సమాజంలో ఆస్తికత అడుగంటి పోతున్నదని, దైవభక్తి క్షీణిస్తున్నదని ఒకప్రక్కన దైవచింతనగలవారు మహామథనపడిపోతుంటే, మరోప్రక్క పల్లెపల్లెలా దేవాలయాలు, వాడవాడలా మందిరాలు లెక్కకుమించి పుట్టుకొస్తూండడం, వాటిలో కొన్ని మరీ మహిమగల దేవాలయాల ఆదాయం అంతులేకుండా పెరిగిపోతూండడం చూస్తుంటే, ‘నిజంగా సమాజంలో దైవభక్తి క్షీణించడంలేదేమో!’ ౼ నన్న అనుమానం రాకమానదు.
తనకు ఆలయాలు కట్టించమని దేవుడు దేబిరించలేదు! దేవాలయాల నిర్మాణం ముక్తికి తిరుగులేని మార్గమని శాస్త్రాలు ఘోషించడమూలేదు. అయినా క్రొత్త దేవాలయాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. పాత దేవాలయాలు దీపం పెట్టే దిక్కులేక పాడుపడిపోతూనే ఉన్నాయి. ఆలయనిర్మాణానికి ఖర్చుపెట్టిన డబ్బు చిత్రగుప్తుని చిట్టాలో పుణ్యం క్రింద (పెద్ద అక్షరాలతో) జమ అవుతుందనే విశ్వాసం, తాము పెట్టుబడి పెట్టిన దేవాలయం నిలిచి ఉన్నంతవరకు అజరామరమైన కీర్తితో పాటుగ జమ అయిన పుణ్యం తాలుకు వడ్డీ కూడా తమకు ముట్టుతూంటుందనే ఆశ – సామాన్యంగా దేవాలయనిర్మాణానికి ప్రేరకాలు. తన ఇష్టదైవం మీద ప్రీతితోకానీ ఆ దైవం ఏవో తన కోరికలు తీర్చినందుకు కృతజ్ఞతతోగానీ ఎవరైనా మనఃస్ఫూర్తిగా ఆలయనిర్మాణానికి సంకల్పించినా, ఆ ఆలయనిర్మాణానికి ధనకనకవస్తురూపంలో వచ్చిపడే సహకారం వెనుకైనా పైచెప్పిన ప్రేరణ సామాన్యంగా దర్శనమిస్తుంది. అటువంటి ప్రేరణలో నుండి ఉద్భవించి, ధనికస్వాములు (తమ ఆదాయపు పన్ను మినహాయింపు కోసం) విదిలించిన నల్లడబ్బుతో కట్టబడ్డ అలాంటి దేవాలయాలు ఈ కలిలోని పాపాల రూపాలుగా మన కళ్ళముందు నిలుస్తున్నాయి!
ఆలయనిర్మాణంవల్ల ఒనగూడే పుణ్యాన్ని మాత్రమే వాటి నిర్మాతలు చూస్తున్నారు కానీ, ప్రజలలో సరైన ధార్మికచింతన, దైవభక్తి (భయంకాదు!) సరైన జీవితపు విలువల సాధన, అలా కట్టిన దేవాలయాల నిర్వహణ ధర్మబద్ధంగా జరుగకపోతే అది యెంత ఘోరమైన దోషమోనన్న విషయం మనం గుర్తించడం లేదు. అతిథిని ఇంటికి ఆహ్వానించి, ఆ అతిథి రాగానే అతడ్ని పట్టించుకోక అశ్రద్ధచేయడం వంటి అకృత్యమిది. ఆలయంలోకి దైవాన్ని ఆవాహనచేసి (ప్రాణప్రతిష్ఠచేసి) ప్రతిష్ఠించి, తరువాత ఆ దైవకార్యంపట్ల శ్రద్ధవహించకపోవడం దైవధిక్కారమే అవుతుంది; ‘దేవాలయంలో దీపం ఆర్పడమే’ అవుతుంది!
ఈ అనర్థానికి అసలు కారణం దేవాలయమంటే కేవలం దేవునికి కట్టించిన నివాసమేననే దురవగాహన, దేవాలయాతత్త్వాన్ని గురించి మహాత్ములు చెప్పిన సత్యాలు మరుగున పడడమూ కారణాలని తోస్తుంది. స్థూలమైన విశ్వానికి (macrocosm) సూక్ష్మరూపం (microcosm) వ్యక్తి. అయితే, యీ స్థూల-సూక్ష్మరూపాల ‘స్వ’రూపం మాత్రం ఒక్కటే. ఈ ‘అద్వైత’ స్వరూపాన్ని మనచే దర్శనం చేయించేవి ఋషిప్రోక్తాలయిన నిగమాగమాలు. వ్యష్ఠి రూపుడైన (individual consciousness) జీవుని, సమిష్ఠి రూపుడయిన (collective consciousness) ఈశ్వరునితో అనుసంధానంచేసే ప్రక్రియే యజ్ఞం. వేదసంస్కృతిలో ప్రధానపాత్రవహించిన యజ్ఞవాటికలు కాలాంతరంలో దేవాలయాలుగా రూపుదిద్దుకున్నాయి. పైన వివరించిన యజ్ఞానికి దేవాలయం సంజ్ఞారూపం. మానవుని మూలప్రకృతి ఏ కాలంలోనయినా ఒక్కటే. కనుక వ్యక్తి తన ప్రకృతిని ఏ విధంగా సంస్కరించుకొని బాహ్యజగత్తుతో సామరస్యంగా మనగలడో నిర్దేశించే మౌళికసూత్రాలు కూడా మారనివే.
ఈ అంతర్దర్శనాన్ని సాధించడానికి అవసరమైన మానవధర్మాలను, సాధనాలను ప్రబోధించే కేంద్రాలుగా దేవాలయాలు ఏర్పడ్డాయి. అందుకనే మునుపు ఆచార్య పీఠాలుగా, ఘటికాస్థానాలుగా (universities), ధర్మజిజ్ఞాసకు వేదికలుగా దేవాలయాలు వెలుగొందాయి. కాలక్రమేణా సమాజంలో తాత్త్విక జిజ్ఞాస అవగాహన కొరవడడంతో, దేవాలయాలు ఆయా ఆలయ అధిష్ఠాన దేవతలకు కేవలం అర్చనాకేంద్రాలుగా మారిపోయాయి. ఆచార్యులు అర్చకులయ్యారు. ఆచార్యపీఠాలు దేవతార్చన ‘పీటలు’గా మారిపొయ్యాయి. జిజ్ఞాసువులకు ముముక్షువులకు ‘ఆశ్రమాలు’ గా వెలుగొందిన దేవాలయాలు క్రమంగా కేవలం ఆర్తులకు అర్థార్థులకు ఆశ్రయాలయ్యాయి.
ఆలయనిర్మాణం చేబట్టే ముందు, ఆలయం నిర్మించబోయే ప్రదేశంలో మహాత్ముల చరిత్రల పఠనము, పవిత్ర ఆధ్యాత్మిక ధార్మిక గ్రంథాల అధ్యయనము, మహాత్ముల ఆశీస్సులు, సామూహిక జపధ్యానాలు కొంత కాలం పాటు జరగాలి. నిత్య సత్సంగ స్వాధ్యాయ ప్రవచనాలపట్ల ఆ ప్రాంతంలోని స్థానిక ప్రజలకు శ్రద్ధాసక్తులు కలగాలి. అలా జరుగుతూంటే క్రమంగా ఆ కేంద్రమే దేవాలయంగా పరిణతి చెందుతుంది. ఇది సాధించకుండా, దేవాలయ నిర్మాణానికి పూనుకొని, చందాలు దండిగా దండి, దండగజేయడం నిషిద్ధకార్యమే అవుతుంది. ఇదే ఆగమశాస్త్రాల్లో ఆలయనిర్మాణానికి ముందు చేయవలెనని చెప్పబడ్డ ‘స్థలశోధన’ ‘స్థలశుద్ధి’ లలోని ఆంతర్యం.
స్థూలమైన విశ్వానికి (macrocosm) అంటే విరాట్ స్వరూపానికి సూక్ష్మరూపం (microcosm) వ్యక్తియనీ, యీ రెండింటి యొక్క సమన్వయస్వరూపాన్ని దర్శింపజేసే సాధనం దేవాలయమనీ ఇంతకు మునుపు చెప్పుకున్నాం. అందువల్లనే వ్యక్తియొక్క దేహము, జీవప్రకృతికి ప్రతీకగా ఆలయనిర్మాణం కూడా సాగింది. “దేహోదేవాలయప్రోక్తః జీవోదేవస్సనాతనః” 'దేహమే దేవాలయం; అందులోని జీవుడే దేవుడు అని భావించి పూజించు' అని తమ ‘ఆత్మపూజ’ గ్రంథంలో శ్రీఆదిశంకరులు ప్రవచించారు. మానవ దేహనిర్మాణానికి ప్రకృతికి ప్రతీకగా దేవాలయాన్ని ఎలా నిర్మించాలనే సూత్రాలను చెప్పేందుకు దేవాలయ వాస్తు పుట్టింది. ఈ సత్యాన్నే “నరప్రాస్తారమితి తద్వాస్తు ప్రస్తార మిత్యపి” అని ఆ శాస్త్రమే చెబుతున్నది.
వ్యక్తి తనలోని రాగద్వేషాదులను శోధించి, అలా శుద్ధిచేయబడ్డ అంతరంగంలో అస్తవ్యస్తంగా పడివున్న తన హృదయవాసనలనే చంద్రశిలలను ఆగమసూత్రాల కనుగుణంగా తీర్చి పేర్చి నిర్మించిన హృదయమందిరంలో భగవంతుడు ఆనందంతో నర్తిస్తాడు. మనం నిర్మింప తలపెట్టిన బాహ్యమందిరం ఈ హృదయమందిరాన్ని ప్రతిబింబించే తత్త్వమయ నిర్మాణం కావాలి! అప్పుడే, “బింబాన మాభిరూపాచ్చ దేవాః సాన్నిధ్యమిచ్ఛతి” (అంటే, ‘బింబ సౌందర్యానికి, లక్షణాలకు అనుగుణంగా దేవతలు తమ సాన్నిధ్యాన్ని ఇవ్వగోరుతారు’) అన్న ఆగమశాస్త్రప్రామాణ్యం ౼ ఆధ్యాత్మికార్థంలో ౼ సిద్ధిస్తుంది.
తనపట్ల, దైవంపట్ల, సాటి మానవులపట్ల సరైన అవగాహనను సమాజంలో కల్పించడానికి ప్రయత్నించక ఆలయాలు నిర్మిస్తే ఆ దేవాలయ రాతి కట్టడాలు స్వార్థంతో కరుడు గట్టిన మనిషి హృదయాలకు ప్రతీకలుగా మాత్రమే నిలుస్తాయి. ఉన్నతసంస్కారాలనే విద్యాప్రణాళికతో ఆత్మవిద్యకు బళ్ళుగా మన పెద్దలు రూపొందించిన యీ గుళ్ళు, కులాల కుళ్ళుకు మతాల మళ్ళకు లోగిళ్ళు కారాదు! మేలుకొలుపు-బాలభోగం దగ్గరనుండి, ఆరగింపు-పవళింపు సేవలదాకా షోఢశోపచారాలు ‘జరిపించడం’ మాత్రమే కాదు దైవంపట్ల శ్రద్ధ వహించడమంటే! దైవం ధర్మస్వరూపం. స్వాధ్యాయప్రవచనాలతో కూడిన ధర్మప్రచారానికి సంస్కరణకు దేవాలయం సాధనం కావాలి.
లేకపోతే, యీనాడు మనం చూస్తున్నట్లు, దేవాలయాలు ధనికస్వాముల అధికారపాటవ ప్రదర్శనశాలలుగా, కుళ్ళు కులతత్వపు కురుక్షేత్రాలుగా, అసంతృప్త ముఠారాజకీయవాదుల అధికార పునరావాస కేంద్రాలుగా, వినోదయాత్రాస్థలాలుగా, మూఢాచారాల మత్తుమందునందించే ‘మతం’ బ్రాండు పానశాలలుగా, శృంగార సినీగీతాల ‘జ్యూక్ బాక్సులు’గా, పెళ్ళిమంటపాలుగా, మొక్కుబళ్ళు తీర్చే క్షౌరశాలలుగ మారక తప్పవు! అందుకే అన్నాడు వేమన: “దేవళములోను తీర్థంబులందును మూలమెరుగకున్న ముక్తి లేదు!” ౼ అని. వేమన యోగీంద్రుని యీ మాట ౼ ఆగమశాస్త్రాల తేట!
Source: సాయిభక్తి సాధన రహస్యం, రచన: పూజ్యశ్రీ సాయినాథుని శరత్ బాబూజీ.
No comments:
Post a Comment