సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 379వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - పదమూడవ భాగం

నిన్నటి తరువాయి భాగం....

ఈ మధ్యకాలంలో స్వామి వివేకానందగారి కంప్లీట్ వర్క్స్ (మాయావతి ఎడిషన్) నా చేతిలోకి వచ్చింది. అందులోని జ్ఞానయోగాన్ని పఠించటం మొదలుపెట్టి, శిరిడీకి వెళ్ళేటప్పుడు దాన్ని నాతో తీసుకెళ్ళి అక్కడ కూడా చదవటం కొనసాగించాను. జ్ఞానయోగంలో కొన్ని భాగాలు కఠినంగా అనిపించేవి. అవి అర్థం కానప్పుడు నేను ద్వారకామాయికి వెళ్ళొచ్చేవాడిని. అది బాబాని కలిసే సమయం కాకపోతే, నేను దూరంనుంచే వారి దర్శనం చేసుకుని వచ్చి మళ్ళీ తిరిగి చదివేవాడిని. దానివల్ల అర్థంకాకపోవటమనేది దూరమయ్యేది. ఈ సమయంలో నేను రచించిన పద్యాలు సాయిలీలా పత్రికలో ప్రచురించబడ్డాయి. వాటిలో "ఓ నాలుకా! నీవు సాయి నామం పలుకు. వేరే పని నీకేముంది?" అన్న పద్యం కాకాసాహెబ్‌కి వ్రాసి పంపాను. అలాగే ఇంగ్లీషులో బాబాపై రాసిన ఒక కవితను కాకాసాహెబ్‌కి పంపాను. దాని భావాన్ని ఆయన బాబాకి చెప్పారు. నేను స్వయంగా బాబాకి ఎదురుగా, "నా హృదయం సదా శుష్కవాదాలతో ఉంది" అను అర్థంతో ఉన్న మరో కవితనూ, అంతేకాక మరో కావ్యాన్ని కూడా పాడి వినిపించాను.

బాబాను రెండోసారో మూడోసారో కలిసినప్పుడు బాబా నన్ను, “ఎక్కడనుంచి వచ్చావ"ని ప్రశ్నించారు. దానికి నేను “బొంబాయి" నుండి వస్తున్నానని యథాలాపంగా చెప్పాను. అయితే తరువాత ఆలోచిస్తే, "ఎక్కడనుంచి వచ్చాం? ఎక్కడికి వెళ్ళాలి?" అన్న ప్రశ్నకి చక్కని పారమార్థిక దృష్టితో బాబా ఒక్కరే సరైన సమాధానం చెప్పగలవారు అనిపించింది. అందుకోసం శిరిడీలో వెంటనే ఒక కవితను రచించి బాబాకి వినిపించాను. బాబా ఏమీ అనకుండా కేవలం ధ్యానపూర్వకంగా విన్నారంతే. ఈ దర్శనంలోనే దాసగణుగారి నాలుగు అధ్యాయాల అనువాదాన్ని నా వెంట తీసుకొచ్చాను. ఈ విషయం గురించి కాకాసాహెబ్‌తో చర్చించాను. కాకాసాహెబ్ దీక్షిత్ దాని గురించి బాబాతో మాట్లాడుతూ వాటి చేవ్రాలు ప్రతిని బాబా చేతిలో పెట్టారు. ఆయన దానిపై తమ దృష్టిని సారించి పేజీలు తిప్పుతూ, “మంచిది, ప్రచురించు" అన్నారు.

ఈ సమయంలోనే నేను శ్రీనానాసాహెబ్ చందోర్కర్‌తో వారి అనుభవాలను చెప్పమని అర్థించాను. అందుకాయన ఒక షరతుపై అంగీకరించారు. అదేమిటంటే, ఆయన చెప్పే అనుభవాలను వ్రాసి మొదట వారికి చూపాలనీ, దానిపై ఆయన చేసిన సవరణలతో ప్రచురించాలనీ అన్నారు. ఆయన చెప్పిన షరతుకి నేను అంగీకరించాక, ఒకసారి నేను పార్లేనో లేక బాంద్రానో వెళ్ళే సమయంలో మూడవ తరగతి రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన టౌన్ హాల్లో జరిగే డిపార్టుమెంట్ పరీక్ష పని మీద వెళుతూ కనిపించి, నాతో కూర్చొని రెండు గంటలు తమ అనుభవాలను చెప్పారు. అవి వ్రాసి నేను వారికి పంపాను. కానీ వారికా జాబు నచ్చలేదు. శ్రీదాసగణు వ్రాసిన నాలుగు అధ్యాయాల్లో నేను వ్రాసిన గుజరాతీ తర్జుమాలో కొన్ని వ్యాకరణ దోషాలున్నాయని కూడా వారు కాకాసాహెబ్ దీక్షిత్‌తో అన్నారట. ఈ కారణం వల్ల ఆ అధ్యాయాలను ప్రచురించే ఆలోచన వెనకపడిపోయింది. అదేకాక దాన్ని ముద్రించటానికి అయ్యే ఖర్చుకోసం నాకు ఎటువంటి ఆదాయమూ లేనందున ఆ పనిని చేపట్టకూడదని అనుకున్నాను. అయినా కూడా వైకుంఠ్ ఆ నాలుగు అధ్యాయాలకూ ప్రతులు వ్రాసి దాన్ని పారాయణ చేయటం మొదలుపెట్టాడు. 

ఆ తరువాత భక్తులైన తన స్నేహితులకు ఆ వ్రాతప్రతులను చూపించాడు. అదలా ఉంటే, ఒకసారి బాబా నాకు స్వప్న దర్శనమిచ్చి, “అరె! ఈ పొలానికి కంచె లేకపోతే మేకలు లోపలకు వచ్చి ధ్వంసం చేస్తాయి" అన్నారు. తరువాత నేను దాసగణు వ్రాసిన నాలుగు అధ్యాయాలూ చదవటం మొదలైనప్పటికీ బాబా అన్న ఆ మాటకి అర్థం నాకు అప్పట్లో బోధపడలేదు. కానీ "ఆధ్యాత్మిక మార్గంలో సాధకునికి వచ్చే పుణ్యానికి వ్రతనియమాలనే కంచెను వేసుకుని కాపాడుకోలేకపోతే మనలోని అహంకారమనే మేకలు భయంకరంగా అరుస్తూ ఆ పుణ్యాన్ని కబళించి వేస్తాయనీ, మనం ఇదివరకు లాగానే అజ్ఞానంలో ఉండిపోతామ"న్నది బాబా మాటలకర్ధమని ఇప్పుడు నాకు అర్థమైంది. అందుకే వ్రతనియమాలనే కంచెను వేసుకోవటం అత్యవసరం.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo