ఖపర్డే డైరీ - నలభై ఎనిమిదవ భాగం
శిరిడీ డైరీ మరియు శ్రీమతి లక్ష్మీబాయి గణేష్ ఖపర్డే - వి.బి.ఖేర్
ఖపర్డే శిరిడీలో నాలుగు నెలలూ, అతని భార్య ఏడునెలలూ ఉన్నారు. ఇద్దరూ కూడా అత్యంత ఆనందాన్ని పొందారు. బాబాపట్ల అపరిమితమైన విశ్వాసం గల శ్రీమతి ఖపర్డే స్వయంగా మశీదుకి నైవేద్యాన్ని తీసుకొచ్చేది. బాబా ఆ నైవేద్యంలో నుంచి కొంత భాగమైనా స్వీకరిస్తేగానీ ఆమె ఆహారం ముట్టుకునేది కాదు. బాబా స్వీకరించిన తరువాతే ఆమె భోజనం చేసేది. ఆమెకున్న అకుంఠిత భక్తి విశ్వాసాలను చూసి భక్తులను గాఢంగా ప్రేమించే బాబా ఆమెకు మార్గం చూపటం జరిగింది. గురువులు అనేక రకాలుగా ఉపదేశాలు చేస్తారు. కానీ బాబా పద్ధతి చాలా విశిష్టమైనది. మనసు లోపలి పొరల్లోకి పూర్తిగా చొచ్చుకుపోయేలా తమ అనుగ్రహాన్ని సునాయాసంగా వర్షిస్తారు.
ఒకసారి శ్రీమతి ఖపర్డే ఒక పళ్ళెం నిండుగా శీరా, పూరీ, అన్నం, పప్పు, పాయసం, ఒడియాలు, అప్పడం, కోషింబర్ (ఉప్పు, నిమ్మకాయ పిండిన వడపప్పు) తీసుకుని మసీదుకు వచ్చింది. ఆమె నైవేద్యం రాగానే బాబా ఆత్రుతగా తన స్థానంలోంచి లేచి తన చొక్కా చేతులు పైకి ముడుచుకొన్నారు. తాను మామూలుగా భోజనం చేసే చోటుకి వచ్చి కూర్చుని ఆ పళ్ళాన్ని తన దగ్గరకు లాక్కుని దానిమీద పెట్టిన మూతను తీసివేసి తినటానికి ఉపక్రమించారు. అక్కడ ఇంకెన్నో నైవేద్యాలున్నా, అందులో కొన్ని ఇప్పుడు తెచ్చిన దానికన్నా ఎంతో విలువైనవైనా, అందులో కొన్ని సామాన్యంగా ఎప్పుడూ ఇతర భక్తులనుండి స్వీకరించేవి ఉన్నా చాలాసేపు బాబా వాటిని ముట్టుకోనేలేదు. మరి శ్రీమతి ఖపర్డే తెచ్చినవి ఆయన కెందుకంత ప్రియమైనాయి? అలా అవటం లౌకికమైన వ్యక్తి ప్రవర్తన; కానీ ఒక మహాత్ముని మననుకు అలాంటి భావం ఎందుకు కలుగుతుంది? అందుకని మాధవరావు దేశ్‌పాండే అటువంటి తరతమ బేధాలను ఎందుకు చూపుతున్నారో బాబాను అడిగి తెలుసుకోవాలనుకున్నాడు.
"బాబా! మీరు మిగతా అన్ని నైవేద్యాలనూ వదిలేశారు. వెండిపళ్ళేలలో వచ్చిన వాటిని కూడా పక్కకు నెట్టేశారు. ఈవిడ నైవేద్యాన్ని తీసుకురాగానే తినటం మొదలుపెట్టారు. ఇది చాలా విచిత్రంగా ఉంది. ఆమె నైవేద్యం మీకంత రుచిగా ఉండటం మాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఓ గురుదేవా! కొంతమంది పట్ల మీకు పక్షపాతం ఉండటమేమిటి?" అని అన్నాడు. "ఈ ఆహారం ఎంత అద్భుతంగా ఉందో నీకెలా వర్ణించను? తన గడిచిన జన్మలలో ఈమె ఒకసారి ఒక వర్తకుడికి చెందిన ఆవుగా జన్మించి సమృద్ధిగా పాలు ఇచ్చేది. తరువాత కొద్దికాలం ఆమెను నేను కలవలేదు. తరువాత ఆమె ఒక తోటమాలికీ, ఆ తరువాత ఒక క్షత్రియుడికీ జన్మించి అటుతరువాత ఒక వర్తకుడికి భార్య అయి, ఆ తరువాత ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ఈమెను చూసి ఎంతో కాలమైంది. ప్రేమతో సమర్పించబడిన ఈ ఆహారాన్ని సంతోషంగా కొంత స్వీకరించి ఆమెకు తృప్తి కలుగజేయనీయి" అన్నారు బాబా. అలా అంటూ హృదయపూర్వకంగా ఆ నైవేద్యాన్ని స్వీకరించి తమ చేతులనూ, నోటినీ కడుగుకొని తృప్తిగా త్రేన్చి తన స్థానంలో కూర్చున్నారు.
శ్రీమతి ఖపర్డే సాయికి నమస్కరించి ఆయన చరణ సేవ చేయటం ప్రారంభించింది. దాన్ని అవకాశంగా తీసుకొని బాబా ఆమె యోగక్షేమాలను విచారిస్తూ, చరణసేవ చేస్తున్న ఆమె చేతులను బాబా నొక్కసాగారు. భగవంతుడూ, భక్తురాలు ఒకరికొకరు పరస్పరం చేసుకుంటున్న ఆ సేవను చూసి శ్యామా చమత్కారంగా “ఎంత గొప్ప లీలను చూస్తున్నాం! ఓ దేవా! ఒకరిపై ఒకరికున్న అన్యోన్యతను చూసి మాకు ఆశ్చర్యం కలుగుతోంది” శ్రీమతి ఖపర్డే చేస్తున్న సేవను చూసి సంతోషించి బాబా ఆమె చెవిలో మంద్రస్థాయిలో, "రాజారామ్, రాజారామ్" అనే మంత్రాన్ని నిత్యమూ క్రమంతప్పకుండా జపించు. అలా చేస్తే నీకు ఆత్మతృప్తి కలుగుతుంది. నీ చిత్తం ప్రశాంతతను పొంది నీకు అపారమైన ప్రయోజనం సిద్ధిస్తుంది" అని చెప్పారు. ఎంతో శక్తివంతమైన ఆ మాటలు ఆమె హృదయంలోకి చొచ్చుకొనిపోయి, ఒక్క క్షణంలో ఆధ్యాత్మిక శక్తిని సంతరించి పెట్టాయి. అలా దయానిధీ, రక్షకులూ అయిన శ్రీ సమర్థ సాయినాథులు భక్తుల కోరికలను తృప్తిపరచి వారి యోగక్షేమాలను చూస్తారు.
పై సంఘటనకు సంబంధించిన వివరాలు 4-3-1912 తేదీన ఈ క్రింది విధంగా క్లుప్తంగా చెప్పబడింది. "నా భార్య సాయిబాబాను పూజించటానికి చాలా ఆలస్యంగా వచ్చినా ఆయన చాలా దయతో తన భోజనాన్ని నిలిపి ఆమెను పూజ చేసుకోనిచ్చారు”.
తరువాయి భాగం రేపు ......
source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.
No comments:
Post a Comment