సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 357వ భాగం.


ఖపర్డే డైరీ - నలభైరెండవ  భాగం. 

బాబా సశరీరులుగా ఉన్నప్పుడు దాదాసాహెబ్ ఖపర్డే అయిదుసార్లు శిరిడీ దర్శించాడు. అతను శిరిడీ దర్శించిన తేదీలూ, అక్కడ ఎంతకాలం ఉన్నదీ ఈ క్రింద ఇవ్వబడింది.

మొదటి దర్శనం: 1910 డిసెంబరు 5 నుండి, 1910 డిసెంబరు 12 వరకు.

రెండవ దర్శనం: 1911 డిసెంబరు 6 నుండి, 1912 మార్చి 15 వరకు.

మూడవ దర్శనం: 1915 డిసెంబరు 29 నుండి, 1915 డిసెంబరు 31 వరకు.

నాలుగవ దర్శనం: 1917 మే 19వ లోకమాన్య బాలగంగాధర్ తిలక్‌తో.

అయిదవ దర్శనం: 1918 మార్చిలో కొన్ని రోజుల పాటు.

ఇప్పుడు ప్రతి దర్శనాన్నీ విడివిడిగా గమనించి, 1924-25లో సాయిలీలా మాసపత్రికలో ప్రచురించబడిన దానికి జతగా దాదాసాహెబ్ ఖపర్డే జీవిత చరిత్రలో ఏ సమాచారం లభ్యమవుతుందో చూద్దాం.

1910 డిసెంబరులో మొదటి దర్శనం:

దాదాసాహెబ్ ఖపర్డే పూణే నుండి బొంబాయికి వచ్చి‌, అక్కడినుండి తన పెద్ద కుమారుడు బాలకృష్ణతో కలిసి డిసెంబరు 5న శిరిడీకి వెళ్ళాడు. అతనక్కడ ఏడురోజులుండి, సాయిబాబా అనుమతి తీసుకొని డిసెంబర్ 12వ తేదీన శిరిడీ నుండి బయలుదేరి డిసెంబరు 13వ తేదీన అకోలాకి వచ్చాడు. రైల్వే ప్రయాణంలో మూడు నుండి నాలుగు తరగతుల వరకూ ఉన్న ఆ రోజుల్లో అతను సాధారణంగా మొదటి తరగతిలో ప్రయాణం చేసేవాడు. అయితే ఈ సందర్భంలో తనవద్ద చాలినంత పైకం లేనందువల్ల, అతను రెండవ తరగతిలో ప్రయాణం చేసి డిసెంబరు 19న అకోట్ మీదుగా ఆమ్రావతి చేరుకున్నాడు. ఆమ్రావతి రైల్వేస్టేషన్ నుంచి తన ఇంటికి నడిచి వెళ్ళినట్లుగా వ్రాయబడి ఉంది. దాదాసాహెబ్ లాంటి ఉన్నత స్థాయిలో ఉన్న మనిషి తన ఇంటికి వెళ్ళటానికి వాహనానికయ్యే ఖర్చును కూడా భరించలేకపోవటం చాలా ఆశ్చర్యమనిపిస్తుంది. జీవనవ్యయం అతి చౌకగా ఉండి, ఆదాయపు పన్ను కట్టవలసిన చట్టం లేనప్పుడే అతని సంవత్సరాదాయం 90,000 నుండి 95,000 రూపాయల వరకూ ఉండేది. దాదాసాహెబ్ తన ఆదాయానికి మించిన జీవనవిధానాన్ని అవలంబించటం వల్ల పైన వర్ణించబడిన పరిస్థితుల నుండి తప్పించుకోలేకపోయాడు.

ఒకప్పుడు అతనికి ఏడు గుర్రాలూ (అందులో రెండు ఆస్ట్రేలియావి), రెండు గుఱ్ఱపుబగ్గీలు, వాటిని చూడటానికి కావలసిన పరివారమూ ఉండేది. అతను తప్పుచేసిన వారిపట్ల చాలా దయగలిగి ఉండేవాడు. ఎన్నో కుటుంబాలకి ఆశ్రయమిచ్చేవాడు. అతని ఇల్లు ఎప్పుడూ అతిథులతో కిటకిటలాడుతూ ఉండేది. వారి సౌకర్యాల కోసం, కాలక్షేపాల కోసం (సంగీత నృత్య విభావరులతో సహా) చాలా ఖర్చు పెట్టేవాడు. ఇప్పుడు పాఠకులకు అర్థమయ్యే ఉంటుంది, ఖపర్డే రైల్వేస్టేషన్ నుంచి ఇంటికి కాలినడకన ఎందుకు వెళ్ళవలసి వచ్చిందో.

శ్రీసాయిలీలలో చెప్పబడిన ఈ శిరిడీ సందర్శనం - ఖపర్డే జీవిత చరిత్రతో పోల్చి చూస్తే అంతా సమగ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.

డిసెంబరు 11న రెండవ దర్శనం:

దాదాసాహెబ్ ఖపర్డే రెండవ శిరిడీ దర్శనం చాలా పెద్దది. అతనక్కడ వందరోజుల వరకు ఉండాల్సి వచ్చింది. ఇది చాలా ముఖ్యమైనది మరియు లోతుగా పరిశీలించవలసింది. ఎందుకంటే, దాదాసాహెబ్, అతని భార్య ఆమ్రావతికి తిరిగి వెళ్ళాలని అనుకున్నప్పటికీ, సాయిబాబా వారిని శిరిడీలోనే ఉంచేసి, వారిని వెళ్ళనివ్వలేదు. తన సద్గురువైన బాబాపై ధృఢవిశ్వాసంతో, బాబా నిర్ణయమే తనకు శ్రేయోదాయకమని నమ్మిన ఖపర్డే సాయిబాబా ఆజ్ఞలను శిరసావహించాడు.

దాదాసాహెబ్‌ని బాబా అన్ని రోజులు శిరిడీలో ఉంచటానికి కారణమేమై ఉంటుంది? దాదాసాహెబ్ ఖపర్డే లోకమాన్య బాలగంగాధర తిలక్‌కు సహాయకుడూ, సమర్ధించేవాడూ అని పాఠకులకు తెలుసు. 1908, జూన్ 24వ తారీఖున ప్రజలను రెచ్చగొట్టిన అభియోగం మీద తిలక్‌ను అరెస్టు చేసి విచారణ నడిపిస్తున్నారు. ఆ విచారణ 1908, జూలై 13 వరకు కొనసాగి, తిలక్ దోషిగా నిరూపించబడి, 1908, జులై 22న అతనికి 6 సంవత్సరాల జైలుశిక్ష విధించబడింది. దాని తరువాత కొద్దిరోజులకే, అంటే 1908 ఆగస్టు 15న లోకమాన్యను దోషిగా బొంబాయి హైకోర్టు వారిచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా ప్రైవీ కౌన్సిలులో అప్పీలు చేసుకోవటానికి దాదాసాహెబ్ ఇంగ్లాండు వెళ్ళాడు. 1908, ఆగష్టు 31న అతను డోవర్ చేరి వెంటనే లండనుకి వెళ్ళిపోయాడు. అనుకున్న విధంగా ప్రైవీ కౌన్సిల్‌లో అతను ఒక పిటీషను పెట్టుకొన్నాడు. కానీ బొంబాయి హైకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా తిలక్‌ను వదిలేయటానికి ప్రైవీ కౌన్సిల్ తిరిస్కరించింది. సరైన మద్దతు లేకపోవటం వల్ల హౌస్ ఆఫ్ లార్డ్స్‌కి అతను పెట్టుకున్న అప్పీలు కూడా విఫలమైంది. ఇండియాకు స్టేట్ సెక్రటరీ అయిన లార్డ్ మోర్లేకు పెట్టుకున్న అర్జీ వల్ల కూడా లాభం లేకపోయింది. చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్ధమైపోగా, ఖపర్డే 1910 సెప్టెంబరు 15న (ఇంగ్లాండులో రెండు సంవత్సరాలున్న తరువాత) రంగూన్ మీదుగా ఇండియాకు వచ్చాడు. తిలక్‌కి వ్యతిరేకంగా ఇవ్వబడిన తీర్పుని ఎన్ని ప్రయత్నాలు చేసినా మార్చలేకపోయాడు. తన నాయకుడి విడుదల కోసం తన స్వంత ఖర్చులతో ఇంగ్లాండుకి వెళ్ళాడు. ఇంగ్లాండులో అతను పడిన శ్రమ తన నాయకుడి పట్ల అతనికున్న విధేయతనూ, భక్తినీ మాత్రమేగాక, తను న్యాయమని నమ్మిన సిద్ధాంతం కోసం తన శక్తినీ, కాలాన్నీ, డబ్బునీ పణంగా పెట్టగల అతని స్వార్థరాహిత్యాన్ని కూడా నిరూపిస్తోంది.

అతను ప్రయాణంలో ఉండగానే 1910 సెప్టెంబరు 27వ దాదాసాహెబ్ తల్లి మరణించింది. ఖపర్డే 16-10-1910న రంగూన్ చేరి, 22-10-1910న మాండలే జైలులో తిలక్‌ని కలిశాడు. 27-10-1910న కలకత్తా చేరి, 5-11-1910న ఇంటికి చేరుకున్నాడు. అప్పటికి అతను ఇల్లు వదలి రెండు సంవత్సరాల రెండునెలల ఇరవై రెండు రోజులు అయింది.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo