లభులు, శ్రీనృసింహ సరస్వతీస్వామి వారివల్ల విఖ్యాతమైంది. ఈ సాంప్రదాయకులను ‘దత్తుల’ని అంటారు. ఇది ప్రధానంగా యోగమార్గానికి సంబంధించినది. పురాణేతిహాసాలు దత్తాత్రేయులవారిని యోగనాధుడనే పేర్కొన్నాయి. దత్తాత్రేయులవారు వివిధ కాలాల్లో, వివిధ ఆధ్యాత్మిక మార్గాలను ప్రవర్తిల్లజేయడానికి వివిధ సద్గురుమూర్తుల రూపంలో అవతరిస్తుంటారనేది యీ సాంప్రదాయకుల విశ్వాసం. ఇది భాగవత సాంప్రదాయంలో చెప్పబడ్డ విష్ణుఅవతార సిద్ధాంతానికి (‘సంభవామి యుగేయుగే’) ప్రతిరూపం. “గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః” అన్న శాస్త్ర (స్కాందపురాణ) వచనానుసారం పరిపూర్ణ సద్గురుతత్త్వమైన దత్తమూర్తిని త్రిమూర్త్యాత్మకుడుగా భావించి తదనుగుణంగా ఆయన మూర్తిని రూపకల్పన చెయ్యటం జరిగింది. అందుకే దత్తమూర్తి మూడుతలల మూర్తి అయ్యాడు. అయితే, ఇది దత్త సాంప్రదాయం ఒక ప్రత్యేకశాఖగా రూపొందుతున్న కాలంలో జరిగిందే. ఎందుకంటే భాగవత, బ్రహ్మాండ, బ్రహ్మ, మార్కండేయ పురాణాలేవీ దత్తాత్రేయుల వారిని త్రిమూర్త్యాత్మకుడుగా పేర్కొనడం లేదు! అత్రి అనుసూయలకు విష్ణు అంశంలో దత్తాత్రేయులు జన్మించారని మాత్రం కొన్ని పురాణాలు చెబితే, మరికొన్ని పురాణాలు అత్రిఅనసూయలకు మొత్తం ముగ్గురు కుమారులనీ, వారిలో విష్ణ్వాంశలో దత్తస్వామి, రుద్రాంశలో దుర్వాసముని, బ్రహ్మాంశలో చంద్రుడు జన్మించారని చెబుతున్నాయి. దత్తసాంప్రదాయాల్లో దత్తమూర్తిని పరదైవంగా ఉపాసించడం ప్రారంభమైన తరువాతే దత్తమూర్తిని త్రిమూర్త్యాత్మకుడిగా (మూడుతలల మూర్తిగా) భావనచేసి ఆరాధించడం ఆరంభమైంది. ఈ గురుసాంప్రదాయం బహుళప్రచారం పొందిన ఫలితంగా, అందరు సద్గురువులను (వారిలో వ్యక్తమైన సిద్ధి, పరిపక్వత దృష్ట్యా) దత్తాత్రేయుల వారి అంశావతారాలుగానో, పూర్ణావతారాలుగానో భావించడం మహారాష్ట్రదేశంలో ఆచారమైంది. ఈ దృష్ట్యానే శ్రీసాయిబాబాను కూడా దత్తావతారంగా అక్కడ భావిస్తారు. అంతే తప్ప శ్రీసాయిబాబా తాము దత్తావతారమని ఎక్కడా ఎన్నడూ ప్రకటించలేదు. సర్వదేవతాస్వరూపాలు తానే అని నిరూపణ ఇచ్చిన బాబా, కొందరు దత్తభక్తులకు తానే దత్తమూర్తినని కూడా నిదర్శనమిచ్చారు, అంతే!

మహారాష్ట్ర దేశంలో దత్తోపాసన నాథసాంప్రదాయంతో ప్రారంభమై, శ్రీపాదశ్రీవల్లభుల తరువాత ఒక ప్రత్యేక ఉపాసనా సాంప్రదాయంగా రూపుదిద్దుకొని, తరువాత శ్రీనృసింహసరస్వతీస్వామి (శ్రీగురుని) వల్ల ప్రఖ్యాతమైంది. ఈ నాథ దత్తసాంప్రదాయాలతో బాటు, మహానుభావ సాంప్రదాయమనేది మహారాష్ట్ర దేశంలో బాగా వేళ్ళూనుకొన్న సాంప్రదాయం. శ్రీగోవింద ప్రభువుచే ప్రారంభించబడినదని చెప్పబడే యీ పంథా, చక్రధరుల వల్ల బాగా ప్రాచుర్యం పొందింది. మొదట భాగవత సాంప్రదాయాన్ని పూర్తిగా అవలంబించి, శ్రీకృష్ణుడినొక్కడినే పరాదైవతంగా ఆరాధించిన యీ పంథా తర్వాతికాలంలో దత్తోపాసనను కూడా స్వీకరించింది. భగవద్గీత, భాగవతము, చక్రధరులు రచించిన ‘సూత్రపాఠము’ తప్ప, కడకు వేద ప్రామాణ్యాన్ని కూడా ఈ పంథా అంగీకరించకపోవడం వల్ల, వర్ణాశ్రమ వ్యవస్థ (కుల వ్యవస్థ)ను తీవ్రంగా వ్యతిరేకించడం వల్ల ఆ కాలంలో యీ పంథా అగ్రవర్ణాల ఆగ్రహానికి గురై, ఎన్నో విమర్శల అపనిందల పాలైంది.

ఛాందస వైదికాచారాలకు వ్యతిరేకంగా బయలుదేరిన నాథసాంప్రదాయానికి, పూర్తిగా వేదప్రామాణ్యాన్నే త్రోసి పుచ్చిన మహానుభావ పంథాకు స్ఫూర్తినిచ్చి ఎంతో ప్రభావితం చేసిన దత్తాత్రేయయోగ సాంప్రదాయం తరువాత కాలంలో పరమఛాందసమైన వైదిక కర్మకాండకు నెలవైంది!  ఎన్నో చారిత్రక కారణాలకు తోడు యీ పరిణామానికి ఒక కారణం – ‘శ్రీగురుచరిత్ర’!!

శ్రీనృసింహసరస్వతిస్వామి (c 1378-1458) నిర్యాణానంతరం సుమారు ఒక శతాబ్దం తరువాత (1538 ప్రాంతంలో) గంగాధర సరస్వతి అనే ఒక దత్తభక్తుడు మరాటీభాషలో యీ గ్రంథాన్ని రచించాడు. తాను శ్రీగురుని అనుమతితో ఆ గ్రంథం వ్రాస్తున్నానని శ్రీగంగాధర సరస్వతి వ్రాసిన ఒక్కమాట ఆధారంగా, గంగాధరుని శ్రీనృసింహ సరస్వతీ స్వామి వారి సమకాలికునిగా కొందరు చేసిన నిర్ణయం సరైనది కాదు. గంగాధరుని ‘అనుమతి’ ప్రసక్తి కేవలం గ్రంథరచనా సాంప్రదాయానికి సంబంధించినదే. 1854 -1914 మధ్యకాలంలో జీవించిన శ్రీవాసుదేవానంద సరస్వతీ స్వామి కూడా శ్రీగురుచరిత్రను సంస్కృతభాషలోకి అనువదిస్తూ, తాను దత్తస్వామి ‘ప్రత్యక్ష’ ఆజ్ఞ మేరకు ఆ గ్రంథరచన చేస్తున్నానని వ్రాసారు. అంతేకాక, శ్రీనృసింహ సరస్వతిస్వామికి ఐదుతరాల తర్వాత గంగాధరుడు జన్మించినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయి కూడా. దీనివల్ల స్పష్టమయ్యేదేమంటే, గంగాధరసరస్వతి స్వయంగా శ్రీగురుని ముఖఃతా వారి బోధను వినే అవకాశంలేదు. అంతకుముందు సిద్ధముని అనే దత్తభక్తుడు రచించాడని చెప్పబడే చిన్న సంస్కృత గ్రంథం ఆధారంగానూ, తాను కర్ణాకర్ణిగా విన్న విషయాల ‘ఆధారంగా’ను శ్రీపాద శ్రీవల్లభుల (c 1323-53) యొక్క, శ్రీగురుని యొక్క జీవిత విశేషాలను గ్రంథస్తం చేసాడు శ్రీగంగాధరసరస్వతి.

హిందూ-ముస్లిం మతాల సమైక్యతసాధనకు కృషి చేసిన ఆధ్యాత్మిక ఉద్యమాలలో దత్తసంప్రదాయానికి చెందిన నాథపంథీయులు, శ్రీనృసింహసరస్వతీస్వామి వారివల్ల ప్రభావితులైన దత్తపంథీయులు వున్నారు. అయితే, శ్రీనృసింహసరస్వతీస్వామి అనంతరం ఉత్తర కర్ణాటక, మహారాష్ట్రలలో నెలకొన్న సామాజిక రాజకీయ పరిస్థితుల ప్రభావం వల్ల ఇస్లాం మతప్రాబల్యాన్నరికట్టి, సనాతన హైందవధర్మాన్ని పునరుద్ధరించే లక్ష్యంతో కొందరు ఉద్యమించారు. ఆ ఉద్యమం ‘మహారాష్ట్ర ధర్మం’ పేర తరువాత ప్రఖ్యాతమైంది. దత్తపంథీయులు కూడా ఆ ఉద్యమాలచే ప్రభావితులయ్యారు. ఆ కాలంలో రచింపబడ్డ శ్రీగురుచరిత్ర ‘మహారాష్ట్ర ధర్మాన్ని’ ప్రతిపాదించిన ప్రథమ గ్రంథమని చెప్పవచ్చు. సామాజిక ప్రతిఘటనా రూపమైన ఈ ‘మహారాష్ట్ర ధర్మోద్యమం’ తరువాత కాలంలో శ్రీసమర్థ రామదాసస్వామివారి స్ఫూర్తితో పరాకాష్ఠ నందుకుంది. అందుకనే, శ్రీగురుని జీవితవిశేషాలను గ్రంథస్తం చేయడంతో బాటు వివిధ పురాణాలనుండి వ్రతప్రాయశ్చిత్త మహిమ, కర్మకాండ ప్రాశస్థ్యాన్ని వర్ణించే విషయాలను తనకు తోచిన విధంగా ఎంపిక చేసి, శ్రీగురునినోట చెప్పించాడు శ్రీగంగాధరసరస్వతి. గంగాధరుడు తన శ్రీగురుచరిత్రలో శ్రీగురుని నోట పలికించిన ‘బోధ’ యథాతథంగా కొన్ని పురాణగ్రంథాలలో మనకు కనిపిస్తుంది.

శ్రీగురుచరిత్రలోనే చెప్పబడినట్లు మహమ్మదీయులను (రజకుల వంటి) శూద్రులను ఆదరంతో శిష్యులుగా స్వీకరించిన శ్రీగురుడు కుల వ్యవస్థను ప్రోత్సహించాడనటం హాస్యాస్పందం. సతీసహగమనం వంటి దురాచారాల ప్రశంస, రుద్రాక్షమహిమ వంటి బాహ్యాచారాడంబరాల పొగడ్త, కృశ్చచాంద్రాయణాది ప్రాయశ్చిత్త కర్మల, వివిధవ్రతవిధానాల స్తోత్రము, వర్ణాశ్రమ ధర్మాల (కులవ్యవస్థ) సమర్ధన, పాతివ్రత్య మహిమ, స్త్రీ నింద, వివిధ బాహ్య శౌచ ప్రక్రియల వివరణ, కర్మకాండ మొదలయినవన్నీ శ్రీగురుని నిజబోధ అయ్యే అవకాశం లేదు. అర్థరహితమైన ఆచార కర్మకాండలకు వ్యతిరేకంగా ప్రవర్ధిల్లిన భాగవతసాంప్రదాయంలో జనించి, వైదికాచారకాండను, కులవ్యవస్థను తీవ్రంగా నిరసించిన నాథసాంప్రదాయాన్ని, వేదప్రమాణాన్నే త్రోసిరాజని, పరమ ‘అవైదిక’ మతంగా గణుతికెక్కిన మహానుభావపంథాను ప్రభావితం చేసిన దత్తసాంప్రదాయం శ్రీగురుచరిత్రలో (పైన) పేర్కొన్న అంశాలకు ఆలంబనమెలా కాగలదు?

అంతేకాక, దత్తాత్రేయులవారు వాతరశనఋషి సాంప్రదాయానికి చెందినవాడని ప్రతీతి. వాతరశనులు ‘శ్రమణుల’ని శ్రీమద్భావగవతము స్పష్టంగా పేర్కొంటున్నది, “వాతరశనాయ ఋషియః శ్రమణా....”. జైనులు శ్రమణులు; బౌద్ధమతంపై కూడా శ్రమణుల ప్రభావం వుంది. ఈ శ్రమణులు పరమ అవైదికులుగా పురాణేతిహాసాలలో ప్రసిద్ధి. ఈ శ్రమణమతం వేదప్రామాణ్యాన్ని అంగీకరించదు; వైదిక కర్మకాండను నిరసిస్తుంది; కులవ్యవస్థను తూర్పారబడుతుంది. ఈ విధంగా చూచినా ‘శ్రీగురుచరిత్ర’లో గంగాధర సరస్వతిచే శ్రీగురుబోధగా చెప్పబడ్డ అంశాలు నిజమైన దత్తసాంప్రదాయంలో ఇమడవు.

అలాకాదు, సర్వవైదికాచారాలను విసర్జించిన అవధూతతత్త్వం, పరమ ఛాందసమైన కర్మకాండపరమైన సంప్రదాయం – ఈ రెండూ దత్త సాంప్రదాయమనే నాణానికి బొమ్మబొరుసుల వంటివని కొందరు ప్రవచిస్తారు. ఇది కేవలం పైన చెప్పిన ఆధ్యాత్మిక తిరోగమన ధోరణిని సమర్థించే వంచనాశిల్పంలో భాగమే తప్ప, దీనికి ఏ విధమైన నిర్దిష్ట శాస్త్రాధారం లేదు. అత్రిమహర్షి యే ‘పుత్రకామేష్టి’ వంటి యాగమో చేసి దత్తమూర్తిని పుత్రుడుగా పొందలేదు. వాతాశనుడై (ప్రాణాయామం ద్వారా) అత్రిమహర్షి చేసిన తపోయోగ ఫలితంగా దత్తమూర్తి ఆవిర్భవించాడు. అత్రి సాంప్రదాయానికి దత్తుడై దత్తాత్రేయుడైనాడు. మహాతపస్విగ, సిద్ధుడుగ, యోగనాథుడుగ, సర్వబాహ్యాచారవర్జితుడైన అవధూతగ, (కొన్నిచోట్ల) మద్యమాంస మైధునముల వంటి అవైదిక (తాంత్రిక) విధానాలలో మగ్నమైనవాడుగ మనకు పురాణేతిహాసాలలో దత్తాత్రేయులవారు దర్శనమిస్తారు. యదుమహారాజు, కార్తవీర్యార్జునుడు మొదలయిన వారికి దత్తాత్రేయులవారు చేసిన బోధలో కూడా ఎక్కడా కర్మకాండ కనిపించదు. భక్తి, జ్ఞాన, యోగ మార్గాల త్రివేణీ సంగమమే దత్త సాంప్రదాయం. పైన పేర్కొన్న ఆధారాల దృష్ట్యా శ్రీగురుచరిత్రలో శ్రీగురుని బోధనలుగా చెప్పబడ్డ విషయాలు మూల దత్తసంప్రదాయానికి విరుద్ధమైనవనీ, అవి కేవలం గంగాధర సరస్వతి (పురాణోక్తంగా) చేసిన స్వకపోలకల్పలేననీ స్పష్టమవుతుంది.

అయితే, మరి శ్రీనృసింహసరస్వతీస్వామివారి యథార్థబోధ ఏమై యుండాలనే ప్రశ్న పైన చేసిన చర్చ యొక్క పర్యవసానంగా కలగడం సహజం. శ్రీగురుని బోధనలు కూలంకషంగా విని, ఆయనచే ఉపదేశం పొంది, ఆయన సన్నిధిలో సాధనచేసి పరిపూర్ణులైన ప్రత్యక్ష శిష్యుల ద్వారా తప్ప శ్రీగురుని యదార్థబోధ తెలిసే అవకాశం లేదు. అటువంటి వారిలో శ్రీజనార్దనస్వామి ఒకరుగ మనకు కనిపిస్తున్నారు. (మహారాష్ట్రకు చెందిన) ప్రముఖ పండితుడు-పరిశోధకుడుయైన ప్రొఫెసర్ G.S.ఘురే(Prof. G.S.Ghurye) యీ విషయంగా, “హిందూ-మహమ్మదీయుల మధ్య సామరస్య సాధన దత్తసంప్రదాయ ముఖ్య లక్షణమనేది స్పష్టం. సంత్ జనార్దనస్వామి, ఆయన శిష్యులైన ఏకనాథుడు తదితరులు అసలైన దత్తసంప్రదాయానికి ప్రతినిధులు. అయితే, యీ సంప్రదాయం శ్రీపాద శ్రీవల్లభులు, శ్రీనృసింహసరస్వతీస్వామి వార్ల వల్ల ప్రజాబాహుళ్యంలో బహుళ ప్రచారాన్ని పొందింది” అంటారు. సంత్ ఏకనాథ్ మహరాజ్ గురువుగా శ్రీజనార్దనస్వామి ప్రఖ్యాతుడు. శ్రీజనార్దనస్వామి మొదట భోగలాలసునిగా వుండి, శ్రీనృసింహసరస్వతిస్వామివారి బోధనలచే ప్రభావితుడై, పరివర్తన చెంది, శ్రీగురునిచే (గాణుగాపూరులోని ఔదుంబర వృక్షఛాయలలో) దత్తోపాసనలో ఉపదేశం పొంది, ఆయన సన్నిధిలోనే సాధనచేసి పరిపూర్ణుడైనాడని చెప్తారు. ఈనాటికీ మహారాష్ట్రదేశంలో దత్తాత్రేయులవారి అంశావతారంగా ఆరాధింపబడే ఈయన తరువాత దేవగిరిలో స్థిరపడ్డాడు. ఏకనాధుడు అతి పిన్న వయస్సులో శ్రీజనార్దనస్వామిని ఆశ్రయించి, ఆయన సన్నిధిలో శిక్షణలో ఎన్నో ఏళ్ళు ఆధ్యాత్మికసాధనలలో గడిపాడు. శ్రీజనార్దనస్వామి మొదట ఏకనాథునికి దత్తోపాసనలో ఉపదేశమిచ్చి సాధన చేయించారు. ఏకనాథునికి ఎన్నోసార్లు ఒక ముస్లిం ఫకీరు (అవధూత) రూపంలో దత్తాత్రేయ సాక్షాత్కారం కూడా కలిగిందని చెప్తారు. ఆ పైన శ్రీజనార్దనస్వామి ఏకనాథునికి కృష్ణోపాసనను విధించారు. అంతేకాదు! దత్తసాంప్రదాయానికి మూలకందమైన భాగవతసాంప్రదాయాన్ని తిరిగి ప్రవర్తిల్లచేయడానికో, మరే కారణంగానో శ్రీమద్భాగవతం పై వ్యాఖ్యను రచించమని ఏకనాథుని ఆదేశించాడు. ఆ ఆదేశఫలితమే ఏకనాథ భాగవతము. మహానుభావపంథాలోవలే, శ్రీజనార్దన ఏకనాథులలో కూడా ‘శ్రీకృష్ణ-దత్తాత్రేయ’ ఉపాసనల సమన్వయం కనిపిస్తుంది. దత్తోపాసనను కాకుండా, శుద్ధమైన కృష్ణభక్తిని ప్రవర్తిల్లచెయ్యమని శ్రీజనార్దనస్వామి ఏకనాథునికి చేసిన ఆదేశానికి శ్రీనృసింహ సరస్వతిస్వామి ఆమోదము ఆదేశము తప్పక ఉండి ఉండాలి. ఎందుకంటే, శ్రీజనార్దనస్వామి, శ్రీనృసింహసరస్వతి రచించారని చెప్పబడే ఎన్నో అభంగాలు భక్తితత్త్వంతో తొణికిసలాడుతుంటాయి. వాటి ఆధారంగా చివరకు కొందరు పండితులు శ్రీనృసింహసరస్వతి, శ్రీజనార్దనస్వామివార్లు ఇద్దరూ పాండురంగ భక్తపరంపరకు చెందిన వార్కరీ సాంప్రదాయానికి చెందిన వారని కూడా భావిస్తున్నారు! ఉదాహరణకు, ప్రముఖ మరాఠీ సాహిత్యపరిశోధకుడు డాక్టర్. ప్రభాకర్ మాచ్వే ఇలా అంటారు: “నామదేవుని అనంతరకాలంలో ప్రభవించిన సంతకవులలో నరసింహ సరస్వతి, జనార్దన స్వామి వున్నారు. వారిరువురూ వార్కరీ పంథ్ కు చెందినవారు. వారు రచించారని చెప్పబడే భక్తిగీతాలు ఎన్నో లభిస్తున్నాయి.”

ఈ దృష్ట్యా దత్తసాంప్రదాయ హృదయం, బోధనల యొక్క పరాకాష్ఠ మనకు ఏకనాథుని రచనలలో ముఖ్యంగా ఏకనాథ భాగవతంలో లభించగలదు. కులమత దురభిమానాన్ని, వ్యర్థ ఆచారకాండను నిరసిస్తూ, సార్వజనీనమైన శుద్ధ భక్తిజ్ఞానాలను బోధిస్తున్నది ఏకనాథ భాగవతం. శ్రీసాయిబాబా తన భక్తులను పారాయణ చెయ్యమని విధించిన గ్రంథాలలో మొట్టమొదట పేర్కొనవలసింది ఏకనాథ భాగవతమేనన్న విషయం కూడా గమనార్హం.

అయితే కుశాభావు అనే భక్తునికి శ్రీగురుచరిత్ర పారాయణను శ్రీసాయిబాబా ఎందుకు విధించినట్లు? - అనే ప్రశ్న ఇక్కడ ఉదయిస్తుంది.

సాయిబాబా ఎందుకు, ఎప్పుడు, ఏ సందర్భంలో కుశాభావుకు శ్రీగురుచరిత్ర పారాయణ విధించారో నన్న విషయాన్ని తెలియజేసే బాబా ఆదేశం యొక్క పూర్వాపరాలు దాటవేసి, ఊరకే 'శ్రీసాయినాథుడు కుశాభావు అనే భక్తునిచే 108 సార్లు పారాయణ చేయించిన అద్భుత గ్రంథం' - అని కొందరు ప్రచారం చేస్తున్న మాట వాస్తవమే. కానీ, శ్రీసాయి ఏ సందర్భంలో అలా ఆదేశించారో తెలుసుకొంటే, ఆ ప్రచారంలోని వాస్తవం అర్థం కాగలదు. 

కుశాభావు అసలు పేరు కృష్ణాజీ కాశీనాథ్ జోషి. అతడు చిన్నతనంలోనే దత్తమహరాజ్ అనే గురువును ఆశ్రయించి, దత్తోపాసన యోగాభ్యాసంలో శిక్షణ పొందాడు. కొంతకాలానికి తన సాధన లక్ష్యాన్ని మరచి, తన గురువుద్వారా మారణ వశీకరణాది క్షుద్రవిద్యలను సాధించే మంత్రాలు పొంది, వాటి సాధనలో నిమగ్నమయ్యాడు. కొన్ని సిద్ధులు ప్రదర్శించడం నేర్చాడు కూడా. అయితే కుశాభావు గురువైన దత్తమహారాజ్ హిమాలయాలకు వెళ్ళిపోతూ, అతణ్ణి శ్రీసాయిబాబాను ఆశ్రయించమని ఆదేశించాడు. తన గురువు ఆదేశానుసారం కుశాభావు శిరిడీ వెళ్ళాడు. సిద్ధుల ప్రదర్శన ఆపుతానని అతడు ప్రమాణం చేస్తేగానీ బాబా అతడిని మసీదులో అడుగిడనివ్వలేదు. ఆపైన, అతణ్ణి మసీదులో ఒక మూల కూర్చుని, రోజంతా శ్రీసమర్థ రామదాసస్వామి రచించిన దాసబోధను పారాయణ చేస్తూ ఉండమని ఆదేశించారు బాబా. అంతకు మించి మరే ఉపదేశము చెయ్యలేదు. అలా అతడు సుమారు మూడు సంవత్సరాలు శిరిడీలో వున్నాడు. ఒకసారి బాబా అతడితో, “ఆ మూడుతలల మనిషిని చూడు!” అన్నారు. ఆమాటకు బాబా తనను గాణుగాపూరు వెళ్ళి, దత్తపాదుకలు దర్శించి రమ్మన్నారని అర్థం చేసుకొని, కుశాభావు గాణుగాపూరు వెళ్ళాడు. అప్పటినుండి ప్రతిఏటా గురుపూర్ణిమకు, మాఘపూర్ణిమకు (ఏటా మొత్తం రెండుసార్లు) గాణుగాపూరు సందర్శించడం నియమంగా పెట్టుకొన్నాడు కుశాభావు. ఒకసారి అతడు అలా గాణుగాపూరు బయలుదేరుతుంటే బాబా అతడిని గాణుగాపూరులో గురుచరిత్రను 108 సార్లు పారాయణ చెయ్యమని ఆదేశించారు. అతడు గాణుగాపూరులో 10-11 మాసాలుండి ఆ పారాయణ విధిని పూర్తిచేసాడు. బాబా వద్దకు రావడానికి ముందే దత్తోపాసనలో ఉపదేశం పొందిన ఒక దత్తోపాసకునికి గాణుగాపురంలో ఆ క్షేత్రసాంప్రదాయానుసారం శ్రీగురుచరిత్ర పారాయణ చేసుకొమ్మని చెప్పారు బాబా. 

శ్రీగురుచరిత్రలో చెప్పబడ్డ శ్రీగురుని, శ్రీపాదశ్రీవల్లభుల చరిత్ర- లీలలకు తప్ప, దానిలోని ఛాందస ఆచారకాండకు తన ఆమోదం లేదని ఆ కుశాభావుకే స్పష్టంగా చెప్పడానికా అన్నట్లు, ఏకాదశి రోజున ఉపవాసనియమం విధించుకొన్న అతడి చేత ఒక ఏకాదశి నాడు ఉల్లిపాయలు కూడా (పట్టుబట్టి) తినిపించారు శ్రీసాయి. అంతేకాదు! శ్రీగురుచరిత్ర పారాయణ నియమం గల దత్తపంథీయుడైన కుశాభావుకు తప్ప మరింకెవ్వరికీ శ్రీగురుచరిత్ర పారాయణ చెయ్యమని బాబా ఆదేశించలేదు!

శ్రీసాయిబాబా చరిత్ర చదివితే శ్రీసాయి బోధించిన, ఆచరించిన తత్త్వం శ్రీగురుచరిత్రలో చెప్పబడ్డ అర్థరహిత ఆచారకాండకు విరుద్ధమని ఇట్టే బోధపడగలదు. ప్రపంచ ఆధ్యాత్మికచరిత్రలో ప్రభవించిన అన్ని మతసాంప్రదాయలకు చెందిన మహాత్ముల, సద్గురువుల చరిత్రలను సాధకులందరూ అవశ్యం చదువవలసిందే. అందులో వారు ఎన్నుకొన్న సద్గురుమూర్తి యొక్క చరిత్రను తప్పక విధిగా పారాయణ చెయ్యాలి. సాయిభక్తులకు సాయినాథుడే సద్గురువు, దైవం, సాధన, గమ్యం! సాయిభక్తులకు శ్రీసాయిచరిత్రే నిజమైన గురుచరిత్ర! అందుకే, శ్రీహేమాద్పంతు విరచిత శ్రీసాయిసచ్చరిత్ర యొక్క ఉపోద్ఘాతం ఇలా ఉద్బోధిస్తున్నది: “శ్రీగురుచరిత్ర ముఖ్యముగా కర్మకాండపైనాధారపడి యుండుటచే దానిని బోధపరచుకొనుట బహుకష్టము. దాని నాచరణలో బెట్టుట మరింత కష్టము. దత్తాత్రేయుని ముఖ్యశిష్యులు గూడా దాని నాచరణలో పెట్టలేకున్నారు. శ్రీసాయిసచ్చరిత్ర విషయమట్టిది కాదు. కనుక, శ్రీసాయిసచ్చరిత్రమును యీనాటి ‘గురుచరిత్ర’యని చెప్పవచ్చును.” (చూ. శ్రీసాయిసచ్చరిత్ర, ఉపోద్ఘాతము). అవకాశముంటే, శ్రీసాయి చూపిన బాటకు చెప్పిన బోధకు విరుద్ధం కాని మహాత్ముల బోధనలు, చరిత్రలు శ్రద్ధాజిజ్ఞాసలతో చదువుకొనవచ్చు. “పనిచేయి! సద్గ్రంథాలు చదువు! దేవుని నామం ఉచ్ఛరించు!” అన్నది శ్రీసాయి ఉపదేశము. పరమోత్కృష్టమైన సద్గురుభక్తిని ప్రబోధించే శ్రీగురుచరిత్ర వంటి ఉత్తమ ఆధ్యాత్మిక గ్రంథాలను సద్గురుపథంలో పయనించే వారందరూ జిజ్ఞాసతో అవశ్యం పఠించవలసిందే! ఆ గ్రంథాలలో సద్గురునాథుడైన శ్రీసాయినాథునికి అనన్యంగా శరణుపొందడానికవసరమైన అవగాహనను పెంపొందించుకొనే అంశాలను వివేకంతో గ్రహించాలి! అలా గ్రహించి, ఆ గ్రంథాలలో శ్రీసాయిలీలాప్రబోధాలకు సమన్వయపడని అంశాలను మనసునుండి నిష్కర్షగా విసర్జించగలగాలి. అలాంటి విచక్షణాయుతమైన సద్గ్రంథపఠనం వల్ల, బాబానే అన్నట్లు, “భక్తులు పరిశుద్ధులౌతారు. భగవంతుడు ప్రసన్నుడై భవబంధాలను తొలగిస్తాడు!” అంతేకానీ, శ్రీసాయితత్త్వానికి విరుద్ధమైన విషయాలను ‘పారాయణ’ పేరుతో తలకెక్కించుకొని, అవి సమన్వయపడక, అనవసర భావసంఘర్షణకు లోనవడం అవివేకం! అంతేగాదు! శ్రీసాయిబాబా చూపిన శుభ్రమార్గంలో త్వరితగతిన పురోగమించడానికి అదొక ఆటంకం కూడా!

((ఆయా సాధకుల గురుసాంప్రదాయానుసారం వారికి తగు ఆదేశాలనిచ్చి, వారివారి మార్గాలలో సాధకులను ప్రోత్సహించేవారు బాబా. కుశాభావుకు బాబా చేసిన ఆదేశం అటువంటిదే. ఇది సాయిని సద్గురువుగ, పరదైవంగా భావించే సాయిభక్తులకు వర్తించదు.))

((శ్రీసాయి సచ్చరిత్రలో ఉటంకించబడ్డ శ్రీసాఠే స్వప్నానుభవం మాటేమిటనే సందేహం యీ సందర్భంగా కొందరకు కలుగవచ్చు! శ్రీసాఠేను శ్రీగురుచరిత్ర పారాయణ చెయ్యమని శ్రీసాయిబాబా ఆదేశించలేదు. ఆ గ్రంథపారాయణ విధిని శ్రీసాఠే తనకు తానే విధించుకొని ఒక సప్తాహం పారాయణ పూర్తి చేసాడు. ఆ రోజు రాత్రి అతనికి స్వప్నంలో బాబా ఆ గ్రంథాన్ని వివరిస్తున్నట్లు దర్శనమైంది. దానర్థమేమనీ, తానింకా పారాయణ కొనసాగించాలా? వద్దా?౼అని బాబానడుగమని శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ కు ఉత్తరం వ్రాసాడు శ్రీసాఠే. ఎవరికి వారు విధించుకున్న యే నియమాన్నయినా, దానిపట్ల భక్తిశ్రద్ధలు పెంపొందించి, ద్విగుణీకృతమైన దీక్షతో వారి నియమాలను కొనసాగించేట్లు చేసేవారు బాబా. కుశాభావు విషయంలో జరిగింది కూడా ఇదే! శ్రీసాఠే ప్రశ్నకు సమాధానంగా, అతడిని పారాయణ ఇంకా కొనసాగించమని చెప్పారు బాబా! ఇక్కడ మరొక్క విషయం. పైన పేర్కొన్న సంఘటనలోని ‘సాఠే’ బొంబాయికి చెందిన వ్యాపారి; ఆయన శిరిడీలో వాడాను నిర్మించిన సన్నిహితసాయిభక్తుడైన శ్రీH.V.సాఠే కాదు!

Source: సాయిభక్తి సాధన రహస్యం, రచన: పూజ్యశ్రీ సాయినాథుని శరత్ బాబూజీ.

2 comments:

  1. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  2. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయిణే నమః
    🙏 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo