సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 371వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - ఐదవభాగం

నిన్నటి తరువాయిభాగం..... 

నేను బస చేసిన కాకాసాహెబ్ వాడాలో ఆమ్రావతిలోని సుప్రసిద్ధ వకీలూ, లోకమాన్య తిలక్‌కు అనుచరుడూ అయిన శ్రీదాదాసాహెబ్ ఖపర్డే, బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయాధికారి శ్రీషింగణేలు కూడా ఉన్నారు. మధ్యాహ్నం షింగణేతో పరిచయమైన తరువాత ఆయన, "పద, బాబా వద్దకు వెళ్దాం" అన్నాడు. నేను ఆయనతోపాటు బాబా వద్దకు వెళ్ళాను. బాబా అందరితోనూ, ముఖ్యంగా షింగణేతో అరగంటసేపు ఆనందపూర్వకంగా మాట్లాడారు. అలాగే ఆయనకు చాలా ప్రసాదం కూడా ఇచ్చారు. కొద్దిసేపటి తరువాత మేము వాడాకు వచ్చేశాం. మరికాసేపటి తరువాత నేను బాబా వద్దకు మళ్ళీ వెళ్ళినప్పుడు బాబా నాతో, “ఇక వెళ్ళు, మళ్ళీ మళ్ళీ వచ్చే పనేమిటి?” అన్నారు.

అందువల్ల నేను బయటకు వచ్చి రహతా వెళ్ళే దారిలో కొంచెం దూరంలో వున్న ఒక చెట్టు క్రింద కూర్చున్నాను. అక్కడ నాకు, "విష్ణుబువా గీతను చదువు” అని ఒక వాణి వినిపించింది. తిరిగి ముంబాయి వెళ్ళిన తరువాత ఆ వాణికి సాక్ష్యం నాకు దొరికింది. విష్ణుబువా అనే పేరుగల ఒక బ్రహ్మచారి బాబా 'గీత' మీద టీక వ్రాసి ప్రచురించారు. ఆ టీకతో పాటు విష్ణుబువాగారి జీవిత చరిత్ర వేరుగా లభించేది. అది కూడా తెప్పించాను. జీవిత చరిత్ర చదివిన తరువాత ఆయన ఒక గొప్ప పండితుడని నాకు అర్థమైంది. క్రైస్తవ ధర్మ ప్రచారం కోసం ఫాదర్లు చౌపాటీలో సభను ఏర్పరిచేవారు. అప్పుడు విష్ణుబువా ఆ దగ్గర్లోనే వేరే సభ ఏర్పాటు చేసి ఫాదర్ల ద్వారా హిందూధర్మంపై ఆరోపించబడే ఆరోపణలను ఖండించి, శ్రోతలకు వీళ్ళ ప్రచారాలు ఎంత మిథ్యో శాస్త్రాధారంతో వివరించి చెప్తుండేవారు. హిందూధర్మ విశిష్ఠతను కూడా బాగా తెలియచెప్తుండేవారు. వారి ప్రచారంతో ప్రజలకు జాగృతి కలిగేది. వారిచే టీక వ్రాయబడిన గీత నా దగ్గర చాలాకాలం వరకూ ఉండేది. దాన్లో కొంతభాగం చదివాను కానీ, ధ్యానయోగ ప్రకరణలో ప్రాణవాయువు, ఉదజని వాయువు, నత్రజని వాయువుల విషయం గురించి ఆయన వ్రాసిన విషయాలను నేనర్థం చేసుకోలేకపోయాను. భాష కష్టంగా ఉండటం వల్ల టీకను పూర్తిగా చదవలేకపోయాను.

ఇది జరిగిన తరువాత రోజూ రెండుపూటలా పొద్దునా, సాయంత్రమూ బాబా దగ్గరకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. మొదట్లో అదికూడా ఖపర్డేతోనో, షింగణేతోనో కలిసి వెళ్తుండేవాడిని. శిరిడీకి నేను వెళ్ళిన మూడోరోజున మా నాన్నగారి పుట్టినరోజు వచ్చింది. అప్పుడు ఆయన చెప్పిన ప్రకారం జామపళ్ళని కొని బాబా ఎదుట పెట్టి, “ఈరోజు మా నాన్నగారి పుట్టినరోజు. ఈ పళ్ళను మీకివ్వమని ఆయన చెప్పారు. ఇవిగోండి, తీసుకోండి” అన్నాను. బాబా వాటిని అందరికీ పంచేశారు. 

దాని తరువాత మధ్యాహ్నం పూట ఒంటరిగానే బాబా వద్దకు వెళ్ళటం మొదలుపెట్టినట్లు గుర్తు. కానీ అందరూ బాబా వద్దకు వెళ్ళే సమయంలోనే నేనూ బాబా వద్దకు వెళ్ళాలని ఒక నియమం పెట్టుకున్నాను. లేకపోతే బయట మెట్లపైనే కూర్చునేవాడిని. ఒకరోజు అలాగే నేను మెట్లపై కూర్చున్నాను. అప్పుడు బాబా ఒక వ్యక్తి ద్వారా పటిక బెల్లం పంపించారు. దాన్ని తిన్న కొద్దిసేపటికి మా నాన్నగారి వద్ద నుంచి లేఖ వచ్చింది. దాంట్లో, "నీవు ఎల్.ఎల్.బి పాసయ్యావు" అని రాసి ఉంది. సాయంకాలం వాసుకాకా దగ్గరికి వెళ్ళి ఈ సమాచారం చెప్పగానే, “మళ్ళీ బాబాకి కొంచెం ప్రసాదం నివేదించు" అని అన్నాడతను. అప్పుడు హాటే కూడా అక్కడే ఉన్నాడు. అతను కూడా పరీక్షలో పాసయినట్టు తెలిసింది. నాలాగానే అతనికి కూడా "ప్రసాదం నివేదించమని" సలహా ఇవ్వబడింది. సాయంత్రం బాబా వ్యాహ్యాళికి వెళ్ళకముందే వాసుకాకా మా ఇద్దరికోసం ప్రసాదం తయారుచేసి ఇచ్చాడు. నేను వాటిని తీసుకొని వెళ్లి బాబాకు ఇచ్చినప్పుడు ఆయన, "లడ్డూలు తీసుకొచ్చారు. కానీ దారిలో నా గురించి ఏమీ పట్టించుకోకుండా ఊరికే డబ్బాను చప్పుడు చేసుకుంటూ వచ్చారు” అని ఆ లడ్డూలను తమకు సేవ చేస్తున్న కొండాజీకి ఇచ్చేశారు. బాబా మాట్లాడే పద్ధతి తెలీకపోవటం వల్ల ఆయన మాటల్లోని అర్థాన్ని నేను తెలుసుకోలేకపోయాను. విషయమేమిటంటే, దారిలో ఒక కుక్క నా వెనకే వస్తోంది. దాన్ని నేను పట్టించుకోకుండా వెళ్ళిపోయాను. దాన్ని గురించే బాబా అలా అన్నారని ఆ మాటలను బట్టి తరువాత నాకు అర్థమైంది.

తరువాయి భాగం రేపు ......

 source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ. 

3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo