1. అభయప్రదాత సాయితండ్రి2. బాబా అనుగ్రహ వీచికలు
3. పునర్జన్మను ప్రసాదించిన బాబా, గురువుగారు
అభయప్రదాత సాయితండ్రి
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
బాబా! నిన్ను ఒక్కసారి చూడాలయ్యా
నా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా
అమ్మానాన్న అన్నీ నీవేనయ్యా
నిను అయ్యా అని ఒక్కసారి పిలవాలయ్యా...
నేను సాయిభక్తురాలిని. ముందుగా సాయిబంధువులందరికీ నమస్కారాలు. మరోసారి బాబా ప్రసాదించిన అనుభవాన్ని మీతో పంచుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతమున్న కరోనా పరిస్థితుల దృష్ట్యా ప్రతిదానికీ టెన్షన్‌గా ఉంటోంది. చివరికి వ్యాక్సినేషన్‌కి వెళ్ళాలన్నా కూడా భయమే. చాలారోజులుగా ప్రయత్నిస్తూ ఉంటే మొత్తానికి బాబా ఆశీస్సులతో 2021, జూన్ 11న నాకు మొదటి డోస్ వ్యాక్సిన్ వేయించుకునే అవకాశం వచ్చింది. ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకుని లైనులో నిలుచున్నాను. అక్కడ చాలామంది ఉన్నందున నాకు చాలా భయమేసి సాయి నామస్మరణ చేసుకుంటూ చివరికి వ్యాక్సిన్ వేయించుకున్నాను. బాబా దయవల్ల అంతా సవ్యంగా జరిగింది. అయితే ఇంటికి వచ్చిన తరువాత కూడా భయంగా అనిపించి, "బాబా! ఏ విధమైన ఇబ్బందీ లేకుండా చూడండి" అని బాబాను ప్రార్థించి, ఆయన పరమ పవిత్రమైన ఊదీని నీటిలో కలిపి త్రాగుతుండేదాన్ని. మర్నాడు కొద్దిగా జ్వరం వచ్చినట్లు అనిపించడంతోపాటు ఒళ్లునొప్పులు కూడా వచ్చాయి. నేను మన కరుణామయుడైన సాయితండ్రిని, "నా ఆరోగ్యం చక్కదిద్దండి బాబా. నాకు నయమయ్యేలా చూడండి" అని ప్రార్థించి, ఆయన ఊదీని ధరించి, మరికొంత నీళ్లలో కలుపుకుని త్రాగాను. ఆ తరువాత మన 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగు ఓపెన్ చేసి భక్తుల అనుభవాలు చదువుతుంటే, మూడుసార్లు సాయిసచ్చరిత్రలోని 11వ అధ్యాయం పారాయణ చేయమని వచ్చింది. అది బాబా ఆశీర్వాదంగా స్వీకరించి వెంటనే పారాయణ చేశాను. బాబా కృపతో నా ఆరోగ్యం కుదుటపడింది. అభయప్రదాత సాయితండ్రిని 'మా కుటుంబంలో అందరికీ ఆరోగ్యం ప్రసాదించమనీ, సాయిబంధువులందరికీ సకల శుభాలు కలుగజేయమనీ, కరోనా మహమ్మారిని తరిమివేయమ'నీ చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను.
సాయినాథ్ మహరాజ్ కీ జై!
బాబా అనుగ్రహ వీచికలు
నేను సాయిభక్తురాలిని. ముందుగా సాయిభక్తులకు నా నమస్కారాలు. 2021లో ఒకరోజు నా మెడ నరం పట్టేసి చాలా బాధపడ్డాను. తీవ్రమైన ఆ నొప్పిని తట్టుకోలేక చాలా నెమ్మదిగా నా పనులు చేసుకోవాల్సి వచ్చింది. నా కష్టం గురించి బాబాకు చెప్పుకొని, నొప్పి ఉన్న చోట బాబా ఊదీ రాశాను. ఆ తర్వాత మందులు కూడా వేసుకున్నాను. రెండు గంటల్లో నొప్పి తగ్గి చాలా ఉపశమనంగా అనిపించింది. నిజానికి అంత త్వరగా ఆ నొప్పి తగ్గుతుందని నేను అస్సలు అనుకోలేదు. అంతా బాబా దయ. బాబా ఊదీ సర్వరోగనివారిణి.
2021లో నా భర్త కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. "వ్యాక్సిన్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచిగా ఉండాల"ని బాబాకు చెప్పుకున్నాను. బాబా ఎంతో ప్రేమతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చూశారు. "ధన్యవాదాలు సాయీ".
మా అంకుల్‌వాళ్ళ అబ్బాయికి పంచకట్ల వేడుక 2021లో జరిగింది. ఒక్కడే అబ్బాయి అయినందువలన ఆ వేడుక బాగా చేయాలని వాళ్ళు ఒక సంవత్సరంగా వేచిచూస్తున్నా కానీ, కరోనా పరిస్థితుల్లో వేడుక చేయడానికి అందరూ కాస్త భయపడ్డారు. చివరికి దేవుని మీద భారం వేసి ఒక తేదీ నిర్ణయించారు. నేను, "బాబా! మీ దయవలన ఫంక్షన్ ఎలాంటి సమస్యలూ లేకుండా జరగాలి. అలాగే, ఫంక్షన్‌కి వచ్చినవారికి ఎలాంటి సమస్యలూ ఉండకూడదు" అని అనుకున్నాను. ఫంక్షన్ ముందురోజు రాత్రి వర్షం పడినప్పటికీ బాబా కృపవలన ఫంక్షన్ రోజున వర్షం కురవలేదు. పైగా ముందురోజు వర్షం వలన వాతావరణం చాలా చల్లగా మారింది. ఫంక్షన్ చాలా బాగా జరిగింది. ఇదంతా బాబా అనుగ్రహం వల్లే. "థాంక్యూ బాబా. థాంక్యూ వెరీ మచ్ బాబా. అందరిమీద మీ దయ ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి బాబా".
మా కుటుంబంలో కొన్ని చిన్న చిన్న సమస్యలున్నాయి. వాటివలన ఒకరోజు జరిగిన ఒక చిన్న గొడవకి మావారు కోపంతో ఇంటినుంచి బయటకు వెళ్లిపోయారు. రాత్రి 10 గంటల సమయంలో ఆయన అలా వెళ్ళిపోయేసరికి నాకు చాలా బాధగానూ, భయంగానూ అనిపించింది. ఒక గంట తర్వాత ఫోన్ చేస్తే, ఆయన కాల్ లిఫ్ట్ చేయలేదు. ఏం చేయాలో అర్థంకాక బాబాకు నా బాధ చెప్పుకొని, "బాబా! మీ దయవల్ల ఎటువంటి ఇబ్బందీ లేకుండా మావారు త్వరగా ఇంటికి వచ్చేయాలి" అని వేడుకున్నాను. బాబా దయవల్ల గంట తరువాత మావారు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
2021లో ఒకరోజు రెండు సంవత్సరాల మా బాబు తలుపు దగ్గర ఆడుకుంటూ ఉంటే నేను చూసుకోకుండా తలుపు వేసేశాను. వాడి లేలేత వేళ్ళు తలుపు సందులో ఇరుక్కుపోయాయి. దాంతో కోమలమైన వాడి చేతులు ఎర్రగా కమిలిపోయాయి. రక్తం కూడా వచ్చింది. వాడు బాధతో విలవిల్లాడుతూ ఏడుస్తుంటే నాకు చాలా భయం వేసి, "బాబా! మీ దయవల్ల బాబుకి నొప్పి తగ్గిపోవాలి" అని బాబాకు చెప్పుకున్నాను. బాబా దయవలన బాబుకి నెమ్మదిగా రెండు రోజుల్లో నొప్పి తగ్గింది. "థాంక్యూ బాబా. థాంక్యూ వెరీ మచ్". నేను ఇంతకుముందు యూరప్‌లో జరిగే 'భాషాసంబంధిత పరీక్ష' ఒకటి వ్రాశాను. దాని నెక్స్ట్ లెవెల్ పరీక్షకి నేను ఎంతగా ప్రిపేర్ అయినప్పటికీ నాకు చాలా భయంగా ఉండేది. ఆ పరీక్షలో ఉత్తీర్ణత పొందటం నా ఉద్యోగ ప్రయత్నాలకు చాలా అవసరం. అందువల్ల నేను, "బాబా! నేను ఈ పరీక్షలో ఉత్తీర్ణురాలిని అవ్వాలి" అని బాబాకు చెప్పుకున్నాను. బాబా దయవల్ల ఆ పరీక్షలో నేను ఉత్తీర్ణురాలినయ్యాను. "థాంక్యూ బాబా".
పునర్జన్మను ప్రసాదించిన బాబా, గురువుగారు
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
సద్గురు శ్రీ సాయినాథుని శరత్‌బాబూజీ కీ జై!
సాయిభక్తులకు, గురుబంధువులకు నా నమస్కారాలు. 2021లో మా అన్నయ్య కుటుంబం కరోనా బారిన పడిన కారణంగా నేను రెండు నెలలు మానసికంగా చాలా బాధను అనుభవించాను. బాబా దయవలన వదినకు, పిల్లలకు కరోనా తగ్గింది. కానీ, అన్నయ్యకి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయాయి. దాంతో అన్నయ్యను కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ చేశాము. నేను బాబాకి, గురువుగారికి నమస్కరించుకుని, "అన్నయ్యకి త్వరగా తగ్గాలి" అని చెప్పుకున్నాను. అన్నయ్య 18 రోజులు ఐసీయూలో ఆక్సిజన్ మీద ఉన్నాక చివరికి డాక్టర్లు 'లంగ్స్ ఫైబ్రోసిస్ అయింది. దానికి మందులు లేవు. ఫిజియోథెరపీ ద్వారా నిదానంగా తగ్గుతుంది' అని చెప్పి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్‌తో అన్నయ్యని డిశ్చార్జ్ చేశారు. దాదాపు 45 రోజులు అన్నయ్య కాన్సన్ట్రేటర్‌తోనే ఆక్సిజన్ తీసుకున్నారు. బాబా, గురువుగారి దయవల్ల ఇప్పుడు తను మాములుగా ఆక్సిజన్ పీలుస్తున్నారు. బాబా, గురువుగారే మా అన్నయ్యకు పునర్జన్మను ప్రసాదించారు. బాబా, గురువుగారికి శతకోటి నమస్కారాలు.

