ఈ భాగంలో అనుభవాలు:
1. సాయినాథుని సహాయం
2. అప్పటికప్పుడు దగ్గు తగ్గించిన బాబా ఊదీ
సాయినాథుని సహాయం
సాయిబంధువులకు హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు సూర్యప్రకాష్. 2025, జనవరిలో మా ఆఫీసులో ఒక ఆన్లైన్ టెండర్ వేసాము. టెక్నికల్&ఫైనాన్సియల్ ఎవాల్యుయేషన్ అనంతరం తక్కువ టెండర్ వేసిన వ్యక్తిని ఎంపిక చేసి, ఆమోదం కోసం మా ప్రధాన కార్యాలయానికి ఫిబ్రవరి నెల మొదటివారంలో పంపించాము. ఇందంతా ఆన్లైన్లోనే జరిగింది. ఎక్కడా వ్యక్తుల ప్రమేయం లేదు. మొత్తం సిస్టమ్ ఆటోమేటిక్గా చేసింది. కానీ తిరస్కరించిన ఒక కంపెనీ తమ డాక్యూమెంట్లన్నీ సరిగా ఉన్న కూడా రిజెక్ట్ చేసామని మా మీద ఫిర్యాదు చేసింది. నేను చాలా భయాందోళనలు చెంది 'అన్నీ సరిగ్గా చేసినా ఎందుకిలా జరిగింద'ని బాబాని తలచుకొని బాధపడ్డాను. "బాబా! ఆఫీసులో మా ఆఫీసర్ల దగ్గర నన్ను కాపాడే బాధ్యత నీదే. ఈ ఆపద నుంచి కాపాడు తండ్రి. నీ కోవెలలో అన్నదానం చేయిస్తాను" అని బాబాకి దణ్ణం పెట్టుకొని ఆ ఫిర్యాదుకు సంబంధించి సవివరంగా రిప్లై తయారుచేసి మా ప్రధాన కార్యాలయానికి పంపించాను. బాబా కృపవలన మా ప్రధాన కార్యాలయం వాళ్ళు మా రిప్లైని ఆమోదించి, ఆ ఫిర్యాదు తప్పుడుదని నిర్ధారిం చారు. బాబా ఆఫీసులో నాకు చెడ్డ పేరు రాకుండ కాపాడారు. "సాయీ! మీరు చూపించిన కృపకు ధన్యవాదాలు".
2025, మార్చిలో ఆర్థిక సంవత్సరాంతం వలన మా ఆఫీసులో పని చాలా ఎక్కువగా ఉండింది. ఏ రోజు పేమెంట్లు ఆ రోజే చేయాల్సిన బాధ్యత మా మీద ఉండింది. ఆ తొందరలో నా కింద ఉద్యోగి ఒకరు ఒకరికి చేయాల్సిన పేమెంట్ వేరొకరి అకౌంటుకి చేసారు. నేను కూడా పని ఒత్తిడిలో సరిగా గమనించకుండా ఆమోదించేసాను. దాదాపు 20 రోజుల తరువాత అసలైనవాళ్లు వచ్చి, తమకు పేమెంట్ రాలేదని చెప్పడంతో, చూసుకుంటే పేమెంట్ తప్పుగా జరిగినట్లు మాకు అర్థమైంది. ఏమి చేయాలో తెలియక తీవ్రంగా ఆందోళన చెందాము. చాలా పెద్ద మొత్తం ఎలా సర్దుబాటు చేయాలో తోచక తల పట్టుకొని కూర్చున్నాము. నేను ఆ సమయంలో సాయిని తలచుకొని, "ఆ డబ్బు వెనక్కి వస్తే, శిరిడీ వచ్చి మీ దర్శనం చేసుకుంటాన"ని మొక్కుకొని, భారం ఆయన మీద వేశాను. వెంటనే బాబా ఇచ్చిన ప్రేరణ వల్ల ఎవరికి పేమెంట్ వెళ్లిందో, వాళ్ళ వివరాలు సిస్టంలో వుంటాయని చెక్ చేస్తే, వాళ్ళ ఫోన్ నెంబర్ దొరికింది. వెంటనే అతనికి ఫోన్ చేసి జరిగిన సంగతి చెప్పి వెంటనే డబ్బు తిరిగి ఇవ్వమని అడిగితే, "కొంత డబ్బు మినహాయించి ఇస్తాను" అన్నాడతను. కానీ తర్వాత అది కూడా ఇవ్వకుండా హాస్పిటల్లో వున్నా నని తప్పించుకొనే ప్రయత్నం చేస్తూ ఒక పది రోజులు చాలా ఇబ్బందిపెట్టాడు. మేము బ్యాంకువాళ్ళకి సమాచారమిస్తే, వాళ్ళు అతని అకౌంట్ బ్లాక్ చేసారు. బ్యాంకు మేనేజర్ కూడా అతనికి ఫోన్ చేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు.
దాంతో అతను ఏమీ చేయలేక మొత్తం డబ్బులు తిరిగి ఇచ్చాడు. సాయినాథుడే ఆ మేనేజర్ ద్వారా మాకు సహాయం చేసారు, లేకపోతే ఆ డబ్బు మాకు వచ్చేది కాదు. "బాబా! మీకు అనేక వేల నమస్కారాలు. సదా మీ ఆశీస్సులు మా అందరి మీదా వర్షించండి. తొందరలోనే శిరిడీ వచ్చి మీ దర్శనం చేసుకొనే అదృష్టాన్ని మాకు ప్రసాదించు తండ్రి. నేను చేసిన తప్పులు అన్నింటిని మన్నించు దేవా. ఎప్పటికీ మీ పాదాల దగ్గర శ్రద్ధ-సబూరితో ఉండే అదృష్టాన్ని ప్రసాదించు సాయీ: ధన్యవాదాలు బాబా".
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
అప్పటికప్పుడు దగ్గు తగ్గించిన బాబా ఊదీ
సాయి బంధువులందరికీ నమస్తే. నా పేరు సాయి లక్ష్మిప్రసన్న. మాది గుంటూరు జిల్లా, తెనాలి. బాబా గురించి ఎంత మాట్లాడినా తక్కువే! ఒకసారి మా బాబుకి దగ్గు వచ్చి డాక్టర్ చెప్పిన టానిక్ వేస్తున్నా అస్సలు తగ్గలేదు. ఉదయం 6 గంటల నుండి గ్యాప్ లేకుండా దగ్గుతూనే ఉన్నాడు. ఆ రాత్రి నేను వాడి బాధ చూడలేక బాబా ఊదీ బాబుకి పెట్టి, "బాబుకి దగ్గు తగ్గి నిద్రపట్టాలి" అని ప్రార్థించాను. అత్యంత అద్భుతం! బాబుకి దగ్గు చాలావరకు తగ్గిపోయింది. డాక్టర్ చెప్పిన టానిక్ వేస్తున్నగానీ అప్పటికప్పుడు దగ్గు తగ్గించింది మాత్రం బాబానే. నేను నా జీవితమంతా బాబాకి ఋణపడి ఉంటాను. బాబాని ఎప్పటికీ మర్చిపోను. ఒకవేళ నేను మరిచినా బాబా తన బిడ్డలని ఎప్పటికీ వదిలిపెట్టరు. కష్టం వచ్చిందని క్రుంగిపోకండి. బాబా ఖచ్చితంగా ఏదో ఒక దారి చూపిస్తారు.
సర్వేజనా సుఖినోభవంతు.
