సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 405వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • నా జీవితంలో సాయిబాబా - రెండవ భాగం...

చెన్నై నుండి సాయిభక్తురాలు ఐశ్వర్య నిన్నటి భాగంలో కొన్ని  అనుభవాలు పంచుకున్నారు. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు:

బాబా నా చెడు కర్మల ఫలితాన్ని తుడిచిపెడుతున్న క్రమంలో కూడా ఒక గొప్ప విషయం ఏమిటంటే, ఆయన నాలో రాతిస్తంభం లాంటి విశ్వాసం రూపంలో నిలిచారు. జీవితంలో నేను ఎంత నిరాశకు గురైనప్పటికీ బాబాను విడిచిపెట్టాలని మాత్రం అనుకోలేదు. చివరికి ఒకదాని తరువాత ఒకటి బాబా లీలలు మొదలయ్యాయి.

సెప్టెంబర్ 2, 2014న నేను నా ప్రేమికుడిని తీసుకుని బాబా మందిరానికి వెళ్లి హృదయం పగిలేలా బాబా ముందు ఏడ్చాను. నాకు తెలిసిన గొప్ప సాయిభక్తులైన అమిత్ గారికి 'నా కోసం, నా ప్రేమికుని కోసం, నా సోదరుడి కోసం ప్రార్థించమ'ని ఒక లేఖ వ్రాశాను. తరువాత 'నా సమస్యలను పరిష్కరించమ'ని హృదయపూర్వకంగా బాబాను వేడుకున్నాను. సెప్టెంబర్ 20, 2014న నా లేఖకు స్పందన వచ్చింది. తరువాత సెప్టెంబర్ 23 ఉదయం నాకొక కల వచ్చింది. కలలో కాంచీపురానికి చెందిన ఒక సత్పురుషుడు కనిపించారు. నా వివాహం గురించి నేను ఏడుస్తుంటే, ఆయన మౌనంగా ఉన్నారు. తరువాత నా నుదుటిపై మళ్లీ మళ్లీ కుంకుమ పెట్టి ఆశీర్వదించారు. ఆరోజు నేను నిద్ర లేచిన తరువాత నాకు పూర్తి భిన్నమైన అనుభూతి కలిగింది. నాకు నేనే కొత్తగా కనిపించాను. అప్పటికే ముగిసిన నా ప్రేమ బంధాన్ని మొదటిసారిగా అంగీకరించాలని నిర్ణయించుకున్నాను. నన్ను నిజంగా ప్రేమించే నా కుటుంబసభ్యుల కోసం నేను సంతోషంగా జీవించాలని అనుకున్నాను.

దాంతో నేను నా ప్రేమికుడిని కలిసి నా భావాలు అతనికి తెలియజేశాను. తను నా నిర్ణయానికి చాలా సంతోషించాడు. కానీ ఇన్ని సంవత్సరాలు నాలో చాలా ఆశలు కలిగించినందుకు బాధపడ్డాడు. తరువాత తను నాతో, "దయచేసి నా నుండి దూరంగా వెళ్లి అందమైన జీవితాన్ని గడుపు. నేను నెరవేర్చలేని ఆశలు రేపి నీ జీవితాన్ని దుర్భరంగా మార్చినందుకు నన్ను క్షమించు" అని చెప్పాడు. నేను తనతో, “ఫర్వాలేదు, ఇదంతా నా కర్మ. ఇన్ని సంవత్సరాలు నువ్వు నాతో చాలా బాగా నడుచుకున్నావు. కాబట్టి, నీ పట్ల నాకు ఎలాంటి ద్వేషం లేదు, ఉండదు కూడా. దేవుని దయతో నువ్వు కూడా చక్కటి జీవితాన్ని గడపాలి” అని చెప్పాను. అలా ఇద్దరం మా ప్రేమబంధాన్ని సంతోషంగా ముగించాము.

సెప్టెంబరు తర్వాత వచ్చే పెళ్లి ప్రతిపాదన ఏదైనప్పటికీ వాటిని స్వీకరించడానికి నన్ను నేను మలచుకున్నాను. ఒక నిశ్శబ్ద పరివర్తన బాబా నాలో తీసుకొచ్చారు. ఏ పదాలూ దానిని వివరించలేవు. మార్చి 25, 2015, నేను మొదటిసారి నా భర్తను మందిరంలో కలుసుకున్నాను. (మా తల్లిదండ్రులు ఆ సమావేశం ఏర్పాటు చేశారు.) నేను తనతో, "బాబాను నమ్ముతారా?" అని అడిగాను. అందుకతను, "నమ్ముతాను, నేను ఉద్యోగరీత్యా వేరే సిటీకి వెళ్లేంతవరకు ప్రతి గురువారం నా తల్లిని తీసుకుని బాబా మందిరానికి వెళ్ళేవాడిని" అని చెప్పారు. వెంటనే నేను, 'నా బాబా ఈ వ్యక్తిని నాకోసం ఎన్నుకున్నారు. నేను ఇతన్ని హృదయపూర్వకంగా స్వీకరిస్తాను' అని అనుకున్నాను. కొన్ని కారణాలవల్ల, ఆయన కూడా నన్ను మొదటిచూపులోనే ఇష్టపడ్డారు. అదేరోజు చిన్న ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్ కూడా మా మధ్య జరిగింది. ఇది మా కుటుంబంలోని ప్రతి ఒక్క సభ్యునికి ఒక ఆశ్చర్యం, అద్భుతం కంటే ఎక్కువే. నాన్న, నా సోదరుడి ఆనందానికి హద్దుల్లేవు. నేను వారి ఆనందాన్ని చూసి పూర్తిగా ఆనందించాను. అన్నింటికి కలిపి బాబాకు కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించాను. ఆగస్టు 2015లో నా వివాహం జరిగింది. మళ్ళీ నేను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. నా భర్త నిజంగా చాలా మంచి వ్యక్తి. పెళ్ళికి ముందు తన జీవితంలో జరిగిన కొన్ని కఠినమైన సంఘటనల ద్వారా ఆయన చాలా పాఠాలు నేర్చుకున్నారు. అందుకే బాబా దయతో ఆయన చాలా ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని సొంతం చేసుకున్నారు.

నా జీవితం ఒక గాడిలో పడ్డాక నేను నా సోదరుడి వివాహం గురించి ప్రార్థించడం మొదలుపెట్టాను. అయితే తనకి అప్పటికే 35 సంవత్సరాలు, పైగా ఉద్యోగం లేదు. ఆ కారణాల వలన తన వివాహంపట్ల నా విశ్వాసం పూర్తిగా దెబ్బతింది. కానీ బాబా దయ చూపారు. ఆయన ఐటి సంస్థలో పనిచేస్తున్న ఒక మంచి అమ్మాయిని చూపించారు. ఆగస్టు 2017లో తన వివాహం జరిగింది. ఇప్పుడు తనకి సంవత్సరం వయస్సున్న ఒక పండంటి బాబు కూడా ఉన్నాడు. తను బాగా సంపాదిస్తూ కుటుంబ జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నాడు.

నా వివాహానంతరం సంవత్సరానికి పైగా నేను గర్భం దాల్చలేదు. అకస్మాత్తుగా 2016 జూన్ నెలలో ఒకరోజు నా సోదరుడు నాకు ఫోన్ చేసి, "బాబాకు అంకిత భక్తుడైన తన స్నేహితుడు "తన సోదరి, అంటే నేను ఆరునెలల్లో గర్భం దాలుస్తానని, కొన్ని గురువారాలపాటు బాబా మందిరంలో పిల్లలకి ఆహారం పంపిణీ చేయమ'ని చెప్పాడ"ని చెప్పాడు. నేను ఆ మాటను పూర్తిగా విశ్వసించి, అలాగే చేశాను. సరిగ్గా ఆరవ నెలలో నేను గర్భం దాల్చాను. 2017, సెప్టెంబరులో ఆరోగ్యవంతమైన మగబిడ్డకు జన్మనిచ్చాను.

అయితే డెలివరీ తరువాత నేను నా బిడ్డకు తల్లిపాలు ఇవ్వలేకపోయాను. బిడ్డ ఏడుస్తుంటే పాలిచ్చి వాడి ఆకలి తీర్చలేక బాబా ముందు చాలా తీవ్రంగా ఏడ్చాను. బాబా అపారమైన ప్రేమను చూపారు. నా బిడ్డకు 30 రోజుల వయస్సున్నప్పుడు నాకొక కల వచ్చింది. కలలో నా బిడ్డ బాబా పాదాల చెంత ఉండగా నేను ఆయనకు సంపూర్ణ శరణాగతి చెందాను. నేను మేల్కొన్న తరువాత నా భర్తతో, "నేను నా బిడ్డకు త్వరలో తల్లిపాలు పట్టబోతున్నాను. కంచి మహాస్వామి, బాబా నన్ను ఆశీర్వదించినందున నా శరీరం అందుకు సహకరిస్తుంద"ని చెప్పాను. అద్భుతం! సరిగ్గా పదిహేను రోజుల్లో నా బిడ్డకు 45 రోజుల వయస్సున్నప్పుడు డబ్బాపాలను ఆపి పూర్తిగా తల్లిపాలను ఇవ్వగలిగాను. మన దైవం బాబా చేసే అద్భుతాలు అలాంటివి.

మన బాబాను గురించి చెప్పడానికి పదాలు సరిపోవు. స్వర్గ సుఖాన్ని మించిన ఆనందాన్ని అనుభవించడం తప్ప మాటల్లో చెప్పలేం. నా సమస్యలన్నిటినుండి నేను బయటపడితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని బాబాకు వాగ్దానం చేశాను. కానీ దానిని నేను చాలాకాలం పాటు వాయిదా వేసాను. "నా ప్రియమైన బాబా! నన్ను క్షమించండి. ఎప్పుడూ మీ పాదాల చెంత ఉండాలని కోరుకునే మీ సేవకురాలిని". ప్రియమైన సాయి కుటుంబీకులారా! దయచేసి సాయి పాదాలను అంటిపెట్టుకుని ఉండండి. ఆయనను గుడ్డిగా విశ్వసించండి. దయచేసి సహనాన్ని కలిగి ఉండండి. నా జీవితంలో బాబా ఇచ్చిన అనుభవాలు చాలా ఉన్నాయి. వ్రాయగలిగినంత వరకు వ్రాశాను. చాలా ఓపికతో నా అనుభవాలను చదివినందుకు మీకు శతకోటి ధన్యవాదాలు. మీరు కూడా మీ అనుభవాలను వీలైనంత త్వరగా పంచుకోండి, తద్వారా బాబా ప్రేమను అందరికీ పంచండి.

source:http://www.shirdisaibabaexperiences.org/2020/01/shirdi-sai-baba-miracles-part-2598.html


5 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo