సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 366వ భాగం.


ఖపర్డే డైరీ - యాభైఒకటవ భాగం

శిరిడీ డైరీ మరియు శ్రీమతి లక్ష్మీబాయి గణేష్ ఖపర్డే -వి.బి.ఖేర్

నిన్నటి తరువాయిభాగం.... 

ఎంతో ఐశ్వర్యాన్ని అనుభవించి, లోకమాన్య తిలక్ అరెస్టు తరువాత కొద్ది సంవత్సరాలు దాదాసాహెబ్ సంపద తాత్కాలికంగా తగ్గినప్పుడు ఆ మారిన పరిస్థితులకు ఆమె సర్దుకోలేకపోయింది. శ్రీసాయిలీల మొదటిరోజుల్లో “శిరిడీ డైరీ గురించి మరికొంత” అనే వ్యాసంలో ప్రచురింపబడినట్లు లోకమాన్యపై దేశద్రోహ నేరం చేశాడన్న దోషారోపణ చేయబడి 22-7-1908 లో అతనికి ఆరు సంవత్సరాలు కారాగార శిక్షపడింది. దాదాసాహెబ్ లోకమాన్య విడుదలకై 1908 ఆగష్టు 13వ తారీఖున హఠాత్తుగా ఇంగ్లాండు వెళ్ళాలని నిర్ణయించుకొని ఆగష్టు 15న బయలుదేరాడు. అప్పుడు బొంబాయి గవర్నమెంటు 'లా' కాలేజీలో 'లా' చదువుతున్న దాదాసాహెబ్ కొడుకు - దాదాసాహెబు హఠాత్తుగా వెళ్ళిపోవటాన్ని గురించి తల్లితో సమయానికి చెప్పలేకపోయాడు. అందుకు అతని తల్లి అతన్ని నిందించింది. కాలంలో వచ్చిన మార్పులను ఆమె తెలుసుకోలేకపోయింది. 

దాదాసాహెబ్ ఇంగ్లాండులో రెండు సంవత్సరాలున్నాడు. అతను ఇంటికి తిరిగి వచ్చిన తరువాత కూడా ప్రభుత్వ నిఘాలోనే ఉన్నాడు. అందుకని సాయిబాబా అతన్ని 1911-12 ప్రాంతంలో సుమారు మూడున్నర నెలలు శిరిడీలోనే ఉంచేశారు. లక్ష్మీబాయి కూడా దాదాసాహెబ్‌తో శిరిడీలోనే ఉండేది. ఖపర్డే శిరిడీలో నాలుగు నెలలు ఉండగా, అతని భార్య మాత్రం ఖపర్డే శిరిడీ నుంచి వెళ్ళిపోవటానికి బాబా వద్ద అనుమతిని పొందిన తరువాత కూడా ఏడు నెలలు శిరిడీలోనే ఉండిపోయిందని శ్రీసచ్చరిత్ర ద్వారా మనకి తెలుస్తోంది. అందుకని క్రొత్త పరిస్థితులను అర్థం చేసుకొని అంగీకరించటానికి ఆమెకు చాలా సమయం పట్టింది. సహజంగానే ఆ సమయంలో ఆమె సంతోషంగా లేదు. బాబా 1-2-1912లో శ్రీమతి ఖపర్డేకి రెండొందల రూపాయిలు ఇవ్వమని దీక్షిత్‌కి ఇచ్చిన ఆజ్ఞను ఖపర్డే అది తనకి పేదరికాన్నీ, సహనాన్నీ ఇవ్వమని దీక్షిత్‌కి బాబా ఇచ్చిన ఆజ్ఞ అని 1923-24 సంవత్సరంలో మాత్రమే అర్థం చేసుకొని అంగీకరించాడు.

లక్ష్మీబాయి దృఢంగా, ఆరోగ్యంగా ఉండేది. కానీ, 1928 నుంచి ఆమె ఆరోగ్యం క్షీణించటం మొదలుపెట్టింది. క్రమంతప్పకుండా వచ్చే జ్వరమూ, ఉబ్బసమూ ఆమెను బాధించేవి. మోకాళ్ళు బాగా వాచిపోయి ఆమె నడవలేకపోయేది. 30-4-1928 లో ఆమెకి వివరీతంగా తలనొప్పి, జ్వరమూ వచ్చాయని దాదాసాహెబ్ తన డైరీలో రాసుకున్నాడు. అప్పటినుంచీ ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించి మందులు పనిచేయటం మానేశాయి. జరుగబోయేదేమిటో ఆవిడకు ముందే తెలిసిపోయింది. కుటుంబసభ్యులతో గ్రూప్ ఫోటో తీయించుకోవాలని సూచించిందామె. 1928 జులై 11న వారంతా కలిసి ఫోటో తీయించుకున్నారు. ఆ తరువాత హృదయాన్ని కలచివేసే సంఘటన జరిగింది. దాన్ని దాదాసాహెబ్ మాటల్లో అయితే బాగా చెప్పవచ్చు. మరాఠీలో దాదాసాహెబ్ జీవితచరిత్ర లోంచి ఈ క్రింది పేరా అనువదించబడింది.

''నేను మధ్యాహ్న భోజనానికి ముందు సంధ్యావందనం చేసుకుంటుండగా నా భార్య నా దగ్గరకు వచ్చి ఒక విగ్రహాన్ని మనం ఎలా పూజిస్తామో అలా నన్ను పూజించింది. నాకు చాలా ఆశ్చర్యమనిపించి, “ఇన్ని సంవత్సరాల్లో ఎన్నడూ చేయని విధంగా ఇప్పుడిలా ఎందుకు చేస్తున్నావ"ని అడిగాను. "నేను ప్రశాంత చిత్తంతో ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నాను" అంది. ఇన్నిరోజులూ అస్వస్థతగా ఉండటం వల్ల ఆమె తాను జీవిస్తాననే ఆశను కోల్పోయింది కాబోలనుకున్నాను. “భగవంతుడి మీద విశ్వాసం పెట్టుకొని ఆయన ఇచ్ఛకి తలవంచమ"ని ఆమెతో చెప్పాను. ఈ సంఘటన గురించి వారి కొడుకు, కోడలుకు ఈ డైరీలో చదివినదాకా తెలియదు. ఆ సంఘటన జరిగిన తరువాత లక్ష్మీబాయి పూర్తిగా మంచానపడింది. అప్పటినుండి ఎనిమిది రోజుల తరువాత, అంటే 1928 జులై 20న ఆమె తన సద్గురు సాయిబాబా దర్శనాన్ని పొంది, సంతోషంగా, ప్రశాంతంగా కన్నుమూసింది. 

ఆమె మరణాన్ని గురించిన వర్ణన - ఆరోజు గురించి డైరీలో పొందుపరచిన ఖపర్డే మాటల్లో:- "నా భార్యను చూడటానికి క్రింది అంతస్థులోకి వెళ్ళాను. ఆమెకి రాత్రంతా నిద్రలేనట్లుంది. కానీ ప్రశాంతంగా, హాయిగా ఉంది. మా పెద్దబ్బాయి సూచనను అనుసరించి మా కుటుంబమంతా త్వరగా స్నానాలు చేసి, కొంచెం తినగలిగినంత తిని, ఆమెను గమనిస్తూ, ఆమె పడక దగ్గరే ఉండిపోయాం. నా సమయాన్నంతా ఆమె పడక ప్రక్కనే గడిపాను. ఆమె ఉన్న గదిలో నుంచి ఆమెను తీసుకొచ్చి, మండువాలో మా కులదేవతలున్న గది ముందర పడుకోబెట్టాం. ఆమె శ్వాస బరువెక్కుతున్నప్పటికీ ఆమె ప్రశాంతంగా ఉండి మధ్యాహ్నం 3-15గం.లకు కన్నుమూసింది. కొద్దిసేపటి వరకూ నన్ను నేను సంభాళించుకోలేకపోయాను. కానీ, దాన్ని చివరికి సాధించాను. ప్రతివాళ్ళూ నేను జీవించి ఉన్నప్పుడే ఆవిడ వెళ్ళిపోయింది కనుక ఆమె అదృష్టవంతురాలన్నారు. 

అగ్నిసంస్కారమై మేము తిరిగి వచ్చాక - కొద్ది వారాల క్రితమే ఆవిడ తన నగలూ, బట్టలూ తన కోడళ్ళకీ, వారి పిల్లలకీ పంచేసి, విలువైన తన వస్తువులనన్నిటినీ తనవారికి ఇచ్చేసి ఆనందంగా ఉండమని వారిని ఆశీర్వదించిందని నా కొడుకుల ద్వారా విన్నాను. ఆమె తన సద్గురు దర్శనాన్ని పొందింది. కాబట్టి ఆమెకు తను వెళ్ళిపోవటం గురించి ఖచ్చితంగా తెలుసుననుకుంటున్నాను. ఆమె మందులు కావాలని కోరనూ లేదు, జబ్బు నయమవ్వాలని ఆందోళనపడనూ లేదు. ఆమె చాలా సంతోషంగా వెళ్ళిపోయింది. ఆమె ఇప్పుడు చాలా చాలా నంతోషంగా ఉంటుందనటంలో నాకెలాంటి సందేహమూ లేదు".

సమాప్తం...

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo