సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 424వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. సాయి నామస్మరణతో ఆరోగ్యం
  2. సాయిపాదాలు తాకినమీదట పరిమళభరితమవుతున్న చేతులు 

సాయి నామస్మరణతో ఆరోగ్యం

నా పేరు స్వాతి. 2020లో కొన్నిరోజులు నా శరీరంలో వేడి పెరుగుతూ వుండేది. అది 'జ్వరమా?' అంటే జ్వరం కాదు. కాళ్ళు కూడా లాగుతూ ఉండేవి. బాత్‌రూమ్‌కి వెళ్ళి వచ్చినా కాళ్లు లాగడం, పొట్ట నొప్పి రావడం జరుగుతూ ఉండేది. ఎక్కువగా నీళ్లు త్రాగితే సమస్య సమసిపోతుందేమో అనిపించి మంచినీళ్లు ఎక్కువగా త్రాగుతుండేదాన్ని. కానీ ఏ మాత్రమూ ఉపశమనం కలగలేదు. దాంతో మావారు హాస్పటల్‌కి వెళదామని అన్నారు. నేను అందుకు ఒప్పుకోలేదు. బాబాపై ఉన్న నమ్మకంతో బాబాను ప్రార్థించి, ఆయన మీద భారం వేశాను. నా మనసులో, "బాబా! మీరే కదా అన్నారు, 'నా భక్తులకోసం పరుగిడి వస్తానని, విశ్వాసంతో పిలిస్తే వస్తానని, మా బాధ తీరుస్తానని'. మరి నేనిలా బాధపడుతుంటే, నా ఆరోగ్యాన్ని మీరే సరిచేయాలి కదా! బాబా! 'మీ శరణు వేడిన వారిని మీరు కాపాడతారని, వారి భారాన్ని మోస్తాన'ని అన్నారు. ఆ నమ్మకంతో నేను మీ నామస్మరణ చేస్తాను. మీ నామస్మరణే నాకు ఔషధం కావాలి" అని బాబాతో చెప్పుకొన్నాను. తరువాత ఆ రోజంతా 'ఓం శ్రీసాయినాథాయ నమః' అనే మంత్రాన్ని స్మరిస్తూ గడిపాను. ఆ మంత్రాన్ని స్మరిస్తూ నా శరీరంలోని ప్రతి అణువులోకి ఆ మంత్రశక్తి ప్రసరిస్తున్నట్లు, నా ఆరోగ్యాన్ని సరిచేస్తున్నట్టు అనుభూతి చెందాను. దాంతో నా ఆరోగ్యం చాలావరకు కుదుటపడింది. బాబా కృపతో నా ఆరోగ్యం త్వరలో పూర్తిగా నయమైపోతుందని ఆశిస్తున్నాను. ఆయన తలచుకుంటే జరగనిదేముంది? అందుకే ఆయన తప్పకుండా అనుగ్రహిస్తారనే నమ్మకంతో ఈ అనుభవాన్ని ముందుగానే బ్లాగులో పంచుకుంటున్నాను. బాబా ప్రేమాస్వరూపులు, చాలా దయగలవారు. ఆయన మననుంచి ఏమీ ఆశించరు, మన ప్రేమను తప్ప. అప్పుడప్పుడు మన విశ్వాసాన్ని మరియు ఆయన మాటలను గుర్తుంచుకొని ఆవిధంగా మనం నడుచుకుంటున్నామా లేదా అని పరీక్షిస్తారు. మనం చేయవలసింది ఒక్కటే, ఆయనపై విశ్వాసంతో ఆయన చూపిన మార్గంలో నడవడం. బాబాను మీరు ఏమైనా అడిగినప్పుడు ఆయన ఇవ్వకపోతే సహనాన్ని కోల్పోయి ఆయనను నిందించకండి. అటువంటి సమయాలలో మనకు శ్రేయస్సునిచ్చేదైతే బాబా తప్పక ఇస్తారని మరియు ఆయన అద్భుతశక్తిని మననం చేసుకుంటూ పదే పదే ఆయనను ప్రార్థించండి. మనసులోనే బాబాతో మాట్లాడండి. ఆయన కరుణ ఖచ్చితంగా మీపై ఉంటుంది. కరుణామయుడైన బాబాకు నా మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటూ... 

సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!

సాయి పాదాలు తాకిన మీదట పరిమళభరితమవుతున్న చేతులు 

నా పేరు మల్లూరు చంద్రశేఖర్. నేను ఖమ్మం జిల్లా, వేంసూర్ మండలం, మర్లపాడు గ్రామ నివాసిని. నేను సాయిభక్తుడిని. దేవుడంటే నమ్మకమే లేని నన్ను పూర్తిగా తమను విశ్వసించేలా బాబా అనుగ్రహించారు. నేనొక సోషల్ వర్కర్‌ని. సోషల్ వర్క్‌కి సంబంధించి నేను చేసే ప్రతి పనినీ ముందుగా సద్గురు సాయిని స్మరించుకుని ప్రారంభిస్తాను. ఆ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలనేది బాబానే నా మనసుకు స్ఫురింపజేస్తారు. ఆయన అనుగ్రహంతో కార్యక్రమాలన్నీ విజయవంతమవుతున్నాయి. నిస్వార్థంగా తమను నమ్ముకున్న భక్తుల మనసులో తామెల్లప్పుడూ కొలువై వుంటామనే సత్యాన్ని బాబా ప్రతిరోజూ నాకు చూపిస్తూ వున్నారు. ప్రియమైన సాయిబంధువులారా! 2019 చివరి నుంచి నేను తరచూ ఉదయాన్నే సాయి మందిరానికి వెళ్తుండేవాడిని. ఒక గురువారం ఉదయం బాబాకు అభిషేకం, పూజ ముగిశాక, అక్కడున్న పటంలోని బాబా పాదాలను నా రెండు చేతులతో స్పృశించి 'నీ చరణం శరణం' అని స్మరించుకున్న తరువాత నా చేతులను కళ్ళకు అద్దుకోగానే గుప్పుమని పరిమళభరితమైన సువాసన వచ్చింది. ఒకసారి నా చేతులను వాసన చూడమని నా భార్యాబిడ్డలతో చెప్పాను. వాళ్ళకి కూడా పరిమళాల వాసన వచ్చింది. ఆశ్చర్యమేమిటంటే, నా చేతుల వాసన చూసినప్పుడే వాళ్ళకి సువాసన వస్తోంది. అదే వాళ్ళు నేరుగా బాబా పటాన్ని తాకితే రావడం లేదు. కేవలం నాకు మాత్రమే ఆ అనుభూతి కలుగుతోంది. నాకు చాలా ఆశ్చర్యమేసింది. బాబా నన్ను ఈ రీతిన అనుగ్రహిస్తున్నారని నేను చాలా సంతోషించాను. ఇది ఏదో ఒకరోజు జరిగిన అనుభవం కాదు. గత ఐదు నెలలుగా నేను అనుభూతి చెందుతున్న బాబా ఆశీర్వాదం. ఈరోజు(2020, మే 21) ఉదయం కూడా నేను ఈ సాయిలీలను ఆస్వాదించాను. "బాబా! మీకు నా ప్రణామాలు. మీ అనుగ్రహం ఎప్పుడూ ఇలాగే నాపై, నా కుటుంబంపై, మీ బిడ్డలందరిపై ఉండాలని మనసారా కోరుకుంటున్నాను".

సాయినాథ చరణం శరణం.


9 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo