సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 831వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. వెంట ఉండి కోరుకున్న సందర్భాన్ని కల్పించిన బాబా
2. దయగల తండ్రి నా సాయినాథుడు
3. ఊదీతో తగ్గిన గొంతునొప్పి

వెంట ఉండి కోరుకున్న సందర్భాన్ని కల్పించిన బాబా


సాయి గురుబంధువులకు మరియు ఎంతోమంది సాయిభక్తుల అనుభవాలను ప్రచురిస్తూ బ్లాగును ఇంత విజయవంతంగా నిర్వహిస్తూ సాయిభక్తులందరికీ ఎంతో మనోధైర్యాన్ని, బాబాపట్ల భక్తివిశ్వాసాలను ఎన్నో రెట్లు పెంపొందిస్తున్న సాయికి నా నమస్కారాలు. ఇక నా అనుభవంలోకి వస్తే...


నా పేరు శాంతి. 2021, మే మొదటివారంలో మా కుటుంబంలోని అందరమూ, అంటే మా అత్తయ్య, మావారు, నేను కోవిడ్ బారినపడ్డాము. మాకు 6 సంవత్సరాల పాప ఉన్నందున నాకు చాలా భయం వేసింది. కానీ ఇప్పుడే ఎంతో ధైర్యంగా ఉండాలి అని బాబా ముందు కూర్చుని, "బాబా! ఏమిటి ఇలా జరిగింది? నాకు ఈ పరిస్థితిని ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రసాదించండి" అని ఏడ్చేశాను. తరువాత, 'బాబా ఉన్నారు. మాకు ఏమీ కాదు' అనే నమ్మకంతో మేమంతా ఎవరి గదులలో వాళ్ళు గృహ నిర్బంధంలో ఉండసాగాము. పాపను నా దగ్గరే ఉంచుకుని, "బాబా! పాపకు కోవిడ్ రాకుండా మీరే చూడాలి. మేము హాస్పిటల్లో చేరాల్సిన పరిస్థితి రాకుండా త్వరగా కోలుకోవాలి" అని బాబాను పదేపదే అడుగుతూ ఉండేదాన్ని. కాదు, కాదు.. బాబాను విసిగించానేమో! అయినా కష్టం వచ్చినప్పడు తల్లికి కాక ఎవరికి చెప్పుకుంటాం? ప్రతిరోజూ మేమందరం బాబా ఊదీని పెట్టుకుంటుండేవాళ్ళం. ప్రతిరోజూ పడుకునేముందు నాకు సచ్చరిత్ర చదివే అలవాటు. ఒకరోజు నేను కోవిడ్‌కి సంబంధించిన వార్తలు, వాట్సాప్ మెసేజెస్ చూసి చాలా భయపడిపోయాను. దాంతో సచ్చరిత్ర పుస్తకం పట్టుకుని ఏడ్చేశాను. "బాబా! మీరే నాకు ధైర్యాన్ని ఇవ్వండి. నేను పుస్తకం తెరవగానే నాకు ధైర్యాన్నిచ్చే సంఘటన రావాలి" అని బాబాతో చెప్పుకుని సచ్చరిత్రను తెరిచాను. అక్కడున్న లీలను చూసి ఆశ్చర్యపోయాను. రాధాకృష్ణమాయికి మలేరియా జ్వరం వచ్చినప్పుడు, ఆ జ్వరం తగ్గించటానికి బాబా ఒక నిచ్చెనను తెప్పించి, ఆమె ఇంటి పైకప్పు ఎక్కి, మరోవైపుగా దిగే సంఘటన ఉంది. అది చూసి నాకు ఒకప్రక్క సంతోషం, మరోప్రక్క దుఃఖం ఒకేసారి కలిగాయి. ‘నా బాబా నాతోనే ఉన్నారు, ఆయన నా కుటుంబాన్ని తప్పకుండా కాపాడుతారు’ అన్న ధైర్యం వచ్చింది. ఇక బాబా లీలలు తలచుకుంటూ సమయాన్ని గడపసాగాను. ఒకసారి, "బాబా! మేమంతా కోలుకున్న తరువాత కొంత మొత్తం అనుకుని ఏదైనా అనాథాశ్రమానికి ఇస్తాను. కానీ నాకు ఏ అనాథాశ్రమాలూ తెలియవు. పైగా ప్రస్తుత పరిస్థితుల్లో నేరుగా ఇవ్వలేం. కాబట్టి మీరే సందర్భాన్ని కలిపించండి" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవల్ల అందరమూ కోలుకున్నాము. విచిత్రం ఏమిటంటే, అన్ని రోజులూ మా పాప నాతోనే ఉన్నప్పటికీ తనకు ఎటువంటి ఆరోగ్య సమస్యా రాలేదు. బాబా నా బిడ్డ వెన్నంటే ఉండి తనను రక్షించారు.


కోవిడ్ నుండి బయటపడిన వారం రోజుల తరువాత ఒకరోజు మా వదిన (నేను అనాథాశ్రమం గురించి బాబాకు చెప్పుకున్న విషయం తనకు తెలియదు) ఫోన్ చేసి, "నాకు తెలిసిన ఒకావిడ ఉన్నారు. నా చిన్నప్పటినుండి ఆవిడ ఒక అనాథాశ్రమం నడుపుతున్నారు. ప్రస్తుతం వయస్సు పైబడినందువల్ల ఆవిడ తిరిగి డబ్బులు సమీకరించలేకపోతున్నారు. ఆవిడ నాకు ఫోన్ చేసి, తన పరిస్థితి గురించి చెప్పి, 'అనాథాశ్రమం కోసం సహాయం చేయగలరా?' అని అడిగారు. నేను కొంత మొత్తాన్ని ఆవిడకు ఇచ్చాను. నువ్వు కూడా కొంత మొత్తం అనుకుని ఇవ్వగలవా?" అని అడిగారు. అది విని ఆశ్చర్యపోయాను. నా సంతోషానికి అవధులు లేవు. బాబా కల్పించిన సందర్భాన్ని తలచుకుంటూ, నేను ముందుగా నా మనసులో బాబాకు చెప్పుకున్నంత మొత్తాన్ని అనాథాశ్రమానికి ట్రాన్స్‌ఫర్ చేశాను. కాదు, బాబానే నా చేత చేయించారు. "బాబా!  మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోవాలి? మీ పట్ల నాకున్న శ్రద్ధ, సబూరీలు రెట్టింపు అయ్యేలా అనుగ్రహించు తండ్రీ. సదా మీ నామస్మరణను, మీ లీలలను చింతన చేసేటట్లు నాపై దయచూపండి బాబా". మరో అనుభవంతో మళ్ళీ కలుద్దాం.

ఓం శ్రీ సాయినాథాయ నమః.


దయగల తండ్రి నా సాయినాథుడు


సాయిభక్తులందరికీ నా నమస్కారం. ఈ బ్లాగు నిర్వహిస్తున్న భక్తులందరి పేరుపేరునా బాబా అనుగ్రహం సదా వాళ్లపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రస్తుత కరోనా విపత్కర సమయంలో బాబా ఎంతోమంది భక్తులకు ప్రసాదించే అనుభవాలను ప్రచురించి, 'ఏ సమయంలోనైనా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సాయితండ్రి అండగా ఉంటార'న్న ధైర్యాన్ని నింపుతున్న మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు శ్రీదేవి. బాబా నాకు ఎన్నో అనుభవాలను ప్రసాదించారు. నా సాయితండ్రి చేసే లీలలను ఏమని చెప్పను? నాకు మాటలు రావడం లేదు. మనకు ఎంతమంది దేవతలున్నా ఎందుకో బాబాని చూస్తే మంచి ఆప్తుడిలా అనిపిస్తారు, 'తండ్రి' అన్న భావన కలుగుతుంది. ఒక్కోసారి 'నా బాబా' అనే స్వార్థం కూడా ఉంటుంది. నిరంతరం బాబా స్మరణ చేసుకుంటూ ఉంటే, ఎంతటి కష్టాన్నైనా బాబా తొలగిస్తారు. నా జీవితాన్ని నడిపిస్తున్నది బాబానే. ఆయన అడుగడుగునా అండగా ఉంటూ మా కుటుంబాన్ని కాపాడుతున్నారు. నాకు ఏ చిన్న కష్టం వచ్చినా నేను బాబాతో చెప్పుకుంటాను. ఇటీవల మా అమ్మగారి ఆరోగ్యరీత్యా తనకు కరోనా పరీక్ష చేయించాల్సి వచ్చింది. అప్పుడు నేను, "రిపోర్టు నెగిటివ్ అని వస్తే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాను వేడుకున్నాను. బాబా దయవలన రిపోర్టు నెగిటివ్ అని వచ్చింది. ఆనందంగా బాబాకు కృతజ్ఞతలు చెప్పుకుని, "అమ్మ ఆరోగ్యం కుదుటపడాల"ని బాబాను వేడుకున్నాము. ఇంకా, కరోనా పరీక్ష చేయించుకున్న మా అత్తగారికి, మామగారికి కూడా బాబా దయవలన నెగిటివ్ అని రిపోర్టు వచ్చింది. బాబాను నమ్ముకుంటే చాలు, అంతా మంచే జరుగుతుంది. ఆయన ముందుండి మనందరినీ నడిపిస్తారు.


తరువాత, గుంటూరులో అమ్మకి MRI స్కానింగ్ చేయిస్తే, 'అమ్మ తలలో ఏదో సమస్య ఉందని, బయాప్సీ చేసి పరీక్షకి పంపాల'ని చెప్పారు. దాంతో మేము చాలా భయపడిపోయాము. బాబాకు చెప్పుకుని ఆ క్షణం నుండి నేను, అన్నయ్య, చెల్లి బాబా చరిత్ర పారాయణ మొదలుపెట్టాము. తర్వాత 2021, మే 31న అమ్మని విజయవాడలోని యూరాలజీ డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్లారు. బాబా ఎంత లీల చేశారంటే, ఆ సాయితండ్రే వైద్యుడై అమ్మకి కంటిపరీక్ష చేసి, 'అంతకుముందు చెప్పినట్టు పెద్ద ప్రమాదం ఏమీ లేదనీ, మందులు వాడుతూ విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంద'నీ చెప్పారు. అది తెలిసి ఆనందంగా బాబాకు ధన్యవాదాలు తెలుపుకున్నాము.


ఈమధ్యకాలంలో ఒకసారి నా స్నేహితురాలికి నెలసరికి సంబంధించి ఒక సమస్య వచ్చింది. అధిక ఋతుస్రావం వలన తను నీరసంతో బాధపడుతోంది. కరోనా పరిస్థితుల దృష్ట్యా హాస్పిటల్‌కి వెళ్లే పరిస్థితి లేదు. అలాంటి సమయంలో బాబా నా ద్వారా ఆమెకు సాయం చేశారు. నేను నా స్నేహితురాలితో, "బాబా ఊదీ పెట్టుకుని, మరికొంత ఊదీని నీళ్ళలో కలుపుకుని త్రాగు. అలా చేస్తే బాబా దయవలన నీ సమస్య తీరుతుంది" అని చెప్పాను. తరువాత నేను సాయితండ్రితో, 'నా స్నేహితురాలికి ఆ సమస్య తీరితే ఈ అనుభవాన్ని మీ బ్లాగు ద్వారా తోటి సాయిబంధువులతో పంచుకుంటాన'ని చెప్పుకున్నాను. బాబా దయవలన రెండురోజుల్లోనే నా స్నేహితురాలి సమస్య తీరింది. దయగల తండ్రి నా సాయినాథుడు. జీవితంలో ఏ ఇబ్బంది వచ్చినా బాబాకు విన్నవించుకుని, బాబా చరిత్ర పారాయణ చేస్తూ, బాబా ఊదీని నుదుటన ధరించి, తీర్థంలా స్వీకరించండి. ఊదీ పరమౌషధము, బాబా అనుగ్రహంతో శుభం జరుగుతుంది.


సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!


ఊదీతో తగ్గిన గొంతునొప్పి


సాయిబంధువులందరికీ మరియు ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారాలు. నేను ఒక సాయిభక్తురాలిని. బాబా నాకు ఇటీవల వచ్చిన కష్టాన్ని ఆర్తిగా ప్రార్థించినంతనే తమ ఊదీతో రెండురోజుల్లో పరిష్కరించారు. ఆ అనుభవాన్నే నేనిప్పుడు మీతో పంచుకుంటాను. 2021, జూన్ నెల ఆరంభంలో రెండు, మూడు రోజులపాటు మా నాన్నగారు గొంతునొప్పితో బాధపడ్డారు. ఆ కారణంగా ఆయన సరిగ్గా ఆహారం తీసుకోలేకపోయారు. మాకు తెలిసిన ఒక ఆర్ఎంపీ డాక్టరుని సంప్రదిస్తే, నాన్నను హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళమన్నారు. ప్రస్తుత కరోనా సమయంలో హాస్పిటల్‌కి వెళ్లే ధైర్యం మాకు లేకపోయింది. దాంతో నేను 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః', 'ఓం శ్రీసాయి రోగపీడిత నివారణాయ నమః' అనే మంత్రాలను జపిస్తూ, "ఊదీతో నాన్న ఆరోగ్యసమస్యను పరిష్కరించమ"ని బాబాను వేడుకున్నాను. తరువాత బాబా ఊదీని ఔషధంలా నాన్నకి ఇచ్చాను. బాబా నా మొర ఆలకించారు. హాస్పిటల్‌కి వెళ్లాల్సిన అవసరం లేకుండా కేవలం ఊదీతో నాన్న ఆరోగ్యసమస్యను రెండురోజుల్లో పరిష్కరించారు బాబా. "ధన్యవాదాలు బాబా. ఆలస్యంగా నా అనుభవాన్ని బ్లాగులో పంచుకున్నందుకు నన్ను క్షమించండి. నాకున్న ఇంకొక సమస్యను త్వరగా పరిష్కరించండి బాబా".


8 comments:

  1. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha ❤😀🕉🙏

    ReplyDelete
  2. Om Sri Sai Ram ��������

    ReplyDelete
  3. Om sai ram please bless my family with health. Bless my mom with health she is bedridden. With your miracles only we trust you. This is true. Om sai ram❤❤❤

    ReplyDelete
  4. 🌺🌼🙏🙏🙏🙏🙏🌼🌺 OM Sri SaiRam

    ReplyDelete
  5. ఓం శ్రీ సాయినాథాయ నమః

    ReplyDelete
  6. Om sai ram baba amma arogyam bagundali thandri

    ReplyDelete
  7. Baba ee gadda ni karginchu thandri

    ReplyDelete
  8. Baba santosh life happy ga vundali thandri

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo