సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 838వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. కష్టకాలంలో బాబా సంరక్షణ
2. వ్యాక్సిన్ విషయంలో బాబా అనుగ్రహం
3. ఊదీ ప్రసాదంతో మొదలైన బాబా అనుగ్రహం

కష్టకాలంలో బాబా సంరక్షణ


అందరికీ నమస్తే. నా పేరు అంజలి. 2021, మే నెలలో నాకు కరోనా వచ్చింది. ఆ సమయంలో బాబా నాపై చూపిన ప్రేమను, అలాగే ఆయన నా కుటుంబానికి ఎలా రక్షణ ఇచ్చిందీ మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. కరోనా పాజిటివ్ వచ్చిన తరువాత మొదటి రెండు రోజులు జ్వరం, ఒళ్ళునొప్పులు, తలనొప్పి తీవ్రంగా ఉండటం వలన నేను అస్సలు లేవలేకపోయాను. మా బావగారు ఇచ్చిన మందుల కోర్సు వాడుతున్నప్పటికీ మూడవ రోజు కూడా జ్వరం తగ్గలేదు. దాంతో అందరూ "ఇలా జ్వరం తగ్గకుండా ఉంటే, హాస్పిటల్‌కి వెళ్ళాల్సిందే" అన్నారు. నేనింక బాబాను చూసి, "నాకు జ్వరం తగ్గిపోయేలా అనుగ్రహించండి బాబా" అంటూ బాగా ఏడ్చేశాను. తరువాత బాబా ఊదీ రాసుకోవడం మొదలుపెట్టాను. అలా చేస్తూ ఉండగా బాబా దయవలన మరుసటిరోజు తెల్లవారేసరికి జ్వరం తగ్గింది. కేవలం ఐదు రోజులకే జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు మొదలైన అన్ని లక్షణాలనూ తగ్గించారు బాబా. మనస్ఫూర్తిగా బాబాను ప్రార్థిస్తే దగ్గరుండి మనల్ని రక్షిస్తారు. ఆ సమయంలో నా ఫ్రెండ్స్ రోజూ నాకు ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్తుండేవారు. అవి విని నేను భయాందోళనలకు గురవుతుండేదాన్ని. దాంతో నేను బాబాను శరణువేడి, ఆయననే ధ్యానిస్తూ కూర్చునేదాన్ని. రోజుకు ఐదుసార్లు స్తవనమంజరి పఠిస్తుండేదాన్ని. నా దయగల తండ్రి దయవల్ల నేను మానసిక సమతుల్యతను కోల్పోలేదు. మావారు నాకు ధైర్యం చెబుతూ ఉండేవారు. మాది సింగిల్ బెడ్రూమ్ ఇల్లు అయినందువల్ల మా పిల్లల్ని మా ఫ్రెండ్స్ తీసుకెళ్లి వాళ్లతోపాటు ఉంచుకున్నారు. బాబానే ఆ విధంగా మా పిల్లల సంరక్షణ ఏర్పాటు చేశారు.


నాకు కరోనా వచ్చిన రెండురోజుల తర్వాత మా అమ్మకి దగ్గు మొదలైంది. మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నేను బాబాని ఒక్కటే అడిగాను: "అమ్మానాన్నల ఆరోగ్య విషయంలో కష్టాన్ని కలిగించకు" అని. బాబా దయ, వారి ప్రేరణ వలన మావారు ‘ఆ పరిస్థితుల్లో ఊళ్ళో అయితే అమ్మావాళ్ళకి కాస్త బాగుంటుంద’ని తలచి, అత్యవసర పాస్ తీసుకుని నా తల్లిదండ్రులని ఆదివారం ఊళ్ళో దింపి వచ్చారు. సోమవారం నుండి మావారిలో కరోనా లక్షణాలు కనబడ్డాయి. ఆయనకి వాసన తెలియకుండా పోయింది. మంగళవారంనాడు తనకు కరోనా పరీక్ష చేయిస్తే, పాజిటివ్ వచ్చింది. అదేరోజు నాకు టెస్టు చేస్తే బాబా కృపవలన నెగిటివ్ వచ్చింది. దాంతో నేను నేరుగా మా పిల్లలు ఉన్న ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. ఆ సమయంలో మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడి పెళ్లి ఉంది. వాళ్ళు ఆ పనుల్లో బిజీ అయ్యే సమయానికి బాబా నాకు నెగిటివ్ వచ్చేలా అనుగ్రహించి, మా పిల్లల వద్దకు చేరుకునేలా చేశారు. అటు మావారు ఒక్కరే ఇంట్లో ఉండి, మందులు సక్రమంగా వాడసాగారు. బాబా దయవలన ఆయనకి తొందరగానే తగ్గిపోయింది. 2021, జూన్ 6న ఆయన టెస్ట్ చేయించుకుంటే, నెగిటివ్ వచ్చింది. బాబా అలా ప్రతిదీ సమయానికి అనుకూలంగా మారుస్తూ వచ్చారు.


కరోనా తగ్గిన తర్వాత, ఆహారం తీసుకోవడం ఆలస్యమైతే నాకు గుండెల్లో ఆయాసంగా అనిపిస్తుండేది. మా స్నేహితులందరూ పోస్ట్ కోవిడ్ టెస్టు, అలాగే రక్తం యొక్క చిక్కదనాన్ని తెలియజేసే డి-డిమ్మర్ టెస్టు చేయించుకోమని సలహా ఇచ్చారు. సరేనని నేను టెస్టు చేయించుకుందామని అనుకున్నాను. కానీ మేము ఇటీవలే నల్గొండ వచ్చినందువల్ల అక్కడ హాస్పిటల్స్ గురించి, డాక్టర్స్ గురించి అంతగా తెలియదు. అటువంటి స్థితిలో, తెలిసినవాళ్ళ ద్వారా బాబా మాకొక డాక్టరుని చూపించారు. దాంతో గురువారం హాస్పిటల్‌కి వెళ్లి బ్లడ్ టెస్టుకి ఇచ్చాము. శుక్రవారం రిపోర్ట్స్ వస్తాయి అన్నారు. ‘డి-డిమ్మర్ టెస్టులో 3000 కంటే ఎక్కువ వస్తే సీటీ స్కాన్ చేయించాలని, లేకపోతే అవసరం లేద’ని డాక్టరు చెప్పారు. దాంతో నాకు చాలా ఆందోళనగా అనిపించి, "బాబా! నాకు ఏ స్కానింగూ వద్దు. దయచేసి టెస్టు రిపోర్ట్స్ ఎలాగైనా నార్మల్ వచ్చేలా చూడు. నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు" అని కన్నీళ్లు పెట్టుకుని బాబాను ప్రార్థించాను. తర్వాత కూడా చాలాసేపటి వరకు బాబా నామస్మరణ చేస్తూ, శిరిడీ ప్రత్యక్ష ప్రసారం చూస్తూ ఉండిపోయాను. నా సాయితండ్రి నిజంగా ఎంత దయామయుడంటే, తన బిడ్డల్ని కాపాడటంలో ఆయన తర్వాతే ఎవరైనా. డి-డిమ్మర్ టెస్టు రిపోర్టులో 750 అని వచ్చింది. నిజానికి 500 కంటే తక్కువ ఉండాలట. కానీ డాక్టరు, "అంత పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. 15 రోజులు టాబ్లెట్స్ వాడితే సరిపోతుంది" అని చెప్పారు. అంతా బాబా దయ. కానీ నేను ఆ సమయంలో పడిన మానసిక సంఘర్షణ అంతా ఇంతా కాదు. అందువలన నాకోసం, నా కుటుంబం కోసం ‘సంకల్ప పారాయణ’ గ్రూపులో 8, 9సార్లు పారాయణ చేయించాను.


కొన్ని రోజులకి మా పాప ఒళ్ళు వేడిగా అనిపించింది. అసలే నాకు, మావారికి కరోనా ఇటీవలే వచ్చిపోయినందువల్ల నాకు భయం వేసింది. అప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, "బాబా! పాప విషయంలో నేను భయపడుతున్నట్లు ఏమీ కాకూడదు. అలాగే మా బాబుకు ఏ సమస్యా రాకుండా చూడండి" అని చెప్పుకున్నాను. తెల్లవారేసరికి బాబా దయవలన పాప యాక్టివ్ అయిపోయింది. అదే సమయంలో నా ఛాతీ ఎడమ భాగంలో బాగా నొప్పిగా అనిపించింది. కరోనా వల్ల ఉన్న కాస్త నీరసం తగ్గడానికి డ్రైఫ్రూట్స్ తీసుకుంటున్నందువల్ల గ్యాస్ ఏర్పడి అలా వస్తుందేమో అనుకున్నాను. బాబా ఊదీని గుండెలకు రాసుకుని, "ఎలాగైనా ఈ నొప్పిని నువ్వే తగ్గించు బాబా" అని బాబాను వేడుకుని, ‘ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన’ని అనుకున్నాను. బాబా అనుగ్రహంతో రెండురోజులకు నొప్పి చాలావరకు తగ్గింది. అయితే నొప్పి పూర్తిగా తగ్గిపోలేదు. నిజానికి కరోనా తగ్గినప్పటినుండి నాకు జీర్ణ సమస్య ఉంది. బహుశా దానివల్లనేమో ఛాతీ ఎడమభాగంలో నొప్పి, ఇంకా ఎడమచేయి ఒకటే లాగుతుండేది. కొన్నిరోజులు అలాగే భరించాను. తరువాత ఒకరోజు బాబాకు చెప్పుకొని, "మీరే ఈ బాధను తగ్గించాలి" అని ఏడ్చాను. తరువాత బాబా ఊదీ పెట్టుకొని పడుకున్నాను. బాబా దయవల్ల తెల్లవారేసరికి నొప్పిలేదు, చాలా ఉపశమనంగా అనిపించింది. నేను ఏ బాధైనా, సంతోషమైనా బాబాతోనే చెప్పుకుంటాను. నా తండ్రి పిలిస్తే పలికే దైవం.


ఇకపోతే, నేను కరోనాతో బాధపడుతున్న సమయంలో దగ్గు సమస్యతో ఇబ్బందిపడుతున్న అమ్మని, తనతోపాటు నాన్నని ఊరికి పంపించామని చెప్పాను కదా! బాబా దయవలన వాళ్ళకి కరోనా సోకలేదుగానీ, దగ్గు ఎక్కువై అమ్మ బాగా నీరసపడిపోయింది. దానితో ఆమెను హాస్పిటల్లో చేర్చాల్సి వచ్చింది. అమ్మ పరిస్థితి చాలా విషమంగా ఉండేది. అప్పుడు నేను తన పేరు మీద కూడా ‘సంకల్ప పారాయణ’ 3సార్లు చేయించాను. బాబా దయవలన అమ్మ చాలావరకు కోలుకుని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయింది. ఇంకా 40% కోలుకోవాల్సి ఉంది. బాబా దయవల్ల ఇంకో పది రోజుల్లో అమ్మ పూర్తిగా కోలుకుంటుందని ఆశించాను. అనుకున్నట్లే బాబా దయవల్ల అమ్మ ఆరోగ్యం కుదుటపడి తన పనులు తాను చేసుకుంటోంది. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఎలాంటి సమస్యలు లేకుండా నన్ను, నా భర్తను, పిల్లలను, నా తల్లిందండ్రులను, ఇంకా అందరినీ చల్లగా కాపాడండి. బ్లాగులో పంచుకుంటానని పని బిజీలో పడి మర్చిపోయి కొంచెం ఆలస్యం చేసినందుకు నన్ను క్షమించండి బాబా. మేము నీ పిల్లలం బాబా. నువ్వు కాకపోతే ఎవరు క్షమిస్తారు? ఈ కరోనా బారినుండి అందరినీ కాపాడండి బాబా".


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


వ్యాక్సిన్ విషయంలో బాబా అనుగ్రహం


శ్రీ శిరిడీ సాయినాథా! అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


నా పేరు తిలోత్తమ. మేము ఒరిస్సాలో నివాసముంటున్నాము. ముందుగా, సాయిభక్తులకు మరియు ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఈ బ్లాగులో ప్రచురితమయ్యే సాయిభక్తుల అనుభవాలు ప్రతిరోజూ చదువుతూ ఎంతో ఆనందం పొందుతున్నాను. వాటిని చదివాక నా అనుభవాన్ని కూడా ఈ బ్లాగ్ ద్వారా తోటి భక్తులతో పంచుకోవాలనిపించి ఇదివరకు ఒక అనుభవాన్ని పంచుకున్నాను. ఇప్పుడు మరో రెండు అనుభవాలను పంచుకుంటున్నాను.


రెండు, మూడు నెలల క్రిందట నా భర్త కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఆన్లైన్లో స్లాట్ బుక్ చేశారు. తరువాత ఒకరోజు 'రేపు వ్యాక్సిన్ వేస్తార'ని మాకు మెసేజ్ వచ్చింది. అయితే అప్పటికి రెండు రోజుల ముందు నుంచి నా భర్తకి జలుబు, దగ్గు సమస్యలు ఉన్నాయి. ఆయనకి ఆ సమస్యలు మొదలైన మరుసటిరోజు నుంచి నాకు కూడా జలుబు ఉంది. ఆ లక్షణాలు ఉన్నప్పుడు వ్యాక్సిన్ వేయించుకోవచ్చో, లేదోనని మేము చాలా భయపడ్డాము. పోనీ వ్యాక్సిన్ వేసుకోవడం వాయిదా వేద్దామంటే ఆలస్యమైపోతుంది. అందువలన నేను, నా భర్త బాబా ఊదీని నుదుటన పెట్టుకుని, మరికొంత ఊదీని నీళ్లలో కలుపుకుని త్రాగాము. తరువాత నేను బాబాను ప్రార్థించి, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే మంత్రాన్ని జపించాను. బాబా దయవల్ల మరుసటిరోజు ఉదయానికల్లా మా ఇద్దరికీ పూర్తిగా నయమయింది. దాంతో ఏ ఆటంకం లేకుండా వ్యాక్సిన్ వేయించుకున్నాము. బాబా కృపవలన ఆ తరువాత కూడా మా ఇద్దరికీ ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాలేదు.


2021, జూన్ 13న మా అమ్మగారు వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఆరోజు రాత్రి నుంచి అమ్మకి తలభారం, ఒళ్ళునొప్పులు, జ్వరం మొదలయ్యాయి. టాబ్లెట్స్ వేసుకుంటే కొంచెం ఉపశమనం కలిగి మళ్ళీ సాయంత్రానికి మొదలయ్యాయి. మళ్ళీ మందులు వేసుకున్నా తగ్గలేదు సరికదా తలభారం ఇంకా ఎక్కువైంది. అప్పుడు అమ్మ బాబా ఊదీని నుదుటన పెట్టుకుని, మరికొంత ఊదీని నీళ్లలో కలుపుకుని త్రాగి, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' మంత్రాన్ని జపించింది. రెండు గంటల తర్వాత అమ్మ తలనుంచి ఒక్కసారిగా విపరీతంగా చెమటలు కారాయి. అమ్మకి తన తలనుంచి ఏదో భారం కిందకు దిగినట్లు అనుభూతి కలిగింది. అంతటితో అమ్మకి తలభారం పూర్తిగా తగ్గిపోయింది. మరుసటిరోజు ఉదయానికి జ్వరం, ఒళ్లునొప్పులు కూడా తగ్గిపోయాయి. "ధన్యవాదాలు బాబా. మీకు మాట ఇచ్చినట్లుగా ఈ రెండు అనుభవాలను బ్లాగులో పంచుకున్నాను. మా తమ్ముడి కోసం ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాము బాబా. మీ దయతో తనకు త్వరగా ఉద్యోగం రావాలని వేడుకుంటున్నాను. ఆ కోరిక నెరవేరితే ఆ అనుభవాన్ని కూడా బ్లాగులో పంచుకుంటాను బాబా".


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!


ఊదీ ప్రసాదంతో మొదలైన బాబా అనుగ్రహం


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.


శ్రీ సాయినాథుని పాదాలకు శతకోటి నమస్కారాలు. నేను 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో సాయి మహిమలను చదువుతూ ఎంతో సంతోషాన్ని పొందుతున్నాను. నా పేరు రేవతి. మాది విజయవాడ. మీతో పంచుకోవడానికి సాయినాథుడు నాకు చాలా మహిమలు చూపించారు. నేను మొదటిసారి శ్రీసాయిసచ్చరిత్ర పారాయణ చేస్తున్న సమయంలో, అందులోని ఊదీ లీలలు చదువుతున్నప్పుడు ఊదీ యొక్క సువాసనను నేను చాలా అనుభూతి చెందాను. ఆ సచ్చరిత్ర గ్రంథంలోనే బాబా నాకు ఊదీ ప్రసాదించారు. అది చూసిన నా సంతోషం అంతా ఇంతా కాదు. అదే నేను మొదట చవిచూసిన సాయి మహిమ. ఆ ఊదీని మా ఇంట్లో అందరికీ చూపించి, పెట్టుకోమని ఇచ్చాను. బాబా అనుగ్రహానికి వాళ్ళు చాలా సంతోషపడ్డారు.


ఇక బాబా నాకు ప్రసాదించిన రెండవ మహిమ ఏమిటంటే, సచ్చరిత్ర పారాయణ పూర్తిచేసిన నెలరోజులకే నేను గర్భం దాల్చాను. బాబా అనుగ్రహంతో నాకు చక్కటి అందమైన పాప పుట్టింది. అది కూడా బాబాకు ప్రీతికరమైన గురువారంనాడు. 


బాబా ప్రసాదించిన ఇల్లు:


ఒకసారి నేను బాబాను, 'మాకు ఒక ఇల్లు ఇవ్వమని, వారి దర్శనాన్ని ప్రసాదించమ'ని రెండు కోరికలు కోరుకుని, అవి నెరవేరేవరకు రోజూ ఆయనకు దక్షిణ సమర్పిస్తూ ఉంటానని అనుకున్నాను. తరువాత ఒకరోజు హఠాత్తుగా మేముండే ఇంటి యజమాని ఒకేసారి 3000 రూపాయలు అద్దె పెంచారు. దాంతో మా మామయ్యగారు 'లోన్ తీసుకుని ఇల్లు కట్టుకుందామ'ని ఉన్నపళంగా నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆ పని మొదలుపెట్టారు. బాబా దయవల్ల ఏ ఇబ్బందులూ లేకుండా లోన్ రావడం, ఇల్లు కట్టుకోవడం చకచకా జరిగిపోయాయి. గృహప్రవేశం రోజున మావాళ్ళందరూ దేవుడి ఫొటోలు పట్టుకుని లోపలికి వెళ్తున్నారు. నేను మా బాబుని ఎత్తుకుని ఉండటం వల్ల దేవుడి ఫోటో పట్టుకోవడం నాకు కుదరలేదు. కానీ మా బంధువుల్లో ఒక పెద్దాయన నన్ను పిలిచి, ఎవరో పట్టుకునివున్న బాబా ఫోటోని తీసుకొని నాకిచ్చి పట్టుకోమన్నారు. అప్పుడు నా మనసుకి, "ఇదిగో, నువ్వు అడిగావుగా 'మాకు ఇల్లు కావాలి' అని, ఇచ్చాను. ఇక పద, గృహప్రవేశం చేద్దామ"ని బాబా చెప్తున్నట్లు అనిపించి చాలా చాలా సంతోషపడ్డాను.


మా ఇల్లు కరకట్ట ప్రక్కన ఉన్న నదీ పరీవాహక ప్రాంతం అవడం వల్ల ప్రభుత్వంవారు చాలాకాలం 'మీటర్లు ఇవ్వము' అని ఇబ్బందిపెట్టారు. మాకున్న నాలుగు పోర్షన్లకి నాలుగు కరెంట్ మీటర్లు కావాల్సి ఉండగా ప్రభుత్వం ఒక్కటే ఇచ్చింది. ఎప్పుడూ ఏదో ఒక రిపేర్, అద్దెకి ఉన్నవాళ్ళు మీటర్లు ఎప్పుడు వస్తాయని అడుగుతుంటే సమాధానం చెప్పలేక చాలా బాధపడటం, అలా ఎన్నో ఇబ్బందుల మధ్య ఒక్క మీటరుతోనే 9 నెలలు గడిపేశాము. ఎప్పుడు మీటర్ల విషయం మా ఊరి ప్రెసిడెంటుని అడిగినా ఏదో ఒకటి చెప్పి పంపించేస్తుండేవాడు. చివరికి ఒకరోజు ఎమ్మెల్యేని కలిస్తే, బాబా దయవలన ఆ ఎమ్మెల్యే మా ఊరి ప్రెసిడెంటుకి ఫోన్ చేసి చెప్పారు. దాంతో ప్రెసిడెంట్ మరియు ఏ.ఈ. మా దగ్గర కాస్త తక్కువ కమీషన్ తీసుకుని మీటర్లు ఇచ్చారు. అంతా సాయినాథుని దయ. బాబా ఎప్పుడూ మన వెంటే ఉంటూ మనల్ని కాపాడుతూ ఉంటారు. "ధన్యవాదాలు బాబా".


శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


9 comments:

  1. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😀😊❤

    ReplyDelete
  2. Jaisairam

    Today is my birthday day. Bless me saibaba. I put my family life in ur hands. Save us guide us.

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. Om Sri Sai Ram ��������

    ReplyDelete
  5. ఓం సా౦ుు బాబా నమస్కారము చేసి రాచినదియు ఏమనగా మేము నీ బిడ్డ లము మమ్ము కాపాడు తండ్రి. నీ కు నమస్కారము చేసి ఈ కరోనా బారి నుండి కాపాడు తండ్రి.మా సమస్తమును నీ వేల తండ్రి. ❤❤❤

    ReplyDelete
  6. Om sainatha i love your leela. You light diyas with water I liked your leela.i became your devotee.when I read that leela in satcharita I feel very happy.you are powerful God. Om sai ram ❤��������

    ReplyDelete
  7. Om sai ram baba amma arogyam bagundali thandri pleaseeee

    ReplyDelete
  8. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo