సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 419వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • జ్యోతిష్యశాస్త్ర నిర్ణయాన్ని తారుమారు చేసిన బాబా

సాయిబాబా లీలలు అద్భుతమైనవి. ఒక్కోసారి పరిస్థితులు అనుకూలంగా లేవని వాస్తవాన్ని అంగీకరించడానికి మనం మన ఆశలను, ధైర్యాన్ని వదులుకోవడానికి సిద్ధపడతాం. సరిగ్గా అప్పుడే బాబా మనం కోరుకున్నట్లుగా పరిస్థితులను మారుస్తారు. సాయిభక్తుడు శ్రీనివాసులు జీవితంలో ఇదే అనుభవమైంది. ఆ అనుభవాన్నే అతను మనతో పంచుకుంటున్నారు.

నాకు మా మేనమామ కూతురినిచ్చి వివాహం చేయాలని మా చిన్నతనం నుండి ఇరు కుటుంబాల వాళ్ళు అనుకుంటుండేవారు. 2005, డిసెంబరులో మా మేనమామతో, "మీ అమ్మాయిని మా అబ్బాయికిచ్చి వివాహం చేసి మా ఇంటి కోడలిగా పంపమ"ని అడిగింది మా అమ్మ. అందుకు ఆయన అంగీకరించాడు. మేమంతా చాలా సంతోషించాము. నేను మా మేనమామ కూతురికి ఫోన్ చేసి మాట్లాడాను. క్రమంగా ఆమెను ప్రేమించడం మొదలుపెట్టాను.

2006 ప్రారంభంలో పెద్దవాళ్ళు పెళ్లిపనులు మొదలుపెట్టారు. అందులో భాగంగా వాళ్ళు ఒక జ్యోతిష్కుడి వద్దకు వెళ్లారు. ఆ జ్యోతిష్కుడు మా జాతకాలు చూసి, మా ఇద్దరికీ పెళ్లి చేయకూడదని, ఒకవేళ చేస్తే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం భవిష్యత్తులో చాలా పెద్ద సమస్యలు వస్తాయని చెప్పాడు. అప్పుడు ఇరు కుటుంబాల వాళ్ళు చర్చించుకుని పెళ్లి ఆపివేయాలని నిర్ణయించుకున్నారు. ఆ విషయం తెలిసి మేమిద్దరం కన్నీళ్లు పెట్టుకున్నాము. మేము మా తల్లిదండ్రులను ఎంతగానో అభ్యర్థించాము. కానీ వాళ్ళు, "జ్యోతిష్కుడు చాలా అనుభవజ్ఞుడు. పైగా మనకు బంధువు. అతను బాగా పరీశీలించి మరీ చెప్పాడు. కాబట్టి ఈ పెళ్లి జరగద"ని నిష్కర్షగా చెప్పేశారు.

నేను చాలా చాలా బాధపడి హైదరాబాదు వెళ్లి మరో జ్యోతిష్కుడిని సంప్రదించాను. అతను మా జాతకాలు పరిశీలించి, "జ్యోతిష్యశాస్త్ర ప్రకారం మీరు వివాహం చేసుకోవచ్చు" అని చెప్పాడు. నేను అతను వేసిన కుండలినిని మా అమ్మకి పంపి పరిస్థితిని మార్చడానికి ప్రయత్నించాను. మా అమ్మావాళ్ళు దాన్ని తీసుకుని మొదటి జ్యోతిష్కుడి వద్దకు వెళ్లారు. అతను రెండవ జ్యోతిష్కుడు చెప్పిన వాటిలో కొన్ని తప్పులను ఎత్తిచూపి, "నేను బాగా పరిశీలించే ఈ పెళ్లి జరగకూడదని చెప్పాను. కాబట్టి ఈ విషయంలో మీరు ఎవరి ద్వారానూ ముందుకు పోవద్దు, పెళ్లి చేయవద్దు" అని చెప్పాడు. దాంతో పెద్దవాళ్ళు మా పెళ్లి గురించి ఇక మాట్లాడకూడదని నిర్ణయించుకున్నారు.

నేను చాలా బాధపడుతూ జరిగినదంతా నా స్నేహితుడితో పంచుకున్నాను. తను నవ్వి, "మన సాయిబాబా ఉండగా నువ్వెందుకు ఆందోళన చెందుతున్నావు? నువ్వు సాయి సచ్చరిత్ర పారాయణ చేయి, అప్పుడు బాబా చేసే అద్భుతాన్ని చూడు" అని చెప్పాడు. దాంతో నేను సాయి సచ్చరిత్ర పారాయణ చేయడం ప్రారంభించాను. మొదటిరోజు పారాయణ పూర్తయింది, రెండవరోజు, మూడవరోజు, నాల్గవరోజు పారాయణ కూడా పూర్తయింది. ఐదవరోజు సాయంత్రం 8 గంటలకు నేను పారాయణ చేస్తూ ఉన్నాను. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. హఠాత్తుగా కొన్ని సెకన్లు “గుర్ర్...”మంటూ ఒక శబ్దం వినిపించింది. అది ఎక్కడినుండి వస్తుందో నాకు అర్థం కాలేదు. ఏమిటోలే అని మళ్ళీ నేను చదవడం మొదలుపెట్టాను. ఐదు నిమిషాల తరువాత “గుర్ర్...”మంటూ అదే శబ్దం. ఈసారి నేను భయపడ్డాను. అంతా వెతికాను. కానీ ఏమీ కనపడలేదు. మళ్ళీ చదవడం ప్రారంభించాను. మళ్ళీ ఐదు నిమిషాల్లో అదే శబ్దం. ఈసారి అది ఫోన్ వైబ్రేషన్ శబ్దం అని కనుగొనగలిగాను. అప్పుడు ఫోన్‌ లిఫ్ట్ చేసి మాట్లాడాను. ఆ ఫోన్ చేసింది మరెవరో కాదు, మా అత్తయ్య. ఆమె, "2006, మార్చి 3న మీ నిశ్చితార్థం. మే 11న వివాహం" అని చెప్పింది. ఆ అద్భుతానికి ఆశ్చర్యపోతూ, "ఇది ఎలా జరిగింద"ని ఆమెను అడిగాను. అందుకామె, "(మొదటి) జ్యోతిష్కుడు మా ఇంటికి వచ్చి, 'ఇద్దరి నక్షత్రాలు జెమినియే. ఆ నక్షత్రం ఉన్నవాళ్ళకి ఆ నక్షత్రం వాళ్లతోనే వివాహం చేయాలి కాబట్టి ఈ ఇద్దరికీ వివాహం జరిపించాలి' అని చెప్పాడు. అందువల్లనే మేము ముహూర్తాలు పెట్టాము" అని చెప్పింది. ఇక నా ఆనందానికి అవధులులేవు. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!"

నాకు ఇలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. అందులో ఇది ముఖ్యమైనది. సాయిబాబా మామూలు మానవుడు కాదు. ఆయన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్వరూపం. శ్రీసాయినాథుడు మన దైవం. కాబట్టి దేనికోసమూ చింతించకండి. సాయి నామం జపించండి. ఏ సమస్యలు లేకుండా మీ జీవితాలు హాయిగా సాగిపోతాయి.

source:http://www.shirdisaibabaexperiences.org/2012/02/my-experience-with-my-god-sai-devotee.html


5 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo