సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 828వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా అనుమతి
2. సాయి మార్గంలోకి పయనం
3. పెద్దగా సమస్య కాకుండా అడ్డుకుని ఆదుకున్న బాబా

బాబా అనుమతి

సాయి మహరాజ్ సన్నిధి బ్లాగును ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్న సాయి బృందానికి ముందుగా నా వినమ్రపూర్వక ప్రణామములు. అలాగే, ఎంతో ప్రేమగా బాబా తమకు ప్రసాదించిన చక్కని అనుభవాలను పంచుకుంటున్న సాయిబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు దేవి. మాది గజపతినగరం. గత సంవత్సరం నుండి నేను ఏ ఒక్కరోజూ విడిచిపెట్టకుండా ఈ బ్లాగులో ప్రచురించే సాయిభక్తుల అనుభవాలను చదువుతూ ఉన్నాను. తోటి సాయిభక్తుల అనుభవాలు చదువుతుంటే, నాకు కూడా నా అనుభవాలను పంచుకోవాలనిపించేది. కానీ, అనిపించినంత మాత్రాన మనం చేయలేం కదా! ఎందుకంటే, "నా ఆజ్ఞ లేక ఆకైనా కదలదు" అన్నారు బాబా. ‘మరి నాకు ఆ ఆజ్ఞ లభిస్తుందా?’ అనుకున్నాను. ప్రతి విషయాన్నీ చీటీల ద్వారా బాబాను అడిగి, ఆయన చేయమంటేనే చేసే అలవాటున్న నేను నా అనుభవాలు పంచుకోవడానికి అప్పట్లో బాబాను అనుమతినడిగితే, 'అప్పుడే వద్దు' అన్నారు బాబా. బహుశా ఇన్ని విషయాలు వివరంగా వ్రాసే సమయం అప్పుడు నాకు ఉండదని బాబా ఉద్దేశ్యం కాబోలు! లేదా ఇంకేదైనా కావొచ్చు. ఇప్పుడు మాత్రం నేను అడగకుండానే బాబా తమ అనుమతినిచ్చారు. అదెలాగో చూడండి!

ఎప్పటిలాగే ఒకరోజు తెల్లవారుఝామున నేను నిద్రలేచి బాబాకు నమస్కరిస్తుండగా, "బ్లాగులో అనుభవాలు పంచుకో" అని బాబా చెప్తున్నట్లు నా మనసుకి అనిపించింది. ‘ఇన్నాళ్ళుగా లేనిది ఇంత అకస్మాత్తుగా బాబా ఇలా చెప్తున్నారేమిటి?’ అని ఒకప్రక్క అనుకుంటూనే, మరోప్రక్క 'అనుభవాలు ఎలా వ్రాయాలి? అసలు ఏ ఏ అనుభవాలు వ్రాయాలి?' అని నా మనసులో ఒకటే ఆందోళన మొదలైంది. అయితే, ‘అలవాటు ప్రకారం ఆ విషయాన్ని చీటీలు వేసి బాబాను అడిగి తీరుబాటుగా వ్రాసి పెడదాములే’ అని అనుకుని నా రోజువారీ కార్యకలాపాలలో పడి ఆ విషయాన్ని అశ్రద్ధ చేశాను. అదేరోజు సాయంత్రం అనూహ్యంగా ప్రతిరోజూ ఉదయం మాత్రమే జీసెస్ మెసేజీలు పంపించే నా క్రిస్టియన్ స్నేహితురాలి ద్వారా "నా సందేశం వినని నీ చెవులు మొద్దుబారినవా?" అనే సందేశం వచ్చింది. అది చూసి నేను ఆశ్చర్యపోయాను. ఒక్క క్షణం జీసస్(సాయిబాబా) అలా ఎందుకన్నారో నాకు అర్థం కాలేదు. తరువాత బాబాకి ధూప్ ఆరతి ఇద్దామని సిద్ధం చేస్తుండగా 'అనుభవాల గురించే బాబా అలా అన్నారేమో!' అనిపించి వెంటనే బాబాను ధ్యానించి, చీటీలు వేశాను. 'అనుభవాలు బ్లాగులో పంచుకోమ'ని బాబా సమాధానం వచ్చింది. బాబా ఆజ్ఞ పట్ల అశ్రద్ధ వహించిన నాకు జీసస్ రూపంలో తమ సందేశాన్ని గుర్తుచేసి మరీ తమ ఆజ్ఞను శిరసావహించేలా చేశారు సాయి. ఈ విధంగా నా అనుభవాలను బ్లాగులో పంచుకునే అదృష్టాన్ని ప్రసాదించిన బాబాకు వేల వేల కృతజ్ఞతలు. ఇక ఇప్పటినుండి బాబా నాకు ఇప్పటివరకు ప్రసాదించిన అనుభవాలను ఒక్కొక్కటిగా మీతో పంచుకుంటాను.

సాయి మార్గంలోకి పయనం:

మా నాన్నగారి ప్రేరణ వలన నాకు చిన్నప్పటినుండి కొంచెం దైవభక్తి ఉండేది. సత్యసాయి బాలవికాస్ తరగతులకు వెళ్లడం, చిన్న చిన్న ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాలుపంచుకోవడం, మా ఇంటిలోగానీ లేదా ఎవరింట్లోనైనాగానీ శిరిడీసాయి భజనలు నిర్వహిస్తే వాటిలో పాల్గొని ఇష్టంగా భజనలు పాడడం వంటివి చిన్నతనంనుండే నేను చేసేదాన్ని. అయితే, బాబాపై అమితమైన భక్తి కుదిరింది మాత్రం నా బి.ఇడి తరువాతనే. ఏవో కారణాల వలన బాబాకు దూరమైన నన్ను ఇద్దరు స్నేహితుల ద్వారా తిరిగి తమ మార్గంలోకి బాబా ఎలా రప్పించుకున్నారో ఇప్పుడు చెప్తాను.

నేను 2012లో బి.ఇడి చదువుతున్నప్పుడు పావని, మాధవి అనే ఇద్దరితో నాకు మంచి స్నేహం ఉండేది. వారివురి ఆకట్టుకునే ప్రవర్తనే నన్ను వారికి దగ్గర చేసింది. మాధవి అందరినీ హృదయపూర్వకంగా ఆప్యాయంగా పలకరించేది. తాను తెచ్చుకున్న లంచ్ బాక్సులో ఉన్నది ఏదైనా ప్రక్కనున్నవారికి పెట్టి తినేది. తనలో ఉన్న అటువంటి గుణాలు నన్ను ఆమెను బాగా ఇష్టపడేలా చేశాయి. ‘ఈ రోజుల్లో కూడా ఇంత మంచిబుద్ధి కలవారు ఉంటారా?’ అని నాకు అనిపించేది. తరువాత తెలిసింది, ‘ఆమె అప్పటికే 8 సంవత్సరాల నుంచి ఎంతో భక్తితో బాబాను ఆరాధిస్తున్న స్వచ్ఛమైన సాయిభక్తురాలు’ అని. ఇక పావని విషయానికి వస్తే, తను ఒక్కక్షణం కూడా వృధాచేయకుండా పాఠ్యపుస్తకాలను చదువుతూ క్రొత్త విషయాలను నేర్చుకోవడంలో ఎంతో కుతూహలంగా ఉండేది. నేను కూడా అటువంటి గుణం కలిగినదాన్ని అయినందున ఆమెతో నాకు స్నేహం ఏర్పడింది. తను కూడా బాబా భక్తురాలు. తనతో పరిచయం నన్ను బాబాకు దగ్గర చేసింది. ఎలా అంటే, ఒకరోజు "పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలంటే ఏ విధంగా కృషి చేయాలి?" అని నేను పావనితో చర్చిస్తున్న సమయంలో బాబా గురించిన ప్రస్తావన వచ్చింది. తను, "బాబాను ప్రార్థిద్దాం. ఆయన మనకు తప్పక సహాయం చేస్తారు" అని చెప్పి, "మా అమ్మగారు మంచి సాయిభక్తురాలు. ఆమె వద్ద 'బాబా ప్రశ్నలు-సమాధానాలు' అనే ఒక పుస్తకం ఉంది. నువ్వు ఒక గురువారంనాడు బాబాను ప్రార్థించి, ఒక నెంబర్ నాకు చెప్పు, నేను అమ్మనడిగి ఆ నెంబరుకి బాబా సమాధానం ఏముందో నీతో చెప్తాను" అంది. నేను సరేనని గురువారంనాడు ఒక నెంబర్ అనుకొని తనతో చెప్పాను. ఆ నెంబర్ మీద బాబా సమాధానంగా, "నీకు సాయియోగం పట్టనుంది" అని వచ్చింది. అది విని సంతోషము, ఆశ్చర్యమూ రెండూ ఒకేసారి కలిగాయి. సాయి నా జీవితంలో ఏదో మంచి చేయబోతున్నారన్నది సంతోషానికి కారణమైతే, 'రాజయోగం పట్టడం' విన్నాంగానీ, 'సాయియోగం పట్టడం' అని ఎప్పుడూ వినలేదని ఆశ్చర్యం. ఆ విషయం నాకు అప్పట్లో సరిగ్గా అవగాహన కాకపోయినా ఇప్పుడు నా సాయి నాకు సాయియోగాన్ని ఎలా పట్టిస్తున్నారో తలచుకుంటుంటే నాలో ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది.

ఇకపోతే, పావని ద్వారా సాయియోగం పట్టబోతుందని తెలియజేసిన బాబా, మాధవి ద్వారా నాకు సద్బోధ ఎలా చేశారో చూద్దాం. అప్పట్లో నాకు మనుషుల స్థితిగతులను బట్టి కొందరిపట్ల చులకనభావం ఉంటుండేది. నన్ను, నా ఈ స్వభావాన్ని మాధవి బాగా పరిశీలించినట్లుంది, మా బి.ఇడి పరీక్షలకు రెండు నెలల ముందు ఒకరోజు నన్ను వాళ్లింటికి తీసుకొని వెళ్ళి, బాబా విగ్రహాన్ని, శ్రీఆచార్య ఎక్కిరాల భరద్వాజగారి 'సాయిలీలామృతం' పుస్తకాన్ని నా చేతిలో పెట్టి, "దీనిని రోజూ క్రమంతప్పకుండా పారాయణ చేయి" అని చెప్పింది. ఆపై ఆమె చెప్పిన కొన్ని మాటలు నాలో భక్తిని మేల్కొల్పాయి. భక్తి అనడం కన్నా మానవత్వమంటే సమంజసంగా ఉంటుందేమో! ఆమె, "ఎవరు ఎటువంటి పరిస్థితులలో ఉన్నా వారిని చులకనగా చూడడం మరియు వారిని నిందించడం లాంటివి ఎట్టి పరిస్థితులలోనూ చేయకు. ఒక సందర్భంలో ఒక భక్తుడు సాటివారిని విమర్శించినప్పుడు బాబా అతనికి మలాన్ని తింటున్న ఒక పందిని చూపుతూ, “ఆ పంది మలాన్ని ఎంత ప్రీతిగా తింటోందో చూశావా? సాటివారి గురించి అపవాదులు కల్పించడం అలాంటిదే!” అని అన్నారు. అంటే, "ఎదుటివారిని నిందించడమంటే మనం మన నాలుకతో వారి మానసిక మలినాలను నాకి వారి పాపాలను స్వీకరిస్తున్నట్లే" అని చెప్పింది. ఆ మాటలతో నాలో ఎంతో జ్ఞానోదయం అయింది. అప్పటినుండి తనలాంటి చక్కటి ప్రవర్తనతో క్రొత్త జీవితం మొదలుపెట్టాలని సిద్ధపడ్డాను. ఈ విధంగా నేను సాయిమార్గంలోకి రావడానికి సహాయపడిన నా స్నేహితురాళ్లకు, వారి రూపంలో తమపై భక్తిని మేల్కొల్పిన బాబాకు శతకోటి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. మరికొన్ని అనుభవాలతో మళ్ళీ కలుద్దాం...  

శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

పెద్దగా సమస్య కాకుండా అడ్డుకుని ఆదుకున్న బాబా

ముందుగా సాయిబంధువులందరికీ నా నమస్కారం. 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా ధన్యవాదాలు. నా పేరు సాయి గీత. మాది గజపతినగరం. మా నాన్నగారు సాయిభక్త కమిటీలో ఉండడం వలన నాకు చిన్నప్పటినుండి బాబాకు పూజలు చేయడం, భజనలకి వెళ్ళడం, నారాయణ సేవలో పాల్గొనడం అలవాటైంది. ఆ విధంగా బాబాకు అనుసంధానింపబడిన నేను కాలక్రమంలో నా చదువు, వివాహం, పిల్లలు వంటి వాటిలో పడి పూర్తిగా బాబాను మర్చిపోయాను. ఒక విధంగా చెప్పాలంటే బాబాకు దూరమయ్యాను. కానీ, "నా భక్తులను నేను ఎన్నటికీ నా నుండి దూరం కానివ్వను" అని వాగ్దానం చేసిన బాబా 2012-13లో మా ఆడపడుచు ద్వారా తిరిగి నా జీవితంలోకి ప్రవేశించారు. నాలో భక్తిని బలపరిచారు. అప్పటినుండి మాకు తోడుగా ఉంటూ మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఎన్నో అనుభవాలు ప్రసాదించారు బాబా. అందులో ఒకటి నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

నాకు రోజూ బాబా ముందు దీపం పెట్టి, హారతి ఇచ్చాక 'సాయి ప్రశ్నావళి'లో బాబా సందేశం చూడడం అలవాటు. అలా ఒకరోజు సాయంత్రం చూసినప్పడు, "నీకు రాబోయే సమస్యని నేను అడ్డుకుంటాను" అని బాబా సందేశం ఇచ్చారు. మరో రెండు నిమిషాల్లో మావారి నెంబర్ నుంచి మా అత్తగారికి ఫోన్ వచ్చింది. ఫోనులో ఎవరో మాట్లాడుతూ, "మీ వాళ్ళకు సబ్బవరం రోడ్డు ప్రక్కన చిన్న యాక్సిడెంట్ జరిగింద"ని మాకు సమాచారం ఇచ్చారు. అది విని మేము చాలా కంగారుపడి, వెంటనే బయలుదేరి వెళ్ళాము. మేము అక్కడికి చేరుకునేసరికి మావారిని హాస్పిటల్లో చేర్చడం, చికిత్స అందించడం జరిగింది. మావారు చిన్న చిన్న గాయాలతో ఆ ప్రమాదం నుండి బయటపడ్డారు. ఇంటికి వచ్చిన తర్వాత మాకు సమాచారం ఇచ్చిన వ్యక్తికి  కృతజ్ఞతలు చెపుదామని ఫోన్ చేస్తే, 'ఆయన బాబా భక్తులనీ, చీకటిలో ఎవరూ గమనించకపోయినప్పటికీ అనుకోకుండా అటుగా వెళ్ళిన ఆయన మావారిని చూసి మాకు సమాచారం అందించార'నీ తెలిసింది. బాబా తన భక్తుని ద్వారా నా భర్తని కాపాడారని అప్పుడు అర్థమయ్యింది. లేకపోతే ఏమయ్యేదో! ఆ భక్తుడు మావారి ఫోన్, ఇతర విలువైన వస్తువులు తన వద్ద భద్రపరిచి, మాకు భద్రంగా అందించారు. ఇలా సమయానికి బాబా మావారిని పెద్ద ప్రమాదం నుండి తప్పించి క్షేమంగా ఇంటికి చేర్చారు. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోగలను?" ఇంకొన్ని అనుభవాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

10 comments:

  1. Om Sairam experience are nice .sai bless to all , I need a sai devotees for mahaparayna group, pls help sai

    ReplyDelete
  2. OM SREE SACHIDHANANDA SAMARDHA SADGURU SAINATH MAHARAJ JAI ❤🙏😊🕉

    ReplyDelete
  3. Om Sri Sai Ram ��������

    ReplyDelete
  4. చక్కని సాక్ష్యం తల్లీ. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్

    ReplyDelete
  5. ఓం సా౦ుు బాబా నమస్కారము చేసి రాచినదియు ఏమనగా సా౦ుు తండ్రిని వేడుకొంటే అంతా మంచే జరుగు తుంది. ఓం సా౦ుు బాబా నమస్కారము చేసి ❤❤❤��

    ReplyDelete
  6. Om Sairam
    Sai Always be with me

    ReplyDelete
  7. Om sai ram baba amma problem tondarga cure avali sai thandri

    ReplyDelete
  8. Baba ee gadda ni karginchu thandri pleaseeee

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo