సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 223వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • బాబా కురిపిస్తున్న అమితమైన ప్రేమ

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాలనిలా పంచుకుంటున్నారు:

నా సొంత ఊరు గుల్బర్గా. ప్రస్తుతం నేను బెంగళూరులో ఉంటున్నాను. బ్లాగు నిర్వాహకులకు నా కృతజ్ఞతలు. భక్తులు తమ అనుభవాలను బ్లాగు ద్వారా పంచుకోవడం చూస్తుంటే చాలా మంచి అనుభూతి కలుగుతుంది. వాటి ద్వారా సడలిన నా విశ్వాసం దృఢమవ్వడమే కాకుండా, మన చుట్టూ సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. తద్వారా ఎంతటి భారమైనా బాబాకు విడిచిపెట్టి ధైర్యంగా ఉండగలుగుతాము.

2013లో నేను ఇంజనీరింగ్ పూర్తిచేశాక, అధ్యాపకవృత్తికి వెళ్లాలా లేక ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేసుకోవాలా అన్న సందిగ్ధంలో పడ్డాను. అధ్యాపకవృత్తికి వెళ్లాలంటే నేను పీ.జీ. కూడా పూర్తిచేయాలి. కానీ అందుకు మా ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేనందున, ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేరాలని నేను అనుకున్నాను. ఆ ఆలోచన ప్రకారమే నేను బెంగళూరు వెళ్లి ఒక కోర్సులో చేరి ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాను. కానీ నాకు ఉద్యోగం అంత త్వరగా దొరకలేదు. మధ్యతరగతికి చెందిన నేను ఉద్యోగం లేకుండా బెంగళూరులో ఉండటానికి చాలా ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. అందువలన కోర్సు పూర్తయ్యేవరకు ప్రయత్నంచేసి, చివరకు ఉద్యోగం లేకుండానే బాధతో తిరిగి మా ఊరికి వెళ్ళిపోయాను. చూస్తుండగానే రెండు సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఈలోపల ఎటువంటి ఉద్యోగ ప్రయత్నాలూ చేయలేదు, ఎందుకంటే నేను నా ఆత్మవిశ్వాసం పూర్తిగా కోల్పోయిన సమయమది. అటువంటి సమయంలో, అంటే 2014 చివరిలో మా కజిన్ నాకు బాగా దగ్గరయ్యింది. ఆమె నా శ్రేయోభిలాషి. నా జీవితంలోకి వచ్చిన దేవదూత. ఆమె నాకు 'శ్రీసాయిసచ్చరిత్ర' పుస్తకం ఇచ్చి బాబా ప్రేమను నాకు పరిచయం చేసింది. నిజానికి నేను నా చిన్ననాటిరోజుల్లోనే సాయిబాబా గుడికి వెళుతుండేదాన్ని. కానీ అప్పుడు బాబా ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలియదు. నా కజిన్ ఇచ్చిన సాయిసచ్చరిత్ర పుస్తకం చదవడం మొదలుపెట్టాక నేను బాబా ప్రేమను తొలిసారి చవిచూస్తూ చాలా సంతోషాన్ని అనుభవించాను. దాంతో నా చుట్టూ చాలా సానుకూల వాతావరణం చోటుచేసుకుంది.

సాయిబాబా కృపతో 2015, జూన్‌లో మా ఇంటి యజమానురాలి ద్వారా ఒక స్కూలులో కంప్యూటర్ టీచర్‌గా ఉద్యోగంలో చేరాను. నాకు వచ్చే జీతం 5,500 రూపాయలే అయినా నేను చాలా సంతోషించాను. ఆ జీతంతో నా కుటుంబానికి సహాయం చేయగలుగుతున్నానన్న సంతృప్తి నాకు దక్కింది. బాబా నా జీవితాన్ని ముందుకు కొనసాగించేందుకు తగిన ధైర్యాన్నిచ్చారు. అదే చివరికి నాకు ఎంతో మేలుచేసింది. ఒక సంవత్సరం పూర్తయ్యాక ఎమ్.టెక్. చేస్తే ఇంజనీరింగ్ కాలేజీలో బోధించే అవకాశం ఉంటుందని తెలిసి, స్కూల్ టీచర్ ఉద్యోగం వదిలిపెట్టి పీ.జీ. సెట్ కి తయారయ్యాను. ఆ సమయమంతా బాబా నాతో ఉన్నట్లుగా నాకు అనుభవాలు ఇస్తూనే ఉన్నారు. ఆయన కృపతో నేను బాగా చదివి పీ.జీ. సెట్ లో మంచి ర్యాంకు సాధించాను. ప్రభుత్వ కాలేజీలో చేరితే ఫీజులు తక్కువగా ఉంటాయని  తెలిసి బెంగళూరులోని ఒక ప్రభుత్వ కళాశాలలో చేరాను. బెంగళూరు వెళ్లి చదువుకోవడం ప్రారంభించాను. ఒక గురువారం నేను బాబా మందిరంలో నా కజిన్ తో ఉండగా బెంగళూరులోని ఒక కంపెనీ నుండి నాకు ఇంటర్న్‌షిప్ కి కాల్ వచ్చింది. బాబా దయతో ఆ ఇంటర్వ్యూ బాగా చేయటంతో అందులో నేను ఎంపికయ్యాను. మొదటి సంవత్సరం అన్ని సెమిస్టర్లలో నాకు మంచి మార్కులు వచ్చాయి. ఆర్థిక సమస్యల కారణంగా 2వ సంవత్సరంలో ఫీజు తగ్గిస్తే బాగుంటుందని అనుకున్నాను. అదేసమయంలో కళాశాల ఫీజుల తగ్గింపు విషయంగా సమ్మె జరుగుతుండటంతో ఫీజు తగ్గింపు కోసం సహాయం చేయమని బాబాను ప్రార్థించాను. నేను ఊహించని విధంగా బాబా అనుగ్రహించి నన్ను అబ్బురపరిచారు. నా ఫీజు 44,000 రూపాయల నుండి 31,390 రూపాయలకు తగ్గించారు. అదే నాకు నమ్మశక్యం కాని విషయమైతే, నాకు 46,390 రూపాయల స్కాలర్‌షిప్ కూడా మంజూరు చేశారు. అంటే నేను రెండవ సంవత్సరం పూర్తిగా ఉచితంగా చదువుకోగలిగేలా ఏర్పాటు చేశారు బాబా. నేను ఆశించిన దానికంటే ఎంతో ఎక్కువ ఇచ్చారు బాబా. అలా నా అవసరాలకు అనుగుణంగా ప్రతిదీ అమరుస్తూ, నాకు ఏ సమస్యలు లేకుండా ఎంతో ప్రేమగా చూసుకున్నారు బాబా.

ఎమ్.టెక్. 3వ సెమిస్టరులో ఒకరోజు ఉదయం నేను, నా కజిన్ కలిసి శిరిడీకి రైలులో వెళ్తున్నట్లు నాకొక కల వచ్చింది. నిజానికి ఎంతోకాలంగా నేను శిరిడీ వెళ్లాలని ఎదురుచూస్తున్నాను. ఆ కల ద్వారా బాబా మమ్మల్ని శిరిడీకి రమ్మని పిలుస్తున్నారని మేమిద్దరం శిరిడీ వెళ్ళాము. మొదటిసారి శిరిడీ దర్శనంతో నేను గొప్ప అనుభూతి పొందాను. అక్కడినుండి తిరిగి వస్తున్నప్పుడు మేము కోపర్‌గాఁవ్ స్టేషన్‌లో ఉండగా 3వ సెమిస్టరులో 80% మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లు తెలిసింది. అంత మంచి వార్తతో బాబా నన్ను సంతోషంలో ముంచేశారు. చివరికి నా చివరి సెమిస్టరులో నేను నా వైవాకు సంబంధించిన తేదీ కోసం వేచి చూస్తున్న సమయంలో ఆశ్చర్యకరంగా అది డిసెంబర్ 27వ తేదీగా నిర్ధారణ అయ్యింది. ఆరోజు బాబాకు నన్ను దగ్గర చేసిన నా కజిన్ పుట్టినరోజు, పైగా బాబారోజైన గురువారం. తరువాత ఒక్క నెలలోనే నా ఎమ్.టెక్. ఫలితాలు వచ్చేలా చేశారు బాబా.

తరువాత నేను టీచింగ్ ఉద్యోగం కోసం శోధించడం మొదలుపెట్టాను. దాదాపు బెంగళూరులోని అన్ని ఇంజనీరింగ్ కాలేజీలలో ప్రయత్నాలు మొదలుపెట్టాను. చాలా చోట్ల ప్రతికూల ప్రతిస్పందనే ఎదురైంది నాకు. ఎవరైనా సిఫారసు చేస్తేనే ఉద్యోగం పొందడం సాధ్యమని తెలిసి నేను కాస్త టెన్షన్ పడి, “బాబా! నాకు ఏ సిఫారసూ అవసరం లేదు. మీరే నాకున్న పెద్ద సిఫారసు. ఖచ్చితంగా మీరే నాకు ఉద్యోగాన్ని చూపిస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది. దయచేసి నాకు సహాయం చేయండి" అని బాబాను ప్రార్థించాను. తరువాత నాకొక ఇంజనీరింగ్ కాలేజీ నుండి ఇంటర్వ్యూకి పిలుపు వచ్చింది. నేను ఇంటర్వ్యూకి హాజరయ్యాను, కానీ బాగా చేయలేకపోవడంతో నిరాశ చెందాను. తరువాత మరో ఇంజనీరింగ్ కళాశాల నుండి పిలుపు వచ్చింది. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వాళ్ళు జనవరి 31వ తేదీ గురువారంనాడు నన్ను ఇంటర్వ్యూకి హాజరుకమ్మని చెప్పారు. గురువారం అనేసరికి నాకు చాలా సంతోషంగా అనిపించి బాబానే నాకోసం ఆవిధంగా ఏర్పాటు చేశారని అర్థం చేసుకున్నాను. బాబా అనుగ్రహంతో ఆ ఇంటర్వ్యూ బాగా చేశాను. ఆరోజు నేను ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు నాకు ఒక నెమలి ఈక దొరికింది. అది కృష్ణుడి ప్రేమచిహ్నం. ఆవిధంగా నాకు నా సాయికృష్ణుని దీవెనలు లభించాయి. అయితే తరువాత ఆ కాలేజీ నుండి ఎటువంటి స్పందనా లేకపోవడంతో నేను మళ్ళీ టెన్షన్ పడ్డాను. అయితే ఆ సమయంలో బాబానుండి నాకు చాలా శుభసంకేతాలు వచ్చాయి. ఒకసారి నేను గణపతిని మోసుకుని వెళ్తున్నట్లు కల వచ్చింది. ఏదో శుభం జరగబోతోందని నేను అనుకున్నాను. తరువాత నేను బాబాకు స్వీట్స్ సమర్పించడానికి వెళ్తున్నట్లుగా కల వచ్చింది. చివరిగా నా కజిన్ ఫ్రెండ్ ద్వారా సాయిబాబా విగ్రహాన్ని పొందాను. ఈ సూచనలన్నీ నాకు ఆ ఉద్యోగం వస్తుందనే భావనను దృఢం చేసాయి. ఈలోగా ఫిబ్రవరి 14 వస్తుండటంతో నేను బాబాతో, “బాబా! నేను ప్రేమించిన వ్యక్తితో ఎప్పుడూ వాలెంటైన్స్ డే జరుపుకోలేదు. కానీ ఈసారి నా వాలెంటైన్‌గా మీరు ఉండాలని ఆశపడుతున్నాను. ఆ ఉద్యోగాన్ని నాకు బహుమతిగా ఇచ్చి ఆరోజును ప్రత్యేకమైన రోజుగా చేయాలని కోరుకుంటున్నాను" అని చెప్పుకున్నాను. బాబా నా కోరికను విన్నారు. ఫిబ్రవరి 13 సాయంత్రం కళాశాల నుండి నాకు కాల్ వచ్చింది. వాళ్ళు నన్ను ఫిబ్రవరి 14న కాలేజీకి రమ్మని చెప్పారు. ఆరోజు కూడా గురువారం. నా ఆనందానికి హద్దులు లేవు. బాబా ప్రేమతో నాకు ఈ ఉద్యోగం ఇచ్చారు. ఈరోజు నేను బెంగళూరులోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాను. ఇంతకన్నా నేను బాబాను ఏమి అడగను? ఆయన నాపై చూపిన ప్రేమను గుర్తుచేసుకుంటుంటే నా కళ్ళనుండి ఆనందభాష్పాలు ధారలుగా  వర్షిస్తున్నాయి. ఆయన ప్రేమ గురించి ఏమి చెప్పగలను? ఆయన ఎప్పుడూ నా చుట్టూ ఉంటున్నారు. ఆయన నా జీవితంలోకి వచ్చినప్పటినుండి ఎంత కష్టకాలం ఎదురైనా నేనెప్పుడూ ఒంటరిగా భావించలేదు. కష్టసమయంలో బాబాను పట్టుకోండి. ఆయన మీతో ఉంటూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు. మంచైనా, చెడైనా మనం అనుభవించక తప్పదు. కానీ బాబా మనకు తోడుగా ఉంటే మన జీవితం ఫలవంతంగా ఉంటుంది. "బాబా! మీరు నాపై కురిపిస్తున్న అమితమైన ప్రేమకు నా శతకోటి ప్రణామాలు".

source: http://www.shirdisaibabaexperiences.org/2019/09/shirdi-sai-baba-miracles-part-2468.html

3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo