సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుడు - చక్రనారాయణ


బాబాపై భక్తివిశ్వాసాలు కలిగివున్న అతికొద్దిమంది క్రైస్తవులలో చక్రనారాయణ ఒకరు. ఇతడు పోలీస్ ఫౌజ్‌దారుగా కోపర్‌గాఁవ్‌లో పనిచేస్తుండేవాడు. మొదట్లో అతను బాబాను విశ్వసించేవాడు కాదు. ఆ రోజులలో భక్తులు బాబాకు దక్షిణ సమర్పిస్తూ ఉండేవారు. దక్షిణ రూపంలో వచ్చిన ఆ ధనాన్ని బాబా అందరికీ పంచేస్తూ సాయంత్రమయ్యేసరికి పేదఫకీరుగానే ఉండేవారు. అలా ఆయన పంచే ధనం 500 రూపాయలకు పైనే ఉండటంతో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం పన్ను వేయదలిచింది. ఆ లెక్కలు వ్రాయడానికి హిందువునో, ముస్లిమునో నియమిస్తే పక్షపాతం చూపుతారని క్రైస్తవుడైన చక్రనారాయణను నియమించింది.

అతడు ప్రతిరోజూ బాబా వద్దకి ఎవరెవరు వచ్చి పోతున్నారు, ఎంతెంత దక్షిణ ఇస్తున్నారు అని పరిశీలిస్తూ ఆ వివరాలని ఒక డైరీలో వ్రాసుకుంటుండేవాడు. అలా అతను బాబాను అప్రమత్తంగా గమనిస్తూ ఆయన వ్యక్తిత్వంపట్ల, ఆయనలోని గొప్ప లక్షణాలపట్ల ఆకర్షితుడయ్యాడు. క్రమంగా ఆయనపట్ల గౌరవభావం ఏర్పడి, అతడు కూడా బాబా భక్తుడయ్యాడు.

అతడు 1936లో బి.వి.నరసింహస్వామిగారితో ఇలా చెప్పాడు:

"కాంతా-కనకాల విషయంలో బాబా ఏమాత్రం చలించేవారుకాదు. ఎందరో స్త్రీలు బాబా వద్దకు వచ్చి, తమ శిరస్సులను బాబా పాదాలపై ఉంచి నమస్కరించి వారి సన్నిధిలోనే  కూర్చునేవారు. బాబా ఏమాత్రమూ చలించేవారు కాదు. వారి వంక  ప్రశంసాపూర్వకంగా కానీ, మోహంతో కానీ చూసేవారుకాదు. వారు బంధాలకు అతీతులు".

"డబ్భు విషయంలో బాబాను క్షుణ్ణంగా పరిశీలించాము. వారికి డబ్బంటే గడ్డిపోచతో సమానం. భక్తులు స్వచ్ఛందంగా ఆయనకు దక్షిణలు సమర్పించేవారు. ఎవరైనా దక్షిణ ఇవ్వకపోయినా ఆయన వారిని ద్వేషించడం, నిందించడం, నిరాదరించడం జరిగేది కాదు. దక్షిణ రూపంలో ఎంత ధనం వచ్చినా సరే, ఆ ధనాన్ని ఉదారంగా భక్తులకు పంచేస్తుండేవారు. విరివిగా అన్నదానం చేస్తుండేవారు. అద్భుతమైన విషయం ఏమిటంటే, ఒక్కొక్కసారి దక్షిణ రూపంలో వచ్చిన మొత్తం కంటే ఎక్కువ మొత్తంలో ఆయన భక్తులకు పంచేస్తుండేవారు. ఆ అదనపు మొత్తం ఎక్కడినుండి వచ్చేదో అర్థమయ్యేది కాదు. దీనిని బట్టి వారికి దివ్యశక్తులున్నాయని నేను గ్రహించాను. బాబా సమాధి చెందిన తరువాత వారి వద్దనున్న ధనాన్ని మేము స్వాధీనం చేసుకున్నాం. అది కేవలం రూ.16/- మాత్రమే".

"ఇక భిక్ష విషయంలో కూడా అంతే. బాబా జోలె పట్టుకుని భిక్షకు వెళ్లేవారు. భిక్షగా వచ్చే ఘనపదార్థాలను జోలెలో, ద్రవపదార్థాలను రేకుడబ్బాలో వేయించుకొనేవారు. ఎవరేది పెట్టినా కాదనకుండా స్వీకరించేవారు. మసీదు చేరుకున్నాక ఆ పదార్థాలన్నింటినీ కలిపి, అందరికీ ప్రసాదంగా పంచేసేవారు".

"అన్ని మతాలపట్ల బాబా ప్రవర్తన చాలా గొప్పగా ఉండేది. ఆయనకు కుల మత వర్గ విచక్షణ, పేద, ధనిక భేదభావాలు లేవు. అందరినీ సమానంగా చూసేవారు. ఎవరినీ చులకనగా చూసేవారు కాదు. నేను మొదట శిరిడీ వెళ్ళినప్పుడు ఒక భక్తుడు, "ఈ ఫౌజ్‌దార్ ఒక క్రైస్తవుడ"ని బాబాతో చెప్పాడు. అప్పుడు బాబా, "అయితేనేం? అతను నా సోదరుడు" అని అన్నారు. బాబాకు అద్భుతమైన శక్తులున్నాయి. ఆయన ఊదీ అనారోగ్యంతో బాధపడుతున్న ఎంతోమందికి స్వస్థత చేకూర్చింది".

"ఒకసారి ఒక పోలీసు అధికారి వచ్చి బాబాను దర్శించాడు. బాబా అతనిని దక్షిణ అడిగారు. అతడు "తన వద్ద డబ్బు లేద"ని బదులిచ్చాడు. అప్పుడు బాబా, "నీ పర్సులో చూడు. అందులో యాభై రూపాయల నోటు ఉంది" అన్నారు. అతడు పర్సు తీసి ఆ డబ్బును బాబాకు సమర్పించాడు. బాబా దానినుండి కొద్దిమొత్తాన్ని మాత్రమే తీసుకొని, మిగతాది అతనికే ఇస్తూ, "ఈ డబ్బు నీ దగ్గర ఉంచు. త్వరలోనే దీని అవసరం నీకు వస్తుంది" అన్నారు. అతడు వెళ్ళిపోయాడు. త్వరలోనే అతడికి ఒక సమస్య వచ్చింది. దానినుండి బయటపడటానికి అతడు ఆ డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఆ సమస్యనుండి బయటపడ్డాక అతడు కృతజ్ఞతతో ఆ మొత్తాన్ని బాబాకు పంపాడు".

"బాబా సమాధి చెందినప్పుడు జప్తు చేయబడిన ఆస్తులకు సంబంధించిన వ్యవహారంలో నేను సంస్థాన్‌కు సహాయం చేశాను. బాబా ఆస్తుల పంపకం విషయంలో నేను ప్రజాభిప్రాయాలను సేకరించాను. వాటి ఆధారంగా మేజిస్ట్రేట్ పంపకానికి సంబంధించిన ఉత్తర్వులు మామల్తదారు జారీ చేశారు. దీనివలన సంస్థాన్‌కు ఎన్నో ఇబ్బందులు తప్పాయి."

సమాప్తం

Source: Devotees' Experiences of Shri Sai Baba, Part I by Late Shri.B.V.Narasimha Swamiji.

8 comments:

  1. ఓం శ్రీ సాయిరాం జీ 🙏🙏🙏

    ReplyDelete
  2. ఓం శ్రీ సాయి సమర్థ

    ReplyDelete
  3. SaiNadha🙏🙏🙏🙏🌹🌹🌺🌺🌺

    ReplyDelete
  4. ఓం సాయిరామ్🙏💐🙏

    ReplyDelete
  5. ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  6. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤😃🌺🥰🌸😀🌼🤗🌹

    ReplyDelete
  7. Om Sai Ram 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo