సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 421వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా ప్రసాదించిన తొలి అనుభవం
  2. మనసు మార్చి సమస్యను పరిష్కరించిన బాబా

బాబా ప్రసాదించిన తొలి అనుభవం

నా పేరు సాయి. ముందుగా, ఎంతోమంది సాయిభక్తులకి ప్రతిరోజూ బాబా ప్రసాదించిన అనుభవాల గురించి తెలుసుకునే అవకాశం కల్పింస్తున్న ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సాయినాథ్ మహరాజ్‌కి తన భక్తుల పట్ల ఉన్న ప్రేమ మాటల్లో చెప్పలేనిది. అది అనుభపూర్వకంగా తెలుసుకుంటేనే అర్థమవుతుంది. మాకు మొదటిసారి బాబా దర్శనభాగ్యం ఎలా కలిగిందో నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

చాలా సంవత్సరాల క్రిందట నేను ఐదవ తరగతిలో ఉన్నప్పుడు మేము శిరిడీ వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. మేము అప్పట్లో పల్లెటూరులో ఉండటం వలన శిరిడీ ఎలా వెళ్ళాలో మాకు అస్సలు తెలియదు. మా నాన్నగారు తనకు తెలిసినవాళ్ళని కనుక్కుని వివరాలన్నీ తెలుసుకున్నారు. తరువాత బస్సులో శిరిడీ వెళ్ళాలని నిర్ణయించుకుని, ఒకరోజు ఉదయాన్నే మా ఊరినుండి బయలుదేరి హైదరాబాద్ లోని మహాత్మాగాంధీ బస్‌స్టాండుకి చేరుకున్నాం. మేము శిరిడీ వెళ్ళే బస్సుకోసం ఎదురుచూస్తూ ఉన్నాము. అలా చాలాసేపు ఎదురుచూశాము. నేను చాలా చిన్నపిల్లని కావటంవల్ల నాకు అంత బాగా గుర్తులేదు కానీ చాలాసేపు ఎదురుచూశాక, మా నాన్నగారు బస్సు గురించి డిపోలో వాకబు చేసారు. వాళ్ళు ‘బస్సు వెళ్ళిపోయింద’ని చెప్పారు. దాంతో అమ్మానాన్నలు ఎంతో బాధపడటం నేను చూశాను. ఇంటినుండి ఎంతో సంతోషంగా వచ్చాం, తీరా వచ్చాక బస్సు కాస్తా వెళ్ళిపోయేసరికి ఎంతో బాధతో బస్‌స్టాండు నుండి బయటికి నడిచాం. బస్‌స్టాండు బయట చాలా ఆటోలు ఆగివున్నాయి. నిజానికి ఎలా జరిగిందీ గుర్తులేదుగానీ, ఒక ఆటో అతను మమ్మల్ని పిలిచి, “శిరిడీకి వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఇక్కడికి దగ్గర్లో నుండే బయలుదేరుతుంద”ని చెప్పాడు. ఆ మాట వినగానే అమ్మానాన్నల్లో మళ్ళీ ఆశ చిగురించింది. మేము వెంటనే ఆ ఆటో ఎక్కేశాము.

మాకు హైదరాబాదు సరిగా తెలియదు. ఆటో అతను ఎటు తీసుకెళ్తున్నాడో అసలు తెలియదు. కొంతదూరం వెళ్ళాక ఆటో అతను మమ్మల్ని ఒకచోట దింపి నాన్నతో ఏదో చెప్పారు. నాన్న మమ్మల్ని ఒక ప్రక్కన ఉండమని చెప్పి ఒక చిన్న ఆఫీసులాంటి రూంలోకి వెళ్లారు. కాసేపట్లో టికెట్లతో బయటికి వచ్చారు. కానీ రెండే సీట్లు ఉన్నాయి ఆ బస్సులో. సరిగ్గా పది నిమిషాల్లో బస్సు బయలుదేరింది. బాబా మహత్యం వల్ల హాఫ్ టికెట్టుతో ప్రయాణించాల్సిన నేను శిరిడీకి ఉచితంగా ప్రయాణించాను

అసలు ఎవరో ఒక ఆటో అతను మమ్మల్ని పిలవగానే మేము ఆటో ఎక్కేసి వెళ్లడం ఏంటి? కేవలం రెండు టికెట్లతో ముగ్గురం వెళ్లగలగడం ఏంటి? నాకు అప్పుడు తొమ్మిది సంవత్సరాల వయసు ఉంటుంది. టికెట్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. కానీ బాబా అనుకుంటే ఏదైనా చేయగలరు. మరుసటిరోజు ఉదయం శిరిడీ చేరుకున్నాం. బాబా దర్శనం కూడా చక్కగా అయ్యింది.

మైనతాయి ప్రసవ సమయంలో బాపూగిర్ కోసం గుర్రపుటాంగాతో బాబా వచ్చినట్టే, మాకోసం ఆటోతో వచ్చారు నా బాబా. ఇప్పటికీ ఆ ప్రయాణం గుర్తొచ్చినప్పుడల్లా నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. “మమ్మల్ని అంత ప్రేమగా శిరిడీకి పిలిపించుకుని మీ ఆశీస్సులు ప్రసాదించినందుకు చాలా చాలా ధన్యవాదాలు బాబా! మీ ప్రేమని పొందే అదృష్టం మాకు కలిగినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. మీ ప్రేమ, ఆశీస్సులు మీ భక్తులందరి మీదా ఎప్పటికీ ఉంటాయని నాకు తెలుసు బాబా!”

నేను పూర్తిగా బాబా భక్తురాలిగా మారిన విషయం తదుపరి అనుభవంలో మీతో పంచుకుంటాను.

ఓం శ్రీ సాయినాథయ నమః.

మనసు మార్చి సమస్యను పరిష్కరించిన బాబా

సాటి సాయిభక్తులకు మరియు ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారాలు. ఈ సాయి భక్తకోటిలో నేనొక చిన్న భక్తురాలిని. గత 27 సంవత్సరాలుగా శ్రీసాయిని ప్రగాఢంగా నమ్ముతున్నాను. బాబా నాకు ఎన్నో అనుభవాలను ప్రసాదించారు. ఈమధ్య మా అద్దె ఇంటి విషయంలో మా కుటుంబమంతా చాలా ఆందోళనపడ్డాము. ఆ సమస్యను బాబా ఎలా పరిష్కరించారో నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

మేము ఒక సొంత ఇంటి నిర్మాణం చేపట్టాం. కానీ కొన్ని కారణాల వల్ల ఇంటి నిర్మాణం ఆలస్యమైంది. క్రొత్త ఇంటికి మారడానికి కనీసం మరో రెండు నెలల సమయం పడుతుంది. ఇంతలో మా అద్దె ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయమని మాపై ఒత్తిడి తెచ్చారు. ఆయనని మేము ఒకటి రెండు నెలలు గడువు కావాలని కోరాము. ఎందుకంటే, వేరే ఇల్లు వెతుక్కుందామనుకున్నా ఒకటి రెండు నెలలకు ఎవ్వరూ ఇల్లు అద్దెకు ఇవ్వరు. అందులోనూ మావారికి గుండె ఆపరేషన్ అవ్వడం వల్ల ఇల్లు మారడం మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అందువల్ల ఒకటి రెండు నెలలు గడువిమ్మని మా ఇంటి యజమానిని చాలా బ్రతిమాలాము. ఆయన ఒప్పుకోలేదు సరికదా మాపై పోలీసు కేసు పెడతానని గొడవ చేశారు. మా అబ్బాయి కూడా ఫోన్ చేసి చాలా బ్రతిమాలాడు. అయినా మా అద్దె ఇంటి యజమాని ఏమీ చెప్పకుండా కోపంగా కాల్ కట్ చేశారు. దీంతో నా పరిస్థితిని బాబాకు చెప్పుకుని, “మా సమస్యని పరిష్కరించండి బాబా! మా సమస్య తీరితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అని బాబాని వేడుకున్నాను. బాబా కృప వల్ల నాలుగు రోజుల తరువాత ఇంటి యజమాని మాకు ఫోన్ చేసి మాకు అనుకూలంగా స్పందించారు. మరో రెండు నెలల పాటు మేము ఆ ఇంట్లో ఉండటానికి ఒప్పుకున్నారు. మా సమస్యను తీర్చినందుకు ఎంతో ఆనందంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాము. బాబాకు మాట ఇచ్చినట్లు నా అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. మా కుటుంబంలో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను కూడా బాబా త్వరగా పరిష్కరిస్తారని ఆశిస్తూ, బాబా కృపాకటాక్షాలు ఎల్లవేళలా మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. బాబా చాలా విషయాల్లో నన్ను ఆదుకున్నారు. అన్నివేళలా బాబా మనల్ని కాపాడతారని ఆశిస్తూ... 

ఓ చిన్న సాయిభక్తురాలు.


5 comments:

  1. Om Sri sairam tatayya 🙏🌹🙏🌹🙏🌹

    ReplyDelete
  2. ఓం శ్రీ సాయినాథయ నమః

    ReplyDelete
  3. జై సాయిరాం! జై గురుదత్త!

    ReplyDelete
  4. జై సాయిరాం! జై గురుదత్త!

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo