సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 417వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. సహాయాన్ని అర్థిస్తే బాబా తప్పక చేస్తారు
  2. 'అఖండజ్యోతి’ రూపంలో బాబా మా ఇంట వెలిసాక జీవితమే మారిపోయింది 

సహాయాన్ని అర్థిస్తే బాబా తప్పక చేస్తారు

నా పేరు శ్రీనివాసరావు. ఎందరో సాయిభక్తులు ఈ బ్లాగ్ ద్వారా తమ అనుభవాలను పంచుకోవడం వలన, సాయిమహరాజు తన భక్తులపై కురుపిస్తున్న ప్రేమను మేమంతా తెలుసుకోగలుగుతున్నాము. నేను, నా కుటుంబసభ్యులు ప్రస్తుతం గుంటూరులో నివసిస్తున్నాము. మాకు తెనాలిలో ఒక ఇల్లు ఉంది. ప్రస్తుతం ఆ ఇంటిని అద్దెకు ఇచ్చాము. నేను అప్పుడప్పుడు తెనాలి వెళ్ళి ఇంటిని చూసుకుని, ఏవైనా రిపైర్లు ఉంటే చేయిస్తుంటాను. ఒకసారి ఆ ఇంటిలో ఉన్నవాళ్ళు, ‘నీటి పంపు పాడైందనీ, దానివల్ల నీటికి చాలా ఇబ్బందిపడుతున్నామనీ, దానిని బాగుచేయించవలసిందనీ’ రెండు మూడు సార్లు ఫోన్ ద్వారా తెలియజేశారు. కానీ కరోనా కారణంగా లాక్డౌన్ అమలులో ఉండటం వలన నేను తెనాలి వెళ్లలేకపోయాను. సర్వీస్ చేసేవారు కూడా ఎవరూ బయటకు వచ్చి పని చేసే పరిస్థితి లేదు. అప్పుడు నేను బాబాను తలచుకొని, ‘అద్దెకు ఉన్నవారి సమస్యను తీర్చే మార్గం చూపమ’ని వేడుకున్నాను. తరువాత  నాకు తెలిసిన వ్యక్తికి ఫోన్ చేసి, ఎలాగైనా పంపు బాగుచేసి పెట్టమని అడిగాను. కానీ అతను, “ఇప్పుడు వీలుకాదు, ఎవరినీ బయటకు రానివ్వడం లేదు, అయినా ప్రయత్నిస్తాను” అని చెప్పాడు. బాబా దయవల్ల అతను పంపు రిపేరుకు కావలసిన సామగ్రి కొని, పంపుని బాగుచేసి నీటి ఇబ్బందిని తొలగించాడు. ఈ పని చేసే సమయంలో రోడ్డుమీద పోలీసులు గానీ, మరెవరూ గానీ అతనిని ఆపలేదు, ఇబ్బందిపెట్టలేదు. ఇది చిన్న విషయం అని అందరికీ అనిపించవచ్చు. కానీ తలచిన వెంటనే తన భక్తులు ఇబ్బందిపడకుండా బాబా సహాయం చేస్తారనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. “బాబా! ఇలాగే నన్ను, నా కుటుంబాన్ని, అలాగే ప్రజలందరినీ రక్షించండి. అలాగే కరోనా బారినుండి కూడా అందరినీ కాపాడండి బాబా!”.

సమర్ధ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!

'అఖండజ్యోతి’ రూపంలో బాబా మా ఇంట వెలిసాక జీవితమే మారిపోయింది

అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి. మాది అనకాపల్లి. నా భర్త ఒక ఫైనాన్స్ ఏజెంట్ గా పని చేస్తుండేవారు. మాకు ఇద్దరు కూతుళ్ళు. పెద్దమ్మాయి వివాహం జరిగింది. చిన్నమ్మాయి వివాహం కూడా నిశ్చయమై, మరికొన్ని నెలల్లో వివాహం జరగనుందన్న సమయంలో అకస్మాత్తుగా నా భర్త రోడ్డు ప్రమాదంలో మరణించారు. దాంతో నేను ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉండిపోయాను. ఆ షాక్ నుండి కోలుకోవడానికి నాకు చాలా సమయమే పట్టింది. నిశ్చయమైన వివాహాన్ని, నా పెద్ద కూతురి సహాయంతోనూ, బంధువుల సహాయంతోనూ చక్కగానే జరిగింది. కానీ ఇంటి యజమానిని కోల్పోవడం వల్ల సంపాదన లేదు. బ్రతుకు నడవడం కష్టమైపోయింది. మావారు చేసిన ఫైనాన్స్ వ్యాపారంలో చాలా డబ్బులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. కొంతమంది మాకు ఇవ్వాల్సిన డబ్బులు, మేము కొంతమందికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఆగిపోయాయి. ఇదిలా ఉంటే మరో వైపు మా దగ్గర డబ్బులు పెట్టినవాళ్ళ నుండి వస్తున్న ఒత్తిడి. వీటితో నేను మానసికంగా చాలా కృంగిపోయాను. ఆ మానసిక ఒత్తిడిని, ఆర్థిక సమస్యలను తట్టుకోలేకపోయాను. నా పరిస్థితిని చూసిన నా కూతురు, “అమ్మా! మనం ‘సాయిబాబా అఖండజ్యోతి’ మన ఇంట్లో పెట్టుకుందాం” అని చెప్పింది. అందుకు నేను, “ప్రస్తుతం మనకి సంపాదన లేదు. అంతేకాక, అఖండజ్యోతి చాలా ఖర్చుతో కూడుకున్నది. 49 రోజులకు కావలసినంత నూనె, నైవేద్యాలు, పువ్వుల ఖర్చు భరించే స్థితిలో నేను లేను” అని తనతో చెప్పేశాను. “బాబా మీద భారం వేసి అఖండజ్యోతి పెట్టుకోమ్మా. ఆయనకు కావలసినవన్నీ ఆయనే సమకూర్చుకుంటారు. నీకు ఉన్నంతలో నువ్వు చెయ్యి. ఆడంబరాలను, ఆర్భాటాలను బాబా అస్సలు ఇష్టపడరు. నువ్వు ప్రేమతో, భక్తితో చేసిందే తాను స్వీకరించి, మన కష్టాలన్నీ తొలగిస్తారు” అని చెప్పింది. బాబా సంకల్పం ఉండటం వల్లనేమో, నేను మా ఇంట్లో ‘సాయిబాబా అఖండజ్యోతి’ పెట్టుకున్నాను. చుట్టుప్రక్కల వారందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను నోరు తెరిచి ఎవరినీ, ఏమీ అడగలేదు. బాబా అఖండజ్యోతి దర్శనానికి వచ్చే భక్తులు పూలదండలు, నూనె తీసుకుని మా ఇంటికి వచ్చేవాళ్ళు. ఒక్కోసారి రెండు మూడు రోజుల వరకు నిల్వ ఉండేలా పూలదండలు తీసుకొని వచ్చేవారు. 49 రోజుల పాటు నిర్వహించాలనుకున్న అఖండజ్యోతి పూజను బాబా మా ఇంట్లో 89 రోజుల పాటు నిర్వహించేలా అనుగ్రహించారు. ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల నేను మామూలు సమయాల్లో ఉదయం తొమ్మిది గంటల వరకు లేచేదాన్ని కాదు. కానీ బాబా అఖండజ్యోతి రూపంలో మా ఇంటికి వచ్చిన తర్వాత, తెల్లవారుఝామున నాలుగు గంటలకే లేచి, పనులన్నీ చేసుకుని, బాబాకు నాలుగు ఆరతులు ఇచ్చేదాన్ని. నాకు ఉన్నదాంట్లోనే ఏదో ఒకటి తయారుచేసి బాబాకు నైవేద్యం సమర్పించేదాన్ని. చుట్టుప్రక్కల వాళ్ళందరూ వచ్చి ఆరతి, భజన కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ‘89 రోజుల అఖండజ్యోతి’ కార్యక్రమం తర్వాత బాబా అనుగ్రహంతో ఫైనాన్షియల్‌గా ఉన్న సమస్యలు, ఆరోగ్య సమస్యలు అన్నీ తీరిపోయాయి. బాబా వచ్చిన తర్వాత నా మనసుకి ఎంతో ప్రశాంతత చేకూరింది. అంతేకాకుండా, ప్రతి సమస్యనూ తట్టుకునే శక్తిని బాబా నాకు ఇచ్చారు. “చాలా చాలా ధన్యవాదాలు బాబా!”. నా ప్రాణం ఉన్నంతవరకు నా సాయిని మరువను. నాకు తోడూ, నీడా, సర్వమూ బాబానే.


9 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo