సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 403వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. తమనే నమ్ముకున్న వారికి సదా రక్షణనిచ్ఛే బాబా
  2. మనల్ని రక్షించడానికి బాబా పరుగెత్తుకుని వస్తారు

తమనే నమ్ముకున్న వారికి సదా రక్షణనిచ్ఛే బాబా

సాయి భక్తురాలు అంజలి తన మరో అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

బాబా భక్తులందరికీ, ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారములు. ఈ బ్లాగ్ వలన ఎంతోమంది బాబా లీలలను తెలుసుకోగలుగుతున్నారు. ఈ బ్లాగులో ప్రచురించే బాబా లీలలను నేను ప్రతిరోజూ చదువుతాను. దానివలన నాకు బాబా మీద నమ్మకం దృఢమవుతుంది. బాబా నా జీవితంలో చూపించిన లీలలలో కొన్నిటిని ఇంతకుముందు మీతో పంచుకున్నాను. మరికొన్ని లీలలను ఇప్పుడు పంచుకుంటాను.

2018లో మేము సొంత ఇంటి కోసం ప్రయత్నం చేస్తుండేవాళ్ళము. ఆ సమయంలో నా భర్తకి కజిన్ ఒకాయన, “మంగళగిరిలో ఒక ఇండిపెండెంట్ ఇల్లు నలభై లక్షలకి వస్తోంది. ఇల్లు చాలా బాగుంది, మీరు తీసుకోండి” అని చెప్పారు. మేము కూడా ఇండిపెండెంట్ ఇల్లు తీసుకుందామనే ఆలోచనలోనే ఉన్నాము. అందువల్ల నా భర్త ఆ ఇల్లు తీసుకోవడానికి ఆసక్తి కనబరిచారు. నాకు కూడా ఇల్లు తీసుకోవాలని ఇష్టంగానే ఉంది, కానీ బాబాను అనుమతి అడగలేదు. నా భర్త ఆ ఇల్లు తీసుకుందామని నిర్ణయించుకున్నారు. మేము వెళ్ళి ఆ ఇల్లు చూడాల్సిన సమయం దగ్గరపడుతోంది. ఆ ఇల్లు చూడటానికి బయలుదేరేరోజు బాబా ఫోటో ముందు, ‘ఇల్లు తీసుకుందాము’, ‘వద్దు’ అనే చీటీలు వేసి, బాబాను ప్రార్థించి ఒక చీటీ తీయగా, ‘వద్దు’ అని వచ్చింది. అదే విషయం, అంటే బాబా నిర్ణయాన్ని నా భర్తకు చెప్పాను. కానీ ఆయన నా మాట వినలేదు. “మనం ఇలాంటి నమ్మకాలు పెట్టుకుంటే ఏమీ కొనలేము” అంటూ నా మాటను కొట్టిపారేశారు. నా భర్త మనసు మార్చమని బాబాను ప్రార్థించి, ఆయన మీదే భారం వేశాను. తరువాత గృహనిర్మాణం, వాస్తు గురించి తెలిసిన మా అంకుల్ ఒకాయన్ని మాతో వెంటబెట్టుకుని ఆ ఇల్లు చూడటానికి వెళ్ళాము. ఆయన ఆ ఇల్లు చూడగానే,  "ఈ ఇంటి వాస్తు బాగోలేదు, అది కొంటే సమస్యలు వస్తాయి, పిల్లలకు ఎదుగుదల ఉండదు” అని చెప్పారు. దాంతో నా భర్త ఆ ఇల్లు కొనడానికి సుముఖత చూపలేదు. చీటీల ద్వారా బాబా తమ నిర్ణయాన్ని ముందుగానే చెప్పారు, అయినా నా భర్త వినలేదు. తన మాట విననప్పటికీ బాబా నన్ను, నా కుటుంబాన్ని ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడుతుంటారు. మావారు బాబాను నమ్మరని కాదు, తను కూడా బాబాను నమ్ముతారు, కానీ అప్పుడప్పుడు అలా చేస్తుంటారు. నేను మాత్రం ఏది ఏమైనా సరే బాబా మీదనే భారం వేస్తాను. మనకేది మంచో, ఏది చెడో బాబాకే తెలుసు. అందుకే బాబా మీద భారం వేసి నిశ్చింతగా ఉంటాను.

రెండో అనుభవం:

ఈ మధ్యకాలంలో నాకు ఛాతీ మీద చిన్న గడ్డలాగా వచ్చింది. బాబాను ప్రార్థించి, ప్రతిరోజూ బాబా ఊదీని ఛాతీపైన రాసుకునేదాన్ని. బాబా ఊదీ మహిమతో ఆ గడ్డ తగ్గిపోయింది. అది తగ్గితే బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటానని బాబాకు చెప్పుకున్నాను. “ఈ ఆనుభవాన్ని ఇంత ఆలస్యంగా పంచుకుంటున్నందుకు నన్ను క్షమించండి బాబా!”

మూడో అనుభవం:

ఇప్పుడు, ఇటీవలే జరిగిన బాబా లీలను మీతో పంచుకుంటాను. గత కొన్ని వారాలుగా కొరోనా మహమ్మారి అందరినీ భయపెడుతోంది కదా! దానివలన కాస్త దగ్గు, జలుబు అనిపించినా ఎంతో భయం వేస్తోంది. ఇటీవల నాకు, మావారికి జలుబు చేసినట్టు అనిపించింది. జలుబు వల్ల గొంతు కూడా కొంచెం నొప్పిగా అనిపించింది. బాబాను ప్రార్థించి, ఆయన మీద భారం వేసి, ఇద్దరం బాబా ఊదీని నోట్లో వేసుకున్నాం. వెంటనే ఇద్దరికీ జలుబు, దగ్గు, గొంతునొప్పి కూడా తగ్గిపోయాయి. బాబా ఉండగా మనకెందుకు భయం? అంతా ఆయనే చూసుకుంటారు.

నాలుగో అనుభవం:

నేను నా ఆరోగ్య సమస్యలకు చీరాలలో ఉండే ఆయుర్వేద డాక్టరుకి రెగ్యులర్‌గా చూపించుకొని మందులు వాడుతుంటాను. కొరోనా లాక్‌డౌన్‌కి నాలుగు రోజుల ముందు అనుకోకుండా చీరాల వెళ్లి హాస్పిటల్లో చూపించుకుని రెండు నెలలకు సరిపడా మందులు తెచ్చుకున్నాను. నేను చీరాల నుండి వచ్చిన వెంటనే లాక్‌డౌన్‌ ప్రకటించారు. నిజానికి, డాక్టర్ అప్పాయింట్‌మెంటుకి ఇంకా టైమ్ ఉంది. కానీ ఆ అప్పాయింట్‌మెంటు లాక్‌డౌన్ పీరియడ్ లో వస్తుంది. జరగబోయేదంతా బాబాకు ముందే తెలుసు కాబట్టి, నేను మందులకు ఇబ్బందిపడకుండా ఎంతో చక్కగా ప్లాన్ చేసి, నన్ను చీరాలకు పంపించి ముందుగానే కావలసిన మందులు సరిపడా ఇప్పించి నన్ను అనుగ్రహించారు. “నిజంగా ఎన్ని జన్మలెత్తినా మీ ఋణం తీర్చుకోలేని దీనురాలిని బాబా. నామీద మీకున్న ప్రేమకు సర్వదా కృతజ్ఞతలు బాబా! లవ్ యు సో మచ్ బాబా!”

మరికొన్ని అనుభవాలతో మరలా మీ ముందుకు వస్తాను. 

జై సాయిరాం!

మనల్ని రక్షించడానికి బాబా పరుగెత్తుకుని వస్తారు

మలేషియా నుండి ఒక సాయిభక్తుడు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

ఓం సాయిరామ్! నేను గత 19 సంవత్సరాలుగా బాబా భక్తుడిని. 2016లో నా కారు దొంగిలించబడింది. నేను మోటారు భీమా సంస్థకు అప్లికేషన్ పెట్టుకున్నాను. దాదాపు రెండున్నర సంవత్సరాల తరువాత జూన్ 2019లో భీమా సంస్థ నా అభ్యర్థనను తిరస్కరించింది. ఎందుకంటే, దొంగతనానికి ముందు నా కారు నావద్దే ఉందని నేను నిరూపించలేకపోయాను. కారు లేకపోయినా ఇప్పటికీ నేను బ్యాంకు ఋణాన్ని చెల్లిస్తూ మానసిక క్షోభను అనుభవిస్తున్నాను. పైగా భీమా సంస్థ నుండి కూడా ఎదురుదెబ్బ తగిలింది. దాంతో నేను బాగా కృంగిపోయాను. ఆ సమయంలో ఒక స్నేహితుడి సలహాతో నా సమస్య విషయంలో సహాయం కోసం అంబుడ్స్‌మన్‌కి వెళ్లాను. మొదటి సమావేశంలో భీమా సంస్థ తమ నిర్ణయంలో మొండిగా ఉండటంతో నాకు అనుకూలంగా ఏమీ జరగలేదు. నేను జులైలో మరో సమావేశం కోసం షెడ్యూల్ చేసుకున్నాను. ఆలోగా నేను, "ఈసారి నాకు అనుకూలంగా జరిగితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాను ప్రార్థించాను. "ఇక్కడ నేనుండగా మీరెందుకు భయపడాలి? నాపై విశ్వాసముంచు" అన్న బాబా మాట అక్షరసత్యం. నేను రెండవ సమావేశానికి వెళ్ళకుండానే అంతకాలంగా నలుగుతున్న సమస్యను పూర్తిగా పరిష్కరించి అద్భుతాన్ని చూపించారు బాబా. కాబట్టి ప్రియమైన భక్తులారా! విశ్వాసం, సహనం కలిగి ఉండండి. మనల్ని రక్షించడానికి బాబా పరుగెత్తుకుని వస్తారు. "ధన్యవాదాలు బాబా!"

source:http://www.shirdisaibabaexperiences.org/2019/12/shirdi-sai-baba-miracles-part-2581.html


6 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo