సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 367వ భాగం


సాయి శరణానంద అనుభవాలు - మొదటి భాగం

పరిచయం

శ్రీసాయికి శిష్యులంటూ ఎవరూ లేకపోయినా, భక్తులు అసంఖ్యాకంగా ఉన్నారు. అలాంటి అనన్యభక్తి చేసేవారిలో చెప్పుకోదగ్గ భక్తుడు స్వామి సాయి శరణానంద. సన్యాస స్వీకరణకు ముందు ఈయన పేరు వామన్ ప్రాణ్ గోవింద్ పటేల్. ఈయన 1889వ సంవత్సరం, ఏప్రిల్ 5వ తారీఖున సూరత్ జిల్లా, బర్డోలి తాలూకా, మోతా గ్రామంలోని ఒక సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. 6వ తరగతి వరకూ మోతాలో, ఆపై ముంబాయిలో మెట్రిక్యులేషన్, ఎల్ఫిన్‌స్టన్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేసి, 1911లో ఎల్.ఎల్.బి పరీక్ష పాసైన వామన్ 13వ ఏట కళావతి అనే అమ్మాయిని పెళ్ళాడాడు.

ఇంట ఆధ్యాత్మిక వాతావరణం ఉండటం వల్లనో ఏమో ఇతను చిన్నప్పటినుంచీ రామరక్షాస్తోత్రం, విష్ణుసహస్రనామం, ఆదిత్యహృదయం చదివేవాడు. కానీ అతను ఇంటరుకు వచ్చాక నిత్యపూజ, సంధ్య వార్చటాల్లో అభిరుచి కోల్పోయి స్తోత్ర పఠనాలను ఆపేసినా, రాత్రిపూట పడుకోబోయేముందు గీత మాత్రం చదివేవాడు. దాంతో అతనికి మానసికంగా తానెంతో బలాన్ని పుంజుకున్నట్లు అనిపించేది. అతను చదివిన అసంఖ్యాకమైన పుస్తకాల వల్ల అతని మనను అశాంతికి లోనై 'అసలు దేవుడున్నాడా? లేక అది కేవలం భ్రమా?' అన్న మీమాంసలో పడిపోయాడు. ఎలాగైనా సరే దేవుడ్ని చూడాలని తపన అతనికి ఎక్కువైంది. అతని ప్రార్థనలూ, తపస్సూ ఫలించి 1911, డిసెంబరు 10వ తారీఖున తన ఎల్.ఎల్.బి పరీక్ష అవగానే తండ్రి ప్రోద్బలంపై శిరిడీ వెళ్ళాడు. అప్పటినుంచి శ్రీసాయి మహాసమాధి చెందేవరకు శరణానంద తరచూ శిరిడీ వెళ్ళి వస్తుండేవాడు.

ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే 1913, 1916లలో ఇతను శిరిడీలో గడిపిన సమయం చాలా విశిష్టమైనది. 1913లో ఇతను శిరిడీ వెళ్ళినప్పుడు బాబా అతన్ని 11 నెలలు ఉంచేశారు. బాబా అతన్ని భిక్షకోసం 4, 5 ఇండ్లకు పంపేవారు. పూర్వజన్మ కర్మలను నశింపచేయటానికి గాయత్రి పురశ్చరణ చేయించారు. ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు అతనిచే చదివింపజేసి అపారమైన ఆధ్యాత్మిక అనుభవాలు అతనికి ప్రసాదించారు బాబా. అతను హైస్కూల్లో, కాలేజీల్లో ప్రిన్సిపాల్ గానూ, ప్రొఫెసర్ గానూ, సొలిసిటర్ గానూ పనిచేసి 1950లో పదవీవిరమణ చేశారు. 1951లో అతని భార్య, ఆ తరువాత కొడుకు, మరికొన్ని సంవత్సరాలకు కుమార్తె మరణించారు.

1950-53 ల మధ్య ఈయన గుజరాతీ భాషలో 14 అమూల్యమైన గ్రంథాలు రాశారు. ఈయన రాసిన 'శ్రీసాయిబాబా' అనే పుస్తకం 1962-66 మధ్య ఆరుసార్లు ముద్రింపబడి చాలా ప్రసిద్ధి చెందింది. 1953లో ఈయన అన్ని బంధాల నుంచి ముక్తులై సన్యాసం స్వీకరించారు. సాయిబాబాతో ఏకత్వాన్ని సాధించి 1982 ఆగష్టు 25న అహమ్మదాబాదులో నిర్యాణం చెందారు. ఈయన తనకున్న అతీంద్రియశక్తులను అరుదుగా మాత్రమే ఉపయోగించేవారు. ఈయన నిర్యాణం తరువాత ప్రచురించబడ్డ ఈయన రచనలు - 'సాయినాథనే శరణే', 'బ్రహ్మ పరిమళం', 'సిద్ధామృతం'.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

4 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo