సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 378వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - పన్నెండవ భాగం

నిన్నటి తరువాయిభాగం.....

ప్రతి వస్తువులోనూ బాబా దర్శనం

వేసవిలో కాంగ్రెస్ మహాసభలు ముంబాయిలో జరగనున్నాయి. వేసవి కారణంగా కోర్టులు పూర్తిగా మూసివేసేవారు. అందువలన కాకాసాహెబ్ దీక్షిత్ శిరిడీలో ఉన్నారు. ఆయన ద్వారా నేను బాబాను, "నేను కాంగ్రెస్ మహాసభలకి హాజరవనా? లేక మీ దగ్గరకొచ్చి ఒక నాలుగు రోజులు ఉండనా?” అని అడిగించాను. ప్రశ్న మాత్రం సామాన్యంగానే ఉన్నా దాని వెనకాల బాబా నా జీవిత లక్ష్యాన్ని నిర్దేశించాలనే అభ్యర్ధన ఉంది. నేను జీవితంలో రెండు విభిన్న మార్గాల కూడలిలో ఉన్నాను. నేనొక రాజకీయవేత్తగా ఉండటమా? లేక కేవలం ఒక మతాన్ని అంటిపెట్టుకొనే మనిషిలాగా ఉండాలా? అన్న విషయంపై శ్రీసాయిబాబా నిర్ణయాన్ని ఆశించాను. "వేసవిరోజుల్లో ఇక్కడికి రమ్మని వాడితో చెప్పు” అని బాబా జవాబు వ్రాయించారు. దాంతో నేను శిరిడీ వెళ్ళాను. ఇది జరగడానికి ముందు ప్రేమానంద భారతీ విరచిత "లైట్ ఆన్ లైఫ్" అనే చిన్న పుస్తకాన్ని నేను చదవటం తటస్థించింది. అలాగే గుజరాతీ ప్రెస్ ప్రచురించిన శ్రీరామకృష్ణ బోధామృతం కూడా 50 పైసలకి లభించగా అది కూడా చదివాను.

శిరిడీ చేరుకున్న తరువాత అంతవరకు నేను చేస్తున్న బాబా సగుణ ధ్యానానికి బదులు వారి నిర్గుణ రూపాన్ని ధ్యానించటం మొదలుపెట్టాను. ఒక సాయంత్రం ఎవరో జామపళ్ళను నైవేద్యంగా బాబాకి అర్పించారు. బాబా వాటిలో కొన్ని నాకిచ్చి, “తీసుకో, పైకి ఇవి పచ్చిగా ఉన్నట్లనిపించినా లోపల మధురంగా ఉంటాయి” అన్నారు. నిజానికి ఆ జామపళ్ళు ఎవర్నైనా సందిగ్ధంలో పెట్టేలాగానే ఉన్నాయి. అయితే బాబా చెప్పిన ఉపమానం ఎలా ఉందంటే, “నా నిర్గుణోపాసన ప్రారంభంలో పచ్చిగానే కనిపించినప్పటికీ దాని పరిణామం మాత్రం మధురంగానూ, శాంతిని ప్రసాదించేదిగానూ ఉంటుంది" అనిపించింది. ఆయన చెప్పిన మాట బహుశా వారి ఆశయం కావొచ్చుననుకొని, నేను బాబాకి అత్యంత పురాతన భక్తుడు మాత్రమేకాక, ఆయనతో రోజూ మశీదులో శయనించే మహల్సాపతి గారింటికి ఒక గృహస్థుని వెంటబెట్టుకొని వెళ్ళి బాబా మాటలకి అర్థమేమిటని వారిని అడిగాను. ఆయనతో చర్చించాక నా అనుమానం నిజమేననిపించింది. అనుమానం నివారణ చేసుకున్నాక అది బాబా నాకిచ్చిన ఆదేశంగా తలచాను.

వేసవికాలం పూర్తయ్యాక అనుకుంటాను, ఒక రాత్రివేళ బాబా నాకు దర్శనమిచ్చి, "అరే! గుఱ్ఱం, గుఱ్ఱం అంటూ ఉండు. గుఱ్ఱం మీద కూర్చోవటం రావాలి" అని అన్నారు. నా బుద్ధికి తోచిన ప్రకారం, గుఱ్ఱం అనే శబ్దోచ్ఛారణతో మంత్రాన్ని జపించాలనుకుని శిరిడీలో ఉన్న కాకాసాహెబ్ దీక్షిత్ ద్వారా ఆ విషయం గురించి బాబాని అడిగించాను. అప్పుడు బాబా దీక్షిత్ ద్వారా తమ ఆశీస్సులు పంపారు. ఇక నేను ఆ మంత్రాన్నే జపమాలతో జపించటం మొదలుపెట్టాను. ఆ మంత్రాన్ని జపిస్తుండటం వల్ల బాబా రూపం పదే పదే కనిపించటం మొదలైంది. క్రమక్రమంగా నీటిలోనూ, భూమిపైనా, అగ్నిలోనూ, ఒకటేమిటి? ప్రతి వస్తువులోనూ బాబా రూపం గోచరమయ్యేది. దానితో బాబా సర్వవ్యాపకత్వం నాకు బోధపడింది.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo