సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 368వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - రెండవభాగం

దేవుడున్నాడు! లేడని ఎందుకంటావు?

మా నాన్నగారు శ్రీఅక్కల్‌కోట స్వామి శిష్యుడు బాలకృష్ణ మహారాజు దగ్గరకు వెళ్ళొస్తుండేవారు. 1910వ సంవత్సరం డిసెంబరు నెలలో ఓ పూర్ణిమరోజున మా నాన్నగారు నన్ను మహరాజ్ దగ్గరకు తీసుకెళ్ళారు. పిచ్చాపాటీ మాట్లాడుతున్నప్పుడు మహరాజ్‌తో నేను, “భగవంతుడి ప్రత్యక్ష దర్శనాన్ని నాకు ఇప్పించగలవారికి శిష్యరికం చేసి వారిని ప్రసన్నం చేసుకుంటాను. వారినే గురువుగా అంగీకరించి వారిని శరణంటాను" అన్నాను. తరువాత మా నాన్నగారు ఆ మహరాజ్ చేతిలో మరాఠీ ఏకనాథ భాగవతాన్నీ, అక్కల్‌కోట స్వామి చరిత్రనీ పెట్టారు. ఆ మహరాజ్ బత్తాయిలు నాకు ప్రసాదంగా ఇచ్చి, నా తండ్రి ఇచ్చిన పుస్తకాలను ఆయనకు తిరిగి ఇవ్వకుండా నా చేతిలో పెట్టి, "ఇవి చదువు" అన్నారు. నేను అక్కల్‌కోట స్వామి చరిత్ర చదివాను. అందులో వర్ణించబడిన స్వామి దివ్యశక్తినీ, భక్తులకు కలిగిన అనుభవాలనూ చదివి నేను ముగ్ధుణ్ణయ్యాను. అలాంటి మహాత్ముడు ఎవరినైనా నేను దర్శిస్తే ఎంత బాగుంటుంది, 'సాక్షాత్తూ భగవంతుడున్నాడా లేక అది కేవలం మానవ కల్పనా అన్న నా అనుమానానికి ఆ మహాత్ముడు సహజమైన అనుభవమిస్తారేమో కదా!' అన్న ఆలోచన నా మనసులో నాటుకుంది.

శ్రీసాయిబాబా పేరును నేను మొట్టమొదటిసారిగా 1911 మే నెలలో విన్నాను. శ్రీసాయిబాబా దివ్యశక్తిని, కీర్తిని విని మానాన్నగారూ, శ్రీ సాకర్‌లాల్ కేశవరామ్ భట్టు - రావుబహద్దూర్ సాఠే గారి నుంచి లేఖను తీసుకుని శిరిడీ వెళ్ళారు. వారిద్దరికీ సాయిబాబా తమ దివ్యశక్తిని నిరూపించే అనుభవాలనిచ్చారు. ఆ సమయంలో మా నాన్నగారి పళ్ళన్నీ ఊడిపోయి, చిగుళ్ళు చాలా సున్నితంగా ఉన్నాయి, పళ్ళు కట్టించుకోవటానికి ఇంకా సమయం ఉంది. అందువలన ఆయన భోజనం నమిలి తినలేరు కాబట్టి, రవ్వకేసరే తనకి ఆహారం. 

శిరిడీలో బాపూసాహెబ్ జోగ్ ఇంట్లో భోజనానికి కూర్చోవటంతోనే ఆయన మనసున - "ఇక్కడి చపాతీలు నేనెలా నమలగలుగుతాను?" అన్న ఆలోచనే పీకింది. "ఇంట్లో ఐతే నేను రోజూ హల్వా తింటాను. కానీ ఇక్కడ అదెలా దొరుకుతుంది?" అని ఆలోచిస్తుండగా, అప్పుడే సాయిబాబా పంపగా వచ్చిన ఒక వ్యక్తి జోగ్‌తో, “బాబా ఇప్పుడు రవ్వకేసరి పంపమన్నారు. బాబాకు నేవేద్యంగా అర్పించాక భోజనం కోసం కూర్చున్న వారందరికీ అదే ప్రసాదంగా పంచబడుతుంది. భోజనం కోసం కూర్చున్నవారిలో ఎవరూ కూడా ఈ రవ్వకేసరి తినకుండా లేవకూడదని బాబా ఆదేశం" అన్నాడు. జోగ్‌కి సాయిబాబా ఇచ్చిన ఆ ఆజ్ఞతో మా నాన్నగారు విస్మితులైనారు. 'నామనసులో ఉన్న ఆలోచనను వెంటనే తెలుసుకొని రవ్వకేసరిని తయారుచేయించి పంచటానికి ఏర్పాటు జరిగిపోయింది. (కృప కలిగింది)" అని మనసులోనే, "సాయి మహారాజా! ధన్యుణ్ణి" అని ఆయన అనుకున్నారు. 

అలాంటి అనుభవమే సాకర్‌లాల్ భట్‌కి కూడా జరిగింది. ఒకానొక దుర్ఘటన వల్ల అతను కుంటివాడైపోయాడు. కోపర్గాం చేరుకుంటూనే అతని పాదంలో ఒక దానిమీద ఒకటి ఎక్కిన నరాలు విడిపోయి అతను తన కుంటితనం నుండి శాశ్వతంగా ముక్తుడయ్యాడు. దాంతో అతను ఎంతో సంతోషించాడు. తిరిగి వచ్చాక ఈ అలౌకికమైన బాబా లీలల గురించి వారిద్దరూ నాతో చెప్పారు. మా నాన్న నాతో, "వామన్! శిరిడీ వెళ్ళొస్తే నీకు సంతోషం కలుగుతుందని నా విశ్వాసం" అన్నారు.


తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

4 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo