సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 823వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా మనకు చెప్తారు, మనం అర్థం చేసుకోవాలి!
2. ప్రేమతో అడగాలేగానీ బాబా తప్పక కరుణిస్తారు
3. బాబా అనుగ్రహం

బాబా మనకు చెప్తారు, మనం అర్థం చేసుకోవాలి!


నా పేరు నవ్య. సాయిభక్తులకు, ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా వందనాలు. ఇది ఈ బ్లాగులో నేను పంచుకుంటున్న మూడవ అనుభవం. నా గత అనుభవంలో బాబా దయవల్ల నేను కోవిడ్ నుండి బయటపడ్డానని పంచుకున్నాను. అయితే కోవిడ్ నుండి కోలుకున్నాక నా పరిస్థితి ఏమవుతోందో నాకు తెలియలేదు. ఎందుకంటే, రోజుకొక నొప్పి ఉంటుండేది. నీరసం వల్ల వస్తుందిలే అనుకున్నాను. కానీ ఏదో మాయ కమ్మినట్టు మత్తుగా, నిద్రవస్తున్నట్లుగా ఉండేది. రోజూ సాయి ఆరతులు పాడుకునేదాన్ని. కానీ ఏదో భయం, గుండెల్లో మంట, భరించలేని నొప్పి. టాబ్లెట్ వేసుకున్నా తగ్గేది కాదు. అయితే బాబా ఎలా అనుగ్రహించారో చూడండి! నేను టాబ్లెట్ వేసుకునేటప్పుడు బాబాను తలచుకునే వేసుకుంటాను. అలా ఒకరోజు టాబ్లెట్ వేసుకునేటప్పుడు టాబ్లెట్ క్రింద పడింది. దాన్ని తీసుకుని వేసుకున్నాను. చిత్రంగా, మరుసటిరోజు కూడా టాబ్లెట్ క్రింద పడింది. దాంతో, "ఏంటి, రోజూ టాబ్లెట్ క్రిందపడిపోతోంది?" అనుకుని మూడవరోజు టాబ్లెట్ వేసుకోవడం మానేశాను. ఆ రోజు నాకు చాలా తేలిగ్గా అనిపించింది. అప్పుడు, 'బాబా మనకు ముందే చెప్తారు, మనం అర్థం చేసుకోవాలి, లేకపోతే చాలా బాధపడాల్సి వస్తుంది' అని తెలుసుకున్నాను.


అయితే, మరుసటిరోజు నుండి పీడకలలు రావడం మొదలైంది. వాటివల్ల అప్పటివరకు నాలో ఉన్న భయం మరింత ఎక్కువైంది. సరే, సచ్చరిత్ర చదువుకుందామని సచ్చరిత్ర తెరిచాను. 13వ అధ్యాయం తెరుచుకుంది. సరేనని ఆ అధ్యాయాన్ని చదువుతున్నాను. ఏదో తెలియని బాధతో ఏడుపు వచ్చేసింది. అలానే అధ్యాయం పూర్తిచేశాను. తరువాతిరోజు సచ్చరిత్ర తీస్తే, మళ్ళీ అదే అధ్యాయం వచ్చింది. సరేనని మళ్ళీ అదే అధ్యాయం చదివాను. చదవడం పూర్తయ్యేసరికి నా తలంతా ఏదో నొప్పిగా, బరువుగా అనిపించింది. ఆరోజు మధ్యాహ్నం ఆరతి పాడుకుంటున్నప్పుడు నా స్నేహితురాలి భర్త, "నవ్యా! నీకు ఎలా ఉంది? ఇప్పుడు నీరసం తగ్గిందా?" అని అడిగారు. నేను అతనితో, "నాకు పీడకలలు వస్తున్నాయి" అని చెప్పాను. అతను "హనుమంతుడిని తలచుకో!" అని అన్నారు. సరేనని ఆ సాయంత్రం హనుమాన్ చాలీసా చదివాను. నా తల భారం ఇంకా ఎక్కువై, ఒకపక్క భయమేస్తోంది, మరోపక్క నిద్ర వచ్చేస్తోంది. అసలు నాకు ఏమవుతోందో తెలియడం లేదు. వెంటనే లేచి ఫోనులో ఆంజనేయస్వామి దండకం పెట్టాను. నొప్పి ఇంకా ఎక్కువవుతోంది. అయినా తొమ్మిదిసార్లు ఆ దండకం ప్లే చేశాను. దాంతోపాటు నేను 'ఓం శ్రీసాయి ఆపద్బాంధవాయ నమః' అని స్మరించుకుంటున్నాను. నెమ్మదిగా నా శరీరంలోని ఒక్కో నొప్పి పోతున్నట్టు అనిపించింది. ఎప్పుడు నిద్రపట్టిందో తెలియలేదు. కలలో బాబా దర్శనం జరిగింది. ఉదయం లేచేసరికి నాకు చాలా సంతోషంగా అనిపించింది. "బాబా! మీరు ఎప్పుడూ ఇలాగే మాతో ఉండాలి" అని అనుకున్నాను. అలా నాకు వరుసగా నాలుగురోజులు కలలో బాబా దర్శనమిచ్చి నాకు రాబోయే ప్రమాదాల గురించి ముందే చెప్పారు. ఇంకా ఆ కలలో దయ్యాలు కనిపించేవి. వాటి మధ్యలో నేను బాబాకు అభిషేకం చేస్తుండగా, బాబానే నా వెనుక ఉండి నాతో అభిషేకం చేయిస్తుండేవారు. అభిషేకించిన ఆ పాలను త్రాగమని బాబా నాతో చెప్పారు. నా జీవితంలో ఎప్పుడూ అలాంటి కలలు నాకు రాలేదు. నాకు చాలా భయం వేసింది. అయినప్పటికీ బాబా నాతో ఉన్నారనే సంతోషం, ధైర్యం! బాబా చెప్పినట్లు ఒకరోజు బాబాకు పాలాభిషేకం చేసి, ఆ పాలు త్రాగాను. దాంతో ఆరోజు, తరువాతిరోజు నాకు బాగానే అనిపించింది. అయితే ఆ తరువాత బాబా చెప్పినట్లు చేయలేదు, మర్చిపోయాను. సచ్చరిత్ర చదువుతుంటే, అకస్మాత్తుగా ఆ విషయం గుర్తుకు వచ్చింది. దాంతో మళ్ళీ మొదలుపెట్టాను. రోజూ బాబాకు పాలతో అభిషేకం చేసి, ఆ పాలను త్రాగుతుంటే ఫలితం కనిపిస్తుండేది. అందువలన మానకుండా చేస్తుండేదాన్ని. అప్పుడు కొంచెం బాగానే ఉంటుండేది. కానీ నాకు రోజూ ఒంటినొప్పులు ఉండేవి. ‘ఇవాళ నొప్పిలేదు’ అనుకోడానికి లేదు. హాస్పిటల్‌కి వెళ్తే ‘సమస్యేమీ లేదు’ అని చెప్పేవారు. నేను రోజూ నా బాధను బాబాకు చెప్పుకుంటూ బాబా ఊదీ కలిపిన నీళ్లను ఔషధంగా తీసుకుంటుండేదాన్ని. బాబా నాకు రోజూ ఏదో ఒక అనుభవాన్నిస్తూ, 'సాయి వచనం' రూపంలో నన్ను చాలా సంతోషపెడుతుండేవారు.ఏది ఏమైనా నా బాధను బాబానే తీర్చాలి’ అని ఆయననే ఆశ్రయించుకొని ఉంటుండగా అమావాస్య ముందురోజున నాకు మళ్ళీ ఒక కల వచ్చింది. ఆ కలలో నేను పిల్లల్ని బాగా కొడుతూ వాళ్ళని, నా భర్తని నిద్రలేపుతున్నాను. వాళ్ళు లేవడం లేదు. ముఖ్యమైన విషయమేమిటంటే, కలలో కూడా నేను బాబా నామస్మరణ ఆపకుండా చేస్తున్నాను. హఠాత్తుగా, మా ఊరికి దగ్గరగా ఉన్న బాబా గుడిలో ఉండే ఒక స్వామీజీ హోమం చేస్తూ కనిపించారు. ఆయన నన్ను ఆ హోమం దగ్గర కూర్చోమన్నారు. నా ఎదురుగా ఒక కర్రపై ఒక పసుపురంగు వస్త్రము, దానిపై కుంకుమతో ఒక నామం పలుమార్లు వ్రాసి ఉంది. ఆ నామమేమిటో నాకు సరిగా గుర్తులేదు. బహుశా 'ఓం వామనాయ నమః' అనో లేదా 'ఓం వాసుదేవయ నమః' అనో అయుండొచ్చు. ఇంతలో నా వెనుకనుండి ఎవరో ఒకాయన, "నువ్వు కూడా నామం చెప్పి, అక్షింతలు ఆ నామంపై వేయి" అని చెప్పారు. నేను అలానే చేశాను. నేను అక్షింతలు వేసినప్పుడల్లా ఒక్కో నామం కాలిపోసాగింది. అలా కాసేపట్లో ఆ వస్త్రం మొత్తం కాలిపోయింది. అప్పుడు ఏమైందో ఏమో తెలియదుగానీ ఎవరో నాలో నుండి ఏడ్చుకుంటూ బయటకు వెళ్తున్నట్లు నాకు అనిపించింది. అంతటితో నా కల ముగిసింది. మెలకువ వచ్చాక ఆ కల గురించి ఆలోచించాను. కానీ అలా ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. మరుసటిరోజు మన బ్లాగులో ప్రచురించిన సాయిబంధువు అనుభవం చదువుతుంటే అందులో ఈ క్రింది బాబా సందేశం కనిపించింది:


మీరు చేతబడికి భయపడుతున్నారా? అఘోరీలకు, తాంత్రికులకు భయపడుతున్నారా? నాకన్నా పెద్ద అఘోరీ ఉందా? నన్ను నమ్ముకున్నవారిని తాకే ధైర్యం ఎవరు చేయగలరు? నేను అగ్నిస్వరూపుడను, నా బిడ్డలకు హాని కలిగించే ప్రయత్నం చేసే ఎవరినైనా దహించివేస్తాను. అన్ని భయాలను విడిచిపెట్టి ప్రశాంతంగా జీవించండి! నేను మీ రక్షకుడను!


నాకు అప్పుడు అర్థమైంది, ‘నాలో ఉన్న నెగెటివ్‌ని కలలో బాబా అగ్ని రూపంలో దహించివేశారు’ అని. అప్పటినుండి నాకు నిద్ర బాగానే పడుతోంది. కొంచెం నీరసంగా మాత్రం ఉంటోంది. బాబా చెప్పినట్లు ఆయనను అభిషేకించిన పాలు త్రాగుతున్నాను. బాబా దయవల్ల త్వరలోనే పూర్తిగా కోలుకుంటానని విశ్వసిస్తున్నాను. ఈ బాబా బ్లాగును వీక్షిస్తున్న సాయిభక్తులందరూ సంతోషంగా ఉండాలి. మనమందరం సాయి నీడలో ఉన్నాము. ఆయనే తన బిడ్డలను కాపాడుతారు.


సర్వేజనాః సుఖినోభవంతు.

సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!


ప్రేమతో అడగాలేగానీ బాబా తప్పక కరుణిస్తారు


సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు సౌజన్య. మేము యు.ఎస్.ఏ.లో నివాసం ఉంటున్నాము. నేను నా చిన్నతనంనుండి బాబాను పూజిస్తున్నాను. నేను అడిగినప్పుడు మాత్రమే కాకుండా, అడగనప్పుడు కూడా బాబా నా బాధలు తీర్చారు. అలా ఎన్నోసార్లు ఆయన నాపై తమకున్న ప్రేమను చూపారు. ఇకపోతే, ఈమధ్య జరిగిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈమధ్య నేను విపరీతమైన కడుపునొప్పితోనూ మరియు వీపునొప్పితోనూ చాలా బాధపడ్డాను. డాక్టర్ దగ్గరకు వెళితే, కొన్ని పరీక్షలతోపాటు సీటీ స్కాన్ కూడా చేయించుకోమని సూచించారు. అమెరికాలో టెస్టులు చేయించుకోవడానికి, వాటి రిపోర్టులు రావడానికి చాలా సమయం పడుతుంది. ఆ రిపోర్టులు రాకుండా మందులు ఇవ్వనని డాక్టర్ అన్నారు. కనీసం నొప్పి తగ్గడానికి ఒక్క మందు కూడా ఇవ్వలేదు. పైగా టెస్టులు చేయించుకున్నాక నా బాధ ఇంకా ఎక్కువైంది. ఆ నొప్పిని భరిస్తూ, ఇద్దరు పిల్లలను చూసుకుంటూ, ఇంట్లో పనులు చేసుకుంటూ ఎంత బాధపడ్డానో నాకే తెలుసు. అంతలో మా బాబు పుట్టినరోజు వచ్చింది. తన స్నేహితులందరినీ ఇంటికి ఆహ్వానించి పుట్టినరోజు వేడుక జరుపుకోవాలని మా బాబు ఎంతో సరదాపడ్డాడు. మాకూ చేయాలనే ఉంది. కానీ నొప్పి వలన చేయగలనో, లేదో అని అనుకున్నాను. నేను పడుతున్న బాధ గురించి మావారితో చెప్పకుండా ముందురోజు వరకు ఏదో ఒకలా చేయాల్సిన పనులు చేసుకున్నాను. కానీ, పుట్టినరోజునాడు నాకు నొప్పి భరించరానంతగా అయ్యేసరికి వంట, క్లీనింగ్, పిల్లల్ని చూసుకోవడం, ఇంకా ఇతర పనులన్నీ ఎలా చేసుకోవాలో అర్థం కాలేదు. పైగా మావారికి ఆరోజు సెలవు కూడా దొరకలేదు. ఇక బాబా మీద భారం వేసి, ఆయన నామస్మరణ చేస్తూ నొప్పిని భరిస్తూ పదేపదే మంచినీళ్లు మాత్రమే త్రాగుతూ సాయంత్రం వరకు గడిపాను. అప్పుడు బాబా దగ్గరికి వెళ్లి, ఆయనని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుని, "బాబా! దయచేసి నా బాధను తగ్గించు. అతిథులకోసం చక్కగా వంట చేయాలి. ఎవరికీ ఎలాంటి లోటూ ఉండకూడదు. నాకు శక్తిని ఇవ్వు బాబా" అని వేడుకున్నాను. కొన్ని నిమిషాల్లోనే నా బాబా, నా తండ్రి, నా దైవం, నా గురువు నన్ను కరుణించారు. ఉన్నట్టుండి నిమిషాల్లో నొప్పి మాయం అయింది. అతిథులకోసం చకచకా వంట చేశాను. అవి తిని ‘వంటలు చాలా బాగా కుదిరాయి’ అని అందరూ చెప్తుంటే ఎన్నిసార్లు బాబాని తలచుకున్నానో చెప్పలేను. బాబా దయవల్ల కార్యక్రమం అంతా బాగా జరిగింది. ఎవరికీ చెప్పుకోలేని బాధను నేను బాబాతో పంచుకున్నాను. బాబా నా బాధను అర్థం చేసుకుని నాపై కరుణ చూపారు. ఇంకో విషయం, నేను చేయించుకున్న టెస్టుల రిపోర్టులన్నీ నార్మల్ అని వచ్చాయి. అంతా నా సాయితండ్రి దయ. మనం ప్రేమతో అడగాలేగానీ బాబా తప్పక కరుణిస్తారు. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీకు మాట ఇచ్చిన ప్రకారం బ్లాగులో నా సంతోషాన్ని పంచుకున్నాను తండ్రీ". చివరిగా, ఓర్పుతో నా అనుభవాన్ని చదివిన అందరికీ కృతజ్ఞతలు.


జై సాయినాథ్. జై జై సాయినాథ్.

సర్వేజనాః సుఖినోభవంతు.


బాబా అనుగ్రహం


సాయిభక్తులకు నా నమస్కారాలు. నేనొక సాయి భక్తురాలిని. నేను నా జీవితంలో తొలిసారి బాబా చేసిన అద్భుతానికి సంబంధించిన నా అనుభవాన్ని పంచుకుంటున్నాను. నేను బాబాను ఎంతగానో విశ్వసించి, వారిని పూజిస్తాను. ప్రతి గురువారం సాయి సచ్చరిత్ర చదువుతాను. బాబా నాకు చాలా అనుభవాలు ప్రసాదించారు. 2021, ఏప్రిల్ నెలలో నేను వెన్నుకు ఒకవైపు నొప్పితోను మరియు కడుపునొప్పితోను బాధపడ్డాను. ఆ సమయంలో నాకు చాలా భయమేసింది. అప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, "బాబా! పదిరోజుల్లో నొప్పి తగ్గిపోతే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని ప్రార్థించి, ప్రతిరోజూ బాబా ఊదీని నీళ్లలో కలుపుకుని త్రాగుతూ 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే మంత్రాన్ని జపించేదాన్ని. ఇంకా, మనసులో 'ఓం సాయిరాం, ఓం సాయిరాం' అని అనుకుంటూ ఉండేదాన్ని. బాబా దయవలన 10 రోజులకి నా నొప్పి తగ్గిపోయింది. నా ఎక్స్-రే రిపోర్టు కూడా నార్మల్ అని వచ్చింది. బాబా ఆశీస్సులతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. "థాంక్యూ బాబా".


10 comments:

  1. Om Samardha Sadguru Sree sai Nadhaya Namaha 🕉🙏😊❤

    ReplyDelete
  2. Om sai baba if your blessings are there no worry for anything. That is your power. If we trust you there is nothing to get worry. You are my lovely God. Om sai baba❤❤❤

    ReplyDelete
  3. ఈరోజు బ్లాగులో శ్రీ సాయిబాబా వారి దివ్య మంత్రములు.

    'ఓం శ్రీసాయి ఆపద్బాంధవాయ నమః'
    ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః'
    'ఓం సాయిరాం, ఓం సాయిరాం'
    🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  4. Om Sri Sai Ram ��������

    ReplyDelete
  5. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  6. Om sai ram baba amma arogyam bagundali thandri pleaseeee

    ReplyDelete
  7. Baba ee gadda ni karginchu thandri please

    ReplyDelete
  8. Baba santosh health bagundali thandri

    ReplyDelete
  9. Baba santosh Carrier bagundali thandri

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo