సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 839వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా అనుగ్రహంతో తీరిన ఆరోగ్య సమస్యలు
2. కరోనా నుండి నా కుటుంబాన్ని కాపాడిన బాబా
3. వచ్చింది ఉపద్రవమే అయినా, ఎంతో నేర్పిన బాబా

బాబా అనుగ్రహంతో తీరిన ఆరోగ్య సమస్యలు


ముందుగా నా తల్లి, తండ్రి, గురువు, దైవం, స్నేహితుడు, బంధువు, సర్వం అయిన శ్రీసాయినాథునికి శతకోటి ప్రణామాలు. నా పేరు గోష్టేశ్వరి. నా జీవితంలో బాబా ప్రసాదించిన ఎన్నో అనుభవాలున్నాయి. వాటిలోనుండి ఈమధ్య జరిగిన కొన్నింటిని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.


మొదటి అనుభవం :  


ఈమధ్య ఒకరోజు మా పాపకి పడుకునేముందు బాగా జలుబు చేసి ఊపిరి తీసుకోవడం కష్టమయ్యింది. అప్పుడు నేను, "ఇంతవరకు చక్కగా ఆడుకున్న పాపకి ఇలా అయిందేమిటి బాబా? తెల్లవారేసరికి పాపకి జలుబు తగ్గి, తను నార్మల్‌గా ఉంటే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాను ప్రార్థించి, బాబా ఊదీని పాపకి పెట్టాను. బాబా దయవలన తెల్లవారేసరికల్లా పాపకి జలుబు తగ్గిపోయింది. "థాంక్యూ బాబా, థాంక్యూ సో మచ్!"


రెండవ అనుభవం :


ఈమధ్య మా అమ్మగారికి గ్యాస్ట్రిక్ సమస్య ఎక్కువై వాంతులు, విరోచనాలు అయ్యాయి. ఆ తర్వాత టైఫాయిడ్ జ్వరం వచ్చింది. అప్పుడు నేను, "బాబా! మీ కృపతో అమ్మ ఆరోగ్యం కుదుటపడితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకు మ్రొక్కుకున్నాను. బాబా దయవలన రెండు రోజుల్లో మా అమ్మ ఆరోగ్యం కుదుటపడింది. "ధన్యవాదాలు బాబా".


మూడవ అనుభవం :


ఇటీవల మేము మా ఇంటికోసం ఆన్లైన్లో ఏసీ బుక్ చేశాము. కానీ ఈ కరోనా సమయంలో ఎక్కడివారో ఇంటికి వచ్చి ఏసీ ఫిట్ చేస్తే ఏమవుతుందోనని భయపడి, "ఏసీ ఫిట్ చేశాక ఎవరికీ కరోనా రాకుండా ఉంటే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాను ప్రార్థించాను. ఏసీ ఫిట్ చేసిన పదిరోజులకి నాకు జ్వరం వచ్చింది. తర్వాత మా పాపకి, మావారికి కూడా జ్వరం వచ్చింది. అప్పుడు నేను, "బాబా! బ్లడ్ టెస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా రెండురోజుల్లో జ్వరం తగ్గితే, నా అనుభవాలను బ్లాగులో పంచుకుంటాన"ని మ్రొక్కుకున్నాను. రోజూ అందరం బాబా ఊదీ పెట్టుకుంటూ, ఊదీ కలిపిన నీళ్లు త్రాగుతూ ఉండేవాళ్ళం. అలాగే నేను 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే మంత్రాన్ని జపించాను. బాబా దయవలన మా అందరికీ జ్వరం తగ్గింది. ఇంకా, మాకొచ్చింది వైరల్ ఫీవర్ అని తెలిసింది. "థాంక్యూ బాబా. మీ దయవల్ల మేమందరం క్షేమంగా ఉన్నాము. థాంక్యూ సో మచ్ బాబా".


"బాబా! గత ఆరేళ్లుగా నేను ఒక కుటుంబసమస్యతో బాధపడుతున్నాను. నా చెల్లి, నా భర్త మాట్లాడుకోరు. నేను ఎవర్ని సమర్థించాలో, ఎవరికి సర్దిచెప్పాలో తెలియక ఎంత బాధపడుతున్నానో మీకు తెలుసు. ఈ సమస్యను పరిష్కరించమని మీతో ఎన్నోసార్లు విన్నవించుకున్నాను. ఈ సమస్య పరిష్కారమై నా భర్త, చెల్లి మాట్లాడుకుంటే, ఎప్పటిలాగే మేమందరం కలిసిపోతే ఆ అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటాను. దయచేసి త్వరగా సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను. నాకు అన్నీ మీరే బాబా. మీ మీదే భారం వేసి సర్వస్య శరణాగతి చేస్తున్నాను".


ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


కరోనా నుండి నా కుటుంబాన్ని కాపాడిన బాబా


సాయి గురుదేవులకు నా నమస్కారం. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయిభక్తులకు నా కృతజ్ఞతలు. నా పేరు రాణి. ఈమధ్యకాలంలో నాకు జరిగిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుందామని అనుకుంటున్నాను. 


నేను ఒక ప్రైవేటు స్కూల్లో టీచరుగా పనిచేస్తున్నాను. 2021, మే 17వ తేదీన నాకు జ్వరం రావటంతో, గర్భవతినైన నాకు కరోనా సోకిందేమోనని భయం వేసింది. పైగా మా అమ్మకి షుగరు, బీపీ ఉన్నాయి. అందువలన భయంతో బాబాను ప్రార్థించాను. కానీ రెండు రోజుల తర్వాత నాకు విపరీతంగా దగ్గు రావడంతోపాటు వాసన కూడా తెలియకుండా పోయింది. టెస్టు చేయిస్తే కరోనా అని నిర్ధారణ అయింది. అయితే బాబా దయవలన తొందరగానే కోలుకున్నాను. కానీ అంతలోనే అమ్మ జ్వరం, విపరీతమైన ఒళ్లునొప్పులతో అనారోగ్యం పాలైంది. ఏది జరగకూడదనుకున్నానో అదే జరుగుతుండేసరికి నాకు చాలా భయం వేసింది. మందులు వాడుతున్నప్పటికీ పరిస్థితిలో ఏ మార్పూ లేదు. కరోనా పరీక్ష చేయించుకోమని అమ్మని ఎంతగానో బ్రతిమాలినప్పటికీ అందుకు ఆమె ఒప్పుకోక 'కరోనా అని తెలిస్తే, అందరూ మనల్ని వేరుగా చూస్తార'ని మూర్ఖంగా ప్రవర్తించేది. అలాంటి పరిస్థితుల్లో నాకు ఏం చేయాలో తెలియక, "బాబా! నేను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను, నాకు దారి చూపించు" అని బాబాను ప్రార్థిస్తూ రోజూ ఏడ్చేదాన్ని. అన్నీ చూసుకోవడానికి ఇంట్లో నేను ఒక్కదాన్నే అయిపోయాను. పైగా గర్భవతిగా ఉండటం వల్ల ఏం తోచని పరిస్థితిలో తమ్ముడికి ఫోన్ చేశాను.


మా తమ్ముడు వాళ్ళు కలకత్తాలో ఉంటారు. దూరాన ఉన్న వాళ్ళకి అమ్మ అనారోగ్యం గురించి చెప్పొద్దని మా ఇంట్లోవాళ్ళు అంటున్నందువల్ల నేను మొదట్లో తమ్ముడితో విషయం చెప్పలేదు. కానీ ఐదు రోజులైనా అమ్మకి జ్వరం తగ్గకపోయేసరికి భయం వేసి తమ్ముడికి ఫోన్ చేసి, ఇంట్లోవాళ్ళకి విషయం చెప్పకుండా రమ్మని చెప్పాను. వెంటనే తను బయలుదేరాడు. ఆ రాత్రి అమ్మకి ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోయాయి. అమ్మ పరిస్థితి చూసి భయం వేసింది. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని స్థితిలో నేను బాబాను స్మరించుకుంటూ రాత్రంతా మేల్కొని ఉన్నాను. మరుసటిరోజు తమ్ముడు వచ్చాడు. తను అమ్మని ఒప్పించి, హాస్పిటల్‌కి తీసుకువెళ్లి టెస్ట్ చేయిస్తే కరోనా పాజిటివ్ అని వచ్చింది. అది కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పారు. హాస్పిటల్లో తెలిసినవాళ్ళు ఉండటం వల్ల విషయం బయటికి రానివ్వకుండా గోప్యంగా ఉంచారు. అది బాబా దయే. మేము అమ్మతో కరోనా పాజిటివ్ అని చెప్పకుండా టైఫాయిడ్ అని చెప్పి ఇంట్లోనే ట్రీట్మెంట్ మొదలుపెట్టాము. అయితే రోజురోజుకీ ఆక్సిజన్ లెవల్స్ తగ్గుతూ అమ్మ పరిస్థితి దారుణంగా మారుతుండటంతో తనని హాస్పిటల్లో జాయిన్ చేద్దామని అనుకున్నాము. కానీ, ఇలాంటి పరిస్థితుల్లో హాస్పిటల్‌కి వెళ్లిన వాళ్ళు ప్రాణాలతో తిరిగి రావడం లేదు. అసలు అమ్మకి విషయం ఎలా చెప్పాలి? తనని ఎలా హాస్పిటల్లో జాయిన్ చేయాలి? వెళ్తే మళ్లీ అమ్మ ఇంటికి వస్తుందా? ఇలాంటి ప్రశ్నలతో మాలో మేము కుమిలిపోతూ ఏడ్చేవాళ్ళం. ఎంత భయపడ్డామో, ఏడ్చామో బాబాకే తెలుసు. చివరికి ఎలాగో ధైర్యం చేసి అమ్మని హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళాము. అక్కడ అమ్మకి ఏదో ఇంజక్షన్ చేశారు. దాంతో అమ్మ పరిస్థితి మెరుగైంది. తరువాత అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ చేయమని డాక్టర్ చెప్పారు. కానీ అమ్మ అక్కడ పరిస్థితి చూసి "చస్తే, ఇంట్లోనే చస్తానుగానీ హాస్పిటల్లో మాత్రం చేరను"అని చాలా గోల చేసింది. ఏం చేయాలో తెలియక బాబాపై భారం వేసి గృహనిర్బంధంలో ఉండటానికి కావలసిన కిట్, మందులు మొదలైనవన్నీ తీసుకుని ఇంటికి వచ్చేశాము. మా తమ్ముడు అమ్మను ఒక చిన్నపిల్లలా చూసుకుంటూ 15 రోజులపాటు ఒక దీక్షలా సపర్యలు చేస్తుండేవాడు. మేము రోజూ బాబాను ప్రార్థిస్తూ ఉండేవాళ్ళం. మా సిస్టర్ వాళ్ళు అమ్మకోసం సచ్చరిత్ర పారాయణ చేశారు. బాబా దయవలన స్టెరాయిడ్స్, ఇంజక్షన్లతో అమ్మ కొంచెం కొంచెంగా కోలుకోసాగింది. ఆక్సిజన్ లెవల్స్ కూడా పెరిగాయి. అంతలో నాన్నకి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే ఐదురోజులు మందులు వాడేసరికి ఆయనకి తగ్గిపోయింది. అమ్మకి సపర్యలు చేస్తున్న క్రమంలో తమ్ముడికి కూడా కరోనా వచ్చింది. అయితే టాబ్లెట్స్‌తో తొందరగానే తగ్గింది. ఇదంతా బాబా దయవలనే సాధ్యమైంది. అమ్మకి, నాన్నకి, నాకు, తమ్ముడికి కరోనా తగ్గిపోతే నా అనుభవాలను బ్లాగులో పంచుకుంటానని బాబాకు మ్రొక్కుకున్నట్లుగా ఇప్పుడు మీ అందరితో పంచుకున్నాను. "బాబా! చాలా చాలా ధన్యవాదాలు. మేము పడ్డ టెన్షన్ చాలామంది పడుతున్నారు. అందరికీ ధైర్యాన్ని, రక్షణను ఇవ్వండి బాబా".


వచ్చింది ఉపద్రవమే అయినా, ఎంతో నేర్పిన బాబా

 

నేను ఒక సాయిభక్తుడిని. నేను ఇటీవల జరిగిన నా అనుభవాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. ఇటీవల మా కుటుంబంలో ఉన్న నలుగురు వ్యక్తులమూ కరోనా బారినపడ్డాము. టెస్టు చేయించుకునేటప్పుడు రిజల్ట్ నెగిటివ్ రావాలని ఎంతగానో బాబాను ప్రార్థించాను. కానీ, పాజిటివ్ వచ్చింది. దాంతో నేను చాలా ఆందోళన చెందాను. ఎందుకంటే, మా నాన్నగారు షుగర్ పేషెంట్. దానికితోడు రోజూ భయపెట్టే ఎన్నో వార్తలు వినడం. కానీ బాబా దయవల్ల మా కుటుంబంలోని వ్యక్తులు చాలా మంచివాళ్ళు కావడం వలన మా ఊరిలోనే ఉన్న మా చుట్టాలు మాకు ఎంతగానో సహాయం చేశారు. ఇటువంటి కుటుంబసభ్యులుంటే చాలామంది కరోనాని జయిస్తారు. బాబా దయతో వాళ్లెప్పుడూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఆ కష్టసమయంలో ఎల్లప్పుడూ బాబా నామస్మరణ చేస్తూ, బాబా ఊదీని నీళ్లలో కలిపి నా కుటుంబసభ్యులందరి చేత త్రాగిస్తుండేవాడిని. భయం మాత్రం నన్ను ఒకప్రక్క వెంటాడుతూ ఉండేది. దినం ఒక యుగంలా గడిపాము. కానీ అపారమైన బాబా కరుణ నన్ను, నా కుటుంబసభ్యులను కరోనా నుండి క్షేమంగా బయటపడేలా చేసింది. 14 రోజులు పూర్తయ్యాక మా అందరికీ కరోనా నెగిటివ్ అని వచ్చింది. ఆ పద్నాలుగు రోజులలో నిజమైన ప్రేమ, స్నేహం, ఇంకా కుటుంబం యొక్క గొప్పతనం తెలిసేలా చేశారు బాబా. అయితే, కరోనా తగ్గిన తర్వాత కూడా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తుండేవి. అవి నా భయమో, భ్రమో తెలీదుకానీ, నలతగా ఉంటుండేది. ఒకరోజు కళ్ళు మంటలుగా ఉండి రెండు, మూడు రోజుల వరకు తగ్గలేదు. అప్పుడు నేను, "ఏమిటి నాకీ బాధలు సాయీ? నన్ను కాపాడండి. మీరు నాకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తే, నా అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని మ్రొక్కుకొని పడుకున్నాను. మరుసటిరోజుకి నాకు ఆరోగ్యం చేకూరింది. ఇదీ సాయి అనుగ్రహం, వారి దయ. "చాలా ధన్యవాదాలు బాబా. నాకు ఇంత మంచి కుటుంబాన్ని ఇచ్చావు. ఈ ఉపద్రవం వచ్చాక ఐహిక సుఖాలు ఎంత నిస్సారమైనవో తెలిసి వచ్చింది. బ్రహ్మజ్ఞానం యొక్క గొప్పదనం తెలిసింది. ఇంతకుముందు బ్రహ్మజ్ఞానం యొక్క ఆవశ్యకత నాకు తెలియలేదు. ఇప్పుడు ఈ సంఘటన ద్వారా అది తెలిసేలా చేసిన మీకు ధన్యవాదాలు బాబా". మేమంతా ఆరోగ్యంగా బయటపడితే నా అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటానని బాబాకు మ్రొక్కుకున్న విధంగా ఈ అనుభవాన్ని మీ అందరితో పంచుకున్నాను. బాబా నామస్మరణ ఎల్లప్పుడూ చేసి జీవితాలను చరితార్థం చేసుకోండి. చివరిగా, మాకు ప్రాణభిక్ష పెట్టిన సాయిదేవునికి పాదాభివందనం చేసుకుంటూ …


ఓంసాయిశ్రీ సాయి జయజయసాయి


9 comments:

  1. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🙏🕉❤😀😊

    ReplyDelete
  2. Om Sri Sai Ram ��������

    ReplyDelete
  3. Om sai ram today's sai leelas was very nice to read.my daughter also cured from covid. Sai baba blessings cured her health soon. My son also doctor he gave medicines to her. Baba udi gave hope also. That is power of sai. Om sai ram❤❤❤

    ReplyDelete
  4. om sairam
    sai always be with me

    ReplyDelete
  5. Om sai ram baba amma arogyam bagundali thandri pleaseeee

    ReplyDelete
  6. Baba enka 4 days vundhi naku ee gadda ni karginchu baba bayanga vundhi thandri

    ReplyDelete
  7. Baba karthik ki thyroid taggipovali thandri

    ReplyDelete
  8. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo