సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 369వ భాగం


సాయిశరణానంద అనుభవాలు -  మూడవ భాగం

నిన్నటి తరువాయి భాగం....

ఆ రోజుల్లో నేను 'లా' రెండవ సంవత్సరం చదువుతూ అక్టోబరులో జరుగబోయే నా పరీక్షలకు తయారవుతున్నాను. పరీక్షలు కాగానే శిరిడీ వెళ్ళాలనుకున్నాను. నాన్న నా మాటను అంగీకరించారు. ఈమధ్యకాలంలో నేను శ్రీసాయిబాబా చిత్రపటాన్ని కొని, ఇంట్లో పెట్టుకొని ప్రతి గురువారం ఒక పండు నైవేద్యంగా వారికి పెట్టటం మొదలుపెట్టాను. ఒకరోజు బాబాకు యాపిల్ పండు నివేదించాక నా మనసులో, 'నేను సమర్పించే నివేదన సాయిబాబా స్వీకరిస్తున్నారా, లేదా - దీనికి ప్రమాణమేమిటి?' అన్న ఆలోచన వచ్చింది. దాంతో గోడకి తగిలించబడ్డ ఆ చిత్రపటం క్రింద ఉన్న ఒక అల్మారాలో ఒక చిన్న గిన్నెలో మేలురకమైన ఆ యాపిల్ పెట్టాను. నిద్రించే సమయంలో, "బాబా! మీరీ నైవేద్యాన్ని స్వీకరిస్తే, ఉదయానికి దానిమీద మీరు తిన్నట్లుగా ఏదో ఒక గుర్తు కనిపించాల"ని మనసులో అనుకున్నాను. ఉదయం లేచి చూస్తే, నేనెలా ఆ యాపిల్‌ని పెట్టానో అలాగే ఉన్నట్లు కనిపించింది పైకి. కానీ దాన్ని చేతిలోకి తీసుకుని చూస్తే, దాని క్రిందిభాగంలో కొరికినట్లు గుర్తులు కనిపించాయి. ఆ అల్మారా పైన ఎలుకల, బొద్దింకల అలికిడి లేనందున బాబాకు అర్పించబడ్డ నైవేద్యం ఆయన స్వీకరిస్తున్నారన్న విశ్వాసం నాకు కలిగింది. 

ఒకరోజు నేను చర్చిగేట్ 'లా' కాలేజీకి వెళ్ళాలని శాంతాక్రజ్ నుంచి రైలులో బయలుదేరాను. బండి పరేల్, ఎల్ఫిన్‌స్టన్ రోడ్డుని చేరుకున్నది. బండి నడక వేగం తగ్గగానే ఒక వృద్ధుడు తన చేతిలో ఉన్న సంచిని ముందుగా రైల్లో పెట్టాడు. తర్వాత కంగారుగా ఎలాగో అతను రైలెక్కాడు. నాకు అతను పడిపోతాడేమో, ఏదైనా అవుతుందేమో అని భయమేసింది. కానీ అతను హాయిగా బండెక్కి నాతో, "భగవంతుడి లీల చూడు. ఆయన కృపతో నన్ను రక్షించారు" అని అన్నాడు. అతను చూడటానికి నల్లగా ఉన్నాడు. కానీ చిత్రపటంలోని బాబాలాగానే ఉన్నట్లు నా దృష్టికి గోచరించాడు. నేను ప్రత్యక్షంగా బాబా దర్శనం చేసుకోనందున ఆయన తెల్లగా ఉంటారని నాకప్పటికి తెలియదు. ఈ రీతిన బాబా నాకు దర్శనమిచ్చి భగవంతుడున్నాడని సూచించినట్లు ఆ సమయంలో నాకు అనిపించింది. ఆ వృద్ధుడు తరువాత దిగి వెళ్ళిపోయినప్పటికీ ఈరోజుకీ అతని మూర్తి చెదిరిపోకుండా నా మనసులో అలాగే ఉండిపోయింది.

పరీక్షలు అయిపోయిన తరువాత నేను 1911వ సంవత్సరం డిసెంబరు 10వ తారీఖు రాత్రి మా నాన్న ద్వారా నానాసాహెబ్ చందోర్కర్ రాసిచ్చిన ఉత్తరాన్ని తీసుకుని శిరిడీకి బయలుదేరాను. నేను ఉదయం కోపర్గాం స్టేషనులో దిగి టాంగా ఎక్కి వెళ్తూ, మద్యలో గోదావరి నదిలో స్నానం చేశాను. బాగా చలిగా ఉంది. ఆ చలి భరించలేక నా శరీరం గజగజ వణికిపోతోంది. టాంగా శిరిడీ వైపు బయలుదేరింది. టాంగా వెనుకభాగంలోని ఒక సీటుపై ఒక మార్వాడీ, రెండో సీటుపై ఒక వేశ్య కూర్చుని ఉన్నారు. నేను ముందు కూర్చున్నందున ఎవరితోనూ మాట్లాడవలసిన అవసరం కలుగలేదు.

లెండీబాగ్ దాకా వచ్చాక టాంగావాడు బండిని ఆపి, “అదిగో, సాయిబాబా వెళుతున్నారు. దర్శించుకోండి” అన్నాడు. నేను టాంగా దిగి సాయిబాబా పాదాలకు నమస్కరించగానే బాబా, "భగవంతుడున్నాడు - లేడని అంటావెందుకు?” అని, “వెళ్ళు” అన్నారు. నేను టాంగా ఎక్కి గ్రామంలోకి వెళ్లి బాలాభావుని కలిసి, నేను తెచ్చిన లేఖ అతనికి ఇచ్చాను. ఆ లేఖను చదివిన బాలాభావు, "మంచిది, కాకాసాహెబ్ వాడాలో ఉండు. బాబా లెండీబాగ్ నుంచి తిరిగి వచ్చిన తరువాత నేను నిన్ను వారి దర్శనానికి తీసుకెళ్తాను" అన్నాడు.


తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo