ఈ భాగంలో అనుభవం:
- మోసపోకుండా బాబా మమ్మల్ని రక్షించారు
యు.ఎ.ఇ. కి చెందిన ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:
ఓం సాయిరామ్! ఉద్యోగస్తురాలినైన నేను ప్రేమగా చూసుకునే నా భర్త, ఇద్దరు పిల్లలతో దుబాయిలో నివాసముంటున్న ఒక సాధారణ సాయిభక్తురాలిని. వారంరోజులపాటు నేను బాబాతో పోట్లాడినందువల్ల నన్ను నేను బాబాకు భక్తురాలినని చెప్పుకోవచ్చో లేదో నాకు తెలియదు. నేను బాబా భక్తురాలినని చెప్పుకునే హక్కును కోల్పోయాను. కానీ పోట్లాడినా, అరిచినా బాబా పాదాలనే నేను ఆశ్రయించగలిగేది. "క్షమించండి బాబా! దయచేసి నా ప్రవర్తనకు మన్నించండి". మొదట్లో నేను బాబాకు భక్తురాలిని కాదు. కానీ బాబానే నన్ను, నా కుటుంబాన్ని దగ్గరకు తీసుకుని తమయందు దృఢమైన విశ్వాసం స్థిరపడేలా చేసుకున్నారు. ఇప్పుడు బాబా మా కుటుంబంలో ఒకరు. ఆయనతో సంబంధం లేకుండా మా ఇంట్లో ఏదీ జరగదు. ఇక నా అనుభవానికి వస్తాను.
కొన్నేళ్ల క్రితం బాబా నన్ను, నా భర్తను మోసపోకుండా కాపాడిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటాను. నా భర్త తన పాత కారును ఇచ్చేసి, అధునాతన ఎస్‌యూవీ ల్యాండ్‌రోవర్ కారు తీసుకోవాలని అనుకున్నారు. దుబాయిలో సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ వ్యాపారం చాలా చురుకుగా ఉంటుంది. మేము సెకండ్ హ్యాండ్ కార్లు, ఇతర వస్తువుల షోరూమ్ అయిన డుబిజిల్‌లో ఒకటి నుండి రెండు సంవత్సరాలు ఉపయోగించబడిన సెకండ్ హ్యాండ్ ల్యాండ్‌రోవర్ చూడటానికి వెళ్ళాము. మంచి ధరలో ఒక వెహికల్ ఉండటంతో ఆ వెహికల్ అమ్మే వ్యక్తిని సంప్రదించి, కారును కూడా పరిశీలించాము. ఆ వెహికిల్ యజమాని ఒక దంతవైద్యుడు. అతడు ఆ కారు తన భార్యదని చెప్పాడు. అతను చెప్పినవన్నీ మేము విశ్వసించి కారు తీసుకోడానికి సిద్ధపడ్డాము. వ్రాతకోతలన్నీ పూర్తిచేసి, రిజిస్ట్రేషన్ కోసం RTA కార్యాలయానికి వెళ్ళాము. కారు అమ్మే ఆ వ్యక్తి విషయంలో అనుమానించదగ్గ చాలా సంకేతాలున్నాయి, కానీ మా అమాయకత్వం వల్ల వాటిని గుర్తించలేకపోయాము. ఇన్సూరెన్స్ చేయాల్సిన బ్రోకర్ ఆ కారు విషయంలో అసౌకర్యాన్ని వ్యక్తపరుస్తూ మరికొన్ని వివరాలను అడుగుతున్నాడు. వాటిని కారు అమ్ముతున్న వ్యక్తి అందిస్తాడనే విశ్వాసంతో పేపర్ల మీద సంతకాలు పూర్తయిన తర్వాత అతనికి చెల్లించడానికి మేము డబ్బు కూడా సిద్ధంగా పెట్టుకున్నాము.
కొద్దిసేపటికి నేను కొన్ని డాక్యుమెంట్ల ఫోటోకాపీల కోసం వెయిటింగ్ హాల్ నుండి బయటకు వెళ్ళాను. అకస్మాత్తుగా, చూడటానికి అచ్చం బాబాలా ఉన్న ఒక వృద్ధుడు నా దగ్గరికి వచ్చి, మా మాతృభాష అయిన తమిళంలో "అమ్మకందారుడు పెద్ద మోసగాడు" అని హెచ్చరించాడు. ఇంకా, "అతను చెప్పేవన్నీ అబద్ధాలు, అతను దెబ్బతిన్న కార్లను ఎంచుకుని, వాటికి పెయింటింగ్ మొదలైనవి వేసి అమాయకులను మోసం చేసి అమ్మేస్తుంటాడు. పాపం ఆ అమాయకులు కారు కొనుక్కున్న తరువాత లక్షలు ఖర్చు పెట్టాల్సిన పెద్ద మరమ్మతులు ఉన్నాయని తెలుసుకుంటారు" అని చెప్పాడు. అది విన్న నేను నిర్ఘాంతపోయాను. నేను ఆ వృద్ధుడికి కృతజ్ఞతలు చెప్పి, మెల్లగా వెళ్లి నా భర్తకు విషయం చెప్పాను.
తరువాత భీమా సంస్థ నుండి కొన్ని పేపర్లు తీసుకుని రావడానికి వెళ్తున్నామని అమ్మకందారునితో చెప్పి మేము బయటికొచ్చి ల్యాండ్‌రోవర్ సర్వీస్ సెంటరుకి వెళ్లి, మేము కొనబోయే కారు గురించి వివరాలు చూసి చెప్పమని ఏజెంటుని అభ్యర్థించాము. సాధారణంగా అపరిచితులకు అలాంటి సమాచారం ఇవ్వాల్సిన అవసరం వాళ్లకు లేదు. కానీ బాబా దయతో వాళ్ళు మాకు సహాయం చేశారు. ఆ కారు ఇటీవలే ఒక పెద్ద ప్రమాదానికి గురైందని, చాలా మరమ్మతులు చేయాల్సిన అవసరముందని చెప్పారు. ఈ విషయాలేవీ మాకు ముందు తెలియదు. మేము వెంటనే తిరిగి వెళ్లి అబద్ధాలు చెప్పినందుకు అమ్మకందారుని నిలదీసి, మా ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాము. మేము ఒప్పందాన్ని పూర్తి చేసుకుని ఉంటే, దెబ్బతిన్న కారుకు డబ్బు చెల్లించి నష్టపోయేవాళ్ళము. కొద్దినిమిషాల కాలవ్యవధిలో మేము పెద్ద సమస్య నుండి బయటపడ్డాము. చివరి నిమిషంలో బాబా తమంతట తాముగా వచ్చి మమ్మల్ని కాపాడారు. ఆ సంఘటన గురించి ఇప్పుడు ఆలోచించినా బాబా తమంతట తాము వచ్చి సహాయం చేసేందుకు తగినట్లుగా మేమున్నామనే ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతాను.
"ధన్యవాదాలు బాబా! దయచేసి మా భక్తి విశ్వాసాలు స్థిరంగా ఉండేలా మమ్మల్ని ఆశీర్వదించండి. గత కొన్ని సంవత్సరాలుగా మా కుటుంబం చాలా కష్టాలను ఎదుర్కొంటోంది. మీ దయవలన మాత్రమే మేము జీవన ప్రయాణం చేయగలుగుతున్నాము. బాబా! మీరే నా దైవం, స్నేహితుడు, మార్గదర్శకుడు. గురుదేవా! మీకు మీ గురువుపట్ల ఉన్నంత భక్తి మేము మీపట్ల కలిగి ఉండేలా అనుగ్రహించండి. మీ ఆశీస్సులతో మాత్రమే ప్రతిదీ సాధ్యమవుతుంది".
ఓం శ్రీ సాయిరాం తాతయ్య 🙏🙏🙏
ReplyDeleteOm sai ram 🙏 🙏🙏
ReplyDeleteom sairam
ReplyDeletesai always be with me
Om Sai Ram 🙏🌹🙏
ReplyDelete