సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 400వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబాను సహాయం అడిగితే తప్పకుండా చేస్తారు
  2. బాబా చిన్న చిన్న విషయాలను కూడా గమనిస్తుంటారు

బాబాను సహాయం అడిగితే తప్పకుండా చేస్తారు

ఓం శ్రీ సాయిరామ్! సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

నా పేరు పద్మ. నేను సాయిబాబా భక్తురాలినని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. నా జీవితంలో ప్రతిదీ బాబా ఇచ్చిందే. బాబా వద్దకు రాకముందు జీవితానికి, బాబాను నమ్ముకున్న తర్వాత ఆయన ప్రసాదించిన జీవితానికి చాలా తేడా ఉంది. నా ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. నన్ను మంచి మనిషిగా బాబా మలుస్తున్నారు. నాకు ఏది మంచిదో అది ఇస్తూ బాబా నన్ను, నా కుటుంబాన్ని ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడుతున్నారు. నా జీవితంలో బాబా చేసిన లీలలు ఎన్నో వున్నాయి. వాటిలో ఒక లీలను ఇప్పుడు మీతో పంచుకుంటాను. నా కోరిక నెరవేరితే భక్తుల అనుభవాలలో ఈ లీలను పంచుకొంటానని బాబాకు మాట ఇచ్చాను. “ఇంత ఆలస్యంగా మీ లీలను పంచుకుంటున్నందుకు మీ బిడ్డను దయతో మన్నించండి బాబా!”. ఇక నా అనుభవం విషయానికి వస్తే..

బాబా దయతోనే మాకు బాబు పుట్టాడు. అడుగడుగునా బాబా దయతోనే మంచివాడుగా పెరుగుతూ చక్కగా చదువుకుంటున్నాడు. తను ఇంజినీరింగ్ చదివేటప్పుడు బాబా దయతో క్యాంపస్ ప్లేస్‌మెంటులో ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కానీ ఆ కంపెనీవాళ్ళు 5 సంవత్సరాలు బాండు అడిగారు. మంచి కంపెనీ, మంచి ఉద్యోగమని బాబు ఆ కంపెనీలో జాయిన్ అవుతానంటే, కంపెనీ అడిగిన బాండు గురించి మేము చాలా మదనపడ్డాము. చివరికి బాబా మీద భారం వేసి, ‘అంతా బాబానే చూసుకొంటార’ని ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు మా బాబు. ఒక సంవత్సరం తర్వాత తనకు ఆ ఉద్యోగం నచ్చలేదు. తాను పెద్ద చదువులు చదువుతానని పట్టుపట్టాడు. ‘మరి బాండు సంగతి?’ అని చాలా ఆందోళనపడ్డాము. బాబా నామం స్మరించుకుంటూ, “ఈ నిర్ణయం వల్ల బాబుకి ఏ సమస్యా రాకుండా నువ్వే చూసుకో బాబా” అని బాబాని వేడుకున్నాను. ఒకరోజు నా మనస్సుకు ధైర్యం చెప్పడానికా అన్నట్టు మా ఇంటి ముందుకు బాబా బండి వచ్చింది. ‘నేను ఆ బండి దగ్గర మ్రొక్కితే నా సమస్య బాబా పరిష్కరిస్తారని బాబానే ఆ బండి అతని ద్వారా చెప్పించారు. దాంతో నా మనసు కాస్త కుదుటపడింది. భారమంతా బాబా మీద వేసి మా బాబు ఆ ఉద్యోగం మానేశాడు. తను ఆ ఉద్యోగం మానేసి దగ్గర దగ్గర రెండేళ్ళు అవుతోంది. ఆ కంపెనీ నుండి ఎటువంటి సమస్యా లేకుండా బాబా చూసుకున్నారు. ఇప్పుడు మా బాబు బాబా అనుగ్రహంతో CMAT ద్వారా మంచి కాలేజీలో సీటు సంపాదించి ఉన్నత చదువులు చదువుకుంటున్నాడు. మంచి మనసుతో మనం బాబాను సహాయం అడిగితే ఆయన తప్పకుండా సహాయం చేస్తారు. బాబా పైన భారం వేసి మనం నిశ్చింతగా ఉందాం. ఇకముందు కూడా మా పిల్లలను, నా కుటుంబాన్ని బాబా కంటికి రెప్పలాగా కాపాడుతారని నమ్ముతున్నాను. “బాబా! మా భారం నీదే తండ్రీ. మా బాబు ఉద్యోగం విషయంలో ఏది మంచిదో అది చేయి తండ్రీ. ఎల్లప్పుడూ నీ నామస్మరణ చేసేలా నన్ను దీవించు బాబా! నా కుటుంబాన్ని, ఈ విశ్వాన్ని కొరోనా బారినుండి కాపాడు బాబా ప్లీజ్! నన్ను, నా కుటుంబాన్ని ఎల్లవేళలా కాపాడుతున్నందుకు థాంక్యూ, థాంక్యూ బాబా!”

బాబా చిన్న చిన్న విషయాలను కూడా గమనిస్తుంటారు

బెంగుళూరు నుండి ఒక సాయిభక్తురాలు ఇటీవల తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

ప్రతి గురువారం నేను బాబాకు నైవేద్యంగా ఏదైనా తయారు చేసుకుని శివమ్మతాయి సాయి మందిరాన్ని సందర్శిస్తుంటాను. ఇటీవల ఒకరోజు నేను పులిహార తయారు చేసుకుని ఆ మందిరానికి వెళ్ళాను. బాబాకు నైవేద్య సమర్పణ, ఆరతి అయ్యాక నేను ప్రసాదం పంపిణీ చేయడానికి నిలబడ్డాను. నాతోపాటు ఒక పెద్దాయన ఛోలే (శనగలు) పంపిణీ చేయడానికి నిలుచున్నారు. నేను ఆయనకి పులిహార పెట్టాను. ఆయనకి అది ఎంతగానో నచ్చి మళ్ళీ మళ్ళీ పెట్టించుకుని తిన్నారు. అది నా మనసుకు సంతోషాన్నిచ్చింది. ఆయన నాకు ఛోలే ఇచ్చారు. అది కూడా రుచికరంగా ఉంది. మరోసారి తినాలని నాకున్నా కూడా ప్రసాదం కోసం చాలామంది స్కూలు పిల్లలు, పెద్దవాళ్ళు ఉన్నందున నేను మౌనంగా ఉండిపోయాను. భక్తులందరికీ ప్రసాదం పంపిణీ చేయడం ముగిశాక ఆయన నావైపు చూసి పులిహార పెట్టించుకున్నారు. ఆయన కూడా నాకు ఛోలే ఇస్తారేమోనని చూశాను కానీ అది ఖాళీ అయిపోయినట్లుంది. అందువలన నా కోరిక నా మనస్సులోనే ఉండిపోయింది. తరువాత నేను ఇంటికి వెళ్తున్నాను. దారిలో ఎందుకో తినడానికి వడ (తిని చాలా రోజులైనందువల్ల) ఉంటే బాగుంటుందని ఒక చిన్న ఆలోచన నా మనస్సులోకి వచ్చింది. ఆ కోరికను కూడా మనసులోనే దాచుకుని ఇంటికి చేరుకున్నాను. బాబా చిన్న చిన్న విషయాలను కూడా గమనిస్తుంటారు. కాబట్టి నా మనసులోని కోరిక నెరవేరడానికి ఎంతో సమయం పట్టలేదు. రాత్రి 7 గంటలకు నా స్నేహితురాలొకరు సాయి ప్రసాదం ఇవ్వడానికి వస్తున్నానని చెప్పింది. నేను తనకోసం వేచి చూస్తునాను. ఆమె ఒక ట్రే తో నా ముందుకొచ్చింది. అందులో ఉన్న ఛోలే, వడ చూసి నాకు ఆశ్చర్యం! ఆనందం! అసలు నా స్థితిని ఎలా వ్యక్తపరచాలో నాకు తెలియడంలేదు. ఇది చాలా చిన్న విషయమే, కానీ హృదయం పులకించిపోయింది. "లవ్ యు బాబా!" నా ఆనందాన్ని నాలోనే దాచుకోలేక మీ అందరితో పంచుకోవాలని అనిపించింది.

ఓం సాయిరాం!


5 comments:

  1. మీ అనుభవాలను చదువుతుంటే చాలా సంతోషంగా ఉంది. ఓం శ్రీ సాయిరాం తాతయ్య,🙏🙏🙏

    ReplyDelete
  2. Sairam,Sairam,Sairam pls solve my problem soon sai,pls give me strength to move towards my goal.Love u sai,pls be with me always

    ReplyDelete
  3. ఓం సాయిరాం🌹🙏🌹

    ReplyDelete
  4. SaiNadha! Please don't test me do any miracle in my life for getting a good Job.I am in your hand only so please protect me.
    protect me🙏🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo