“జాతకాలు చూడవద్దు! సాముద్రికాన్ని నమ్మవద్దు!”
~శ్రీసాయిబాబా
{బాబా మాట: “సాంగె తయాస్ మాఝె మాన్, పత్రికా ఠేవీగుండాళూన్... జన్మపత్రికా పాహూ నకా... సాముద్రికా విశ్వాసూ నకా... ఠేవీ విశ్వాస్ మజవరీ!” (“నేను చెప్పే మాట వినుకో! జన్మకుండలిని చుట్టచుట్టి అవతల పారెయ్! జాతకాలు చూడొద్దు! సాముద్రికాన్ని నమ్మొద్దు! నాపై విశ్వాసముంచు!”)} --శ్రీసాయి సచ్చరిత్ర, అధ్యాయం:29; ఓవీ 108-110.
మన జ్యోతిష్కులు చెప్పే జోస్యాల శాస్త్రంలో నిజం ఎంతో ఆ జాతవేదునకే తెలుసు! మనకు మన భవిష్యత్తు గురించి సహజంగా వుండే భయాందోళనలు, భద్రతారాహిత్యభావం, ఎలాగైనా భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆతురత, యేమాత్రం వీలున్నా ఆ ‘భవిష్యత్తు’ను మనకనుకూలంగా మార్చుకోవాలన్న ఆశ... ఇవన్నీ కలిసి మనలను జ్యోతిషాల పాలబడేలా చేస్తున్నాయి. ఏది జరగాలని నిర్ణయింపబడి వుందో అదే ‘భవిష్యత్తు’ అయినట్లయితే, దాన్ని ముందుగా తెలుసుకొనే సామర్ధ్యం జ్యోతిష్కుల కెంతమందికున్నది? ఒకవేళ వున్నా, ఆ భవిష్యత్తును మార్చగలిగే ‘శక్తి’ వారు చేసే ‘గ్రహశాంతుల’ కున్నదా? అంత తేలిగ్గా మార్చుకోగలిగింది అసలు ‘భవిష్యత్తు’ ఎలా అవుతుంది?– అనే విషయాలను గురించి మనం యోచించం! ప్రజాబాహుళ్యానికి సంబంధించినంత వరకు యీ అనాలోచిత చర్యల సంగతెలావున్నా, శ్రీసాయిబాబా వంటి సద్గురువును ఆశ్రయించిన సాయిభక్తులకు మాత్రం ఇది అనుచితమని చెప్పక తప్పదు!
కొందరడగవచ్చు: “మరి, బాబా కూడా భవిష్యత్తు చెప్పారు గదా?” అని. ఇదే ప్రశ్న శ్రీనానాసాహెబ్ చందోర్కర్ ఒకసారి బాబానే అడిగాడు! దానికి బాబా తన సహజమైన నిగూఢరీతిన చెప్పిన సమాధానం గమనార్హం. బాబా అన్నారు: “లేదు నానా! నేను ఎట్టి చమత్కారాలు చెయ్యను! మీకు జ్యోతిష్కులు వున్నారు. వారు ఏవో గుణించి చూచి, ఓ రెండురోజుల ముందుగా భవిష్యత్తు చెప్తారు. వీనిలో కొన్ని నిజాలవుతాయి. నేను ఇంకా కొంచెం దూరం ముందుగా చూస్తాను. నేను చెప్పింది జరుగుతుంది. బాహ్యంగా, నేను చేసేది గూడా ఒకవిధమైన జ్యోతిషంలాగా కనబడవచ్చు. అయితే, దీని ఆంతర్యం పామరులు గ్రహించలేరు. నీకు ముందు ముందు ఏమి జరగబోతుందో తెలియదు గనుక, అది నేను చెప్తే, నీకు అది ఒక చమత్కారం (మహత్తు)గా కనిపిస్తుంది. అవి నా అద్భుతశక్తికి నిదర్శనాలని తలచి నా పట్ల భయభక్తులు చూపుతావు. నేను మాత్రం మీరు చూపే భక్తిగౌరవాలను ఆ భగవంతునికే సమర్పించి, మీరు నిజంగా అనుగ్రహింపబడేలా చూస్తాను”.
చాలా సునిశితంగా పరిశీలిస్తేగాని బాబా మాటలలోని అంతరార్థం బోధపడదు. తాము ఎప్పుడూ ‘చమత్కారాలు’ చేయమనీ, మన పామరత్వము వల్లనే ఆయన చేసే పనులు ‘చమత్కారాలు’గా ‘జోస్యాలు’గా కనిపిస్తాయనీ, అటువంటి వాటికోసమే ఆయన్ను ఆశ్రయిస్తే సద్గురువును ఒక జ్యోతిష్కుని స్థాయికి దిగజార్చడమేననీ, అలా చెయ్యడం శ్రీసాయి వంటి సమర్థ సద్గురుని ఓ సద్గురువుగా కాక, ఒక జ్యోతిష్కునిగా తలచి ఆశ్రయించడంతో సమానమేనని - బాబా మాటల్లోని శ్లేష. అంతేకాదు! బాబా చెప్పిన మాటలలో మరో సత్యాన్ని గుర్తించాలి. అదేమంటే, జ్యోతిష్కులు బహుశా కొంచెం ముందుగా జరుగబోయేది చెప్పగలరేమో కానీ, - బాబా 'చెప్పింది జరుగుతుంది'!
అయితే, అలా జోస్యాలుగా ‘కనిపించే’ చర్యలనయినా బాబా ఎందుకు చేసినట్లు? సద్గురువు తమ భూతభవిష్యద్వర్తమానాలు తెలిసిన త్రికాలజ్ఞులని, తన శ్రేయస్సు కోసం అవసరమైతే ‘విధి’నే మార్చగల సమర్థులనే విశ్వాసం బాబాయొక్క లీలల వల్ల భక్తునికి కలుగుతుంది. క్రమంగా ఆ విశ్వాసమే భక్తుని సద్గురువుకు సంపూర్ణ శరణాగతి చెందిస్తుంది. అప్పుడే సద్గురువుకు పూర్తిగా ‘పగ్గాలప్పగించడం’ సాధ్యం.
సద్గురువు తమ భూతభవిష్యద్వర్తమానాలు తెలిసిన త్రికాలజ్ఞులని, తన శ్రేయస్సుకోసం అవసరమైతే ‘విధి’నే మార్చగల సమర్థులనే విశ్వాసం బాబాయొక్క లీలల వల్ల భక్తునికి కలుగుతుంది. క్రమంగా ఆ విశ్వాసమే భక్తుని సద్గురువుకు సంపూర్ణ శరణాగతి చెందిస్తుంది. అప్పుడే సద్గురువుకు పూర్తిగా ‘పగ్గాలప్పగించడం’ సాధ్యం. శ్రీసాయిబాబా వంటి సమర్థసద్గురువును ఆశ్రయించనంత వరకే జాతకాలు గ్రహాలు మొదలైన వాటి ప్రసక్తియని, ఒక్కసారి (శ్రీసాయి వంటి) సద్గురువును ఆశ్రయించిన తరువాత ‘గ్రహాలు’ ఏమీ చెయ్యలేవని శాస్త్రం, మహాత్ముల ఉవాచ. ఈ విషయాన్ని సూచిస్తూ బాబా ఒక భక్తునితో, “నీ ప్రారబ్దంలో నీకు సంతానమెక్కడ వుంది? నా దేహాన్ని చీల్చి నీకు కుమారుణ్ణి ప్రసాదించాను” అనీ, మరో భక్తునితో, “ద్వారకామాయి బిడ్డలను గ్రహాలేం చెయ్యగలవు?” అనీ అభయమిచ్చారు. మరోసారి ఒక ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి బాబాను అంగసాముద్రికశాస్త్ర దృష్ట్యా పరిశీలించాలని శిరిడీ వచ్చాడు. అతడు మసీదు చేరి ఒక మూల కూర్చోబోతుండగా బాబా తమ ప్రక్కనున్న భక్తులకు ఆ సిద్ధాంతిని చూపుతూ, “ఇతడు నా ఇంటి వాసాలను లెక్కబెట్టడానికొచ్చాడు! నా దగ్గర అతడు చూడగలిగిందేమీ లేదు. అతణ్ణి వెంటనే ఇక్కణ్ణుండి బయటకు పంపివేయండి!” (“ఓ హమారా జోపిడీ కా బాంబు గిన్ నేకో ఆయా...”) అని కోపంగా కేకలేసారు.
ఒకసారి ఒక భక్తుడు ఒక జ్యోతిషశాస్త్ర గ్రంథాన్ని బాబా చేతికిచ్చి, ఆయన ప్రసాదంగా దాన్ని తిరిగి తనకివ్వమని ప్రార్థించాడు. అలాంటి సందర్భాలలో బాబా తమ అనుమతిని ఇవ్వదలచుకోకపోతే, ఆ ఆశీస్సులు కోరే వ్యక్తికి ఆ వస్తువును తిరిగి ఇచ్చేవారు కాదు. అయితే భక్తులు సమర్పించిన యే వస్తువును తమ వద్ద వుంచుకొనేవారు కూడా కాదు. కనుక అటువంటి వస్తువులను (పుస్తకాలు మొ౹౹నవి) తమ ప్రక్కనున్న షామావంటి భక్తులకు ఇచ్చేసేవారు. జ్యోతిషం వంటి విద్యల్ని ఎన్నడూ ప్రోత్సహించని బాబా, ఆ జ్యోతిషగ్రంథాన్ని ఆశీస్సులకోసం తమకిచ్చిన భక్తునికి తిరిగి ఇవ్వలేదు. ఆ పుస్తకాన్ని అటు, ఇటు తిరగేసి, ఆ సమయంలో తన ప్రక్కనున్న శ్రీబూటీకి ఇచ్చివేశారు.
((జ్యోతిషం మీద ఏ మాత్రం ఆసక్తి లేకపోయినా బాబా చేతిగుండా వచ్చింది కదా అని శ్రీబూటీ ఆ గ్రంథాన్ని చదవడం, ఒకసారి శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ ఎన్నికలలో పోటీచేయగా సరదాగా దీక్షిత్ గ్రహబలాన్ని గుణించి ఏ సమయంలో ఎన్నికలు జరిగితే అతను గెలుపొందే అవకాశముందో చెప్పడం, ఎన్నికలు అలానే జరిగి దీక్షిత్ గెలుపొందడమూ జరిగాయి. దీన్నిబట్టి బాబా జ్యోతిషాన్ని పరోక్షంగానైనా ప్రోత్సహించినట్లే కదా? అని కొందరు భక్తలు తలచడం సహజమే! కొందరు రచయితలు యీ వివరాన్ని ఆధారం చేసుకొని అలానే వ్యాఖ్యానించారు కూడా! కానీ, తాను గెలుపొందింది కేవలం "బాబా అనుగ్రహం" వల్లనేనని శ్రీదీక్షిత్ స్వయంగా తమ డైరీలో వ్రాసుకున్నారు. అంతేకాదు! శ్రీబూటీకి ఆ పుస్తకాన్ని ఇవ్వడం అనే బాబా చర్యవల్ల, అటు శ్రీబూటీగానీ, ఇటు శ్రీదీక్షిత్ గానీ జ్యోతిషం పట్ల జోస్యాలపట్ల ఆకర్షితులు కాలేదు. కాయను బట్టి చెట్టును నిర్ణయించమని (“Judge the tree by the fruit!”) కదా ఆర్యోక్తి!))
తమకేది మంచిదో అది బాబా తప్పక చేస్తారనే విశ్వాసం సాధనాపథంలో ప్రథమ సోపానం. అది మరచి సాయిభక్తులే జ్యోతిష్కుల చుట్టు, వాస్తు సిద్ధాంతుల చుట్టూ తిరగడం; కొందరు ప్రముఖ సాయిభక్తులే జాతకాలను ప్రోత్సహిస్తూ, జోస్యాలు చెప్పడం; ఎందరో ‘వృత్తి జ్యోతిష్కుల’కు శ్రీసాయి ‘కులదైవం’ కావడం – శోచనీయం! సద్గురు చరణాలనాశ్రయించి, వారిని శ్రేయోభిక్ష పెట్టమని అర్ధించిన చేతులను హస్తసాముద్రికుల ముందు దేబిరిస్తూ చాచడం – మనం ఆశ్రయించిన సద్గురువునే అవమానించి, కించపరచడం కాదా? ప్రసిద్ధ జ్యోతిషశాస్త్ర పండితుడు శ్రీముళేశాస్త్రి (నాసిక్) ఒకసారి బాబా చేయి చూస్తానని ప్రార్థిస్తే, బాబా ఓ చిరునవ్వు నవ్వి వూరుకున్నారేగానీ, ఆ హస్తసాముద్రికుని ముందు తమ చేయి చాపలేదు! ఈ జోస్యాల ఆకర్షణలలో గ్రహశాంతుల ఊబిలో పడకుండా, వివేకంతో తమను తాము నిగ్రహించుకోగలిగిననాడు మనం శ్రీసాయి శరణాగతిపథంలో ఒక మెట్టు పైనుంటాం!
Source: సాయిభక్తి సాధన రహస్యం, రచన: పూజ్యశ్రీ సాయినాథుని శరత్ బాబూజీ.
om sai ram when baba is there why astrolagy.om sai ma
ReplyDeleteJai sairam
ReplyDeleteసర్వం సాయిమయం
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ReplyDeleteఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏