ఖపర్డే డైరీ - నలభై తొమ్మిదవ భాగం
శిరిడీ డైరీ మరియు శ్రీమతి లక్ష్మీబాయి గణేష్ ఖపర్డే -వి.బి.ఖేర్
శ్రీసాయిలీలా మాసపత్రిక ప్రచురింపబడుతున్న కొత్తల్లో శ్రీసాయి శరణానంద ఈ సంఘటనను ఈ క్రింది విధంగా వివరించాడు. "బాబా తన భక్తులకు ఊదీ ఇచ్చేటప్పుడూ, భక్తులు బాబాకు పాదనమస్కారం చేసుకునేటప్పుడూ, బాబాకు చరణ సేవ చేసుకునేటప్పుడూ భక్తులకు బాబా స్పర్శ అనుభవమయ్యేది. అప్పుడు కూడా ఆయన అందర్నీ ముట్టుకోవటమూ, ప్రతివారినీ ఒకేవిధంగా ముట్టుకోనివ్వటమూ చేసేవారు కాదు. ఆయన ఏ భక్తుడికైనా సూచన ఇవ్వాలనుకున్నప్పుడు అతని విశ్వాసాన్నీ, భావాన్ని అనుసరించి అతన్ని ముట్టుకోనిచ్చేవారు. కొన్నిసార్లు అభ్యంతర పెట్టేవారు కూడా. శ్రీమతి ఖపర్డేకు “రాజారామ్" అన్న మంత్రాన్ని ఉపదేశించాలనుకున్నప్పుడు మసీదులోకి స్త్రీలు మధ్యాహ్న సమయంలో రాకూడదన్న నిబంధనను పక్కకు పెట్టి ఆమెను మసీదులోకి అనుమతించటమే కాక ఆమె తీసుకొచ్చిన నైవేద్యాన్ని స్వీకరించి, ఆమె తమ చరణసేవ చేసుకునేందుకు వీలుగా తమ కాళ్ళను చాపి, తమ పాదసంవాహనం చేస్తున్న ఆమె చేతులను నొక్కుతూ "రాజారామ్,రాజారామ్ అని జపిస్తూ ఉండు" అని మంద్రంగా చెప్పారు. ఈ సంఘటనపై స్వామి సాయిశరణానంద వ్యాఖ్యానం చూస్తే సాయిబాబా శ్రీమతి లక్ష్మీబాయి గణేష్ ఖపర్డేని ఎంతటి ఉత్తమస్థాయిలో ఉంచారో తెలుస్తుంది.
ఇప్పుడు శ్రీసాయి సచ్చరిత్ర 7వ అధ్యాయంలో లక్ష్మీబాయి ఖపర్డే తన కొడుకు అనారోగ్యాన్ని గురించి పడుతున్న ఆందోళన నుంచి సాయిబాబా ఎలా విముక్తి కలిగించారో చూద్దాం. పాఠకుడికి బాబా అద్భుత లీలలను ఎన్నని వర్ణించను! ఒకసారి అక్కడ ప్లేగు వ్యాపించింది. అక్కడ అప్పుడు జరిగిన అద్భుతాన్ని ఇప్పుడు వినండి. శిరిడీలో ఉంటున్న దాదాసాహెబ్ ఖపర్డే కొడుకు తన తల్లితో కలిసి శ్రీసాయి సాన్నిధ్యంలో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ఒకసారి ఆ పిల్లవాడికి తీవ్రమైన జ్వరం రాగా తల్లి ఎంతగానో ఆందోళన చెందింది. ఆమె తన స్వగ్రామమైన ఆమ్రావతి వెళ్ళిపోవటానికి బాబా అనుమతి కోసం వచ్చింది. సాయంత్రపు వ్యాహ్యాళి సమయంలో బాబా వాడా దగ్గరకు వచ్చినప్పుడు శ్రీమతి ఖపర్డే బాబా పాదాలు పట్టుకొని తన బాధను వివరించింది. స్త్రీలు సున్నిత హృదయులు. ఆ పిల్లవాడేమో ప్లేగు సోకి జ్వర తీవ్రతతో వణికిపోతున్నాడు. బాబా ఆమెతో మృదువుగా, "ఆకాశం మేఘావృతమైంది. మేఘాలు వర్షిస్తాయి. మబ్బులు విడిపోతాయి. భయమెందుకు?" అంటూ తమ కఫ్నీని నడుము వరకు పైకెత్తి, తన శరీరం మీద కోడిగ్రుడ్లంత పరిమాణంలో ఉన్న నాలుగు ప్లేగు బొబ్బలను చూపి, "చూడు, నీ బాధను నేను తీసుకున్నాను" అన్నారు. తమ భక్తుల కోసం మహాత్ములు వారి బాధలను ఎలా సహిస్తారో చూసి ఆ దివ్యమైన అద్భుతదృశ్యంతో అక్కడున్నవారు అవాక్కైపోయారు. మహాత్ముల మనసులు మైనం కంటే మృదువైనవి. అవి వెన్నలాంటివి. వారు తమ భక్తులనుండి ఏమీ ఆశించకుండా ప్రేమిస్తారు. వారిని తమ స్వంత పిల్లల కంటే ఎక్కువగా చూసుకుంటారు."
ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు శిరిడీ డైరీ 8-1-1912, 17-1-1912, 18-1-1912, 20-1-1912, 8-2-1912 తారీఖుల్లో పొందుపరచబడ్డాయి. వాటిని సమీకరించి ఈ క్రింద ఇవ్వటం జరిగింది.
8-1-1912: ఆరతయ్యాక మధ్యాహ్న సేవలో, సాయిమహారాజు హఠాత్తుగా కోపగించి తీవ్రంగా తిట్టారు. ప్లేగు ఇక్కడికి మళ్ళీ వ్యాపించబోతున్నట్లుంది. దాని రాకను శ్రీసాయిమహారాజు ఆపబోతున్నట్లున్నారు.
17-1-1912: బల్వంత్(దాదాసాహెబ్ ఖపర్డే చిన్న కొడుకు) దుఃఖాక్రాంతుడై శిరిడీ వదిలి వెళ్ళిపోవాలనుకొన్నాడు.
18-1-1912: పి.ఎస్:- నేనో విషయాన్ని మరచిపోయాను. ఈరోజు సాయిబాబా కఠిన పదాలతో తిట్లవర్షం కురిపిస్తూ, మా అబ్బాయి బల్వంత్‌ను రక్షించానని అంటూ, "ఫకీరు దాదాసాహెబ్‌ను (అంటే నన్ను) చంపాలనుకున్నాడు గానీ నేను అనుమతించలేదు" అన్నారు.
20-1-1912: భీష్మ, మా అబ్బాయి అస్వస్థులుగా ఉన్నారు. భీష్మ అనారోగ్యం వల్లా, బల్వంత్ పరిస్థితి అధ్వాన్నంగా ఉండటంవల్లా ఈరోజు భజన జరుగలేదు.
6-2-1912: మా తిరుగు ప్రయాణం గురించి నా భార్య మాట్లాడినప్పుడు నేను తనని స్వయంగా మా తిరుగు ప్రయాణం గురించి అనుమతిని కోరలేదని బాబా చెప్పారట.
8-2-1912: ఈ మూడు వారాల్లో మొట్టమొదటిసారిగా బల్వంత్ మశీదు వరకూ నడిచి వచ్చే సాహసం చేసి, సాయిమహారాజు పాదాలపై తల పెట్టాడు. బల్వంత్ ఇప్పటికి కోలుకున్నాడు.
9-12-1911న శిరిడీ డైరీలో ఉన్న వివరాలను బట్టి సాయిమహారాజు శ్రీమతి ఖపర్డేను 'అజీబాయి' (అమ్మమ్మ) అని సంబోధించేవారని తెలుస్తోంది.
1-2-1912న మరో ఆసక్తికరమైన వివరం కూడా ఉన్నది. దాని అర్థాన్ని జి.ఎస్.ఖపర్డే ఫుట్ నోట్ రూపంలో 1924లో శ్రీ సాయిలీలలో శిరిడీ డైరీ ప్రచురింపబడటానికి ముందో తరువాతో స్పష్టం చేశారు. ఇప్పుడు చెప్పబడ్డ ఆ వివరము, దానికివ్వబడిన సృష్టీకరణ ఈ క్రింద ఇవ్వబడ్డాయి.
1-2-1912: "ఈరోజు సాయంత్రం సాయిబాబా వ్యాహ్యాళికి వెళ్ళబోయేముందు మేమంతా మశీదులో సమావేశమైన సమయంలో సాయిబాబా శ్రీదీక్షిత్‌తో సాయిసాహెబ్ చరణ సంవాహనం చేస్తున్న నా భార్యకు రెండువందల రూపాయిలు ఇవ్వమని చెప్పారు. ఈ ఆజ్ఞ తిరుగులేనిది. నేను ఇతరుల దయాదాక్షిణ్యాల మీద నా జీవనాన్ని గడపాలని దీనితో తెలుస్తోంది.!!! దీనికన్నా నాకు మరణమే నయం. సాయిసాహెబ్ మొదట నా అహాన్ని అణిచి తరువాత దాన్ని నాశనం చేయటం కోసం పేదరికానికీ, ఇతరుల దయాధర్మాలకీ నన్ను అలవాటు చేస్తున్నారేమో".
పై వివరాన్ని స్పష్టం చేసే ఫుట్ నోట్:
"1912 డైరీలో ఫిబ్రవరి ఒకటవ తారీఖు పేజీని తిరగేసి, నీ చేత గుర్తించబడ్డ పేరాను చదివాను. అది నా భావాలను సరిగ్గా ప్రతిబింబిస్తోంది. మన సద్గురు సాయిమహారాజు ఆజ్ఞాపించారు. సర్వజ్ఞులు అవటంవల్ల నా మనసు లోపలి పొరల్లో ఉన్న భావాలతో సహా వారికి తెలుసు. అందుకే తమ ఆజ్ఞను పాటించమని ఆయన ఎన్నడూ బలవంతపెట్టలేదు. నా భార్య కష్టాలతోనూ, పేదరికంతోనూ ఉన్న జీవితాన్ని ఇష్టపడటం లేదని నాకు అనిపించటం మీదకి నా దృష్టిని పెట్టాను. కాకాసాహెబ్ దీక్షిత్ ఈ జీవితాన్ని అంగీకరించాడు. ఆనందంగా ఉన్నాడు. కనుక సాయిమహారాజు అతన్ని రెండువందల రూపాయిలు, అంటే పేదరికాన్ని, సహనాన్నీ, నా జీవితానికి(భార్యకి) ఇవ్వమన్నారు".
source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.
Om Sai
ReplyDeleteSri Sai
Jaya Jaya Sai
🙏🙏🙏
Om Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం సాయిరాం🌹🙏🌹
ReplyDelete