సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 404వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • నా జీవితంలో సాయిబాబా - మొదటి భాగం...

చెన్నై నుండి సాయిభక్తురాలు ఐశ్వర్య తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

నేను ఉద్యోగస్థురాలిని. ఒక అందమైన మగబిడ్డకు తల్లిని. బాబా నాకు చక్కటి ఆహ్లాదకరమైన వైవాహిక జీవితాన్ని ప్రసాదించారు. ఆయన నా జీవితంలో ప్రసాదించిన ప్రతిదానికీ నా శతకోటి ధన్యవాదాలు, ప్రణామాలు.

నేను 2004లో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్నప్పుడు ఒకరోజు నా తోటి విద్యార్థి తన చేతికి ధరించిన బాబా ఉంగరాన్ని చూశాను. ఈయనెవరని తనని అడిగాను. అప్పుడే నేను తొలిసారి నా బాబా దైవత్వం గురించి తెలుసుకున్నాను. తనని నాకోసం ఒక ఉంగరం తీసుకోమని అభ్యర్థించాను. తరువాత అదృష్టవశాత్తూ మేమిద్దరమూ ఒకే కాలేజీలో ఒకే కోర్సులో చేరి ఒకే బస్సులో ప్రయాణించేవాళ్ళము. ఒకరోజు హఠాత్తుగా తను నాకు బాబా ఉంగరం ఇచ్చింది. ఎన్నో రోజుల క్రితం ఇచ్చిన వాగ్దానాన్ని తను గుర్తుపెట్టుకుని మరీ నాకు ఉంగరాన్ని ఇచ్చింది. అప్పటినుండి నా బాబాతో నా ఆత్మ ప్రయాణం ప్రారంభమైంది.

తరువాత నేను మొదటిసారి సాయి సచ్చరిత్ర పుస్తకాన్ని తెరచినప్పుడు అందులో ఉన్న బాబా ఫోటోను చూసి ఆయనతో, "బాబా మీరొక సత్పురుషులని నేను ఎలా నమ్మాలి? ఈ ఫోటోలో ఉన్న మీరు ఇప్పుడు మీ కనురెప్పలు వాల్చి(బ్లింక్) చూపించండి. అప్పుడే మిమ్మల్ని నేను నమ్ముతాను" అని అన్నాను. కానీ అలా జరగలేదు. అయినప్పటికీ, నేను ఆ పుస్తకాన్ని చదివాను. ఆరునెలల తరువాత మొదటిసారి నేను నా కుటుంబంతో కలిసి బాబా గుడికి వెళ్ళాను. అకస్మాత్తుగా బాబా కనురెప్పలు వాల్చారు. అది నేను చాలా స్పష్టంగా చూశాను. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు చాలాసార్లు ఆయన కనురెప్పలు వాల్చడం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఒక నిమిషం పాటు ఏమి జరుగుతుందో అర్థంకాని స్థితిలో స్తబ్దంగా ఉండిపోయాను. తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు గతంలో నేను బాబాను అభ్యర్థించిన విషయం గుర్తొచ్చింది. ఆ విషయాన్ని నేను పూర్తిగా మర్చిపోయాను. కానీ నా బాబా మర్చిపోకుండా తమ కనురెప్పలు వాల్చి తాము సత్పురుషులమని నాకు తెలియజేశారు. మొదటిసారి నా కళ్ళలో కన్నీళ్ళు తిరిగాయి. 'ఇది చాలు, నా జీవితాంతం నేను ఆయనను విశ్వసించగలను' అని అనుకుని ఆ క్షణంనుండి నేను బాబాకు శరణాగతి చెందాను.

సాయి సచ్చరిత్ర చదవడం ద్వారా, బాబా సూచించినట్లు నన్ను నేను ఒక మంచి వ్యక్తిగా ఎలా రూపొందించుకోవాలో అర్థం చేసుకున్నాను. ఆయన కారణంగా నా చుట్టుపక్కల అందరిలో ధైర్యం, మంచి హృదయం గల వ్యక్తిగా గుర్తింపు పొందాను. నాకు బాబా చూపుతున్న అద్భుతాలను నా చుట్టూ ఉన్న చాలామందితో పంచుకుంటూ ఉండేదాన్ని. నా స్నేహితులు కూడా చాలామంది బాబా భక్తులయ్యారు. మేమంతా కలిసి ప్రతి గురువారం హాస్టల్‌లో బాబాకు పూజలు చేయడం ప్రారంభించాము. ఆచారం ప్రకారం చెప్పాలంటే మా పూజలో చాలా లోపాలు ఉండేవి, కానీ ఆయన మా స్వచ్ఛమైన మనస్సును స్వీకరించారు. నా స్నేహితులు, కుటుంబసభ్యులతో బాబా గురించి పంచుకుంటూ చాలా సంతోషంగా ఉండేదాన్ని.

అయితే నాకు కఠినమైన కాలం 2007 నవంబర్లో ప్రారంభమైంది. హఠాత్తుగా మా అమ్మ నాల్గవ దశ రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలిసింది. కానీ బాబా దయతో ఆమె 2009 ఏప్రిల్ వరకు మా మధ్య ఉంది. ఆ సమయంలో మేము తనకోసం ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా చేయగలిగినదంతా చేశాము. కానీ దైవనిర్ణయం మరోలా ఉంది. అందుచేత ఆమె మమ్మల్ని శారీరకంగా విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కానీ ఆమె ఎప్పుడూ మాతోనే ఉంది. ఆ సంఘటన తరువాత జీవితం పట్ల ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చింది వచ్చినట్లు తీసుకోవడం ప్రారంభించాను. తీవ్ర దుఃఖంతో సంవత్సరానికి పైగా నేను దేవుళ్ళను ప్రార్థించడం మానేశాను.

ఇలాంటి సమయంలో నాకెంతో సన్నిహితుడైన నా పాఠశాల స్నేహితుడు నన్ను ఇష్టపడుతున్నానని ప్రతిపాదన తీసుకొచ్చాడు. చిన్నప్పటినుండి తను నన్ను ఇష్టపడుతున్నాడని నాకు తెలుసు. కానీ మేము మా ఉద్యోగాలలో స్థిరపడ్డాకే నాకీ విషయం చెప్పాడు. అతను మంచి వ్యక్తి, అందులో సందేహం లేదు. కానీ సమస్యేమిటంటే అతను ముస్లిం, నేను హిందువుని. కానీ అది దైవనిర్ణయమని మేము అనుకున్నాము. అందువలన నేను తన ప్రతిపాదనకు సమ్మతించాను. సంవత్సరం తరువాత అతని కుటుంబ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. అందువలన ఈ పరిస్థితుల్లో వివాహం చేసుకోవడం కష్టమని తను నాతో చెప్పాడు. ఆ మాటతో నా గుండె బద్దలైపోయింది. అతను ఒక మంచి వ్యక్తిత్వం గల మేలిమి రత్నం. తల్లిని కోల్పోయిన నేను తనని కూడా కోల్పోతున్నందుకు కుమిలిపోయాను. కొన్ని సంవత్సరాలపాటు పగలు రాత్రి, "మా తల్లిదండ్రుల సమ్మతితో మా వివాహం జరిగేలా కృప చూపమ"ని ఏడుస్తూ గడిపాను. బాబాను, శివుడిని ప్రార్థిస్తూ, ఉపవాసాలు చేశాను. సచ్చరిత్ర చదువుతూ ఎక్కువ సమయం ఒంటరితనంలో గడిపాను.

అదలా ఉంటే, మరోవైపు నా తల్లి మరణంతో నా సోదరుడు షాక్ కి గురికావడంతో మానసిక రుగ్మతకు లోనయ్యాడు. ఆ స్థితిలో నాన్నకు, సోదరుడికి నేను మాత్రమే ఆనందం అయ్యాను. అందువల్ల నా లోపల ఏమి జరుగుతుందో బయటకు తెలియనివ్వకుండా నేను పూర్తిగా మౌనంగా, ఒక సాధారణ వ్యక్తిలాగా ఇతరుల ముందు ప్రవర్తించసాగాను. కానీ మానసికంగా బాగా కృంగిపోయాను. ఇవన్నీ 2009-2014 సెప్టెంబర్ మధ్యలో జరిగాయి. నా బాబా, మా కులదేవత నన్ను వారి హృదయానికి చాలా దగ్గరగా ఉంచుకుని ఆ కష్టకాలంలో నాకు సహాయం చేశారు.

అన్ని సంవత్సరాలపాటు బాబా నా చెడు కర్మల ఫలితాన్ని తుడిచిపెడుతున్న క్రమంలో కూడా ఒక గొప్ప విషయం ఏమిటంటే, ఆయన నాలో రాతిస్తంభం లాంటి విశ్వాసం రూపంలో నిలిచారు. జీవితంలో నేను ఎంత నిరాశకు గురైనప్పటికీ బాబాను విడిచిపెట్టాలని మాత్రం అనుకోలేదు. చివరికి ఒకదాని తరువాత ఒకటి బాబా లీలలు మొదలయ్యాయి.

మిగిలిన అనుభవాలు రేపటి భాగంలో ... 

source:http://www.shirdisaibabaexperiences.org/2020/01/shirdi-sai-baba-miracles-part-2598.html


4 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo