సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 849వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. కోవిడ్ కష్టం నుండి కాపాడిన బాబా
2. కోరుకున్నట్లే అనుగ్రహించిన బాబా
3. ఏళ్లనాటి తలనొప్పి బాబాను ప్రార్థించినంతనే అదృశ్యం

కోవిడ్ కష్టం నుండి కాపాడిన బాబా


ముందుగా ఈ 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వాహకులకు నా ధన్యవాదాలు. సాయిభక్తకోటికి నా నమస్కారాలు. నా పేరు అరుణదేవి. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.


2021, మే నెలలో మా అమ్మకు కంటి ఆపరేషన్ చేసి, "ఒక 15 రోజులు ఏ పనీ చేయకూడదు" అని డాక్టర్లు చెప్పారు. అప్పుడు నేను మా ఇద్దరు పిల్లల్ని తీసుకుని మా అమ్మావాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఐదు రోజుల వరకు అందరం బాగానే ఉన్నాము. తర్వాత మా అమ్మకు జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు మొదలవడంతో టాబ్లెట్స్ వేసుకోసాగింది. మూడు రోజుల తర్వాత నాకు తలనొప్పి, ఒళ్లునొప్పులు మొదలయ్యాయి. నా తర్వాత మా నాన్నగారికి  జ్వరం, ఒళ్లునొప్పులు వచ్చాయి. ఆ స్థితిలో పనిచేసే ఓపిక లేక నేను ఇద్దరు పిల్లలను తీసుకుని మా ఇంటికి వచ్చేశాను. తలనొప్పి, ఒళ్లునొప్పులు, జలుబు బాగా ఉండటం చూసి మావారు నాకు రాపిడ్ టెస్ట్ చేయిస్తే, కోవిడ్ పాజిటివ్ వచ్చింది. వెంటనే నేను అమ్మావాళ్లకు ఫోన్ చేసి, "నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. మీరు కూడా టెస్ట్ చేయించుకోండి" అని చెప్పాను. అయితే వాళ్ళు ముందు భయపడి టెస్ట్ చేయించుకోలేదు. 4 రోజుల తర్వాత టెస్ట్ చేయించుకుంటే అమ్మకి, నాన్నకి, మా అక్కావాళ్ళ బాబుకి పాజిటివ్ వచ్చింది. మా నాన్నగారిని పరీక్షించిన డాక్టర్లు, "లంగ్స్ 45% ఇన్ఫెక్ట్ అయ్యాయ"ని కూడా చెప్పారు. నాన్నకి బీపీ, షుగర్ ఉన్నందువల్ల మాకు చాలా భయం వేసింది. దానికి తోడు నాన్న ఆక్సిజన్ లెవెల్స్ పడిపోసాగాయి. హాస్పిటల్లో చేరమంటే నాన్న భయపడుతుండేవారు. అదలా ఉంచితే హాస్పిటల్లో బెడ్స్ కూడా దొరకలేదు. అటువంటి స్థితిలో మేము సహాయం కోసం బాబాను ప్రార్థించాము. బాబా దయవలన ఆక్సిజన్ అమర్చివున్న బెడ్ దొరికింది. వెంటనే నాన్నని హాస్పిటల్లో చేర్చారు. బాబా దయవలన నాన్నకి రెమిడీసీవర్ ఇంజెక్షన్ ఉచితంగానే వేశారు. అయితే నాన్నకి బీపీ, షుగర్ అధికమవడంతో పరిస్థితి సీరియస్ అయింది. అప్పుడు నేను బాబా పటం ముందు కూర్చుని, 'సాయి సూక్ష్మాయ నమః' అనే మంత్రాన్ని 108 సార్లు వ్రాసి, "బాబా! నాన్న క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని మ్రొక్కుకున్నాను. దయామయుడైన బాబా మనల్ని బాధపడనిస్తారా? మరుసటిరోజు ఉదయం, 'నాన్న ఆక్సిజన్ లెవెల్స్ 97 ఉందనీ, ఇప్పుడు ఆయన బాగున్నార'నీ తెలిసి ఎంతో సంతోషించాను. ఎంతో ఆనందంతో మనసారా బాబాకు ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఈరోజు మా నాన్న క్షేమంగా ఉన్నారంటే అది బాబా కృపే. అలా బాబా మా నాన్నని చావుబ్రతుకుల పరిస్థితి నుండి రక్షించడమే కాకుండా అమ్మని, అక్కావాళ్ళ బాబుని త్వరగా కోలుకునేలా చేశారు. "బాబా! మీకు వేలకోట్ల ధన్యవాదాలు".


ఇకపోతే, నాకు కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చిందని చెప్పాను కదా! ఆ విషయం తెలిసిన వెంటనే మా పిల్లలను మా అత్తయ్యావాళ్ళింట్లో ఉంచి, నేను మా ఇంట్లోనే గృహనిర్బంధంలో ఉంటూ మందులు వాడసాగాను. అందరూ నాతో, "భయపడకు, ధైర్యంగా ఉండు" అని చెప్తుండేవారు. నేను వాళ్ళతో, "నాకేం భయంగానీ, టెన్షన్ గానీ లేవు. ఎందుకంటే, నాకు తోడుగా బాబా ఉన్నారు" అని చెప్పాను. నాకు నీరసం ఏమీ లేదు, నార్మల్ గానే ఉండేది. అందువల్ల గురువారం శ్రీసాయిసచ్చరిత్ర పారాయణ చేద్దామని అనుకున్నాను. అయితే బుధవారం రాత్రి వరకు బాగానే ఉన్న నేను గురువారం ఉదయాన లేవలేకపోయాను. అయినప్పటికీ కాస్త ఓపిక తెచ్చుకుని లేచి పారాయణ చేద్దామని అనుకున్నాను. కానీ నావల్ల కాలేదు. బాగా నీరసంగా ఉంది. దాంతో "బాబా! నావల్ల కావడం లేదు. నన్ను క్షమించండి" అని బాబాతో చెప్పుకుని పడుకున్నాను. కొద్దిసేపటికి నా శరీరం మొద్దుబారిపోయినట్లు, నా శరీరం నుండి ఆత్మ వేరవుతున్నట్టు నాకు తెలుస్తోంది. వెంటనే నేను 'బాబా' అని గట్టిగా అరిచాను. మరుక్షణం బాబా నాకు కనిపించారు. "బాబా! నన్ను కాపాడండి. నాకు పిల్లలున్నారు బాబా" అని చెప్పుకుని, 'బాబా, బాబా' అంటూ బాబా నామాన్ని జపిస్తున్నాను. సరిగ్గా అదే సమయంలో మావారు నాకు ఫోన్ చేశారట. నేను ఎంతకూ స్పందించకపోయేసరికి నేనుండే ఇంటి వద్దకు వచ్చి, బయట నుండి గట్టిగా పిలిచినా నేను పలకలేదట. దాంతో మావారు ఇంటి తలుపులు తెరచి చూస్తే, నేను స్పృహలో లేను. మావారు నన్ను గట్టిగా తట్టి లేపి కూర్చుండబెట్టి, "ఏమైంది?" అని అడిగారు. నేను నా శరీరం మొద్దుబారిన విషయం, బాబా కనిపించిన విషయం చెప్పాను. మావారు, అత్తయ్య కంగారుపడి, 'నేను కోవిడ్ నుండి కొలుకుంటే, నన్ను బాబా గుడికి తీసుకువస్తాను" అని మొక్కుకున్నారు అంట. ఆ మరుసటిరోజు నుండి నాకు ఏ ఇబ్బందీ లేదు. కోవిడ్ నుండి నన్ను, నా తల్లదండ్రులను కాపాడిన బాబాకు ఎన్ని వేల కోట్ల కృతజ్ఞతలు చెప్పినా ఆయన ఋణం తీర్చుకోలేను. "బాబా! మీ ప్రేమ ఎప్పుడూ మీ బిడ్డలమైన మాపై ఇలాగే వుండాలి".

 

ఇంకో విషయం, మా అమ్మావాళ్ళ ఇంట్లో ఉన్న మా అందరికీ కోవిడ్ పాజిటివ్ వచ్చినా బాబా దయవల్ల మా పిల్లలిద్దరికీ వైరస్ సోకలేదు. ఇంతలా మమ్మల్ని కాపాడుతున్న బాబాకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. "బాబా! నాలోని లోపాలను సరిచేసి నన్ను మంచి మార్గంలో నడిపించండి. తెలిసీతెలియక నేను ఏమైనా తప్పులు చేసివుంటే నన్ను క్షమించండి బాబా. ఆలస్యంగా ఈ అనుభవాన్ని పంచుకుంటున్నందుకు నన్ను మన్నించండి బాబా".


కోరుకున్నట్లే అనుగ్రహించిన బాబా


"ఓం సాయినాథా! కరుణాకర దీనబంధో! భక్తులపాలిట కల్పవృక్షమగు నీవే మాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, సర్వమూ. సర్వకాల సర్వావస్థలయందు మమ్ము రక్షించండి సాయీ". నా పేరు శ్రీదేవి. 2021, మే 12న బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీ అందరితో పంచుకుంటాను. ఆ సమయంలో నా భర్తకు కాస్త ఒళ్ళునొప్పులు వచ్చాయి. దాంతో ఆయన సందేహించి కరోనా టెస్ట్ చేయించుకోవడానికి వెళ్లారు. ఆ సమయంలో నేను బాబాను ప్రార్థించి, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే మంత్రం జపించాను. కానీ, మావారికి కరోనా పాజిటివ్ వచ్చింది. నేను చాలా భయపడి, "బాబా! నా భర్తను ఎలాగైనా కాపాడండి" అని బాబాను ప్రార్థించాను. మరుసటిరోజు గురువారం. బాబాకు దివ్యపూజ చేస్తూ, "వచ్చే గురువారానికల్లా నా భర్తకు పూర్తిగా నయం కావాల"ని వేడుకున్నాను. మరుసటి గురువారం మావారికి బి.పి కాస్త ఎక్కువగా ఉండటంతో హాస్పిటల్‌కి వెళ్ళవలసి వచ్చింది. కొంతసేపటికి నేను ఇంట్లో  దివ్యపూజ ప్రారంభిస్తుండగా మావారు ఫోన్ చేసి, "ఇక్కడ కరోనా టెస్ట్ చేశారు. కరోనా నెగిటివ్ వచ్చింది" అని చెప్పారు. నేను కోరుకున్నట్లే అనుగ్రహించి నా భర్తను కాపాడినందుకు చాలా సంతోషంగా బాబాకు కృతజ్ఞతలు తెలుపుకుని పూజ ముగించాను. ఆ సాయంకాలానికి మావారి బి. పి. కూడా నార్మల్ అయింది. అయితే కరోనా వల్ల మావారికి షుగర్ కొంచెం పెరిగింది. నేను, "బాబా! మావారికి స్వీట్లంటే ఇష్టం. ఎలాగైనా ఆయనకు షుగర్ నార్మల్ చేయండి" అని బాబాను ప్రార్థించాను. మరుసటి వారంలో మావారు టెస్ట్ చేయించుకుంటే, బాబా దయవల్ల షుగర్ నార్మల్ వచ్చింది. "బాబా! ఎల్లప్పుడూ మావారు క్షేమంగా ఉండేలా చూడండి. మా భారమంతా మీదే. మీ దివ్యపాదాలనే నమ్ముకున్నాం బాబా".


సర్వం శ్రీసాయి.

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


ఏళ్లనాటి తలనొప్పి బాబాను ప్రార్థించినంతనే అదృశ్యం


నా పేరు కళ్యాణి. నాకు 2000వ సంవత్సరంలో పెళ్లయింది. మా పెళ్లికి ఎవరో బాబా ఫోటోను బహుమతిగా ఇచ్చారు. అయితే ఆ సమయంలో మాకు బాబా మీద నమ్మకం లేనందున మేము ఆ ఫోటోను ప్రక్కన పెట్టాము. ఇకపోతే, చిన్నప్పటినుండి నాకున్న తలనొప్పి ఏళ్ళు గడుస్తున్నా నన్ను వదలలేదు. ఎప్పుడూ తలనొప్పితో బాధపడుతూ ఉండేదాన్ని. మా అమ్మాయి బాబా భక్తురాలు. ఇటీవల ఒకరోజు తను నా తలకు బాబా ఊదీ రాసి, "అమ్మా! నువ్వు నమ్మకంతో బాబాను ప్రార్థించు" అని చెప్పింది. దాంతో నేను, "బాబా! ఇప్పటినుండి నేను మిమ్మల్ని నమ్ముతాను. నా తలనొప్పి తగ్గించండి" అని ప్రార్థించాను. అంతే, 10 నిమిషాల తరువాత నా తలనొప్పి తగ్గిపోయింది. ఇది ఈమధ్యనే, అంటే 2021, ఏప్రిల్ నెలలో జరిగింది. అప్పటినుండి ఇప్పటివరకు నాకు మళ్ళీ తలనొప్పి రాలేదు. "బాబా! మీకు చాలా చాలా కృతజ్ఞతలు. నాకు అన్నీ నువ్వే బాబా".


11 comments:

  1. Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  2. 🙏💐🙏ఓం సాయిరాం🙏💐🙏

    ReplyDelete
  3. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha ❤😊🕉🙏🌼

    ReplyDelete
  4. Om sai ram baba amma infections tagginchu thandri sainatha

    ReplyDelete
  5. Baba ee gadda ni tondarga karginchu thandri

    ReplyDelete
  6. Baba santosh life bagundali thandri

    ReplyDelete
  7. Baba karthik ki thyroid taggipovali thandri

    ReplyDelete
  8. Baba bayanga vundhi kapadu baba please

    ReplyDelete
  9. Baba bayanga vundhi kapadu thandri

    ReplyDelete
  10. 🌺🙏🌼🙏🌺Om Sri Sairam🌷🙏🌼🙏🌼🙏🌺

    ReplyDelete
  11. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo